ప్రజల్లో పెరుగుతున్న ఈ భ్రమభంగం, అసంతృప్తి క్రమంగా బలమైన ప్రజాభిప్రాయంగా రూపుదిద్దుకుని, దీర్ఘకాలం కొనసాగవచ్చనే ఆందోళనే బీజేపీని, ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.
మూడు నెలల క్రితం ఈ20 పెట్రోల్‌పై సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన ఆగ్రహం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వరకు పాకింది.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన ఇంధనం వాహనాల ఇంజిన్లను దెబ్బతీస్తోందని, మైలేజీని తగ్గిస్తోందని పలువురు ఆరోపించారు. దీంతో ఇథనాల్ కలిపే శాతాన్ని మరింత పెంచే ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
పాత వాహనాల ఇంజిన్లు దెబ్బతినకుండా ఉండేందుకు 10 శాతం ఇథనాల్ కలిపిన E10 ఇంధనాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించింది.
సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు
ఆ తర్వాత నీట్ పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్‌తో సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. జూలై 20న జంతర్‌మంతర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు భిన్న వర్గాలకు చెందినవారు.
ఎలాంటి కృత్రిమ ప్రేరణ లేకుండా సహజంగా ఏర్పడిన ఈ ఐక్య ఉద్యమం సీజేపీతో ప్రభుత్వం చర్చలు జరపాల్సిన పరిస్థితిని కల్పించింది.
ఈ నిరసనల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ హోదా కలిగిన పదవిలో పనిచేసిన నందన్ నీలేకని సహాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది.
సీఈసీ తొలగింపు డిమాండ్
ఇప్పుడు ఓటర్ల జాబితాలపై చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రక్రియలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయనే అంశం తీవ్ర వివాదానికి దారితీసింది.
అర్హులైన ప్రతి ఓటరుకు తిరిగి జాబితాలో చోటు కల్పించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించడం అంత సులభం కాదు. ఇందుకు భారత రాజ్యాంగం కఠినమైన నిబంధనలను నిర్దేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించేందుకు అనుసరించే విధానాన్నే ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపునకు కూడా అనుసరించాలి.
2026 మార్చిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు గతంలో చేసిన ప్రయత్నం విఫలమైంది. లోక్‌సభకు చెందిన 130 మంది ఎంపీలు, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు సంతకాలు చేసిన తొలగింపు నోటీసులను ఆయా సభల స్పీకర్, ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు.
ప్రభుత్వం, బీజేపీ వైఖరి
సాంకేతికంగా చూస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. అయితే వాస్తవ రాజకీయాల్లో ఇలాంటి సాంకేతిక పరిమితులను అధిగమించే మార్గాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వచ్ఛందంగా రాజీనామా చేయవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వంలోనూ, బీజేపీలోనూ అగ్రస్థానంలో ఉన్న నాయకత్వం మాత్రం జ్ఞానేశ్ కుమార్ పదవిలో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
ఓటర్ల జాబితాలను ‘ప్రక్షాళన’ చేసే పేరుతో జ్ఞానేశ్ కుమార్ తన అధికార పరిధిని మించి వ్యవహరించారని, అతిగా ఉత్సాహం ప్రదర్శించారని ప్రభుత్వ పెద్దలకు తెలుసు.
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో జరిపిన చర్చల్లో కూడా ఆయన వ్యవహారశైలిలోని అధికార దర్పాన్ని నాయకత్వం అంగీకరించినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఆయనను సమర్థించే వైఖరి నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
ప్రస్తుతానికి ఆయనకు అండగా నిలబడేందుకే ప్రభుత్వం, బీజేపీ తమ రాజకీయ బలాన్ని ఉపయోగిస్తున్నాయి.
జూలైలో జరిగిన నిరసనలకు, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలకు మధ్య ఉన్న స్వభావం, వాటి బలాన్ని ప్రభుత్వం, బీజేపీ వేర్వేరుగా అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది.
స్వతంత్ర ప్రజా ఉద్యమం
జూలై 20న జరిగిన నిరసన ఒక ప్రత్యేకమైనది. తనదైన స్వభావం కలిగిన ఒక స్వతంత్ర ప్రజా ఉద్యమంగా అది రూపుదిద్దుకుంది.
నీట్ పరీక్ష రద్దు ఈ ఉద్యమానికి తక్షణ ప్రేరణ మాత్రమే. అనేక కారణాలతో భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువత, ఎదురయ్యే అడ్డంకులను లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చారు.
ఈ నిరసనలు సమాజంలోని విస్తృతమైన భిన్న వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. భారత జనాభాలో సగం మంది 30 ఏళ్లలోపు వారే. ఈ యువతతో పాటు జనరేషన్ జెడ్‌కు చెందినవారు, భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న యువతీ యువకులు, విద్యార్థి సంఘాలు, ఎల్జీబీటీక్యూ+, క్వీర్ హక్కుల సంఘాలు (వ్యక్తుల హక్కుల కోసం పనిచేసే సంఘాలు, లైంగిక, లింగ వైవిధ్యం కలిగిన వ్యక్తుల హక్కుల ఉద్యమ సంఘాలు), ఆందోళన చెందుతున్న పౌరులు, తల్లిదండ్రుల సంఘాలు ఈ ఉద్యమంలో భాగమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియామక పరీక్షలు లేదా కళాశాల ప్రవేశ పరీక్షలు రద్దు కావడం వల్ల నష్టపోయినవారు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
ఇది ప్రభుత్వాన్ని మేల్కొలిపిన హెచ్చరికగా మారింది. అనేక సమస్యలపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి అంతా ఒక్క డిమాండ్‌గా సంఘటితమైంది— విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ పరిణామంతో ప్రభుత్వం కలవరపడింది. చివరకు ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్, శరద్ పవార్, మహువా మొయిత్రా, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ తదితరులు యువతకు, సీజేపీ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు జంతర్‌మంతర్‌కు వచ్చారు.
అయితే విస్తృత ప్రజా ఉద్యమంలో భాగంగా వారు అక్కడికి రావడం యాదృచ్ఛికమే తప్ప వారి రాకతోనే ఉద్యమం నడుస్తున్నట్లు కనిపించలేదు. వారి ఉనికి ఒక్కటే ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసినట్లు కూడా అనిపించలేదు.
కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ప్రభుత్వం, బీజేపీ ప్రధానంగా రాజకీయ కోణంలో చూస్తున్నాయి.
ఎన్నికల ఓటర్ల జాబితాల్లో శుద్ధత లేదా స్వచ్ఛతను కాపాడటం తమ సిద్ధాంతంలో అంతర్భాగమని బీజేపీ భావిస్తోంది.
అయితే అర్హులైన ఓటర్లను వేధింపులకు గురిచేయకుండా, వారి ఓటు హక్కుకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనా?
స్వతంత్రంగా, జవాబుదారీతనంతో పనిచేసే ఎన్నికల కమిషన్ కోసం కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నప్పటికీ గతంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరుతో ఈ వైఖరికి పొంతన లేదని బీజేపీ వాదిస్తోంది.
ఉదాహరణకు 1999 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ను కాంగ్రెస్ ఎల్కే అద్వానీపై పోటీకి నిలబెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంఎస్ గిల్‌కు క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చింది.
2009లో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను ఆ పదవి నుంచి తొలగించాలంటూ చేసిన సిఫారసును కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది.
అదే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నవీన్ చావ్లానే ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించింది.
ఎన్నికల కమిషనర్ల స్వతంత్రత గురించి కాంగ్రెస్ మాట్లాడుతున్నప్పుడు, ఈ గత పరిణామాలే బీజేపీ అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నాయి.
ఎస్ఐఆర్ అంశంపై కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోవచ్చని ప్రభుత్వం, బీజేపీ భావిస్తున్నాయి.
ఈ నిరసనలను ఎన్నికల్లో ఓడిపోయినవారి ఫిర్యాదుగా, ఎప్పుడూ కనిపించే వామపక్ష శక్తుల జోక్యంగా, అక్రమ వలసదారులను సమర్థించే ప్రయత్నంగా చిత్రీకరించడం ద్వారా ప్రతిపక్షాలపై పైచేయి సాధించవచ్చని అవి భావిస్తున్నాయి.
భవిష్యత్తుపై ఆందోళన
అందుకే ఈ రెండు వేర్వేరు నిరసనల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరులో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. అక్టోబరు 10న సీజేపీ, యువత చేపట్టిన నిరసనలపై ప్రభుత్వం తీవ్రంగా అణచివేత చర్యలకు దిగింది.
అయితే అక్టోబరు 12న ఇండియా కూటమి పెద్ద సంఖ్యలో సమావేశమై ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతించింది.
అదే సమయంలో గత వారాంతంలో నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ప్రతిరోజూ కొనసాగుతున్న ఆందోళనలు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి.
ఈ నిరసనలను అదుపు చేయకుండా వదిలేస్తే అవి క్రమంగా బలపడి ‘వికసిత్ భారత్’ కలపై విశ్వాసం కోల్పోతున్న అన్ని వర్గాల ప్రజలను తమలో భాగస్వాములను చేసుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
ఒక ప్రభుత్వ అధికారి చెప్పినట్లుగా యువత తీవ్ర ఆశాభంగానికి గురైంది. ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. వేతనాల్లో పెరుగుదల లేదు.
నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తుపై ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలు కూడా ఆవిరైపోయాయి. ఈ పరిణామాలన్నీ కలిసి, భ్రమభంగానికి గురైన వివిధ వర్గాల ప్రజలతో కూడిన ఒక ఉమ్మడి కూటమిగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.
ఈ భ్రమభంగం, అసంతృప్తి క్రమంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుని, తాత్కాలిక ఆగ్రహానికే పరిమితం కాకుండా దీర్ఘకాలం కొనసాగితే ఏమవుతుందన్నదే బీజేపీని, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
అనువాదం: కె మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
