ప్రపంచవ్యాప్తంగా ఈనాడు మితవాద శక్తులు అధికారంలో ఉంటూ అనుసరిస్తున్న విద్వేషపూరిత హింసాత్మక ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలకు ప్రత్యామ్నాయంగా అహింస, మిశ్రమ ఆర్థిక విధానాలు, అలీనోద్యమ విధానాలపై చర్చించి వాటి అమలుకు కృషి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘2వ భారత్ సమ్మిట్’ ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరంలో జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న ఈ సమ్మిట్‌లో భారత్‌తో సహా సుమారు 70 దేశాల నుంచి దాదాపుగా 1000 మంది విధాన రూపకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రత్యామ్నాయ విధానాలపై ఆలోచించే ప్రగతిశీల శక్తులు, ప్రతిపక్షాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు.
వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ నేతలు
ఈ సమ్మిట్‌కు సంబంధించి బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్పర్సన్ సల్మాన్ ఖుర్షీద్, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ పరిపాలన విభాగం ఇన్‌ఛార్జి గురుదీప్ సింగ్ సప్పాల్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా తొలుత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచానికి అహింస, అలీనోద్యమం, మిశ్రమ ఆర్థిక విధానాలతో పాటు ప్రగతిశీల భావాలను అందించిందని, ఈ రోజు ఈ విధానాలు ప్రపంచానికి చాలా అవసరమని చాటిచెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
కాంగ్రెస్ కూడా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ విధానాలనే అనుసరించిందని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్.. మరో దావోస్
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్వేష రాజకీయం, ఆర్థిక, సామాజిక విధానాలకు భారతదేశంలో చోటు లేదన్నారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలపై చర్చించి అమలు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
పెట్టుబడిదారీ వర్గాలు, పారిశ్రామికవేత్తలు చర్చించి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడానికి దావోస్ వేదికగా మారిన విధంగానే.. మితవాద శక్తులు అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలపై చర్చించి తగిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడేలా హైదరాబాద్ సైతం దావోస్ మాదిరిగా ఒక వేదికగా మారాలని ఆకాంక్షించారు.
ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమ్మిట్‌లో ప్రపంచం ఈనాడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై చర్చించడానికి వివిధ అంశాలపై 12 సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం నాటి నుంచి తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విధానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
ఏఐసీసీ పరిపాలన విభాగం ఇన్‌ఛార్జి గురుదీప్ సింగ్ సప్పాల్ మాట్లాడుతూ.. దేశంలో, ప్రపంచంలో ఈ రోజు అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలకు ప్రత్యామ్నాయంగా మహాత్మా గాంధీతో పాటు కాంగ్రెస్ ఇతర పెద్దలు చూపిన మార్గదర్శకం, వేసిన బాటలు ప్రపంచానికి ఎంతో అవసరమని అన్నారు.
సమ్మిట్ లోగో ఆవిష్కరణ
‘కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లోగోను కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ డైరెక్టర్ పుష్పారాజ్ దేశ్‌పాండే, ఎమ్మెల్యే మక్కన్ రాజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
