Who are you? (Illustration)
రచయిత: జినోయ్ జోస్ పి
ఫ్రాంజ్ కాఫ్కా రాసిన ‘ది ట్రయల్’ నవలలో, జోసెఫ్ కె. ఒక రోజు ఉదయం నిద్రలేచేసరికి తన గదిలో ఇద్దరు ಅపరిచితులు ఉంటారు. తాను అరెస్టు అయినట్లు వారు అతనికి చెబుతారు. కారణం ఏమిటని అతను ప్రశ్నిస్తాడు. ఆ విషయం మాకు తెలియదు అని చెప్తారు. పత్రాలను చూపించమని అడిగితే అలాంటివేమీ తమ దగ్గర లేవని సమాధానమిస్తారు. ఈ విషయాన్ని తేల్చగలదనే ఆశతో అతను తన సైకిల్ పర్మిట్‌ను, ఆ తర్వాత తన జనన ధృవీకరణ పత్రాన్ని బయటికి తీస్తాడు. అయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. జోసెఫ్ కె. తన గురించి తాను నిరూపించుకోగల అంశాలపై ఆ ఏజెంట్లు తమకు ఎలాంటి ఆసక్తి లేదు అని చెప్తారు. కోర్టు మీ గురించి ఏమి నిర్ణయించింది అనే దానిపై మాత్రమే మా పట్టింపు అని నిష్కర్షగా చెప్తారు.
ఒక శతాబ్దానికి పైగా గడిచినా, ఈ సన్నివేశం తన ప్రభావాన్ని కోల్పోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఒక వ్యక్తి తాను ఎవరో చెప్పుకునే స్వేచ్ఛపై నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. భారతదేశంలో 2026 మార్చిలో వరుసగా మూడు కొత్త చట్టాలు తేవడంతో, మతాంతర మార్పిడి, లింగ గుర్తింపు, వివాహం వంటి వ్యక్తిగత విషయాలలోకి రాజ్యం మరింతగా జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ నిరూపించుకోవాల్సిన బాధ్యతను వ్యక్తిపైనే మోపుతున్నారు. అయితే ఇది కేవలం భారతదేశానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇది రాజకీయ తత్వశాస్త్రం వలె పురాతనమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. రాజ్యం దృష్టిలో వ్యక్తి అంటే ఎవరు?
ప్రతి చట్టపరమైన వ్యవస్థలోనూ వ్యక్తిత్వం గురించిన అంతర్లీన భావన ఉంటుంది. జ్ఞానోదయ కాలం నుండి వచ్చి, వలసరాజ్యాల ప్రపంచంలో వివిధ రకాలుగా స్వీకరించబడిన ఉదారవాద చట్టాలు ఒక నిర్దిష్టమైన అంచనాతో ప్రారంభమవుతాయి. సమాజంలో ప్రాథమిక యూనిట్ వ్యక్తి అని, అతను/ ఆమెకు హక్కులు ఉంటాయని, అతను/ ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఇవి నమ్ముతాయి. వివాహంతో సహా ప్రతి ఒప్పందంలోనూ అతను/ ఆమె తన స్వంత నిబంధనల ప్రకారమే ప్రవేశిస్తుంది. ఒక వ్యక్తి స్వయంప్రతిపత్తిని నిర్వచించడానికి కాకుండా, దానిని రక్షించడానికి మాత్రమే రాజ్యం ఉనికిలో ఉంటుంది.
పాత నమూనా వైపు తిరుగుముఖం
కానీ నిజానికి ఎన్నడూ మాయం కాని ఒక పాత నమూనా కూడా ఉంది. ఈ నమూనా ప్రకారం వ్యక్తి ప్రాథమిక యూనిట్ కాదు. కుటుంబం, కులం, సమాజమే ప్రాథమిక యూనిట్లు. ఒక వ్యక్తి గుర్తింపు స్వయంచితమైనది కాదు, అది తల్లిదండ్రులు, పూజారులు, గ్రామ పెద్దలు, మేజిస్ట్రేట్ల ద్వారా ధృవీకరించబడాలి. మీరు మీ తండ్రి కొడుకు, మీ సమాజపు సభ్యుడు. మీరు ఎవరో మీరు చెప్పకముందే, వేరే ఎవరైనా దానిని నిర్ధారించాలి.
బి.ఆర్. అంబేడ్కర్ ఈ విషయాన్ని చాలా మంది కంటే బాగా అర్థం చేసుకున్నారు. 1936లో ఆయన ఇవ్వవలసిన ప్రసంగం ‘కుల నిర్మూలన’లో, హిందూ సమాజం అసలు వ్యక్తిని గుర్తించలేదని వాదించారు. అది కులాన్ని, ఉపకులాన్ని, కుటుంబాన్ని మాత్రమే గుర్తించింది. వ్యక్తి తన సొంత నిబంధనల ప్రకారం తనను తాను నిర్వచించుకోవడానికి ఎలాంటి అవకాశం లేని వలయాలుగా ఇవి ఉన్నాయి. “ప్రతి హిందువులోనూ ఉండే స్పృహ అతని కుల స్పృహే” అని ఆయన రాసారు. వ్యక్తి కేవలం కట్టడి చేయబడలేదు; తాత్త్విక అర్థంలో ఆమె/ అతడు అక్కడ లేనే లేరు. చట్టంలో, రాజకీయంలో, ఆయన రూపొందించిన రాజ్యాంగంలో ఆ వ్యక్తికి ఉనికిని తీసుకురావడానికి అంబేడ్కర్ తన జీవితాంతం కృషి చేశారు.
రాజ్యానికి, వ్యక్తికి మధ్య సంబంధం ఎప్పుడూ ఒక స్థిరమైన అంశంగా లేదు. మానవ చరిత్రలో ఎక్కువ భాగం ఈ ప్రశ్న తలెత్తనేలేదు. ప్రజలు ప్రభువులు, వంశాలు, కులాలు, గుంపులకు చెంది ఉండేవారు. రాజ్యానికి పూర్వమే హక్కులు కలిగిన స్వయంప్రతిపత్తి గల యూనిట్‌గా ఒక వ్యక్తి రాజ్యం ముందు నిలబడగలడనే ఆలోచన ఒక సరికొత్త, తీవ్రమైన ఆవిష్కరణ. అప్పట్లో కూడా అది పాక్షికంగానే ఉండేది. 1789 నాటి ఫ్రెంచ్ ‘డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ది సిటిజెన్’ స్వేచ్ఛ, సమానత్వం గురించి గొప్పగా వివరించింది, కానీ ఫ్రెంచ్ మహిళలకు ఓటు హక్కు రావడానికి మరో ఒకటిన్నర శతాబ్దం పట్టింది. భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది, కానీ వివాహం, వారసత్వం, కుటుంబాన్ని నియంత్రించే వ్యక్తిగత చట్టాలు మాత్రం మతపరమైన రేఖల వెంబడే విభజించబడి ఉన్నాయి.
ఆధునిక రాజ్యం – మారుతున్న హామీ
ఆధునిక రాజ్యం దీనికి పరిష్కారం చూపుతుందని భావించారు. సమూహం నీడ నుండి వ్యక్తి ఎట్టకేలకు బయటపడతాడనే వాగ్దానమే ఆధునికత. మీరు గ్రామం నుండి బయటపడవచ్చు, మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు, మీ పేరు, మతం, లింగాన్ని మార్చుకోవచ్చు. ఈ ఎంపికలను ఆమోదించడం కాదు, కేవలం రికార్డు చేయడం మాత్రమే రాజ్యపు పని.
కానీ భారతదేశంలోనూ, ఇతర చోట్లా జరుగుతున్నది ఆ వాగ్దానానికి తూట్లు పొడవడమే.
భారతదేశంలో ఇటీవలి కాలంలో వచ్చిన మూడు చట్టాలను పరిశీలించండి:
- మహారాష్ట్ర స్వేచ్ఛా మతమార్పిడి చట్టం, మతాంతర వివాహాలకు సంబంధించిన మతమార్పిడిలను నేరంగా పరిగణిస్తుంది.
- గుజరాత్ వివాహాల నమోదు (సవరణ) బిల్లు ప్రకారం, దంపతులు తమ తల్లిదండ్రుల గుర్తింపు పత్రాలను, వివాహం గురించి తల్లిదండ్రులకు తెలుసని ధృవీకరించే డిక్లరేషన్‌ను సమర్పించడం తప్పనిసరి చేయబడింది.
- ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (రక్షణ హక్కులు) సవరణ చట్టం, స్వయంగా గుర్తింపు పొందే హక్కును తొలగించి, లింగ గుర్తింపును ఒక మెడికల్ బోర్డు, జిల్లా మేజిస్ట్రేట్ చేతిలో పెట్టింది.
ఈ ప్రతి సందర్భంలోనూ, ఆ వ్యక్తికి కుటుంబం, సమాజం, వైద్యుల మద్దతు ఉందని రాజ్యానికి నిరూపించుకోవాలి. ఆమె/అతడి మాట ఇక్కడ చెల్లదు.
ఇది సంస్కరణ కాదు. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన వ్యక్తిని కాకుండా, బయటి నుండి ధృవీకరించబడాల్సిన వ్యక్తిత్వాన్ని సమర్థించే సిద్ధాంతం. “మహిళలను రక్షించడం”, “కుటుంబాలను పరిరక్షించడం”, “మోసాన్ని నిరోధించడం” వంటి ఈ చట్టాలను సమర్థించడానికి ఉపయోగిస్తున్న భాషలోనే అసలు రహస్యం దాగి ఉంది. ఎవరిని రక్షిస్తున్నారు, దేని నుండి రక్షిస్తున్నారు, ఎవరి ఖర్చుతో రక్షిస్తున్నారు?
ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. హంగేరీ రాజ్యాంగం ఇప్పుడు కుటుంబాన్ని కేవలం పురుషుడు, మహిళ మధ్య వివాహం ద్వారా ఏర్పడినదిగా మాత్రమే నిర్వచిస్తోంది. రష్యన్ సంస్కృతిని పరిరక్షణ పేరిట రష్యా “పారంపరిక విలువల” చట్టం క్వీర్ గుర్తింపులను నేరంగా మారుస్తోంది, భిన్నాభిప్రాయాలను అణచివేస్తోంది. చైనాలో సామాజిక క్రెడిట్ సిస్టమ్ కేవలం వ్యక్తిని మాత్రమే కాకుండా వారి బంధువులను కూడా శిక్షిస్తుంది. మయన్మార్ 1982 పౌరసత్వ చట్టం రోహింగ్యాల వ్యక్తిత్వాన్ని తొలగించి, మొత్తం కమ్యూనిటీని పౌరులు కానివారిగా మార్చింది. ప్రతిచోటా రాజ్యం పాత నమూనాకే మళ్లీ మొగ్గు చూపుతోంది: మీరు మీరు కాదు; మీరు మీ బంధువులు, మీ రక్తం, మీ సమాజపు హోదా మాత్రమే.
నిరుపేదలపై పడుతున్న భారం
ప్రతి సందర్భంలోనూ దీని భారం అత్యధికంగా పేదలపైనే పడుతోంది. ధనవంతులకు లాయర్లు ఉంటారు. వారు కోర్టులకు వెళ్లగలరు, పత్రాలను సమకూర్చుకోగలరు, అధికారులను మేనేజ్ చేయగలరు. కులాంతర వివాహం చేసుకున్న దళిత మహిళ, వైద్య ధృవీకరణ పత్రం లేని ట్రాన్స్‌జెండర్ వ్యక్తి, ఓటరు జాబితా నుండి పేరు మాయమైన వలస కార్మికుడు – వీరే మేజిస్ట్రేట్ ముందు తమను తాము నిరూపించుకోలేని వారు. వీరి కోసం, రాజ్యం అడిగే “మీరు ఎవరు?” అనే ప్రశ్న ప్రాణాంతకమైన ముప్పుగా మారుతుంది.
2025 చివరిలో ప్రారంభించబడిన భారతదేశపు సర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ఇందుకు ఒక ఉదాహరణ. చనిపోయినవారు, నకిలీ పేర్లు, వలస వెళ్లినవారి పేర్లను తొలగించి ఓటరు జాబితాలను ప్రక్షాళన చేయడానికి ఇది ఉద్దేశించబడింది. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 90 లక్షలకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన మతువా హిందూ శరణార్థులు, దళిత వర్గాలపైనే దీని ప్రభావం అత్యధికంగా పడింది. చరిత్ర అంతా మౌఖికంగా ఉండి, పత్రాలు తక్కువగా ఉన్న కమ్యూనిటీలకు సర్ ప్రక్రియలో పొందుపరిచిన “వారసత్వ అనుసంధాన” నిబంధన పత్రాల ఆధారిత పౌరసత్వ పరీక్షగా మారింది.
ఇది కూడా కేవలం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైనది కాదు. మయన్మార్ సైనిక జుంటా 2021 తిరుగుబాటును సమర్థించుకోవడానికి “పౌరులు కాని” ఓటర్లు అన్న ఆరోపణలను అడ్డం పెట్టుకుంది. అమెరికాలో ఓటరు జాబితా శుద్ధీకరణలు నల్లజాతీయులు, లాటినోల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించాయి. కెన్యాలో బయోమెట్రిక్ నమోదు వ్యవస్థలు నుబియన్, సొమాలి కమ్యూనిటీలను వెలివేసాయి. విధానాలు మారవచ్చు కానీ ఫలితం మాత్రం ఒక్కటే. మీరు ఉన్నారని నిరూపించుకునే భారం ఆ సామర్థ్యం తక్కువగా ఉన్నవారికే బదిలీ అవుతుంది.
ప్రజాస్వామ్య వైరుధ్యం
ఇక్కడే అత్యంత లోతైన వైరుధ్యం ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యం ప్రజల నుండి వారి ప్రతినిధులకు అధికారం పైకి ప్రవహిస్తుందనే వాగ్దానంపై నిర్మించబడింది. భాగస్వామ్య ప్రజాస్వామ్యం, సామూహిక బేరసారాలు, స్థానిక స్వపరిపాలన – ఇవే సాధారణ ప్రజలు శక్తివంతులను జవాబుదారీగా ఉంచడానికి వినియోగించే సాధనాలు. కానీ ప్రజలకు సేవ చేయవలసిన రాజ్యం, వారిని నియంత్రించడం వైపు మళ్లింది. కేవలం అధికారిక అణచివేత ద్వారానే కాకుండా, పత్రాలు, ధృవీకరణ, ఆమోదం, నిఘా వంటి నిశ్శబ్ద యంత్రాంగం ద్వారా ఇది నడిపిస్తుంది.
అమర్త్య సేన్ తన ‘ఐడెంటిటీ అండ్ వయొలెన్స్’ అన్న పుస్తకంలో, ‘మన కాలంలోని అత్యవసరమైన ప్రమాదం ఏమిటంటే, ప్రజలను రాజ్యం లేదా గుంపు కేటాయించిన ఒకే ఒక గుర్తింపుగా కుదించివేయడమే’ అని హెచ్చరించారు. రాజ్యమే మీకు పేరు పెడుతుంది. రాజ్యమే మిమ్మల్ని వర్గీకరిస్తుంది. మరియు సరైన సమయంలో సరైన పత్రాన్ని మీరు చూపించలేకపోతే, మీరు కనుమరుగైపోతారు.
1914లో రాస్తున్న కాఫ్కా, తన కల్పన 21వ శతాబ్దానికి ఎంత ఖచ్చితంగా సరిపోతుందో ఊహించి ఉండలేరు. జోసెఫ్ కె. తన గుర్తింపు సమస్యను పరిష్కరించుకోవాలనే ఆశతో తన డ్రాయర్లలో సైకిల్ పర్మిట్, జనన ధృవీకరణ పత్రం కోసం వెతికాడు. నేడు పశ్చిమ బెంగాల్‌లోని గ్రాతులలో, గుజరాత్‌లోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో, దేశవ్యాప్తంగా ఉన్న లింగ-గుర్తింపు క్లినిక్‌లలో ప్రజలు సరిగ్గా అదే పని చేస్తున్నారు – తాము ఎవరో రాజ్యానికి నిరూపించుకోవడానికి ఫైళ్లలో వెతుకుతున్నారు. రాజ్యం అడిగే “మీరు ఎవరు?” అనే ప్రశ్న సాధారణంగానే వినిపించవచ్చు. కానీ ఆ ప్రశ్న అడిగే అధికారం, ఆ సమాధానాన్ని తిరస్కరించే అధికారం అసలు సాధారణమైనది కాదు.
‘ఫార్గో’ (Fargo) అనే టెలివిజన్ సిరీస్ మూడవ సీజన్ ప్రారంభ సన్నివేశం 1988లో తూర్పు బెర్లిన్‌లోని ఒక విచారణ గదిలో జరుగుతుంది. హోర్స్ట్ లాగర్ఫెల్డ్ అనే స్టాసి కల్నల్ బేడీలు వేయబడి, తడిసిపోయిన జాకబ్ అంగర్లైడర్ అనే వ్యక్తికి ఎదురుగా కూర్చుంటాడు. జాకబ్ హత్యకు వాంటెడ్ అయిన ఉక్రేనియన్ వలసదారు యూరి గుర్కా అని కల్నల్ చెబుతాడు. జాకబ్ దానిని వ్యతిరేకిస్తాడు. తన పేరు యూరి కాదని, తన వయసు 20లలో కాక 40లలో ఉందని, తన భార్య ఆరోగ్యంగా ఉందని, ఆ అపార్ట్మెంట్లోకి తాను వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయిందని చెబుతాడు. కల్నల్ మాత్రం చలించడు. యూరి గుర్కా ఆ అడ్రస్లోనే నివసిస్తున్నాడని రాజ్యపు ఫైల్ చెబుతోంది కాబట్టి, అతను కచ్చితంగా యూరి గుర్కానే అయి ఉండాలి. “మీరు చెప్పేది నిజం కావాలంటే, రాజ్యం తప్పు అయి ఉండాలి” అని కల్నల్ అంటాడు. ఆ తర్వాత కాసేపు ఆగి, “రాజ్యం ఎప్పుడూ తప్పు చేయదు” అంటాడు.
నేను ఇది రాస్తున్నప్పుడు గమనించాను, కాఫ్కా నవల జర్మన్ భాషలో ‘డెర్ ప్రోసెస్’ అనగా అక్షరాలా ‘ది ప్రాసెస్’ (ప్రక్రియ) గా పిలువబడుతుంది. విచారణ కాదు, తీర్పు కాదు, కేవలం ప్రక్రియ మాత్రమే. భారతదేశం ఇప్పుడు ప్రవేశపెడుతున్న చట్టాలన్నీ ఖచ్చితంగా ఆ ప్రక్రియనే నొక్కిచెప్పడం గమనార్హం. ప్రక్రియే ఒక శిక్ష అని కాఫ్కా అర్థం చేసుకున్నాడు. నేడు పౌరుడే, వ్యక్తియే విచారణను ఎదుర్కొంటున్నాడు.
అనువాదం: కె సత్యరoజన్
మూలం: Frontline
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
