గత వారం న్యూఢిల్లీలో జరిగిన ఒక ఫోరమ్‌లో ‘ఇండియా ఇంక్’ (భారత పారిశ్రామిక రంగానికి చెందిన నాయకులు) పాల్గొంటుండగా, మరోవైపు పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. ఈ నిరసనకారుల అసంతృప్తి భారతదేశపు ‘వృద్ధి కథనం’లోని కొన్ని వైరుధ్యాలను వెల్లడిస్తోంది.
దేశ రాజధానిలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశమైన కార్పొరేట్ ప్రముఖులు, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో అవకాశాలను కొనియాడుతూ, ఈ ఏడాది అసాధారణమైన 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధించనున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇది రెండు విరుద్ధమైన దృశ్యాలను స్పష్టంగా ప్రతిఫలిస్తోంది.
టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్ బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్‌లో మాట్లాడుతూ.. భారతదేశ పరిమాణం, వినియోగదారుల మార్కెట్, ఆర్థిక వృద్ధి దీనిని పెట్టుబడిదారులకు “సహజమైన ఎంపిక” గా మార్చాయని వాదించారు.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం “చాలా అద్భుతమైన స్థితిలో” ఉందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరవుతున్న ఆ కార్యక్రమంలో వారు అలా మాట్లాడటం వివేకంతో కూడుకున్నదే.
ముఖ్యంగా, ప్రభుత్వాన్ని, భారతదేశ వృద్ధి కథనాన్ని ప్రముఖ ఆర్థికవేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇది మరింత అవసరం కూడా.
అయినప్పటికీ, కార్పొరేట్ ఇండియా వ్యక్తం చేస్తున్న ఆశావాదానికి, అలాగే వీధుల్లోనూ, పెట్టుబడి మార్కెట్లలోనూ మదుపుదారులు, ప్రజలలో వ్యక్తమవుతున్న ఆందోళనకు మధ్య ఉన్న వ్యత్యాసం రోజురోజుకూ మరింత స్పష్టమవుతోంది.
దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ పై భారతదేశం ఆధారపడటం వల్ల, ఇరాన్ యుద్ధం, ముడి చమురు ధరల పెంపు ప్రభావం దేశంపై పడింది.
ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి చేరువవుతోంది. ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న కరెన్సీలలో ఒకటైన రూపాయిని కాపాడుకోవడానికి రిజర్వ్ బ్యాంకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తోంది.
నిఫ్టీ బెంచ్‌మార్క్ 50 ఈక్విటీ ఇండెక్స్ ఈ ఏడాది 13 శాతం పడిపోయింది.
ఈ ఒత్తిళ్లతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారత్ వెనుకబడి ఉండటం (అమెరికా, చైనాల కంటే వెనుకబడి ఉంది) కూడా తోడైంది. దీంతో ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే విదేశీ మనీ మేనేజర్లలో భారత్ పట్ల ఆసక్తి తగ్గింది. ఈ సంవత్సరం విదేశీ పెట్టుబడిదారులు రికార్డు స్థాయిలో భారతీయ ఈక్విటీలను విక్రయించారు.
చివరకు దేశ ప్రధాన జీడీపీ గణాంకాలు కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. సొసైటీ జెనెరాలేలో ఇండియా ఎకనామిస్ట్‌గా ఉన్న కునాల్ కుందు గత నెలలో విడుదల చేసిన నివేదికలో- ఇటీవల చేపట్టిన రీబేసింగ్ ప్రక్రియ, సాంకేతిక ప్రభావాల వల్ల వాస్తవ చిత్రం దెబ్బతిన్నదని, వాస్తవ జీడీపీ డేటా “ఆర్థిక కార్యకలాపాల స్థాయిని అతిగా చూపుతోంది” అని పేర్కొన్నారు.
పెద్ద కంపెనీలు బాగుపడుతున్నప్పటికీ, చిన్న తరహా, అసంఘటిత వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కుందు వివరిస్తున్నారు.
నిజ వేతన వృద్ధి పడిపోవడం, జీవన వ్యయం పెరుగుతుండటంతో ఇంటి ఖర్చుల రుణాలు పెరగడం మూలంగా వినియోగదారుల డిమాండ్ తగ్గింది అని కుందు వివరిస్తున్నారు.
తగినన్ని ఉద్యోగాలను సృష్టించడంలో భారతదేశ వైఫల్యం కూడా తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.
ఈ ఏడాది విస్తృతంగా ప్రస్తావించబడిన ‘అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ’ అధ్యయనం ప్రకారం.. 25 ఏళ్లలోపు ఉన్న కాలేజీ, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లలో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.
ఈ పరిస్థితి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేతృత్వంలో ఒక విస్తృత యువ నిరసన ఉద్యమంగా మారడానికి దోహదపడింది. ఈ ఉద్యమం విద్యారంగంలో అవినీతిని, వృద్ధి చెందుతోందంటున్న ఆర్థిక వ్యవస్థలో అవకాశాల కొరతను, ఇటీవల ఓటర్ల జాబితా సవరణలో 13 కోట్ల మంది ప్రజలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను ప్రతిఫలిస్తుంది.
అయితే, బిజినెస్ ఫోరమ్‌లో వాతావరణం మరింత ఆశాజనకంగా ఉంది. ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ బిలియనీర్ ఛైర్మన్ నందన్ నీలేకణి, ఏఐ మూలంగా భారతీయుల ఉద్యోగాలు పోతాయనే భయాలను “నిరర్థకమైనవి”గా కొట్టిపారేశారు.
భారత్‌కు, చిన్న వ్యాపారాలకు మరింత పని లభిస్తుందని, ఇది ఆటోమేషన్‌కు గురికాని ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన వాదించారు.
అయితే, భవిష్యత్ ఉద్యోగాలపై ఉన్న ఈ ఆశావాదం, ప్రస్తుతం వాటిని సృష్టించడంలో కంపెనీల వెనుకంజతో సరిపోలడం లేదు.
కార్పొరేట్ పన్ను మినహాయింపులు, ఉత్పత్తి- అనుసంధాన ప్రోత్సాహకాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల రూపంలో మోదీ ప్రభుత్వం వ్యాపార అనుకూల చర్యలు చేపట్టినప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు మందగించే ఉన్నాయి.
ప్రభుత్వ సర్వేల ప్రకారమే, ప్రతి సంస్థకు అయ్యే మూలధన వ్యయం నాలుగు సంవత్సరాల క్రితం రూ. 1.8 బిలియన్లు ఉండేది తాజాగా 17 మిలియన్లకు పడిపోయింది.
ఉద్యోగ కల్పన సమస్యకు పరిష్కారంగా ఎంతగానో ప్రచారం చేసిన మేక్ ఇన్ ఇండియా ద్వారా వస్తూత్పత్తి రంగం దశాబ్ద కాలం క్రితం మోదీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో తక్కువ వాటాను కలిగి ఉంది.
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, రెడ్ టేపిజం, భూసేకరణలో ఇబ్బందులు, భారతదేశపు బలహీనమైన మధ్యతరగతి వర్గంపై ఒత్తిడి పెరగడం వల్ల దేశీయ డిమాండ్ తగ్గడం వంటి కారణాలను ఆర్థికవేత్తలు ప్రస్తావిస్తున్నారు.
ఈ సమస్యలన్నీ భారతదేశపు ఆర్థిక రికార్డులు బాగున్నా ప్రజల అనుభవంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడాన్ని సూచిస్తున్నాయి.
పటిష్టమైన జీడీపీకి, దాదాపు 150 కోట్ల జనాభా అనుభవిస్తున్న వాస్తవ జీవిత పరిస్థితులకు మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతోంది.
వ్యాపారవేత్తలు సహనంతో ఉండాలని కోరుతున్నారు. గత వారం జరిగిన వేదికపై సునీల్ మిత్తల్ మాట్లాడుతూ, భారత్ ఎదుర్కొంటున్న కష్టాలు “తాత్కాలికమైనవి, కానీ దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం, వృద్ధి నెలకొని ఉన్నాయి” అని అభివర్ణించారు.
అయితే, ఈ అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి వేచి ఉన్న ప్రజలకు ఈ ఊరడింపు మాటలు నమ్మడం కష్టంగానే ఉంది.
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. అనువాదం: కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
