బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా తమకు ‘ఉచిత ప్రచారం’ కల్పించిన వేడుక నిర్వాహకులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పీతంపురాలో దసరా ఉత్సవాల సందర్భంగా రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల ఎత్తున్న బొద్దింక దిష్టిబొమ్మను కూడా అక్టోబరు 20న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తగులబెట్టారు.
బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయాలనే నిర్ణయాన్ని శ్రీ కేశవ్ రాంలీలా కమిటీ(ఎన్ఎస్పీ పీతంపురా) నిర్వాహకులు తీసుకున్నారు. ఈ కమిటీకి బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం.
“భారత్‌లో ఫ్రాన్స్ తరహా పరిస్థితులను సృష్టించవచ్చని భావిస్తున్న మురికి శక్తులు, నక్సలైట్లు, జిహాదీలు, అవినీతిపరుల కూటమి.. భారత్‌కు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలకు ప్రతీకగా ఈ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేశాం. ప్రజలు దీనిని వేడుకగా జరుపుకొన్నారు. బొద్దింక దిష్టిబొమ్మ కాలిపోతోంది, కానీ ఆ బాధను చెదపురుగులు అనుభవిస్తున్నాయి” అని మిశ్రా ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా'(పీటీఐ)తో అన్నారు.
ఓటర్ల తొలగింపుపై నిరసనల వేళ దహనం
ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) ప్రక్రియలో విస్తృతంగా అవకతవకలు జరిగాయని, పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపిస్తూ ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనలను ఎదుర్కొంటున్న సమయంలో బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జూన్–జూలై నెలల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘ నిరసన చేపట్టింది. ఆ నిరసనల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కూడా సీజేపీ నిరసనలు చేపడుతోంది. ఆ సంస్థ నాయకులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
కపిల్ మిశ్రా, కమిటీపై ఆప్ ఫిర్యాదు
అంతకుముందు మంగళవారం, బొద్దింక దిష్టిబొమ్మను రావణుడి సంప్రదాయ దిష్టిబొమ్మతో పాటు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ టీఎస్ సంధు, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు కపిల్ మిశ్రాతో పాటు శ్రీ కేశవ్ రాంలీలా కమిటీ నిర్వాహకులు, ఆ కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్‌పై దాఖలైంది.
రావణుడి దిష్టిబొమ్మతో పాటు సంప్రదాయంగా ఏర్పాటు చేసే ఇతర దిష్టిబొమ్మల పక్కన 30 అడుగుల ఎత్తున్న బొద్దింక దిష్టిబొమ్మను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆప్ తన ఫిర్యాదులో ఆరోపించింది.
ఆ ఫిర్యాదులో ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది:
“సనాతన సంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగా మార్చడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం: దసరా లేదా విజయదశమి అనేది పురాతన హిందూ ఆచారాలు, గ్రంథాలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే అత్యంత పవిత్రమైన పండుగ. రామాయణంలో వర్ణించినట్లుగా, నిర్దిష్టమైన దుష్టశక్తులకు ప్రతీకలుగా నిలిచే పౌరాణిక పాత్రల దిష్టిబొమ్మలను దహనం చేయడం ఈ పండుగలో భాగం. మతపరమైన ఆచారంలో భాగంగా అనధికారికంగా ఒక కీటకానికి సంబంధించిన దిష్టిబొమ్మను అదనంగా చేర్చడం పవిత్ర సంప్రదాయాలను వక్రీకరించడమే. ఇది సనాతన సంప్రదాయాల గంభీరతను అపహాస్యం చేయడంతో పాటు హిందూ సమాజంలోని ప్రజల మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.”
‘ఉచిత ప్రచారం’పై సీజేపీ ధన్యవాదాలు
ఇదిలా ఉండగా, బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా తమకు ‘ఉచిత ప్రచారం’ కల్పించిన వేడుక నిర్వాహకులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అంతకుముందు కృతజ్ఞతలు తెలిపారు.
2020 ఢిల్లీ అల్లర్ల కేసులోనూ ఆరోపణలు
దేశ రాజధానిలో 2020లో జరిగిన అల్లర్లకు దారితీసిన ద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలను కపిల్ మిశ్రా గతంలో ఎదుర్కొన్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో, 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
ఢిల్లీలో జరిగిన హింసాకాండ ‘పథకం ప్రకారం, లక్ష్యాలను నిర్దేశించుకుని’ సాగిందని ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ ఏర్పాటు చేసిన పదిమంది సభ్యుల నిజనిర్ధారణ బృందం గతంలో పేర్కొంది. ఈ హింసాకాండకు కపిల్ మిశ్రాను బాధ్యుడిగా కూడా ఆ బృందం పేర్కొంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
