ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో అక్టోబరు 31న పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దాడి ఘటన ఎవరినైనా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.
నిందితుడు రంపంతో పట్టపగలు పాఠశాల తరగతి గదిలోకి చొరబడి బాలికపై దాడి చేశాడు. ఆమెను రక్షించడానికి వచ్చిన మరో బాలిక కూడా తీవ్రంగా గాయపడింది. తరగతి గదిలోనే ఇలా జరిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ?
దీనికి ముందు దేశ రాజధాని ప్రాంతంలోని దక్షిణ-తూర్పు ఢిల్లీలో లేడీ శ్రీరామ్ కాలేజీ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌లో సెప్టెంబరు 21న పోలీసుల వేషంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై జరిపిన సామూహిక అత్యాచారం, స్వరూప్ నగర్లో మైనర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం, గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న బస్సులో మరొక మైనర్‌పై జరిగిన లైంగిక దాడి లాంటి ఘటనలు చూశాం.
తాజాగా దేశ రాజధానిలో ఒక మహిళా జర్నలిస్టుపై ఏకంగా చట్టాన్ని కాపాడవలసిన ఒక పోలీసు ఉన్నతాధికారే లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చూశాం. ఇటీవల జాతీయ రాజధానిలో నమోదైన పలు లైంగిక హింస నేరాలు ఇవి.
అలాగే దేశంలోని ఏదో ప్రాంతంలో నిత్యం ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ పబ్లిక్ ప్రదేశాల్లో మహిళల భద్రత, నేరాల నివారణ, శిక్షాత్మక చర్యల అవసరాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి.
అత్యంత ఆందోళనకర విషయమేమిటంటే దేశ రాజధానే మహిళలపై అత్యాచారాలకు అడ్డాగా మారడం. అత్యాచారాలు ఎంతగా పెరిగాయంటే, బిహార్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్, తాము ఇలాంటి ప్రభుత్వంలో భాగంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని అనేంత స్థాయిలో జరిగాయి.
నమోదవుతున్న కేసులు ఎన్నో.. శిక్షలు పడేవి మరెన్నో
2012 నాటి ఢిల్లీ నిర్భయ అత్యాచారం కేసు తర్వాత సంవత్సరాలుగా జరిగిన చట్టసవరణలు కఠినమైన శిక్షలను పరిచయం చేయడమే కాకుండా, అత్యాచారం కేసుల పరిష్కారానికి సమయ పరిమితులను నిర్దేశించాయి.
అయితే ఆశ్చర్యకరంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ఆధారంగా చేపట్టిన విశ్లేషణ ప్రకారం, నిర్ణీత కాలపరిమితిలో న్యాయం అందించడంలో దేశం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తెలుస్తోంది. బ్యూరో విడుదల చేసిన ఇటీవల సంవత్సరాల నివేదికలు మహిళలపై జరుగుతున్న నేరాల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
2023లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల ఫిర్యాదుపై నమోదు చేయబడిన మొత్తం కేసులు 4,48,211 కాగా, మహిళా జనాభాలో నేరాల రేటు ప్రతి లక్ష మందికి 66.2గా నమోదైంది.
మహిళలపై నమోదైన కేసుల్లో సింహభాగం — భర్త లేదా ఆయన బంధువుల ద్వారా జరుగుతున్న గృహహింస/వేధింపులు సుమారు 29.8 శాతం, కిడ్నాప్/అపహరణలు 19.8 శాతం, స్త్రీలను మానభంగం చేసే ఉద్దేశంతో జరిగే దాడి/లైంగిక వేధింపులకే 18.7 శాతం చెందుతున్నాయి.
బాలికలు, పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలు పోక్సో(POCSO) కేసులతో సహా ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.
2023లో పిల్లలపై నేరాలు 9.2 శాతం పెరగ్గా, 2024 నాటికి ఇవి మరింత పెరిగి 1,87,702 కేసులకు చేరుకున్నాయి.
2018 నుంచి ప్రతి సంవత్సరం నమోదైన అత్యాచారం కేసుల సంఖ్యను పరిశీలిస్తే సగటున రోజుకు 84 కేసులు అంటే గంటకు మూడు కేసులకు పైగా నమోదవుతున్నాయి. నమోదు కాకుండా ఉన్నవి మరెన్నో.
శిక్షలు పడేది కేవలం 2 శాతమే
2024లో న్యాయస్థానాలు పరిష్కరించిన 20,587 కేసులలో దాదాపు 68 శాతం నిర్దోషులుగా విడుదల కాగా, 8 శాతం కేసులు కొట్టివేయబడ్డాయి. అందులో కేవలం 421 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. ఇది ఆ సంవత్సరం విచారణకు స్వీకరించిన కేసులలో కేవలం 2 శాతం మాత్రమే.
గత సంవత్సరాల డేటాను పరిశీలిస్తే కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. 2023లో విచారణకు వెళ్లిన కేసుల్లో కేవలం 2.3 శాతం మాత్రమే శిక్షతో ముగిశాయి.
2022, 2021లలో ఈ గణాంకాలు వరుసగా 1.9 శాతం, 1.2 శాతంగా ఉన్నాయి. శిక్షా రేటు ఇంత తక్కువగా ఉండటంతో నేరం చేసినా ఎలాగోలా తప్పించుకోవచ్చనే ధీమాతో నేరస్తులకు భయం ఉండదు.
సత్వర న్యాయం అందేలా చూడటానికి కేవలం చట్టసవరణలకే పరిమితం కాకుండా అదనపు చర్యలు అవసరమని ఇది నొక్కి చెబుతోంది.
తాజాగా ఒక మహిళా జర్నలిస్ట్ ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారిపై ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై, గతంలో అదే అధికారిపై మరో ఇద్దరు జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం, దీనికి ముందే మహిళా రెజ్లర్లపై బీజేపీ పార్లమెంటు సభ్యుని లైంగిక వేధింపులపై చర్య తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా నిరాకరించడం వంటివి ప్రభుత్వ వైఖరికి దర్పణం పడుతున్నాయి.
‘బేటీ బచావో – బేటీ పడావో’ వంటివి ఎంత డొల్ల నినాదాలో వీటిని బట్టి తెలుస్తోంది. ‘యథా రాజా – తథా ప్రజా’ అన్నట్లు ప్రభుత్వమే ఇలా ఉంటే, అధికార యంత్రాంగ వైఖరి వేరేగా ఉంటుందని ఆశించలేం.
సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో మైనర్లు, మహిళలపై పెరిగిపోతున్న లైంగిక దాడి ఘటనలను జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబరు 28న స్వచ్ఛందంగా(సుమోటో) విచారణకు స్వీకరించింది.
నాలుగు వారాల్లోగా ప్రమాదకర ప్రాంతాలను తక్షణమే గుర్తించాలని, పార్కులు, విద్యాసంస్థలు, మహిళలు, పిల్లలు ఎక్కువగా సంచరించే ఇతర ప్రాంతాల్లో భద్రతను నిర్ధారించడానికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ విస్తృతమైన నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను, ఇతర అధికారులను కోర్టు ఆదేశించింది.
ఏ బహిరంగ ప్రదేశాన్నీ “ప్రమాదకర ప్రాంతాలుగా” మారడానికి అనుమతించలేమని స్పష్టం చేసింది.
హింసాత్మక భయం లేకుండా, ఆత్మగౌరవంతో జీవించే హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించబడిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక గ్యారంటీలో ఒక అంతర్భాగమని ధర్మాసనం పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో గ్రేటర్ నోయిడా నుంచి కాశ్మీరీ గేట్ వరకు దాదాపు 47 కిలోమీటర్ల మేర ప్రయాణించిన కదిలే బస్సులో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఒక్క పోలీస్ పికెట్ వద్ద కూడా బస్సును ఆపకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనను “2012 నిర్భయ కేసుతో బాధాకరంగా పోల్చక తప్పదు” అని వ్యాఖ్యానించింది.
ఈ సంఘటన, నాటి నుంచి నేటి వరకు చట్ట అమలు యంత్రాంగంలో ఏమైనా “అర్థవంతమైన పురోగతి” వచ్చిందా లేదా అనే దానిపై ప్రశ్నలను లేవనెత్తుతోందని పేర్కొంది.
ఈ తరహా దారుణాలు జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రకటనలు ఇవ్వడం సాధారణమైపోయింది.
అయితే జవాబుదారీతనం నిర్దేశించకుండా కేవలం సానుభూతి వ్యక్తంచేయడం వల్ల వ్యవస్థాగత వైఫల్యాలను కప్పిపుచ్చలేం.
నైతిక విలువలతో కూడిన వాతావరణం రావాలి
మహిళల రక్షణ కోసం పోక్సో చట్టం, నిర్భయ చట్టం వంటి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో దారుణాలు కొనసాగడానికి, నమోదయ్యే కేసుల సంఖ్య పెరగడానికి అనేక సామాజిక, న్యాయ, పాలనాపరమైన కారణాలు ఉన్నాయి:
ప్రభుత్వమే నేరస్తులను కాపాడటం, చట్టాల పట్ల భయం లేకపోవడం, విచారణలో తీవ్ర జాప్యం, తక్కువ శిక్షా రేటు, చట్ట అమలు యంత్రాంగంలో లోపాలు, రక్షణ వ్యవస్థల అలసత్వం, బాధితుల పట్ల పక్షపాతం, పురుషాధిక్య భావజాలం, బాధితులనే నిందించే సంస్కృతి వంటివి కారణాలుగా కనబడతాయి.
ఈ పరిస్థితి మారాలంటే చట్టాలు కాగితాలపై ఉండటమే కాకుండా, నేరస్తులకు కచ్చితమైన శిక్ష పడేలా పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. కేవలం నూతన చట్టాలు తేవడమే కాకుండా, విచారణ వేగవంతం చేసే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పేరుకే కాకుండా ఆచరణలో కూడా ఫాస్ట్‌గా కదలాలి.
పురుషాధిక్య భావజాలం స్థానంలో సమాజంలో చిన్ననాటి నుంచే నైతిక విలువలు, మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించే వాతావరణం ఏర్పడేలా చేయడం వంటి చర్యల ద్వారా మాత్రమే మహిళలకు నిజమైన భద్రత చేకూరుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
