Vikas Yadav's Name Registered 13 Times in Azamgarh Voter List: Action Against Nine Election Officials (AI-generated illustration, not a real photograph)
ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా అవకతవకలపై ఎన్నికల సంఘం చర్యలు – జిల్లా వ్యాప్తంగా ఆడిట్‌కు ఆదేశాలు.
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ‘వికాస్ యాదవ్’ పేరు 13 చోట్ల నమోదైనట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో తొమ్మిది మంది ఎన్నికల సిబ్బందిపై పరిపాలనా పరమైన, చట్టపరమైన చర్యలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా ఆదేశించారు.
వికాస్ యాదవ్ పేరు ఓటర్ల జాబితాలో పలు మార్లు నమోదైందని సమాజ్ వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ చేపట్టారు. అక్టోబర్ 16న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విలేకరుల సమావేశంలో వికాస్ యాదవ్‌ను మీడియా ముందుకు తీసుకొచ్చారు. పరానా పూర్లో నాలుగు, ఖుద్వాల్ లో ఐదు, హుస్సేన్ గంజ్‌లో రెండు, కోట్వా లో ఒక ఓటు చొప్పున నమోదైనట్లు ఆరోపించారు.
వికాస్ యాదవ్ మే నెలలో ఓటరు నమోదుకు ఫారం-6 సమర్పించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ల జాబితా జనవరి 6న ప్రచురితమైంది. ఫారం-6 దరఖాస్తులను కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో అనుసంధానిస్తామని ఎన్నికల సంఘం గతంలో ప్రకటించింది.
వికాస్ యాదవ్ ఒకే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అతని పేరు పలుచోట్ల నమోదైందని అఖిలేశ్ పేర్కొన్నారు. ‘‘అతను ఒక ఓటు వేస్తే, మిగిలిన తొమ్మిది ఓట్లను బీజేపీ వేస్తుంది’’ అంటూ ఎన్నికల సంఘంతో కుమ్మక్కై అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అజంగఢ్ అసెంబ్లీ స్థానం సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. బీజేపీ ఇప్పటివరకు ఈ స్థానంలో విజయం సాధించలేదు. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు దుర్గా యాదవ్ 1996 నుంచి వరుసగా ఆరుసార్లు ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. అంతకుముందు 1986, 1989, 1991లో కూడా విజయం సాధించారు.
విచారణలో వికాస్ యాదవ్ పేరు హిందీలో 13 చోట్ల నమోదైనట్లు గుర్తించామని ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా తెలిపారు. ఇప్పటికే రెండు నమోదుల తొలగింపు ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన 11 నమోదులు అజంగఢ్ జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు చెందిన 11 మంది వ్యక్తులకు సంబంధించినవని తెలిపారు. అసలు వికాస్ యాదవ్ మినహా మిగిలిన పదిమంది పేర్లు, వ్యక్తిగత వివరాలను ఫారం-8 ద్వారా సరిచేసినట్లు చెప్పారు.
గోరఖ్‌పూర్ జిల్లాలోని చౌరీ చౌరా నియోజకవర్గంలో కూడా ఇదే పేరు, తండ్రి పేరుతో మరో నమోదు ఉందని, అయితే అది అజంగఢ్‌లో గుర్తించిన 13 నమోదులకు సంబంధం లేనిదని స్పష్టం చేశారు. అవకతవకలకు బాధ్యులైన ఓటరు నమోదు కేంద్రం కంప్యూటర్ అసిస్టెంట్, బూత్ స్థాయి అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించడంతోపాటు వారి సేవలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు.
కంప్యూటర్ అసిస్టెంట్, సంబంధిత బీఎల్ఓ లు, అప్పటి ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ), ఇద్దరు సహాయ ఎన్నికల నమోదు అధికారులకు (ఏఈఆర్ఓలు) షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 32 ప్రకారం చర్యలు చేపట్టనున్నారు. ఓటర్ల జాబితాల తయారీ, సవరణ, మార్పుల ప్రక్రియలో ఎన్నికల సిబ్బంది విధులను ఉల్లంఘిస్తే సెక్షన్ 32 ప్రకారం శిక్షార్హులవుతారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి బాధ్యులైన అప్పటి ఈఆర్ఓ, ఇద్దరు ఏఈఆర్ఓ లపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. అజంగఢ్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో ఇలాంటి పునరావృత నమోదులపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు.
పిలిభిత్‌లో ఓటరు నమోదుల్లో అవకతవకలు:
వారం వ్యవధిలో ఎన్నికల సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. అక్టోబర్ 22న పిలిభిత్ లో ఇద్దరు అధికారులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొందరు ఓటర్ల ఎపిక్ (EPIC) నంబర్లతో ఆన్లైన్లో వెతికినప్పుడు ఇతర వ్యక్తుల వివరాలు కనిపించినట్లు విచారణలో తేలింది. పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే 10,470 ఓటరు నమోదుల్లో అవకతవకలు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సమర్పించిన నివేదిక నిర్ధారించింది. దీనిపై వార్తా కధనం “ది వైర్ తెలుగు” ఇంతకుముందు ఇచ్చింది.
ఆగ్రాలో మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశం:
మరో వైపు, ఆగ్రా డివిజన్ ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గంలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో అక్టోబర్ 24న ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. శుక్రవారం(23-10-2026) ఎన్నికలు జరిగిన 11 శాసనమండలి స్థానాల్లో ఐదు పట్టభద్రుల, ఆరు ఉపాధ్యాయుల నియోజకవర్గాలు ఉన్నాయి. ఆగ్రా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో భారీగా బూత్‌ల ఆక్రమణ జరిగిందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. దీంతో 20, 21, 26 నంబర్ల పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసింది.
అమ్రోహా, ఆగ్రా, ఫతేపూర్, ప్రతాప్ గఢ్, గోరఖ్ పూర్ జిల్లాల్లో బూత్‌ల ఆక్రమణ జరిగిందని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించింది. వీడియో ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాలని కోరింది. బూత్‌ల ఆక్రమణకు పాల్పడిన వారందరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. అమ్రోహాలో ఏడు, ఆగ్రాలో ఐదు, ఫతేపూర్, ప్రతాప్ గఢ్ జిల్లాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో తిరిగి ఓటింగ్ నిర్వహించాలని కోరింది.
ఆగ్రాలోని 21వ పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే భగవాన్ సింగ్ కుష్వాహా బూత్ ఆక్రమణకు పాల్పడ్డారని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. తమ పోలింగ్ ఏజెంట్‌పై దాడిచేసి బయటకు పంపించడంతోపాటు ఎన్నికల సిబ్బంది సహకారంతో అక్రమ ఓట్లు వేయించారని పేర్కొంది. ఆగ్రాలోని 45వ పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి రామ్ సకల్ గుర్జర్, బీజేపీ అధికారిక అభ్యర్థితో కలిసి ప్రిసైడింగ్ అధికారి సహకారంతో అక్రమ ఓటింగ్ నిర్వహించారని ఆరోపించింది.
బీజేపీ అభ్యర్థి హరి కిశోర్ తివారీ మేనల్లుడు 26, 40, 70 నంబర్ల పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి, సమాజ్ వాదీ పార్టీ ఏజెంట్లపై దాడిచేసి బయటకు పంపించారని కూడా ఆరోపించింది. ఎన్నికల అవకతవకలకు బాధ్యులైన పోలీసు, ఎన్నికల సిబ్బందిని గుర్తించి నివేదిక సమర్పించాలని ఆగ్రా డివిజనల్ కమిషనర్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన సిబ్బందిని రీపోలింగ్ విధులకు నియమించరాదని స్పష్టం చేసింది.
రచయిత: ఒమర్ రషీద్. అనువాదం: కె. గంగాధర్
ఇవి కూడా చదవండి:
- పిలిభిత్ ఓటర్ల జాబితాలో అక్రమాలు
- యూపీ ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై బీఎస్పీ నేత ఆవేదన
- ఎన్నికల సంఘంపై విశ్వాసం సన్నగిల్లితే ప్రజాస్వామ్యానికి ముప్పు
మరింత సమాచారం (ఇతర వనరులు):
- Hindustan Times: Azamgarh voter list, action against nine officials
- The Hindu: election officials removed in UP after voter list errors
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
