Public Transport Is a People's Right - the Foundation of National Development
నవంబర్ 26వ తేదీ ప్రపంచ వ్యాపితంగా సుస్థిర రవాణా దినోత్సవం (World Sustainable Transport Day) జరపాలని ఐక్య రాజ్య సమితి పిలుపునిచ్చింది. ఒక దేశ అభివృద్ధిని కేవలం ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP), పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడులు, సంపద సృష్టి వంటి గణాంకాలతో మాత్రమే అంచనా వేయలేము. ఆ దేశంలోని సామాన్య ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం, రవాణా వంటి కనీస అవసరాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయన్నది కూడా అభివృద్ధికి ముఖ్యమైన కొలమానం. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లాలన్నా, ఒక కార్మికుడు పనికి వెళ్లాలన్నా, ఒక రైతు తన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లాలన్నా, ఒక రోగి ఆసుపత్రికి చేరుకోవాలన్నా రవాణా సదుపాయం అవసరం. రవాణా లేకుండా విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపారం, వ్యవసాయం వంటి రంగాల అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ప్రజా రవాణాను ఒక వ్యాపార కార్యకలాపంగా కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయంగా చూడాలి.
ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి 2023 మే 16న తన 77వ జనరల్ అసెంబ్లీలో A/RES/77/286 తీర్మానాన్ని ఆమోదించింది. నవంబర్ 26ను ప్రపంచ సుస్థిర రవాణా దినోత్సవంగా ప్రకటించింది. ఈ తీర్మానం రవాణా వ్యవస్థను ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ సహకారంతో అనుసంధానం చేసింది.
ప్రజా రవాణా-దాని పరిధి:
ప్రజా రవాణా అంటే సాధారణ ప్రజలు వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే సామూహిక రవాణా సదుపాయాలు. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, నగర, మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్లు, ప్రయాణికుల రైళ్లు, ట్రామ్‌లు, ట్రాలీ బస్సులు, నీటి మార్గాల ద్వారా నడిచే ప్రజా రవాణా, గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక రవాణా సదుపాయాలు, నడక, సైక్లింగ్‌కు అనువైన రవాణా మౌలిక సదుపాయాలు.
ప్రజా రవాణా అంటే కేవలం బస్సులు, రైళ్లు నడపడం మాత్రమే కాదు. వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమైన రహదారులు, రైల్వే మార్గాలు, బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్ పాత్‌లు, సైకిల్ మార్గాలు, ప్రయాణికులకు అవసరమైన ఇతర సదుపాయాలు కూడా అందులో భాగమే. అంటే ప్రజా రవాణా అనేది ఒక సమగ్ర వ్యవస్థ.
ప్రజా రవాణా అవసరం:
ప్రజలందరికీ వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత ఉండదు. కారు, మోటార్ సైకిల్ కొనుగోలు చేయలేని వారు లక్షల సంఖ్యలో ఉంటారు. విద్యార్థులు, రోజువారీ కూలీలు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు, గ్రామీణ ప్రజలు సామూహిక రవాణాపై ఎక్కువగా ఆధార పడతారు.
ప్రజా రవాణా లేకపోతే వీరు ఉపాధి అవకాశాలకు దూరమవుతారు. విద్యాసంస్థలకు చేరుకోవడం కష్టమవుతుంది. వైద్య సదుపాయాలను పొందడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావు. మహిళలు, వృద్ధులు, వికలాంగుల కదలిక స్వేచ్ఛ పరిమితం అవుతుంది. ప్రజా రవాణా అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకునే సదుపాయం కాదు. ప్రజలకు లభించే విద్య, ఉపాధి, వైద్యం, సామాజిక అవకాశాలను నిర్ణయించే అంశం.
ప్రజా రవాణా-దేశ ఆర్థికాభివృద్ధి:
ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందితే దాని ప్రయోజనాలు ప్రయాణికులకు మాత్రమే పరిమితం కావు. మొత్తం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఉపాధి అవకాశాల పెరుగుదల- రవాణా వ్యవస్థ నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులు, వాహనాల తయారీ, విడిభాగాల ఉత్పత్తి, స్టేషన్ల నిర్వహణ వంటి అనేక రంగాల్లో ఉద్యోగాలు ఏర్పడతాయి. బస్సులు, రైళ్లు, మెట్రో వ్యవస్థల విస్తరణ వల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ ఉపాధి పెరుగుతుంది.
పరిశ్రమలు, వ్యవసాయానికి ప్రోత్సాహం-రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ముడిసరుకులు పరిశ్రమలకు త్వరగా చేరతాయి. ఉత్పత్తులు మార్కెట్లకు తక్కువ ఖర్చుతో రవాణా అవుతాయి. రైతులు తమ పంటలను పట్టణ మార్కెట్లకు తీసుకెళ్లగలుగుతారు. పాడై పోయే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మెరుగైన సదుపాయాలు ఏర్పడతాయి.
ప్రజల ఆదాయంలో పొదుపు-వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గితే ఇంధనం, వాహన నిర్వహణ, పార్కింగ్ వంటి ఖర్చులు తగ్గుతాయి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఈ పొదుపు ఎంతో ఉపయోగకరం. ప్రయాణానికి ఖర్చయ్యే ఆదాయాన్ని విద్య, ఆరోగ్యం, ఆహారం వంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు.
ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి-నగరాలు, పట్టణాలు, గ్రామాల మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడితే అభివృద్ధి కొన్ని పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. మహిళలకు, యువతకు అవకాశాలు- సురక్షితమైన, అందుబాటులో ఉండే ప్రజా రవాణా మహిళలు ఉద్యోగాలు, విద్యాసంస్థలు, ఇతర సామాజిక కార్యకలాపాలకు స్వేచ్ఛగా వెళ్లడానికి తోడ్పడుతుంది. యువతకు ఉపాధి, శిక్షణ అవకాశాలు పెరుగుతాయి.
పర్యావరణ పరిరక్షణలో ప్రజా రవాణా పాత్ర:
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్లో రవాణా రంగం కూడా ముఖ్యమైన భాగస్వామి. వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఇంధన వినియోగం, వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ పెరుగుతాయి. ఒక బస్సు లేదా రైలు అనేకమంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగలదు. అందువల్ల ప్రతి ప్రయాణికుడికి అయ్యే ఇంధన వినియోగం, ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంటుంది.
విద్యుత్ బస్సులు, విద్యుత్ రైళ్ల వినియోగాన్ని పెంచడం. పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం. కాలుష్య నియంత్రణ ప్రమాణాలను అమలు చేయడం. నడక, సైక్లింగ్‌కు అనుకూలమైన పట్టణాలను నిర్మించడం. బస్సులు, మెట్రో, రైళ్లు వంటి వివిధ రవాణా మార్గాలను అనుసంధానించడం. ప్రజా రవాణా ప్రయాణ సమయాన్ని, సౌకర్యాన్ని మెరుగుపరచడం లాంటివి ప్రజా రవాణాలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, వ్యక్తిగత కార్ల నుంచి ప్రజా రవాణాకు మారడం వల్ల ఒక్కో వ్యక్తి వార్షిక కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
ప్రజా రవాణా బాధ్యత ఎవరిది?
ప్రజా రవాణా అనేది ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయం. అందువల్ల దాని అభివృద్ధి, అందుబాటు, భద్రత, సమానత్వం విషయంలో ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత ఉంటుంది. అయితే రవాణా సేవలను ప్రభుత్వ సంస్థలే నిర్వహించాలా? ప్రైవేటు సంస్థలకు అప్పగించవచ్చా? అనే విషయంలో ప్రభుత్వాలు వివిధ నమూనాలను అనుసరిస్తున్నాయి.
ప్రజా రవాణాకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించడం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన రవాణా సదుపాయాలు కల్పించడం. బస్సులు, రైళ్లు, మెట్రో వంటి వ్యవస్థల నిర్మాణానికి పెట్టుబడులు సమకూర్చడం. రవాణా ఛార్జీలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడడం. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల భద్రతకు చర్యలు తీసుకోవడం. ప్రైవేటు సంస్థల సేవలపై నియంత్రణ, పర్యవేక్షణ చేపట్టడం. రవాణా రంగంలో పనిచేసే కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతను పరిరక్షించడం. పర్యావరణ హిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజా రవాణా నిర్వహణలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ప్రజలకు సమానమైన, అందుబాటులో ఉండే రవాణా సదుపాయం కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యత తగ్గిపోదు.
ప్రజా రవాణాను లాభనష్టాల వ్యాపారంగా చూడాలా?
ఇది చాలా కీలకమైన అంశం. ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ ప్రధానంగా పెట్టుబడిపై రాబడి, లాభాల పెరుగుదల ఆధారంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్న మార్గాల్లో బస్సులు నడపడం ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు. ఉదాహరణకు, ఒక మారుమూల గ్రామానికి రోజుకు కొన్ని బస్సులు మాత్రమే అవసరమవుతాయి. అక్కడ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. ఆ మార్గంలో బస్సులు నడపడం ద్వారా వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులను కూడా పూర్తిగా భరించలేక పోవచ్చు.
అయితే ఆ గ్రామ ప్రజలకు రవాణా సదుపాయం అవసరం లేదా?
వారికి కూడా విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ వంటి అవసరాలు ఉంటాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఆ గ్రామానికి బస్సు సదుపాయం నిలిపి వేస్తే సామాజిక అసమానతలు మరింత పెరుగుతాయి. అందుకే ప్రజా రవాణా విషయంలో రెండు రకాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది–ఆర్థిక ప్రయోజనం. సంస్థకు వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులు, పెట్టుబడుల వినియోగం, ఆర్థిక సామర్థ్యం. రెండవది–సామాజిక ప్రయోజనం. ప్రజలకు ప్రయాణ సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ.
ఒక మార్గంలో ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ దాని ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనం కలుగుతుంటే, ఆ సేవను కొనసాగించడం ప్రభుత్వ విధానపరమైన బాధ్యతగా పరిగణించాలి. దీనికోసం ప్రభుత్వం అవసరమైన చోట రాయితీలు, సబ్సిడీలు, ఆర్థిక సహాయం అందించాలి. అంటే ప్రజా రవాణా సంస్థలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకూడదని కాదు. వాటి నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి. అయితే వాటి విజయాన్ని కేవలం లాభనష్టాల ఖాతాతో మాత్రమే అంచనా వేయకూడదు.
ప్రయాణీకుల ఛార్జీలు-వివిధ దేశాల అనుభవాలు:
ప్రపంచంలో కొన్ని దేశాలలో బస్సుల నిర్వహణ ఖర్చు(ఆపరేటింగ్ కాస్ట్ అంటే కేవలం బస్సులను నడపడానికి అయ్యే ఖర్చు మాత్రమే. బస్సుల కొనుగోలు, బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం ఇందులో రాదు), ఈ విధంగా ఉంది. ఫెడరల్ ట్రాన్సిట్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక 2023 ప్రకారం 11% మాత్రమే. 2019 లో ఇది 20% గా ఉంది. సింగపూర్ బస్ ట్రాకింగ్ మోడల్ గణాంకాల ప్రకారం 51%. టఫల నివేదిక ప్రకారం లండన్ సిటీ 63.5%, లండన్ మినహా మిగిలిన ప్రాంతాలలో 57.5%. ఒక్క భారత దేశంలో మినహా ప్రపంచంలో ఎక్కడా ప్రజా రవాణాను లాభ-నష్టాల స్కేలుతో కొలవరు. ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలలో బస్ ఛార్జీలు అతి తక్కువగా ఉన్నాయి. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో అత్యధికంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఒక అంచనా ప్రకారం నిర్వహణ ఖర్చు 100% కి పైగా బస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది ప్రయాణికులు బస్సులపై ఆధార పడకుండా వ్యక్తిగత వాహనాలవైపు నెట్టడం తప్ప మరొకటి కాదు.
ప్రజా రవాణా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ ఆర్థిక బాధ్యత:
ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి భారీ పెట్టుబడులు అవసరం. రహదారుల నిర్మాణం, విస్తరణ. బస్స్టేషన్లు, డిపోల నిర్మాణం. రైల్వే లైన్లు, మెట్రో మార్గాల నిర్మాణం. ఫుట్ పాత్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సైకిల్ మార్గాలు. విద్యుత్ బస్సుల కొనుగోలు, ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు. వివిధ రవాణా వ్యవస్థల మధ్య అనుసంధానం. ప్రయాణికులకు తాగునీరు, మరుగు దొడ్లు, విశ్రాంతి గదులు వంటి సదుపాయాలు. ఈ పెట్టుబడులను కేవలం టికెట్ ఆదాయం ద్వారా సమకూర్చడం సాధ్యం కాదు. అందువల్ల ప్రభుత్వ బడ్జెట్, స్థానిక సంస్థల నిధులు, అభివృద్ధి ఆర్థిక సంస్థలు, దీర్ఘకాలిక పెట్టుబడులు వంటి వివిధ మార్గాలను ఉపయోగించాలి.
ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు (PPP): నేడు భారతదేశంలో, ప్రపంచంలోని కొన్ని దేశాలలో కూడా పి. పి. పి. విధానం అమలులో ఉంది. అయితే ఈ విధానంలో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ప్రజా ఆస్తులను, వనరులను అప్పగించి తన బాధ్యత తీరిందనే పధ్ధతుల్లో వ్యవహరిస్తున్నది. ఇది అనేక దేశాలలో అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా ఉంది. అలాంటి ఒప్పందాల్లో సేవల నాణ్యతపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ప్రయాణ ఛార్జీల విషయంలో ప్రజల ప్రయోజనాలు కాపాడాలి. ప్రైవేటు సంస్థలకు ఏకపక్షంగా ఛార్జీలు పెంచే అవకాశం ఉండకూడదు. నష్టాలు, లాభాలు, ప్రభుత్వ రాయితీల వివరాలు పారదర్శకంగా ఉండాలి. ఒప్పందాల అమలుపై ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. కార్మికులకు గౌరవ ప్రదంగా జీవించే వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పించాలి. చట్టాలను విధిగా అమలు చేయాలి. ప్రైవేటు భాగస్వామ్యం అనేది ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించుకునే మార్గం కాకూడదు.
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రభుత్వాలకు ఏం చెబుతోంది?
ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వాలు ఎలా నిర్వహించాలి? ప్రైవేటు సంస్థలకు అప్పగించాలా? ప్రభుత్వమే నిర్వహించాలా? ఆర్థిక నష్టాలు వచ్చినా సేవలు కొనసాగించాలా? ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం A/RES/77/286లోని అంశాలను పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు అర్ధం అవుతాయి. తీర్మానం లోని మొదటి అంశం ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, అందుబాటులో ఉండే, సరసమైన ధరతో కూడిన, సుస్థిరమైన రవాణా వ్యవస్థలు అవసరమని గుర్తించింది. ఇది కేవలం ధనికులకు, పట్టణ ప్రజలకు మాత్రమే కాకుండా అందరికీ వర్తించాలి.
రెండవ అంశం రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, వాయుమార్గాలు, ఓడరేవులు వంటి వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేయాలని పేర్కొంది. వాటి మౌలిక సదుపాయాలు నాణ్య మైనవి, విశ్వసనీయ మైనవి, సుస్థిర మైనవి, విపత్తులను తట్టు కోగలిగేవిగా ఉండాలని సూచించింది.
మూడవ అంశం రవాణా వ్యవస్థల ద్వారా ప్రజలకు ఉద్యోగాలు, పాఠశాలలు, వైద్య సేవలు అందుబాటులోకి రావాలని, వస్తువులు, సేవలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చేరాలని పేర్కొంది. రవాణా వ్యవస్థ అందరికీ సమాన అవకాశాలను కల్పించే సాధనంగా ఉండాలని స్పష్టం చేసింది.
నాలుగవ అంశం తక్కువ కార్బన్ ఉద్గారాలు కలిగిన, ఇంధన సామర్థ్యం గల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వాటి ప్రాధాన్యతను గుర్తించింది.
ఐదవ అంశం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని సమకూర్చడానికి ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బహుళ పాక్షిక, ద్వైపాక్షిక దాతలు, ప్రైవేటు రంగం పరస్పరం సహకరించాలని సూచించింది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రజా రవాణా వ్యవస్థలను ప్రభుత్వమే యాజమాన్యం వహించి నిర్వహించాలని తప్పనిసరిగా ఆదేశించలేదు. అలాగే వాటిని ప్రైవేటీకరించాలని కూడా చెప్పలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యానికి అవకాశం ఉన్నప్పటికీ, ప్రజలకు సురక్షితమైన, సరసమైన, సమానమైన, సుస్థిరమైన రవాణా అందించడమే తీర్మానం ప్రధాన లక్ష్యం.
అలాగే తీర్మానంలోని తొమ్మిదవ అంశంలో ప్రజా రవాణా దినోత్సవ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల ఖర్చులను స్వచ్ఛంద, అదనపు నిధుల ద్వారా సమకూర్చాలని పేర్కొంది. దానిని దేశాల రవాణా మౌలిక సదుపాయాలకు సంబంధించిన మొత్తం ఆర్థిక బాధ్యతను స్వచ్ఛంద విరాళాలకే పరిమితం చేసినట్లు అర్థం చేసుకోకూడదు.
ప్రజా రవాణా–ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు:
ప్రజా రవాణా వ్యవస్థకు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో (SDGs) ప్రత్యక్ష సంబంధం ఉంది.
| సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు ప్రజా రవాణా సంబంధం | |
|---|---|
| సుస్థిర అభివృద్ధి లక్ష్యం (SDG) | ప్రజా రవాణాతో సంబంధం (Public Transport Link) |
| లక్ష్యం 1 – పేదరిక నిర్మూలన | ప్రయాణ ఖర్చులు తగ్గించి ఉపాధి అవకాశాలు పెంచడం |
| లక్ష్యం 3 – ఆరోగ్యం | వాయు కాలుష్యం తగ్గించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం |
| లక్ష్యం 5 – లింగ సమానత్వం | మహిళలకు సురక్షిత ప్రయాణం |
| లక్ష్యం 8 – ఉపాధి, ఆర్థికాభివృద్ధి | ఉద్యోగాలు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ |
| లక్ష్యం 9 – మౌలిక సదుపాయాలు | నాణ్యమైన, విశ్వసనీయ రవాణా వ్యవస్థ |
| లక్ష్యం 10 – అసమానతల తగ్గింపు | వెనుకబడిన వర్గాలకు సమాన ప్రయాణ అవకాశాలు |
| లక్ష్యం 11 – సుస్థిర నగరాలు | అందరికీ అందుబాటులో ఉండే సురక్షిత రవాణా |
| లక్ష్యం 13 – వాతావరణ చర్యలు | కర్బన ఉద్గారాల తగ్గింపు |
ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యం 11లోని 11.2 ఉప లక్ష్యం ప్రకారం, 2030 నాటికి అందరికీ సురక్షితమైన, అందుబాటు ధరలతో కూడిన, సులభంగా చేరుకోగల, సుస్థిర రవాణా వ్యవస్థలను అందించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
2026–2035 ఐక్యరాజ్యసమితి సుస్థిర రవాణా దశాబ్దం:
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023లో ఆమోదించిన మరో తీర్మానం A/RES/78/148 ద్వారా 2026 నుంచి 2035 వరకు పదేళ్ల కాలాన్ని ఐక్యరాజ్యసమితి సుస్థిర రవాణా దశాబ్దంగా ప్రకటించింది. దీని లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మరింత సమగ్రంగా, సురక్షితంగా, అందుబాటు ధరల్లో, పర్యావరణ హితంగా అభివృద్ధి చేయడం. ఇది రవాణా రంగాన్ని ప్రపంచ అభివృద్ధి అజెండాలో ఒక ప్రధాన అంశంగా నిలబెడుతోంది.
వ్యవస్థీకరించ బడిన, అందరికీ అందుబాటులో ఉండే, సురక్షితమైన, నమ్మదగిన, సామాన్య ప్రజలకు భరించగలిగే ధరలో ఉండే ప్రజా రవాణా-ప్రజల జీవన ప్రమాణం, సామాజిక సమానత్వం, ఆర్థిక అవకాశాలు, ఆరోగ్యం, గౌరవప్రదమైన జీవితం (dignity of life)తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు. OECD, International Transport Forum వంటి అంతర్జాతీయ సంస్థల పరిశోధనలు కూడా రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల పేద ప్రజలకు ఉద్యోగాలు, విద్య, వైద్యం, సామాజిక సంబంధాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి “poverty trap” ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నాయి.
“ప్రజా రవాణా కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే వాహనం కాదు. అది ప్రజలకు అవకాశాలను, స్వేచ్ఛను, సమానత్వాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని అందించే సామాజిక మౌలిక సదుపాయం.” ఒక పేద కుటుంబానికి మంచి పాఠశాలకి వెళ్లడానికి రోజుకు ₹100 ఖర్చవుతుంటే?మంచి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. కానీ గ్రామం నుంచి అక్కడికి చేరుకోవడానికి రెండు బస్సులు మార్చుకోవాల్సి వస్తే? ఒక కార్మికుడికి నగరంలో మంచి ఉద్యోగం ఉంది. కానీ రవాణా ఖర్చు అతని వేతనంలో పెద్ద భాగం ఖర్చు అయితే? వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, పిల్లలకు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు సురక్షితమైన రవాణా లేకపోతే? అప్పుడు విద్య, వైద్యం, ఉద్యోగం, నగర సౌకర్యాలు నిజంగా వారికి అందుబాటులో లేనట్లే. అందుకే ప్రజా రవాణాను కేవలం “రవాణా శాఖ” అంశంగా కాకుండా ప్రజల జీవన హక్కులు, సామాజిక న్యాయం మరియు జీవన గౌరవానికి సంబంధించిన అంశంగా చూడాలి.
“Quality of life depends on accessibility, not merely mobility” అని OECD స్పష్టం చేసింది. అంటే మనం ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాం అనే దాని కంటే , మనకు అవసరమైన అవకాశాలు ఎంత సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి అన్నదే జీవన నాణ్యతకు ముఖ్యమైనది. Mobility అంటే మనం ప్రయాణించ గలగడం. Accessibility అంటే మనకు అవసరమైన ఉద్యోగం, పాఠశాల, ఆసుపత్రి, మార్కెట్, ప్రభుత్వ కార్యాలయం మొదలైనవి సులభంగా చేరుకోగలగడం.
తక్కువ ఆదాయం కలిగిన కార్మికుడు నగర శివారులో నివసిస్తున్నాడు. అతనికి ఉద్యోగం నగర మధ్యలో ఉంది. ప్రజా రవాణా సరిగ్గా ఉంటే ఇల్లు → బస్సు → మెట్రో/రైలు → ఉద్యోగ స్థలం తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. కానీ ప్రజా రవాణా బలహీనంగా ఉంటే ఇల్లు → ఆటో → బస్సు → మరో ఆటో → ఉద్యోగం అవుతుంది. దీంతో ప్రయాణ ఖర్చు, ప్రయాణ సమయం పెరుగుతాయి. పని గంటలపై ప్రభావం పడుతుంది. కుటుంబంతో గడిపే సమయం తగ్గుతుంది. ఉద్యోగ ఎంపికలు తగ్గుతాయి. ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
రవాణా అవకాశాలు పరిమితంగా ఉన్న తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు ఉద్యోగాలు, విద్య, వైద్యం, సామాజిక సంబంధాలకు చేరుకోవడం మరింత కష్టమవుతుంది. ఇది పేదరికాన్ని మరింత బలపరిచే “poverty trap”కు దారితీయవచ్చు. అందువల్ల చౌకైన ప్రజా రవాణా ఒక సామాజిక సంక్షేమ పథకం మాత్రమే కాదు, పేదరికాన్ని తగ్గించే ఆర్థిక సాధనం కూడా అని OECD పరిశోధన తెలియజేస్తున్నది.
స్విట్జర్లాండ్:
వికలాంగులు స్వతంత్రంగా ప్రజా రవాణా ఉపయోగించగలిగేలా చట్టపరమైన “barrier-free” ప్రమాణాలు అమలు చేస్తున్నారు. low-floor vehicles, raised platforms, ramps, lifts, accessible information, ticketing వంటి చర్యలు చేపట్టారు. ప్రజా రవాణా ద్వారా dignity of lifeకు ఇది మంచి ఉదాహరణ.
ఆస్ట్రియా – వియన్నా:
వియన్నా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ప్రజా రవాణా నమూనాల్లో ఒకటి. బస్సులు, ట్రామ్‌లు, మెట్రో, రైలు వ్యవస్థలను పరస్పరం అనుసంధానిస్తూ ప్రజలకు విస్తృతమైన ప్రయాణ అవకాశాలు కల్పించారు. 2024లో వియన్నాలో ప్రజా రవాణా-34%, నడక-30%, సైకిల్-11%, కారు-25%. ఇక్కడ “Affordability + Accessibility + Quality” ఈ మూడు అంశాలను కలిపి ప్రజా సేవగా అభివృద్ధి చేశారు.
వియన్నా నగరం ప్రజా రవాణాకు భారీగా ప్రభుత్వ మద్దతు ఇస్తూ, విస్తృతమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. 2026 నుంచి వార్షిక టికెట్ ధర పెరిగినప్పటికీ, అది ఇప్పటికీ అనేక ఇతర యూరోపియన్ నగరాలతో పోలిస్తే తక్కువగానే ఉందని నగర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రజా రవాణా పూర్తిగా టికెట్ ఆదాయంతోనే నడవాలని పట్టుబడితే, affordability దెబ్బతింటుందని ఈ అనుభవం రుజువు చేస్తున్నది.
లక్సెంబర్గ్ – ప్రపంచంలోనే ప్రత్యేకం:
లక్సెంబర్గ్ దేశ ప్రభుత్వం 2020 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిధులతో నడిచే ప్రజా రవాణాను ఉచితంగా చేసింది. బస్సులు, ట్రామ్‌లు, రెండవ తరగతి రైలు ప్రయాణం ప్రజలకు ఉచితం. ప్రపంచంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రజా రవాణా సేవలను ఉచితం చేసిన తొలి దేశంగా లక్సెంబర్గ్.
ఉచిత టికెట్ మాత్రమే సరిపోదు. లక్సెంబర్గ్ తన ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించడం, రైళ్లు, బస్సులు, ట్రామ్ లలో పెట్టుబడులు పెట్టడం కూడా కొనసాగించింది. దేశం 2035 జాతీయ mobility planలో భవిష్యత్ ప్రయాణ అవసరాలను ముందుగానే అంచనా వేసి రవాణా సామర్థ్యాన్ని పెంచే విధానాన్ని అనుసరిస్తోంది. అందువల్ల ఉచిత రవాణా, మెరుగైన సేవలు, నిరంతర పెట్టుబడులు ఈ (Free Transport + Good Service + Continuous Investment) మూడు కలిసి ఉండాలి.
సింగపూర్–ప్రజా రవాణా ప్రభుత్వ బాధ్యత:
సింగపూర్ మరో ఆసక్తికరమైన ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం “car-lite” నగర విధానాన్ని అమలు చేస్తోంది. లక్ష్యం 20-minute towns + 45-minute city. అంటే ప్రజలు తమ పరిసరాల్లోని ముఖ్యమైన సౌకర్యాలకు సుమారు 20 నిమిషాల్లో చేరుకో గలగాలి. peak hoursలో Walk-Cycle-Ride ద్వారా ఎక్కువ మంది తమ ఇల్లు–ఉద్యోగ ప్రయాణాన్ని 45 నిమిషాల్లో పూర్తి చేయగలగాలి.
2023లో 92% మంది నివాసులు తమ సమీప neighbour hood centre ను 20 నిమిషాల్లో చేరుకో గలిగారు. అక్కడ ప్రజా రవాణా కేవలం ప్రయాణికుల నుంచి వచ్చే చార్జీలతో నడపడం కాదు. సింగపూర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం $2 billionకు పైగా public transport operating subsidies అందిస్తోంది. అదనంగా 2025 fare increaseలో కొంత భాగాన్ని వాయిదా వేయడానికి మరో $200 millionకు పైగా సహాయం ప్రకటించింది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై భారం తగ్గించడానికి Public Transport Vouchers కూడా ఇస్తున్నారు.
2024లో తక్కువ ఆదాయ వర్గాల కుటుంబ ఆదాయంలో ప్రజా రవాణాపై ఖర్చు అయ్యే వాటా 3.1% (2015) నుంచి 2.4%కి తగ్గింది. ప్రభుత్వం ప్రజా రవాణాకు సబ్సిడీ ఇవ్వడం “నష్టం” కాదు, ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించే పెట్టుబడి అని ఈ అనుభవం తెలియజేస్తున్నది.
స్విట్జర్లాండ్-సమయం విషయంలో ప్రజా రవాణాపై నమ్మకం:
స్విట్జర్లాండ్ ప్రజా రవాణా వ్యవస్థకు మరో ముఖ్యమైన లక్షణం reliability. ప్రజా రవాణా అంటే బస్సు వస్తుందో లేదో తెలియని వ్యవస్థ కాకుండా “నేను ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు చేరుకుంటాను” అని ముందుగానే తెలుసుకునే ఏర్పాటు.
స్విట్జర్లాండ్, డెన్మార్క్, కొరియా దేశాల్లో కారులో 30 నిమిషాలలో చేరుకోగలిగే దూరాన్ని ప్రజా రవాణా ద్వారా 15 నిముషాలు అంతకంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చని OECD-2024 విశ్లేషణలో పేర్కొంది. ఇది ప్రజా రవాణా నాణ్యతను కేవలం “ఎన్ని బస్సులు ఉన్నాయి?” అని కాకుండా ఎంతమంది ప్రజలకు అవకాశాలు ఎంత సమయంలో అందుతున్నాయి? అని చూడాల్సిన అవసరం ఉంది.
నెదర్లాండ్స్ – ప్రజా రవాణాతో పాటు సైకిల్‌కు ప్రాధాన్యం:
నెదర్లాండ్స్ నమూనా కూడా ముఖ్యమైనది. అక్కడ ప్రజా రవాణా, సైక్లింగ్, నడకలను పరస్పర ప్రత్యామ్నాయాలుగా కాకుండా ఒకే సమగ్ర mobility systemగా అభివృద్ధి చేశారు. దేశంలో దాదాపు 400 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రోజుకు సుమారు 1.2 million మంది వాటిని ఉపయోగిస్తున్నారు. రైల్వే ప్రయాణంతో సైకిల్‌ను అనుసంధానం చేయడానికి bicycle parking వంటి సౌకర్యాలు కూడా అభివృద్ధి చేశారు.
నెదర్లాండ్స్‌లో 35,000 కిలోమీటర్లకు పైగా bicycle tracks ఉన్నాయి. ప్రభుత్వం సైక్లింగ్ accessibility, quality of life ను మెరుగు పరిచిందని అర్ధం అవుతున్నది. అంటే మంచి ప్రజా రవాణా వ్యవస్థ అంటే బస్సులు పెంచడం ఒక్కటే కాదు. Bus + Train + Metro + Tram + Bicycle + Walking ఇవన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానించాలి.
ప్రతి లక్ష జనాభాకు ఎన్ని బస్సులు అవసరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ప్రణాళికల కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన సూచికను ప్రపంచ బ్యాంకు గ్రూపుతో అనుబంధమైన Public-Private Infrastructure Advisory Facility (PPIAF) రూపొందించిన Urban Bus Toolkitలో పేర్కొన్నారు. ఆ సూచిక ప్రకారం ప్రతి 1,000 మంది జనాభాకు 0.5 నుంచి 1.2 బస్సులు అవసరం అవుతాయని సాధారణ అంచనా. అంటే ప్రతి లక్ష జనాభాకు 50-120 బస్సులు అవసరం. అయితే ఈ సంఖ్య పట్టణంలోని ప్రజా రవాణా అవసరాలు, మెట్రో లేదా రైలు అందుబాటు, బస్సుల సామర్థ్యం, రోజువారీ ప్రయాణాల సంఖ్య వంటి అంశాలను బట్టి మారుతుంది.
భారతదేశంలో ప్రస్తుతం బస్సుల పరిస్థితి:
2026 ఆగస్టు 10న ప్రచురితమైన Centre for Science and Environment (CSE), CITIES Forum అధ్యయనానికి సంబంధించిన Down To Earth నివేదికలో కొన్ని ముఖ్యమైన గణాంకాలు ఇలా ఉన్నాయి. దేశంలోని మొత్తం బస్సుల సంఖ్య 14 లక్షల 50 వేలు. అందులో ఆర్. టి. సి. బస్సులు 2 లక్షల 90,000. నిర్వహణలో ఉన్న మొత్తం సిటీ బస్సులు సుమారు 65,000. ప్రతి లక్ష మంది జనాభాకు 44 బస్సులు ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ ఆచరణలో కేవలం 13.3 నుండి 13.8 మధ్య మాత్రమే ఉన్నాయి.
ఫలితంగా భారత దేశంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య ముఖ్యంగా ద్విచక్ర వాహనాల వినియోగం అత్యధికంగా ఉంది. కార్ల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. కానీ అదే స్థాయిలో ప్రజా రవాణా సదుపాయాలు అభివృద్ధి చెందడం లేదు. ప్రభుత్వాలు వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు రుణాలు, ఆర్థిక సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. సామాన్య ప్రజలకు సరసమైన ధరలో, సౌకర్యవంతంగా, సమయానికి బస్సులు అందుబాటులో ఉండేలా చేయడాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. మొత్తం దేశంలోని వాహనాలతో పోల్చినప్పుడు బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది.
ప్రతి కుటుంబం వ్యక్తిగత వాహనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రజా రవాణా ద్వారా తమ రోజువారీ అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ప్రజా రవాణాను ప్రోత్సహించాలి. అందుకు బస్సుల సంఖ్య పెంచడం, ఆర్ధిక సహకారాన్ని అందించడంతో పాటు వాటి రాకపోకల సమయపాలన, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు, మెరుగు పరచాలి. ఛార్జీలు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయించాలి.
ప్రజా రవాణా బలహీనంగా ఉండటంతో వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటం పెరుగుతున్నది. దాంతో ట్రాఫిక్ రద్దీ, ఇంధన దిగుమతుల భారం, వాయు కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజా రవాణా రంగంపై ప్రభుత్వ పెట్టుబడులను ఖర్చుగా కాకుండా దేశ ఆర్థిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించాలి.
ఆర్. లక్ష్మయ్య
ఇవి కూడా చదవండి:
- డీటీసీ కార్మికుల సమ్మె: వెల్లడైన బీజేపీ నిజ స్వరూపం
- ప్రభుత్వంలో ‘ప్రైవేట్’ను పక్కనుంచడం ఏపీతో మొదలా?
మూలం: UN Decade of Sustainable Transport 2026–2035
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
