భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందనే వాదనలు, విషయాలని పోల్చిన తీరులో సందేహాలు, ఉపయోగించిన పద్ధతుల్లో లోపాలు వాస్తవ ఆర్థిక పరిస్థితులతో పోల్చి చూస్తే పూర్తిగా భిన్నమైన కథనాన్ని తెలియజేస్తున్నాయి.
భారతదేశంలో పేదరికంపై జరుగుతున్న చర్చను ప్రపంచ బ్యాంక్ చేసిన ఒక ప్రకటన కొత్త మలుపు తిప్పుతోంది.
2011లో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం ప్రస్తుతం కేవలం 2.6 శాతానికి తగ్గిందని, తద్వారా దేశం ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించే స్థితికి చేరువలో ఉందని ఆ సంస్థ పేర్కొంది.
కొత్త సర్వే విధానంలో నెలకు మూడు సార్లు ఇళ్లను సందర్శిస్తారు. పాత సర్వే విధానంలో వేర్వేరు సందర్భాల్లో ఇళ్లను సందర్శించి సమాచారాన్ని సేకరిస్తారు.
పాత పద్ధతి మెరుగైన సమాచారాన్ని అందజేస్తోంది. ఈ సర్వేలు ఉచితాల అంచనా విలువలను కలిపి, ఖర్చుల వివరాలను విడిగా అందిస్తాయి. ఈ రెండు మార్పుల వల్ల ఖర్చును మరింత కచ్చితంగా అంచనా వేసి, వినియోగ వ్యయ అంచనాలను పెంచవచ్చని, తద్వారా భారతదేశంలో పేదల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నారు.
కాబట్టి 2022-23, ఇంకా 2023-24 సంవత్సరాలకు సంబంధించిన నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (National Statistical Organisation) గణాంకాలను 2011-12 నాటి గణాంకాలతో నేరుగా పోల్చడం సాధ్యం కాదు. అలాంటప్పుడు, ఈ రెండు గృహ వినియోగ వ్యయ సర్వే శ్రేణులను పోల్చడం వీలు కాదు. అయినా పేదరికంలో ఇంతటి భారీ తగ్గుదల నమోదైందని ప్రపంచ బ్యాంక్ ఏ ప్రాతిపదికన అంచనా వేస్తోంది?
ప్రస్తుత (కొత్త పద్ధతి) పేదరికపు అంచనాలు, పలు పర్యటనల ఫలితంగా వచ్చిన(పాత పద్ధతి) అధిక గృహ వ్యయ అంచనాలను కాదని, పాత పద్ధతి అంచనాల నుంచి వచ్చిన అతి తక్కువ పేదరికపు అంచనాను కొనసాగిస్తున్నాయి.
కేవలం ధరల సూచికను ఉపయోగించి 2011-12 పేదరికపు రేఖలను సవరించటం సరికాదు. కొత్త పేదరికపు లక్ష్యాలు అవసరం.
2014 నుంచి భారత ప్రభుత్వం సొంత పేదరిక లక్ష్యాలను రూపొందించడం లేదు. ప్రణాళికా సంఘం అనుసరిస్తూ వచ్చిన సుదీర్ఘ పద్ధతికి భిన్నంగా, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అంచనాలపైనే ఆధారపడుతోంది.
పేదరికం బాగా తగ్గించి చూపించడానికి డేటా పరిమితులను విస్మరించడం పరిశోధన ఆధారిత ఫలితాలకు విరుద్ధంగా ఉంది.
నీతి ఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచికకు(MPI) కూడా ఇదే ఆందోళన వర్తిస్తుంది. అది కూడా పేదరికంలో తీవ్రమైన తగ్గుదల ఉందని పేర్కొంది.
అర్థశాస్త్రవేత్తలు రంగరాజన్, మహేంద్ర దేవ్ చేసిన మరో అంచనా 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి మారిన పద్ధతుల్లోని వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఇక్కడ సమస్య కేవలం పద్ధతికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది విషయ పరమైనది కూడా.
ప్రపంచ బ్యాంకు కూడా ఒక బహుముఖ పేదరిక అంచనాను రూపొందించింది. ఇది మూడు అమెరికన్ డాలర్ల కొనుగోలు శక్తి సమానంగా పేదరిక రేఖను ఉపయోగించి, తన సొంత ద్రవ్య పేదరిక అంచనాతో మొదలు పెట్టి, ఇది పేదల వాటాను 5.3%గా పేర్కొంటుంది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ MPI పది సూచికల జాబితా నుంచి ఐదు సూచికలను జోడించింది. అయినా ఇది ఎటువంటి సూచీని రూపొందించదు.
ఆరోగ్య స్థితి సూచికను ఎందుకు తీసి వేశారో ప్రపంచ బ్యాంకు ఎటువంటి సైద్ధాంతిక వివరణ ఇవ్వలేదు. అలాగే అవుట్‌పుట్ లేదా అవుట్‌కమ్ సూచికలు లేకుండా, కేవలం ఇన్పుట్ సూచికలు మాత్రమే ఎందుకు ఉన్నాయో కూడా అది వివరించలేదు.
ఈ ఇన్పుట్ సూచికలు ద్రవ్యేతర పేదరికంలో తగ్గుదలను ఎలా నిర్ధారించగలవో కూడా అది వివరించలేదు.
ద్రవ్య పరమైన పేదరికం
ద్రవ్య పరమైన పేదరికంపై, ప్రపంచ బ్యాంకు అక్టోబరు 2026 నాటి ‘పేదరికం, సమానత్వ నివేదిక’ ఈ విధంగా చెబుతోంది: “ఈ పురోగతి ప్రధానంగా బలమైన వినియోగ వృద్ధి, పెరుగుతున్న ఉపాధి (ముఖ్యంగా మహిళల్లో) ఆహార రాయితీలతో సహా విస్తరించిన సామాజిక బదిలీల ద్వారా సాధ్యమైంది.” ఈ వాదనలను మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
టెండూల్కర్ ప్రమాణాల ప్రకారం, 2004-2012 మధ్య కాలంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, సుమారు 138 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి.
2015 తర్వాత పేదరిక తగ్గింపు ప్రక్రియ మందగించడానికి గల కారణాలు స్పష్టంగా నమోదు చేయబడ్డాయి.
మొదటి అంశం ఏమిటంటే, ఈ రెండు కాలాల మధ్య జీడీపీ వృద్ధి రేటులో ఉన్న వ్యత్యాసం. 2004 నుంచి 2014 వరకు వార్షిక సగటు వృద్ధి రేటు 7.8%గా ఉండగా, 2014 నుంచి 2026 వరకు ఉన్న 12 ఏళ్ల కాలంలో ఇది 6.2%గా ఉంది.
2004-2014 మధ్య కాలంలో నమోదైన అధిక వృద్ధి రేటుకు, అప్పట్లో ఉన్న బలమైన పొదుపు, పెట్టుబడులు దోహదపడ్డాయి.
2003-04 నాటికి పొదుపు జీడీపీలో 23 శాతానికి, పెట్టుబడి 24 శాతానికి చేరుకున్నాయి. ఆ తర్వాత అనువైన స్థూల ఆర్థిక విధానాల వల్ల, 2004-14 మధ్య కాలంలో జీడీపీలో పెట్టుబడి నిష్పత్తి 32 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది. అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ భారతదేశం ఇంతటి స్థాయిని మళ్లీ సాధించలేదు.
తదనంతర కాలంలో, అంటే 2014-24 మధ్య జీడీపీ వృద్ధి రేటు ఏటా 6.2 శాతానికి తగ్గింది. 2012-23 కాలానికి సంబంధించి వాస్తవ వృద్ధి రేటు ఏటా సుమారు 4.5 శాతంగా ఉంటుందని అరవింద్ సుబ్రమణియన్ అంచనా వేశారు.
పొదుపు, పెట్టుబడి రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. 2014-24 మధ్య పెట్టుబడి రేటు ఏటా 26 శాతం నుంచి 32 శాతం మధ్య నమోదైంది. దీనికి ప్రధాన కారణం వేతనాలు తగ్గడం, తద్వారా పొదుపు కూడా తగ్గడమే.
వృద్ధి సరళి కూడా మారింది. మునుపటి కాలంలో, సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలోనూ వృద్ధి విస్తరించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు, తుది వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ వ్యయం అన్నీ దోహదపడటంతో మొత్తం డిమాండ్ బలంగా కొనసాగింది. వ్యవసాయేతర రంగంలో ఉపాధి ఏటా అపూర్వమైన రీతిలో 75 లక్షల ఉద్యోగాల మేర పెరిగింది.
అసమానతలు పెరిగాయి
దీనికి విరుద్ధంగా, 2016 నుంచి విధానపరమైన పరిణామాలైన పెద్ద నోట్ల రద్దు, సరిగా రూపొందించని జీఎస్టీ, దేశవ్యాప్త లాక్డౌన్లు వంటివి అసంఘటిత రంగంలో, ఎంఎస్ఎంఈ(MSME)లలో ఉపాధి కుప్పకూలడానికి కారణమయ్యాయి.
కోవిడ్ అనంతర పునరుద్ధరణ K ఆకారంలో సాగి, ఇప్పటికే అసమానతలున్న దేశంలో అసమానతలను మరింత పెంచింది.
ఈ రెండు కాలాల మధ్య ఉద్యోగ వృద్ధిలో తీవ్రమైన వ్యత్యాసం ఉంది. భారతదేశ స్వాతంత్ర్యానంతర చరిత్రలో మొదటిసారిగా, వ్యవసాయేతర ఉపాధి విస్తరించడంతో 2004 తర్వాత వ్యవసాయ కార్మికుల సంఖ్య తగ్గింది. దీనివల్ల 2014 వరకు గ్రామీణ కార్మిక మార్కెట్లు బిగుసుకుపోయాయి.
2020 తర్వాత దీనికి విరుద్ధంగా జరిగింది. రివర్స్ మైగ్రేషన్(కోవిడ్-లాక్డౌన్ ఫలితంగా అసంఘటిత వలస కార్మికులు తిరిగి గ్రామాలకు వెళ్లడం) కారణంగా వ్యవసాయ రంగానికి 6.5 కోట్ల మంది కార్మికులు చేరారు.
2017 నుంచి 2023 మధ్య, ముఖ్యంగా మహిళల్లో 1.3 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడటాన్ని పేదరికం తగ్గడానికి ఒక కారణంగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కానీ ఈ ఉద్యోగాలలో 6.5 కోట్లు వ్యవసాయ రంగంలోనే ఉన్నాయన్న విషయాన్ని అది ప్రస్తావించడంలో విఫలమైంది.
నగరాలు, పట్టణ శివారు ప్రాంతాలలో లక్షలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత పురుషులు గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచ్చారు.
మరింత ముఖ్యంగా, గతంలో వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళలు, 2017 నుంచి 2024 మధ్య కాలంలో ఎక్కువగా వేతనం లేని కుటుంబ చాకిరీ వ్యవసాయ పనులకు తిరిగి వచ్చారు.
2017 నుంచి 2025 మధ్య కాలంలో గ్రామీణ, పట్టణ భారతదేశం రెండింటిలోనూ వేతనాలు స్తంభించిపోయాయి.
చివరగా 2004 నుంచి 2014 మధ్య పెరుగుతున్న వాస్తవ వేతనాలు, ముఖ్యంగా ప్రాథమిక వినియోగ వస్తువులపై ప్రైవేట్ తుది వినియోగ వ్యయాన్ని పెంచాయి. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పేదల సంఖ్య తగ్గింది.
1950 నుంచి 2004 మధ్య ఇది జరగలేదు. 1973-74 నుంచి పేదరికం తగ్గుముఖం పట్టినప్పటికీ, పేదల మొత్తం సంఖ్య 2004-2012 మధ్య మాత్రమే తగ్గింది.
2015 నుంచి వాస్తవ వేతనాలు స్తంభించిపోయాయి. వ్యవసాయేతర రంగంలో ఉపాధి కల్పన అవసరమైన స్థాయిలో సగం మాత్రమే ఉంది.
నిరుద్యోగుల సంఖ్య పెరగడం, కొత్తగా శ్రామిక శక్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య అధికం కావడం, అలాగే ఉపాధి, విద్య లేని వారి (NEETs) సంఖ్య పెరగడం వంటి కారణాల దృష్ట్యా రాబోయే 20 ఏళ్ల పాటు భారతదేశానికి ప్రతి ఏటా 12 మిలియన్ల కొత్త వ్యవసాయేతర ఉద్యోగాలు అవసరమవుతాయి.
క్లుప్తంగా చెప్పాలంటే, 2015 నుంచి సాధారణ ప్రజల జీవితాల్లో వచ్చిన ఈ మార్పులేవీ నిలకడగా కొనసాగలేదు. వృద్ధి మందగించింది. అసమానతలు పెరిగాయి. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పన క్షీణించింది. వాస్తవ వేతనాలు ఎటువంటి వృద్ధి లేకుండా స్తంభించిపోయాయి. 2015 నుంచి పేదరికం తగ్గి ఉండవచ్చు. కానీ ఎంత తగ్గిందో తెలియదు.
వ్యాసకర్త: శ్రీ సంతోష్ మెహ్రోత్రా (ఈయన మాస్కోలోని హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మాజీ ప్రొఫెసర్).
తెలుగు అనువాదం: సుబ్రమణ్యం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
