ఈ రోజు, రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. బ్రిక్స్ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ శిఖరాగ్ర సభకు అనేక ప్రాధాన్యతలున్నాయి.
ఇరాన్‌పై అమెరికా ఇశ్రాయేల్ చేస్తున్న యుద్ధం, ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అమెరికా డాలర్ ఆధిపత్యానికి తగ్గుతున్న ఆదరణ తదితర అనేక ప్రధాన సమస్యలు చర్చనీయాంశం కానున్నాయి.
చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షులు పుతిన్ కూడా ఈ సమావేశాలకు హాజరు అవుతున్నారు. 11వ తేదీకే కొన్ని దేశాల అధినేతలు ఢిల్లీ చేరుకున్నారు.
బ్రిక్స్ అనే పేరు మొదట నాలుగు దేశాల పేర్ల మొదటి అక్షరాలతో ఏర్పడింది. బీ – బ్రెజిల్, ఆర్ – రష్యా, ఐ – ఇండియా, సీ – చైనా, ఎస్ – సౌత్ ఆఫ్రికా. ప్రారంభంలో సౌత్ ఆఫ్రికా బ్రిక్‌లో భాగస్వామి కాదు. 2010లో ఆ దేశం కూడా చేరిన తర్వాత బ్రిక్స్ అయింది.
2001లో గోల్డ్‌మన్ సాచ్స్ ఆర్థికవేత్త జిమ్ ఓ’నీల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగు ఆర్థిక వ్యవస్థలను సూచిస్తూ బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించారు.
తరువాత ఇది ప్రభుత్వాల మధ్య సహకార వేదికగా రూపుదిద్దుకుంది. 2006లో బ్రిక్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ ప్రాధాన్యం..
2007-2009 మధ్య కాలంలో ప్రపంచాన్ని కుదిపివేసిన సబ్ ప్రైమ్ సంక్షోభం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటానికి బ్రిక్స్, జీ 20 ఏషియన్ వంటి కూటముల ప్రాధాన్యతను అంతర్జాతీయ ప్రైవేట్ పెట్టుబడి గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలోనే అడుగంటుతున్న ఐఎంఎఫ్ నిధులను పూరించడానికి బ్రిక్స్ దేశాలు అదనపు పెట్టుబడులను సమకూర్చడానికి ముందుకు రావాలని జీ 7 దేశాల కూటమి పట్టుబట్టింది.
తాము పెట్టే అదనపు పెట్టుబడులకు అనుగుణంగా ఐఎంఎఫ్ వ్యవహారాలలో విధాన నిర్ణయాలలో అదనపు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఓటింగ్ హక్కులలో అదనపు వాటాలు కావాలని బ్రిక్స్ దేశాలు పట్టుబట్టాయి. ఆ విధంగానే నాటి తొలి నాటికంటే నేడు ఐఎంఎఫ్‌లో భారతదేశానికి ఎక్కువ వాటా, మెరుగైన ఓటింగ్ హక్కులు వచ్చాయి.
వర్ధమాన దేశాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించే విషయంలో ప్రపంచ బ్యాంక్ నమూనాలకు భిన్నంగా సమానత్వం, సహకారం, భాగస్వామ్యం, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల ప్రాతిపదికన పని చేయటానికి వీలుగా బ్రిక్ బ్యాంక్‌కు కూడా అంకురార్పణ జరిగింది.
2009లో రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో మొదటి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూటీఓ, జీ 20 ప్రభావం చూపుతున్నాయి. వీటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక బలం పెరిగినప్పటికీ, వాటి ప్రాతినిధ్యం, నిర్ణయాధికారం తగినంతగా లేదన్న అభిప్రాయం బ్రిక్స్ దేశాలలో ఉంది. అందువల్ల పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా మరో కూటమిగా బ్రిక్స్ ఏర్పాటు చేయడం లక్ష్యం కాదు.
ప్రపంచ పాలనా వ్యవస్థను మరింత ప్రజాస్వామ్య, సమతుల్య, సమాన ప్రాతినిధ్యంతో మార్చడం ప్రధాన లక్ష్యం.
బ్రిక్స్ ప్రధాన లక్ష్యాలు..
బ్రిక్స్ సహకారం ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా ఉంటుంది.
1) రాజకీయ–భద్రతా సహకారం: అంతర్జాతీయ శాంతి, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అంతర్జాతీయ ఘర్షణలకు శాంతియుత పరిష్కారాలు, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ.
2) ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ఆర్థిక సహాయం, స్థానిక కరెన్సీలలో లావాదేవీలు, చెల్లింపుల వ్యవస్థలలో సహకారం.
3) ప్రజల మధ్య సంబంధాలు: విద్య, ఆరోగ్యం, సంస్కృతి, యువత, క్రీడలు, పర్యాటకం, పరిశోధన, అకడమిక్ సహకారం. ఈ మూడింటిని కలిపి బ్రిక్స్‌లో రాజకీయ-భద్రత, ఆర్థిక-ఫైనాన్షియల్, ప్రజల-మధ్య-సంబంధాలుగా అభివృద్ధి చేశారు.
బ్రిక్స్ విస్తరణ – 5 నుంచి 11 దేశాలకు..
బ్రిక్స్ మొదట నాలుగు దేశాలతో ప్రారంభమై, 2011లో దక్షిణాఫ్రికా చేరడంతో ఐదు దేశాల సమూహంగా మారింది.
2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్‌ను మరింత విస్తరించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం బ్రిక్స్‌లో 11 సభ్య దేశాలు ఉన్నాయి. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా.
బ్రిక్స్ ఆర్థిక ప్రాధాన్యత..
బ్రిక్స్ సభ్య దేశాలు ప్రపంచంలోని అత్యధిక జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంతేకాదు ఈ దేశాలు చమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరులలో కీలక భాగాన్ని కలిగి ఉన్నాయి.
వ్యవసాయం, పరిశ్రమలు, ఖనిజాలు, తయారీ రంగాలలో పెద్ద భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. పెరుగుతున్న ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల బ్రిక్స్ విస్తరణతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గ్లోబల్ సౌత్ బేరసారాల శక్తి పెరిగే అవకాశం ఉంది.
అదే సందర్భంలో సభ్య దేశాల మధ్య తలసరి ఆదాయం, ఆర్థిక నిర్మాణం, రాజకీయ వ్యవస్థలు, విదేశాంగ ప్రయోజనాలు చాలా భిన్నంగా ఉన్నాయనేది వాస్తవం. ఇదే భిన్నత్వంలో ఏకత్వం.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్..
2014లో బ్రెజిల్‌లోని ఫోర్టలెజాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో రెండు కీలక ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
1) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)
2) కాంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా ఏర్పాటయింది. ఎన్డీబీకి 100 బిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఇది బ్రిక్స్ సాధించిన విజయాలలో ఒకటి.
డాలర్ ఆధిపత్యం..
అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలలో అమెరికన్ డాలర్‌కు అపారమైన ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు డాలర్‌ను ఒక్కసారిగా తొలగించాలి అనుకోలేదు. అయితే స్థానిక కరెన్సీలలో వాణిజ్యం, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలు, సరిహద్దు చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై సహకారం పెంచుకుంటున్నాయి.
ముఖ్యంగా ఆర్థిక ఆంక్షలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతదేశం – బ్రిక్స్..
భారతదేశం బ్రిక్స్ వ్యవస్థాపక సభ్య దేశాలలో ఒకటి. భారత్ బ్రిక్స్‌ను “గ్లోబల్ సౌత్ దేశాల స్వరం బలంగా వినిపించే వేదిక”గా భావిస్తున్నది.
బ్రిక్స్ వల్ల భారతదేశానికి ఆర్థిక పరంగా కొత్త మార్కెట్లు, పెట్టుబడులు, వాణిజ్య విస్తరణ, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
దౌత్యపరంగా గ్లోబల్ సౌత్‌లో నాయకత్వం, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ, ఐక్యరాజ్య సమితి సంస్కరణలకు మద్దతు, అంతర్జాతీయ నిర్ణయాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం లభిస్తాయి.
వ్యూహాత్మకంగా చైనా, రష్యా, ఇరాన్, పశ్చిమాసియా దేశాలతో ఒకే వేదికలో చర్చించగల అవకాశం భారతదేశానికి లభిస్తుంది.
మీడియా సమాచారం ప్రకారం ప్రపంచంలో యుద్ధాలు, మహమ్మారులు, ఆహార సంక్షోభాలు, ఇంధన సంక్షోభాలు, సరఫరా గొలుసుల అంతరాయాలు, వాతావరణ మార్పుల వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు మరింత స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవాలని భారత్ భావిస్తున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, కొత్త టెక్నాలజీలు, డిజిటల్ ఆరోగ్యం, అంతరిక్ష సహకారం వంటి రంగాలకు ప్రాధాన్యత ఉండాలని భారత్ అభిప్రాయపడుతున్నది.
బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞానం, ఆరోగ్యం, విద్య, సాంకేతికతలో ఆచరణాత్మక సహకారం ఉండాలని కూడా భారత్ కోరుకుంటున్నది.
2026లో జరిగిన వివిధ బ్రిక్స్ మంత్రుల సమావేశాల ఫలితాలను పరిశీలిస్తే, ఢిల్లీ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా కింది అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
1) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ – గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ప్రాతినిధ్యం, ఆర్థిక స్థిరత్వం
2) అంతర్జాతీయ వాణిజ్యం, డబ్ల్యూటీఓను బలోపేతం చేయడం, గ్లోబల్ వాల్యూ చైన్స్‌లో మార్పులు, ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తేవడం, ట్రేడ్ ఫైనాన్స్, సర్వీసెస్ ట్రేడ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 2026 ఆగస్టులో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
కోవిడ్-19 తరువాత ఒకటి లేదా రెండు దేశాలపై ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకరం అని ప్రపంచం గుర్తించింది. అందువల్ల బ్రిక్స్ దేశాలు ఔషధాలు, సెమీ కండక్టర్లు, ఆహారం, ఇంధనం, కీలక ఖనిజాలు, పారిశ్రామిక ఉత్పత్తులు వంటి రంగాలలో వివిధ దేశాలు, సంస్థల ద్వారా (వైవిధ్యమైన సరఫరా గొలుసులు) ఆయా దేశాల అవసరాలు తీర్చుకోవాలని బ్రిక్స్ దేశాలు భావిస్తున్నాయి.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా కోట్లాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ కారణంతో 2026 బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ సమావేశంలో ఎంఎస్ఎంఈలకు క్రెడిట్, ట్రేడ్ ఫైనాన్స్, అంతర్జాతీయ మార్కెట్లకు ప్రవేశం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.
ఇది బ్రిక్స్ సహకారాన్ని కేవలం పెద్ద కార్పొరేట్ సంస్థలకే పరిమితం చేయకుండా చిన్న వ్యాపారాలకు విస్తరించేందుకు ఉపయోగపడవచ్చు.
ఇంధన భద్రత..
2026లో భారత్ నిర్వహించిన ఎనర్జీ మినిస్టర్స్ సమావేశంలో ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ యాక్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ, హైడ్రోజన్, స్మార్ట్ గ్రిడ్స్, ఎనర్జీ స్టోరేజ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చ జరిగింది.
అందుచేత ఢిల్లీలో నేడు, రేపు జరిగే సమావేశాలలో సురక్షితమైన, అందుబాటు ధరలో, సుస్థిరమైన ఇంధన సరఫరా ముఖ్యమైన అంశంగా ఉండే అవకాశం ఉంది.
వ్యవసాయం – ఆహార భద్రత..
బ్రిక్స్ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో అత్యధికంగా ఉన్నందున ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చరల్ రెసిలియెన్స్ అత్యంత కీలకమైన అంశాలు. అందుచేత వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, డిజిటల్ వ్యవసాయం, ఆహార సరఫరా గొలుసులు, రైతుల ఆదాయం, వ్యవసాయ పరిశోధన, ఎరువులు, విత్తనాలు, ఆహార ధరల స్థిరత్వం అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 12–13 సమావేశ డిక్లరేషన్..
ప్రస్తుతం జరిగే శిఖరాగ్ర సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ విడుదల చేయవచ్చు. ప్రపంచ పాలనా సంస్థల సంస్కరణపై వైఖరిని ప్రకటించవచ్చు.
బ్రిక్స్ ఆర్థిక సహకారాన్ని మరింత పెంచే చర్యలు, స్థానిక కరెన్సీ వాణిజ్యం, చెల్లింపు వ్యవస్థలలో పురోగతి, ఎన్డీబీని మరింత బలోపేతం చేయడం, గ్లోబల్ సౌత్ అభివృద్ధికి కొత్త ఆర్థిక వనరులు, ఆహార, ఇంధన, ఆరోగ్య భద్రతపై సహకారం, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ సహకారం, పర్యావరణ మార్పులు, సమీకృత అభివృద్ధి, అంతర్జాతీయ ఘర్షణలపై శాంతియుత పరిష్కారానికి పిలుపు వంటి అంశాలపై ఢిల్లీ డిక్లరేషన్ ఉండవచ్చని పలువురు మేధావులు అంచనా వేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
