CITU Mahadharna: Multi-Day Protest Second and Final Day
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. వేతన సవరణ సంఘం ద్వారా ఆషా, అంగన్వాడి వర్కర్లకు కనీసం వేతనం రు.30 వేలతొ పాటు రెండు డిఏలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ఇచ్చిన హమీలను అమలు చేయక పోయినట్లయితే సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఇప్పటికే ఒక నాయకునికి ఫాంహౌజ్‌కు పంపిచినట్లుగా, ముఖ్యమంత్రిని కొడంగల్‌కు సాగనంపగలరని, వారు హెచ్చరించారు.
సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటి, నగరంలోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో నిర్వహించిన రెండు రోజుల మల్టీపుల్ డేస్ మహాధర్నా కార్యక్రమంలో సోమవారం ఆఖరి రోజున ధర్నానుద్దేశించి పలువురు సిఐటియు నాయకులు, అనేక మంది ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఈ సందర్భంగా మాట్లాడుతు, ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎన్నికల్లో అడ్డగోలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మేము గుణపాఠం చెపుతామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత అసంఘటిత రంగాలలో పని చేస్తున్న వారితో చెలగాటం ఆడుతున్నాయని నిలదీసారు. హామీల అమలు, హక్కుల కోసం ప్రశ్నిస్తు కనీసం నిరసనలు తెలుపడం, ధర్నాలు చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా గృహనిర్భంధాలకు పాల్పడుతున్నాయని, రాములు విమర్శించారు.
కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి తిరిగి పాత చట్టాలను అమలు పర్చాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రు. 42 వేలకు పెంచాలని, గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా పిఆర్సి పరిధిలోకి తీసుకురావలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీలను రద్దు చేసి పర్మనెంట్ చేయాలని, 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్ణయం ప్రకారం స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి, స్కీమ్‌ల ప్రైవేటీకరణను ఆపాలి, వీటితో పాటు ఇంకా 25 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ చెప్పారు.
వెయ్యి రోజుల ప్రజాపాలన సంబరాలు ఇక సాగవని, వివిధ స్కీమ్‌లలో చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్న లక్షలాది మంది వర్కర్ల భద్రత ఎవరు చూడాలని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్‌లకు బడ్జెట్‌ను తగ్గిస్తు వాటి అమలును ప్రైవేటు ఫౌండేషన్లకు అప్పగిస్తున్నదని భాస్కర్ విమర్శించారు.
సిఐటియు ధర్నాకు సంఘీభవం తెలియజేస్తు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఆషా, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మితో సహ మరికొన్ని ప్రజాసంఘాలకు చెందిన నాయకులు కూడా మాట్లాడారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఈ సందర్భంగా ప్రభుత్వ విధానలను ఎండగడుతు, దేశ భక్తి గీతలాను ఆలాపించారు.
గంటా రాజు,
సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
