Did the move to bring the ‘private’ sector alongside the government begin in AP?
భాష ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఏళ్ల క్రితం ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ, 2014లో అది విభజన పేరుతో మరోసారి పునర్నిర్మాణం అయ్యాక, ఏపీ అంటే అదొక అస్తవ్యస్త వ్యవస్థ అనే భావన స్థిర పడుతున్న ప్రమాద సూచనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
అలా ఎవరికి అనిపిస్తున్నది అనే ప్రశ్నకు ముందుగా జవాబు చూద్దాం. అది, గత యాభై ఏళ్ల రాష్ట్ర పరిణామాలను చూస్తున్నసీనియర్లకా… లేక 35 ఏళ్ల క్రితం మొదలయిన ఆర్ధిక సంస్కరణల కాలంలో విద్యార్ధులుగా ఎదిగిన నేటి 40-50 ఏళ్ల మధ్య వయస్కులకా అనేది ఇక్కడ కీలకం.
తెలుగునాట నేలలోకి వేర్లు జొరబడని ‘మహావృక్ష’ తరాలను పెంచి పోషించిన ‘పొలిటికల్ నర్సరీ’లు వెల్లివిరిసిన కాలం ఒకటి ఉండేది. అప్పట్లో అటువంటి ప్రత్యేక తరం తయారీ కారణంగా ఇప్పుడు- ‘ఇదేంటి వీళ్ళు ఇలా తయారయ్యారు?!’ అని అరవై దాటిన వారికి అనిపిస్తున్నది.
దేశమంతా యువత- ‘జెన్-జీ’ అని, ‘సీజేపీ’ అని తమ తమ సామాజిక కార్యాచరణ జాగాను (’స్పేస్’) వెతుక్కుంటుంటే, ఇక్కడ ఆ వయస్సు తరం నడుస్తున్న దేశచరిత్రలో ఇంతలా- ‘ఇర్రిలవెంట్’ కావడానికి కారణం, అప్పటి ‘నర్సరీ’లా? అని ఇప్పుడు విస్మయం కలుగుతున్నది.
ఇక సినిమా, మీడియా, ఈ నిశబ్ధ రాజకీయ వ్యూహానికి ఊతమై స్పృహలేని ‘సామాజిక అచేతన’ స్థితికి వీరిని చేర్చింది. ఇదే కాలంలో అస్తిత్వ ఉద్యమాల ‘క్యాంపుల్లో’ బందీలైన వారు, కడకు ఉన్నచోట ఉండిపోవడం తప్ప, ‘రివ్యూ’ కోసం వెనక్కి తిరిగి చూసే వయస్సు కూడా వారికి మిగల్లేదు!
“వియ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా..” అని రాజ్యాంగ పీఠిక రాసుకున్న ఈ దేశప్రజలను, రెండుగా చీల్చి ‘రాజ్యాధికార సాధన…’ అజెండా వారి చేతిలో పెట్టి, ప్రధాన స్రవంతిలో లేకుండా వారిని దారి మళ్లించిన ప్రయోగం విఫలమని, దేశం వందేళ్లకు చేరక ముందే నిర్ధారణ అయింది.
‘సీజేపీ’ అభిజిత్ దీప్కే, ‘జెన్-జడ్’ నేహా బోరాల బృందం ఇప్పుడు కొత్తగా చెబుతున్న- “వియ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా..” పాత పార్టీల వర్గీకరణ వలలకు చిక్కక పోవడం, కొత్త సమస్య అయింది. దాంతో వాళ్ళ ఈ ‘జొరబాటు’కు అస్సలు ‘స్పేస్’ ఎలా దొరికింది, అని పాత రాజ్యాంగ వ్యవస్థలనే మళ్ళీ మళ్ళీ కొత్తగా పరిశీలనగా చూడాల్సి వస్తున్నది.
‘ప్రభుత్వం’ ఉపాంగాలు అయిన- ‘లెజిస్లేచర్’ ‘ఎగ్జిక్యూటివ్’ ‘జ్యూడీషియరీ’లో మొదటిదైన ‘లెజిస్లేచర్’ ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సమూహం కనుక, నిరంతరం దాని పనితీరు మంచిచెడులు అన్ని స్థాయిల్లో చర్చ అవుతుంది. ‘జ్యూడీషియరీ’ జోక్యం ప్రజాజీవితాన్ని ప్రభావితం చేస్తే అవీ వార్తలు అవుతున్నాయి.
అయితే స్వతంత్రంగా పనిచేయాల్సిన ‘ఎగ్జిక్యూటివ్’ అయిన ‘స్టేట్ ఎలక్షన్ కమీషనర్’ ఎంత మేర స్వతంత్రంగా పని చేస్తున్నది 2026లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చర్చ అయింది. వీటి పనిలోకి సైతం ‘సుప్రీం కోర్టు’ జోక్యం వల్ల ఏపీలో ఉన్నది అస్తవ్యస్త పాలన అని అంతిమ నిర్ధారణ అవుతున్నది.
నిజానికి ‘లెజిస్లేచర్’ అంటే ఐదేళ్లపాటు అధికారంలో ఉండే రాజకీయ పార్టీ నాయకుడి ‘ఛాయిస్’గా మారింది! ఆ నాయకుడి పాలన గురించి ఆ రాష్ట్రం, దేశం ఏమనుకోవాలి అనేది, ఆ రాష్ట్ర ప్రజల రాజ్యాంగ హక్కుల భద్రతకు అతడు ఇచ్చే విలువను బట్టి, ఆ పార్టీ రాజకీయ సంస్కృతి ఉంటున్నది. ఏళ్ల తరబడి ‘పవర్’ ఉంటే, అదే అక్కడి సామాజిక పర్యావరణం అవుతున్నది.
“వియ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా..” అని రాజ్యాంగ పీఠిక రాసుకున్న ప్రజలకు అటువంటి పార్టీ ప్రభుత్వాలలో ఏ విలువ లేనప్పుడు, ‘జ్యూడీషియరీ’ జోక్యం చేసుకుని బలహీనులకు ‘స్పేస్’ లేకుండా చేస్తున్న ఆధిపత్య శక్తులను కట్టడి చేసి, అందరికీ సమాన అవకాశాలు అందేలా చూడమని- ‘లెజిస్లేచర్’, ‘ఎగ్జిక్యూటివ్’ ఇద్దరినీ హెచ్చరించవలసి వస్తున్నది.
‘ఎగ్జిక్యూటివ్’ అన్నప్పుడు ప్రజలకు దగ్గరగా తెలిసింది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఆ క్రింద ఉండే ఉద్యోగులు. ఆ పై స్థాయిలో రాజధానిలో ఉండే ప్రభుత్వ శాఖల డైరక్టర్లు, కమీషనర్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో సామాన్య ప్రజలకు పెద్దగా పని ఉండదు. అక్కడ విధాన నిర్ణయాలు జరుగుతాయి కనుక, ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఆ స్థాయిలో అవసరాలు ఉంటాయి.
గత యాభై ఏళ్ల రాష్ట్ర పరిణామాలు మన పౌర సమాజంలో సీనియర్లకు ఎలా అనిపించినా, ఆర్ధిక సంస్కరణల కాలంలో ఎదిగిన నేటి 40-50 ఏళ్ల మధ్య వయస్కుల అభిప్రాయమే ఇక్కడ ముఖ్యం అవుతున్నది. ఎందుకంటే, జరుగుతున్న జాతీయ ఉద్యమంలో ముందున్న- ‘జెన్-జీ’, ‘సీజేపీ’ పిల్లలకు వారు తల్లితండ్రులు కనుక.
దీనర్ధం తమ పిల్లల ప్రాధాన్యతల ప్రభావం ‘పేరెంట్స్’పై కనుక ఉంటే, రేపు ‘జెన్-జీ’ ప్రతిపాదించే ‘స్టేట్ పబ్లిక్ పాలసీ’లో జరగాల్సిన సమీక్షకు వారి మద్దత్తు ఎంతమేర ఉంటుంది అనేది కాలం నిర్ణయించవచ్చు.
ఏపీ విషయంలో ఆ పిల్లల ‘పేరెంట్స్’ గత పదిహేను ఏళ్లుగా బెజవాడ-గుంటూరు మధ్య కొత్తగా మొదలైన రాజధాని వాతావరణంలో ముప్పై ఏళ్ల వయస్సు దాటిన ‘ఐఎఎస్’, ‘ఐపీఎస్’లను దగ్గరగా చూస్తున్నారు. అది అలా ఉంటే, గడచిన 35 ఏళ్లలో ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని ‘ప్రైవేట్’ రంగం ప్రభుత్వంలోకి ప్రవేశించి ఇప్పుడు అది అక్కడ తిష్ట వేసింది.
రాబోయే మార్పుకు ముందస్తు సూచిక అన్నట్టుగా సంస్కరణలు మొదలైన పదేళ్లకు 2000 నాటికి ప్రభుత్వం కొత్తగా కలెక్టర్లు, ఎస్పీలకు పర్సనల్ ‘గన్ మ్యాన్’ సెక్యూరిటీ ఇచ్చింది. ప్రజల నిరసనను ‘ప్రభుత్వానికి’ తగిన దూరంలో ఉంచాలి, అనేది అప్పటికే ఒక ‘పాలసీ’ అయింది.
రాష్ట్ర విభజన జరిగి 2015 తర్వాత బెజవాడలో ఏపీ రాజధాని పని మొదలైతే, కిటికీలు లేని భవనాల్లో ఉంటున్న ఆఫీసుల్లోకి ‘ప్రైవేట్ సెక్యూరిటీ’ని దాటుకుని ముందస్తు అనుమతితోనే ‘పబ్లిక్’ వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వంలో పలు సేవలు ‘అవుట్ సోర్సింగ్’కు వెళ్లిపోవడంతో- పనులు ఉండే ప్రజలు కంటే ఇతరులకు ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రవేశం సుళువు అయింది.
ఆఫీసుల్లో సాయంత్రం నాలుగు నుంచి ‘హెచ్.వో.డీ’ లతో ‘మీటింగ్స్’ పేరుతో ‘అవుట్ సోర్సింగ్’ ఏజెన్సీల ప్రతినిధులు గంటల తరబడి ఆఫీసర్స్ ఛాంబర్లలో కూర్చోవడం ఇప్పుడు నిత్య కృత్యమైంది. ఏళ్ల తరబడి సాగే అటువంటి సాయంత్రం వేళ భేటీలు ‘పర్సనల్ లైఫ్’లోకి ప్రవేశాన్ని ఆపడం కష్టం.
మొదటి నుంచి తెలుగు సమాజంలో ‘ఐఎఎస్’ అధికారులకు అరుదైన ‘గ్లామర్’ ఉందనేది కాదనలేని నిజం. మన బలహీనతను 2000 తర్వాత మిగతా వారి కంటే హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ ‘ఐఎఎస్’లు ఈ పాతికేళ్లలో బాగా అలుసుగా తీసుకున్నారు.
మన ఆధిపత్య వర్గాల్లో విలువల్ని పట్టించుకోని వారి నైజాన్ని ‘పోస్ట్ రిఫారమ్స్’ తరం హిందీ బెల్ట్ ‘ఐఎఎస్’లు గరిష్ట స్థాయిలో వాడుకోవడానికి ఏమాత్రం వెరవలేదు. అందులో నిజమెంతో తెలీదు కానీ, వీళ్ళు డిల్లీ ‘కోచింగ్ సెంటర్ల’ కబుర్ల రోజుల్లోనే- ‘ఏపీ కేడర్’ మీద కన్నేసి ఉంటారు, అనే ‘టాక్’ కూడా ఉంది!
ఇక్కడ సంస్కరణల అమలు దేశంలోనే వేగంగా అమలు అయిన కాలంలో- ‘సరళీకరణ’ ‘ప్రైవేటీకరణ’లు రెండూ కూడా ‘లెజిస్లేచర్’ ‘ఎగ్జిక్యూటివ్’లకు ఉభయతారకం అయ్యాయి!
రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా రెండవ ప్రాంతీయ పార్టీ రూపంలో వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక, పాత పరిస్థితి పూర్తిగా మారింది. ‘ఎగ్జిక్యూటివ్’ లకు ‘కెరియర్’లో తమను తాము నిరూపించుకునే అవకాశం మళ్ళీ ఐదేళ్ల పాటు దొరికింది. ఈ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ‘పబ్లిక్ గ్రీవెన్స్ డెలివరీ’ జిల్లా కేంద్రాల నుంచి గ్రామ సచివాలయాలకు చేరి, పై స్థాయిలో ఒత్తిడి తగ్గింది.
అయితే, 2024లో ప్రభుత్వం మారడంతో ‘ఎగ్జిక్యూటివ్’ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. డజన్ల కొద్దీ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ‘పోస్టింగ్’ కోసం ఎదురు చూడడం అంటే; పనిమాలా ‘ఎగ్జిక్యూటివ్’ల చేతిని ‘లెజిస్లేచర్’ స్వప్రయోజనాల కోసం మెలి తిప్పడం బాహాటం అయినా అందుకు ప్రభుత్వం కొంచెం కూడా వెరవడం లేదు.
స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్న ఐఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కేసు చూస్తే, ఈ విషయంలో అదొక ‘కేస్ స్టడీ’ అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వీరు 1994లో ఏపీ సర్వీస్ లోకి ప్రవేశించి, వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆఫీస్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి, 2024 ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం వచ్చాక స్వచ్చందంగా ‘రిటైర్’ అయ్యారు.
ఒక ‘ఎగ్జిక్యూటివ్’ తన ‘కెరియర్’లో అత్యున్నత ‘పోస్టులు’ లక్ష్యాలుగా చేసుకుని, వేగంగా శిఖరం చేరడం కోసం ‘లెజిస్లేచర్’కు దగ్గర అయ్యే క్రమంలో అవసరాన్ని మించి తన పరిధి అంచుల వరకూ వెళుతూ వివాదమై; మారే ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ ప్రాధాన్యతల ఘర్షణలో చివరకు ఎటువంటి అర్ధంతర ముగింపుకు గురి అవుతారో చెప్పే ఉదాహరణ ఆయన కేసు.
రిటైర్ అయ్యాక, ‘సోషల్ మీడియా’ ఇంటర్వ్యూల్లో ప్రవీణ్ ప్రకాష్ తన ‘కెరియర్’ కేంద్రంగా వెల్లడి చేసిన ఆక్రోశం చూస్తే, ఒక్కటే అనిపిస్తుంది. ‘పోస్ట్-రిఫారమ్స్’ కాలంలో ఇద్దరూ ‘లెజిస్లేచర్’ ‘ఎగ్జిక్యూటివ్’లు పూర్తిగా తమ స్వప్రయోజనాల కేంద్రంగా ఆలోచిస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం లోపలికి చొచ్చుకొచ్చిన ఈ ‘ప్రైవేట్’ ధోరణి కాలుష్యాన్ని, ఈ రెండు ప్రధాన వ్యవస్థల నుంచి శాశ్వితంగా తొలగించడం ఎలా అనేది ఆలోచించే సమయం అసన్నమైంది అనిపిస్తుంది.
గతంలో ‘ఎగ్జిక్యూటివ్’ పనితీరులో సంస్కరణలు తప్పదు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకోసం 1966లో మొదటిది 2005లో రెండవది- ‘అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ కమీషన్ల’ నియామకం కాంగ్రెస్ ప్రభుత్వాలలోనే జరిగింది. ఆర్ధిక సంస్కరణల కాలంలో ‘ప్రైవేటీకరణ’ పేరుతో తెరిచిన తలుపులు ఈ రోజున రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని డిల్లీ వీధుల్లో పలచన చేస్తుంటే, మరో మార్పుకు ముందుగా ఏపీ తొలి ‘షో కేస్’గా మారింది.
ఏపీలో తరుచూ జరిగే కలక్టర్ల మీటింగ్ లో ఐఎఎస్ ల పని తీరు ఎలా ఉండాలో ప్రస్తుత సిఎం ఎన్నో విషయాలు వారికి చెబుతుంటారు. ఈ మధ్య జరిగిన అటువంటి సమావేశానికి రెండవ రోజు గైర్హాజరైన కొందరు ఐఎఎస్ లను- “ఏం తమాషాగా ఉందా..” అని సిఎం కోపగించినట్టుగా వార్తలు వచ్చాయి.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ 2022లో తన భార్యకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించిన వార్త చూసాము. అదే 2026లో మరో ఐఎఎస్ ‘కుప్పం ఏరియా డెవలప్మెంట్ ఆధారిటీ స్పెషల్ ఆఫీసర్’ బెంగుళూరు ‘పబ్’లో మిత్రులతో మద్యం తాగి, రాత్రి 1.30 తర్వాత నిఘా విధుల్లోని కర్ణాటక పోలీస్ అధికారిని చెంపపై కొట్టిన ఘటన కేసు కావడం కూడా చూసాము.
రెండు సంఘటనలు రెండు ప్రాంతాలు ఒకటి రాష్ట్రానికి ఉత్తరాన ఒడిస్సా సరిహద్దున ఉంటే, మరొకటి దక్షణాన తమిళనాడు సరిహద్దున ఉంది. ఏవి ఎక్కడ ఉన్నప్పటికీ, రాజకీయ అధికార పగ్గాలు ఎప్పుడు ఎంత బిగుతుగా ఉన్నాయి అనేదే కీలకం అవుతున్నది.
జాన్ సన్ చోరగుడి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
