Brazil Presidential Election: Lula Wins Again
2026 అక్టోబర్ 25న బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికల రెండో విడత పోలింగ్ జరిగింది. ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు లూలా డా సిల్వా గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. లూలా డా సిల్వాకు 51.8% ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి బోల్సొనారోకు 48.2% ఓట్లు వచ్చాయి.
లూలా తిరిగి 2027 జనవరి 5న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ ఫలితానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్టోబర్ 4న జరిగిన మొదటి విడతలో లూలా కంటే బోల్సొనారో ఎక్కువ ఓట్లు సాధించారు. అయితే ఎవరికీ అవసరమైన 50% రాకపోవడంతో రెండో విడత పోలింగ్ నిర్వహించారు. అందులో లూలా తన వెనుకబాటును అధిగమించి విజయం సాధించారు.
ఈ ఎన్నికను కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా మాత్రమే చూడకూడదు. ఇందులో కార్మికుల జీవన పరిస్థితులు, ఆర్థిక విధానాలు, నేరాల నియంత్రణ, సామాజిక సంక్షేమం, ప్రజాస్వామ్య సంస్థల పాత్ర, అమెరికాతో సంబంధాలు వంటి అంశాలు ప్రధాన చర్చకు వచ్చాయి.
లూలా ఎవరు-కార్మిక ఉద్యమం నుంచి అధ్యక్ష పదవి వరకు:
లూలా 1945 అక్టోబర్ 27న బ్రెజిల్‌లోని పెర్నాంబుకో రాష్ట్రంలో జన్మించారు. పేద కుటుంబంలో పెరిగిన ఆయన, విద్య పూర్తిచేసిన తరువాత లోహ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేశారు. అనంతరం కార్మిక సంఘాల నాయకుడిగా ఎదిగారు. 1970ల చివర్లో సావో పాలో పరిసరాల్లో జరిగిన కార్మిక సమ్మెల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
1980లో బ్రెజిల్ వర్కర్స్ పార్టీ (PT) స్థాపనలో లూలా కీలక పాత్ర పోషించారు. కార్మిక హక్కులు, వేతనాలు, సామాజిక అసమానతల తగ్గింపు, పేదరిక నిర్మూలన వంటి అంశాలను తన రాజకీయ కార్యక్రమంలో ప్రధానంగా ముందుకు తెచ్చారు.
2002లో తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికై 2003–2010 మధ్య రెండు దఫాలు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత డిల్మా రూసెఫ్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న సమయంలో లూలా పై పై అక్రమంగా అవినీతి ఆరోపణలు చేసి జైలుకు పంపారు. సుమారు 580 రోజులు జైలులో ఉన్నారు. తరువాత బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆయనపై విధించిన శిక్షలను రద్దు చేసింది. 2022లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు జైర్ బోల్సొనారోను ఓడించి మళ్లీ అధికారంలోకి వచ్చారు.
లూలా రాజకీయ ప్రయాణంలో కార్మిక ఉద్యమం, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల ద్వారా అధికార మార్పిడి, న్యాయ వ్యవస్థతో ఘర్షణలు అన్నీ భాగంగా ఉన్నాయి.
జైర్ బోల్సొనారో నుంచి ఫ్లావియో బోల్సొనారో వరకు
జైర్ బోల్సొనారో 2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన రాజకీయ వైఖరిలో సంప్రదాయవాదం, కఠినమైన నేర నియంత్రణ, సైనిక పాలన కాలంపై అనుకూల వ్యాఖ్యలు, పరిమిత ప్రభుత్వ జోక్యం వంటి అంశాలు ప్రధానంగా కనిపించాయి. లూలా రాజకీయంగా ఆయనకు ప్రధాన ప్రత్యర్థి.
2022 అధ్యక్ష ఎన్నికల్లో జైర్ బోల్సొనారో ఓడిపోయారు. అనంతరం ఎన్నికల ఫలితాలను అంగీకరించడం పై వివాదాలు ఏర్పడ్డాయి. ఆయన మద్దతుదారులు 2023 జనవరిలో ప్రభుత్వ భవనాలపై దాడి చేశారు. 2025 సెప్టెంబరులో బ్రెజిల్ సుప్రీంకోర్టు జైర్ బోల్సొనారో పై తిరుగుబాటు కుట్రకు సంబంధించి 27 సంవత్స రాల జైలు శిక్ష విధించింది.
ఆ తరువాత ఆయన కుమారుడు ఫ్లావియో బోల్సొనారో అధ్యక్ష ఎన్నికల బరిలోకి వచ్చారు. ఆయన ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నేర నియంత్రణ, ఆర్థిక విధానాలు, అమెరికాతో సన్నిహిత సంబంధాల వంటి అంశాలను ప్రచారంలో ముందుకు తెచ్చారు.
అందువల్ల 2026 ఎన్నికల్లో పోటీ లూలా వర్సెస్ ఫ్లావియోగా కనిపించి నప్పటికీ, దాని వెనుక గత ఎన్నికల వివాదాలు, జైర్ బోల్సొనారో పై న్యాయ చర్యలు, దేశ భవిష్యత్తు రాజకీయ దిశ వంటి అంశాలు ఉన్నాయి.
లూలాను ఓడించడానికి అమెరికా ట్రంప్ ప్రభుత్వం?
ఇందుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యమైన సమాచారం 2026 అక్టోబర్ 24న రాయిటర్స్ ప్రచురించిన పరిశోధనాత్మక వార్తలో ఉంది.
రాయిటర్స్ కథనం ప్రకారం, అమెరికా విదేశాంగ శాఖలోని ఇద్దరు రాజకీయ నియామక అధికారులు డారెన్ బీటీ, రికార్డో పిటా బోల్సొనారో కుటుంబం తిరిగి బ్రెజిల్ అధికారంలోకి రావడానికి అనుకూలంగా చర్యలు చేపట్టారని, లూలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే చర్యలను ప్రోత్సహించారని పది మంది ప్రస్తుత, మాజీ అమెరికా అధికారుల సమాచారంతో వార్తా సంస్థ వెల్లడించింది.
అమెరికా ప్రభుత్వం బోల్సొనారో కుటుంబానికి అనుకూలంగా వ్యవహ రించిందని విశ్వసనీయ ఆధారం ఉంది.
బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆంక్షలు:
జైర్ బోల్సొనారోపై విచారణలకు నాయకత్వం వహించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండ్రె డి మొరాయిస్పై 2025 జూలైలో అమెరికా మాగ్నిట్స్కీ చట్టం కింద ఆంక్షలు విధించింది. అమెరికా ప్రభుత్వం దీనికి భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన కారణాలను పేర్కొంది.
రాయిటర్స్ ప్రకారం, ఈ ఆంక్షలు విధించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే డిసెంబర్ 2025లో మొరాయిస్ను ఆంక్షల జాబితా నుంచి అమెరికా తొలగించింది.
బ్రెజిల్ వస్తువులపై 50 శాతం సుంకాలు:
2025 జూలైలో అమెరికా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం సుంకాలను ప్రకటించింది. జైర్ బోల్సొనారోపై జరుగుతున్న చర్యలను అమెరికా వ్యతిరేకిస్తూ ఆంక్షలు విధించింది. ఈ చర్య వల్ల బ్రెజిల్ ఎగుమతిదారులు, రెండు దేశాల మధ్య వాణిజ్యంపై ఒత్తిడి ఏర్పడింది. తరువాత కొన్ని సుంకాలను అమెరికా సడలించింది.
ఈ సుంకాలు లూలా ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రభావం చూపాలని ఉద్దేశించినవని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారని రాయిటర్స్ తెలిపింది.
బ్రెజిల్ నేర ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం:
బ్రెజిల్‌లోని PCC, Comando Vermelho అనే పెద్ద నేర ముఠాలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలనే ప్రయత్నాన్ని బోల్సొనారో కుటుంబం ప్రోత్సహించిందని రాయిటర్స్ నివేదించింది. 2026 మేలో ఫ్లావియో బోల్సొనారో అమెరికా అధికారులతో ఈ అంశంపై సమావేశమయ్యారు. మరుసటి రోజు అమెరికా విదేశాంగ శాఖ ఆ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.
ఈ చర్య బ్రెజిల్లో నేర నియంత్రణ అంశాన్ని రాజకీయ చర్చలో మరింత ముందుకు తెచ్చింది.
బోల్సొనారో కుటుంబంతో అమెరికా అధికారుల సంబంధాలు:
రాయిటర్స్ కథనం ప్రకారం, అమెరికా అధికారులు మొదట మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యానికి అనుకూలంగా పనిచేశారని, ఆయనకు శిక్ష విధించబడిన తరువాత ఫ్లావియో బోల్సొనారో అభ్యర్థిత్వానికి మద్దతుగా తమ వైఖరిని మార్చారని సమాచారం ఇచ్చిన వ్యక్తులు తెలిపారు. ఇతర రైట్ వింగ్ అభ్యర్థులతో సంబంధాలు పెట్టుకోవద్దని అమెరికా దౌత్య సిబ్బందికి బోల్స్‌నారో సూచించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది.
ఆంక్షలు లూలాకు వ్యతిరేకంగా పనిచేశాయా?
రాయిటర్స్ కథనంలో ప్రస్తావించిన బ్రెజిల్ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా చర్యలు ఆశించిన ఫలితానికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా న్యాయమూర్తిపై ఆంక్షలు విధించినప్పటికీ, జైర్ బోల్సొనారోపై విచారణ ఆగలేదు.
అమెరికా సుంకాలు బ్రెజిల్ ఎగుమతిదారులపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి.
ఈ సుంకాలు బ్రెజిల్లో జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమాధికారం అంశాలను రాజకీయ చర్చలోకి తెచ్చాయి.
బ్రెజిల్, అమెరికాలోని వాణిజ్య సంస్థలు కూడా సుంకాల ప్రభావంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ఈ పరిణామాల వల్ల లూలా ప్రభుత్వానికి రాజకీయంగా లాభం కలిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిన ఇతర అంశాలూ ఉన్నాయి. జీవన వ్యయం, ఆహార ధరలు, నేర నియంత్రణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక మాధ్యమాల ప్రచారం, యువ ఓటర్ల భాగస్వామ్యం, ప్రజా ఉద్యమాలు వంటి అంశాలు కూడా కీలకంగా నిలిచాయి.
లూలా విజయానికి దోహదపడిన అంశాలు:
మొదటి విడతలో వెనుకబడిన తరువాత లూలా ప్రచారాన్ని పునర్వ్యవస్థీకరించారు. యువతను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ప్రజాస్వామ్య విలువలు, గత ప్రభుత్వ రికార్డు, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారంలో ముందుకు తెచ్చారు.
బ్రెజిల్ ప్రభుత్వ వార్తా సంస్థ Agência Brasil ప్రకారం, లూలా ప్రచారంలో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. ఆన్లైన్ ప్రచార బృందాలు, వీధి ప్రదర్శనలు, విద్యార్థులు, సామాజిక ఉద్యమాల కార్యక్రమాలు ఆయన ప్రచారానికి ఊపునిచ్చాయి.
వేతనాలు, సంక్షేమం, జీవన వ్యయం:
లూలా ఎన్నికల ప్రణాళికలో ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా కనీస వేతనాన్ని పెంచడం, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలను విస్తరించడం, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెంచడం వంటి హామీలు ఉన్నాయి.
నేర నియంత్రణ, ప్రజా భద్రత:
బ్రెజిల్లో నేరాల నియంత్రణ ప్రధాన ఎన్నికల అంశంగా నిలిచింది. ఫ్లావియో బోల్సొనారో కఠినమైన నేర నియంత్రణ విధానాలను ప్రచారం చేయగా, లూలా కూడా ప్రజా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచే ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు.
అందువల్ల ఈ ఎన్నికను కేవలం ఎడమపక్షం, కుడిపక్షం మధ్య పోటీగా కాకుండా ఆర్థిక భద్రత, సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతపై వేర్వేరు విధానాల మధ్య పోటీగా చూడాలి.
బ్రెజిల్‌కు అమెరికాతో సంబంధాలు ఎందుకు కీలకం?
బ్రెజిల్ లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఉత్పత్తులు, సోయాబీన్స్, మాంసం, ఇనుప ఖనిజం, పారిశ్రామిక ఉత్పత్తులు వంటి రంగాల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అమెరికా బ్రెజిల్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. అందువల్ల రెండు దేశాల మధ్య సుంకాలు, ఆంక్షలు, పెట్టుబడులు, సాంకేతిక సహకారం వంటి అంశాలు బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలవు.
లూలా ప్రభుత్వ విదేశాంగ విధానం సాధారణంగా అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే చైనా, బ్రిక్స్ దేశాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టింది.
అమెరికా ప్రభుత్వంతో విభేదాలు ఉన్నప్పటికీ వాణిజ్య సంబంధాలను కొనసాగించడం, బ్రెజిల్ ప్రయోజనాలను కాపాడుకోవడం లూలా ముందున్న ముఖ్యమైన సవాలు.
ఈ ఎన్నికల ఫలితం- అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం:
లూలా విజయం మూడు ప్రధాన అంశాలను చర్చలోకి తెచ్చింది.
- మొదటిది దేశీయ ఓటర్ల నిర్ణయం: అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి ఉన్నా, చివరికి ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించేది ఆ దేశ ఓటర్లే.
- రెండోది విదేశీ ఆర్థిక ఒత్తిడుల పరిమితులు: సుంకాలు, ఆంక్షలు వంటి చర్యలు ప్రభుత్వాలపై ఒత్తిడి సృష్టించగలవు. అయితే వాటి రాజకీయ ఫలితం ముందుగా ఊహించిన విధంగా ఉండాల్సిన అవసరం లేదు. బ్రెజిల్ విషయంలో ఈ చర్యలు జాతీయ సార్వభౌమాధికారం గురించి చర్చను మరింత పెంచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
- ప్రజాస్వామ్య సంస్థల ప్రాధాన్యం: ఎన్నికల ఫలితాలను అంగీకరించ డం, న్యాయస్థానాల స్వతంత్రత, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలు ప్రజాస్వామ్య స్థిరత్వానికి కీలకం.
ఎన్నికల తరువాత ఫ్లావియో బోల్సొనారో ఓటమిని అంగీకరించ కుండా, పోలింగ్ సమయాన్ని పొడిగించిన నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసి ఫలితాలను రద్దు చేయాలని కోరినట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే పోలింగ్ సమయం పొడిగించడం ఫలితాన్ని ప్రభావితం చేయలేదనీ ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఎన్నికలను రద్దు చేయడానికి సరిపడా న్యాయపరమైన ఆధారాలు ఉన్నాయా అనేది వేరుగా పరిశీలించాల్సిన అంశం.
భారతదేశం, కార్మిక ఉద్యమాలు:
బ్రెజిల్ ఎన్నికల పరిణామాలు భారతదేశంతో సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలకూ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి.
కార్మికుల సమస్యలు: వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక సంక్షేమం ఎన్నికల చర్చలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో గమనించాలి.
విదేశాంగ స్వతంత్రత: పెద్ద దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులు అవసరమే అయినా, దేశీయ విధానాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ముఖ్యం.
ఆర్థిక ఆంక్షల ప్రభావం:
అమెరికా ఆంక్షలు కేవలం ప్రభుత్వానికే కాకుండా కార్మికులు, రైతులు, పరిశ్రమలు, ఎగుమతి దారులపైనా ప్రభావం చూపవచ్చు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం: ఓటర్ల తీర్పు, ఎన్నికల సంఘాల విశ్వసనీయత, న్యాయవ్యవస్థ స్వతంత్రత ప్రజాస్వామ్యానికి పునాది.
ముగింపు:
2026 బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా తిరిగి ఎన్నిక కావడం ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామం. మొదటి విడతలో వెనుకబడిన ఆయన రెండో విడతలో విజయం సాధించారు. ఈ ఫలితంలో దేశీయ రాజకీయాలు, సామాజిక సంక్షేమం, ప్రజా భద్రత, ప్రచార వ్యూహాలు, అంతర్జాతీయ సంబంధాలు అన్నీ పాత్ర పోషించాయి.
ట్రంప్ ప్రభుత్వంలోని కొందరు అధికారులు బోల్సొనారో కుటుంబానికి అనుకూలంగా పనిచేసి, లూలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే చర్యలను ప్రోత్సహించారని రాయిటర్స్ నివేదించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆంక్షలు, బ్రెజిల్ వస్తువులపై సుంకాలు, నేర ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించే చర్యలు ఈ వివాదంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి.
ఈ ఎన్నికల నుంచి తీసుకోవాల్సిన ప్రధాన పాఠం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో దేశ భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఆ దేశ ప్రజలకే చెందుతుంది. విదేశీ ప్రభుత్వాల ఆర్థిక, దౌత్య ఒత్తిడులు రాజకీయ పరిణామాలను ప్రభావితం చేయగలిగినా, అవి తప్పనిసరిగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. అదే సమయంలో ఎన్నికల ఫలితాన్ని ఒక్క కారణంతో వివరించడం కూడా సరికాదు. ప్రజల ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ విశ్వాసాలు, ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం — ఇవన్నీ కలిసే ఎన్నికల తీర్పును నిర్మిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- భారత్- బ్రెజిల్ మధ్య కీలక, అరుదైన ఖనిజాలపై ఒప్పందం
- బ్రిక్స్: ప్రపంచ దక్షిణాది దేశాల స్వరం..
- బ్రిక్స్ రోడ్‌మ్యాప్ సిద్ధం, డాలర్ ఆధిపత్యానికి చెక్..
మరింత సమాచారం (ఇతర వనరులు):
- The Guardian: Brazil election 2026, second round results
- BBC News: Brazil election coverage
- G1: resultado do segundo turno
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
