స్వయం-ఉపాధిగా వర్గీకరించబడిన గ్రామీణ మహిళా కార్మికుల సంఖ్య 2017-18లో 57 శాతం నుంచి 2023-24లో 72.2 శాతానికి పెరిగినట్లు ఆక్స్ఫామ్ అధ్యయనం గుర్తించింది. అయినప్పటికీ, వారిలో 59 శాతం మంది మహిళలు వేతనాలకు నోచుకోని కుటుంబ వ్యాపారాల్లో సహాయకులుగానే ఉన్నారు.
న్యూఢిల్లీ: పనిచేసే గ్రామీణ మహిళల సంఖ్య బాగా పెరగడానికి కారణం కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం కాదని, ఈ పరిణామం ప్రధానంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ప్రతిబింబిస్తుందని ఆక్స్ఫామ్ కొత్త అధ్యయనం బయటపెట్టిందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
అధ్యయనం ప్రకారం, గ్రామీణ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2017-18లో 24.6% నుంచి 2023-24లో 47.6%కి చేరి దాదాపు రెండింతలు పెరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా నమోదైన అత్యంత వేగవంతమైన పెరుగుదలలో ఇది కూడా ఒకటి.
అయితే, దీనికి అనుగుణంగా మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడం పెరగడానికి బదులుగా, ఎక్కువ మంది మహిళలు “స్వయం ఉపాధి” పొందుతున్నవారిగా లెక్కించబడుతున్నారు.
స్వయం ఉపాధి కేటగిరీ కింద సొంతంగా దుకాణం నడపడం దగ్గర్నుంచి వేతనం లేని కుటుంబ వ్యవసాయ పనులు చేయడం వరకు అన్నీ కలిసి ఉన్నాయి.
స్వయం ఉపాధిగా వర్గీకరించబడిన గ్రామీణ మహిళా కార్మికుల సంఖ్య 2017-18లో 57% నుంచి 2023-24లో 72.2%కి పెరిగినట్లు ఆక్స్ఫామ్ అధ్యయనం గుర్తించింది.
అయితే, వీరిలో ఏకంగా 59% మంది మహిళలు వేతనం లేని కుటుంబ వ్యవసాయం లేదా వ్యాపారాల్లో సహాయకులుగానే ఉన్నారు.
అధ్యయనంలో పరిశీలించిన ఇదే కాలంలో, వేతనాలతో కూడుకున్న ఉద్యోగాలలో ఉన్న మహిళల వాటా 11% నుంచి 8%కి పడిపోగా, క్యాజువల్ లేబర్(రోజువారీ కూలీలు) వాటా 32% నుంచి 20%కి తగ్గిపోయినట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
“మరో మాటలో చెప్పాలంటే, మహిళలు పనుల్లోకి వస్తున్నారు, కానీ వారు సాధారణంగా వేతనం, కాంట్రాక్టు లేదా ఎలాంటి భద్రత ఉండే పనుల నుంచి తప్పుకుని వేతనం లేని లేదా అనిశ్చితమైన స్వయం-ఉపాధి పాత్రల్లోకి మారుతున్నారు” అని ఆక్స్ఫామ్ విశ్లేషణ పేర్కొంది.
విధానపరమైన మార్పులు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయో కూడా ఆక్స్ఫామ్ అధ్యయనం నొక్కి చెప్పింది.
గతంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పని దినాల్లో మహిళల వాటా 54% ఉండేది, ఇప్పుడు దాని స్థానంలో వీబీ- జీఆర్ఏఎం-జీ చట్టం వచ్చింది.
“పాత డిమాండ్ ఆధారిత గ్యారెంటీకి భిన్నంగా, కొత్త పథకం నిర్దిష్ట సీజన్లకు మాత్రమే పనిని పరిమితం చేస్తుంది, వేతన బిల్లులో 40 శాతాన్ని రాష్ట్రాల పై మోపుతుంది – వీటిలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి – అలాగే మొబైల్ యాప్ ద్వారా రోజుకు రెండు సార్లు జియో-ట్యాగ్డ్ ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ పరిజ్ఞానం, నైపుణ్యాలు పరిమితంగా ఉన్న మహిళలకు ఇదొక అవరోధంగా మారుతుంది” అని విశ్లేషణ తెలిపింది.
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం అనేది ఎక్కువగా స్వయం ఉపాధి, వేతనం లేని కుటుంబ పనులు, నాణ్యత లేని వ్యవసాయం మరియు అనధికారిక పనుల పైనే కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపిస్తోందని, అదే సమయంలో రెగ్యులర్ వేతన ఉపాధి తగ్గిపోయిందని ది వైర్ గతంలోనే నివేదించింది.
కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ నమూనా విస్తరిస్తున్న ఆర్థిక అవకాశాల కంటే, గృహాలను తక్కువ ఉత్పాదకత, జీవనాధార రూపాల్లోకి నెట్టివేస్తున్న అంతర్లీన ఆర్థిక క్షోభను ఎక్కువగా సూచిస్తుంది.
మహిళల పని భాగస్వామ్యం ఎందుకు మారుతుందనే దాని పై గ్రామాల వారీగా జరిగిన అధ్యయనాలు ఉపయోగకరమైన దృక్పథాన్ని అందిస్తున్నాయి.
ఉదాహరణకు, పాలన్పూర్లో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనంలో, గృహ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు మహిళలు వేతనంతో కూడిన పని నుంచి తప్పుకునే అవకాశం ఎక్కువగా ఉందని, అదే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలోకి నెట్టబడ్డారని కనుగొన్నారు.
తమిళనాడులోని రెండు గ్రామాల్లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం కూడా ఇదే ముగింపుకు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల సమయంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది, కుటుంబ పరిస్థితులు మెరుగుపడినప్పుడు పడిపోతుంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
