పేదరికం నుంచి ప్రజా ఉద్యమాల వరకు, కార్మిక సంఘాల నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు- అధికారం కంటే ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చిన నాయకుడి జీవితం నుంచి నేటి రాజకీయ నేతలు నేర్చుకోవాల్సిన పాఠాలు.
భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో, ముఖ్యంగా కేరళ రాజకీయాల్లో, ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు వెలిక్కకత్తు శంకరన్ అచ్యుతానందన్, ప్రజలకు సుపరిచితమైన పేరు వీఎస్ అచ్యుతానందన్.
1923 అక్టోబరు 20న కేరళలోని పున్నప్ర ప్రాంతంలో జన్మించిన ఆయన, 101 ఏళ్లు నిండి 102 వయసులో ప్రవేశించాక 2025 జూలై 21న మరణించారు.
ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రజా జీవితం కార్మిక ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, భూసంస్కరణలు, అవినీతి వ్యతిరేక ప్రచారాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది.
ఆయనను కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే చూడటం పొరపాటు. సామాన్య కార్మికుడిగా జీవితం ప్రారంభించి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తిగా, తన రాజకీయ జీవితంలో పార్టీ సంస్థాగత బాధ్యతలు, ప్రభుత్వ పదవులు, ప్రతిపక్ష నాయకత్వం వంటి అనేక పాత్రలను పోషించారు. ఆయన జీవితం ముఖ్యంగా మూడు విధాలుగా చూడాలి.
1. నిరాడంబరం: వ్యక్తిగత జీవనశైలిలో ఆడంబరానికి దూరంగా ఉండటం.
2. రాజకీయ నిబద్ధత: కార్మికులు, రైతులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల సమస్యలకు ప్రాధాన్యమివ్వడం.
3. ప్రజా సమస్యలపై పట్టుదల: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలను చర్చలోకి తీసుకురావడం.
బాల్యం
అచ్యుతానందన్ 1923లో అప్పటి ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన పున్నప్ర ప్రాంతంలో జన్మించారు. ఆయన కుటుంబం ఆర్థికంగా బలహీనమైనది. చిన్న వయసులోనే తల్లిని, ఆ తరువాత తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు, జీవనోపాధి సమస్యలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి.
ఆయన ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును కొనసాగించలేక పనిచేయడం ప్రారంభించారు.
కొంతకాలం తన అన్నయ్య దుకాణంలో సహాయం చేశారు. తరువాత కొబ్బరినార పరిశ్రమలో పనిచేశారు. కేరళలోని కొబ్బరినార పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న తక్కువ వేతనాలు, కఠినమైన పని పరిస్థితులు, యజమానుల ఆధిపత్యం ఆయన ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చాయి. ఈ అనుభవం ఆయన రాజకీయ జీవితాన్ని మలిచిన కీలకమైన అంశంగా చెప్పవచ్చు.
పేదరికాన్ని దూరం నుంచి చూసిన వ్యక్తికి, పేదరికంలో జీవించే వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. కార్మికుడిగా పనిచేసిన అచ్యుతానందన్‌కు శ్రమ విలువ, ఉపాధి భద్రత, వేతనాల ప్రాధాన్యం పుస్తకాల ద్వారా మాత్రమే పరిచయం కాలేదు. అవి ఆయన జీవితంలో భాగమయ్యాయి.
అందువల్ల కార్మికుల సమస్యలను ఆయన రాజకీయ ప్రసంగాల్లోని ఒక అంశంగా మాత్రమే కాకుండా, తన స్వీయ అనుభవానికి సంబంధించిన విషయంగా చూశారు. ప్రజా నాయకత్వానికి సామాజిక అనుభవం ఎంత ముఖ్యమో ఆయన బాల్యం గుర్తుచేస్తుంది.
ప్రజల జీవితాలను మార్చాలనుకునే నాయకులు వారి సమస్యలను గణాంకాల్లో మాత్రమే కాకుండా, వారి జీవితాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాలి.
కార్మిక ఉద్యమం నుంచి కమ్యూనిస్టు రాజకీయాల వరకు
1930ల చివరి దశలోనే అచ్యుతానందన్ కార్మిక సంఘ కార్యకలాపాలకు దగ్గరయ్యారు. 1938లో ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి, 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు.
కార్మికులను సంఘటితం చేయడంలో, ముఖ్యంగా కొబ్బరినార పరిశ్రమ కార్మికులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై పోరాటాల్లో పాల్గొనడంలో కీలక పాత్ర పోషించారు. ఆ కాలంలో కేరళలో భూస్వామ్య ఆధిపత్యం, కుల వివక్ష, అంటరానితనం, కార్మికులపై దోపిడీ వంటి సమస్యలు తీవ్రంగా ఉండేవి.
సంస్థాన పాలనలో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడటం కూడా ప్రమాదకరమైన పని. అచ్యుతానందన్ రాజకీయ ప్రయాణం ఈ పరిస్థితుల మధ్య సాగింది.
పున్నప్ర–వయలార్ పోరాటం
1946లో ట్రావెన్కోర్ సంస్థానంలో జరిగిన పున్నప్ర–వయలార్ తిరుగుబాటు కేరళ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం.
కార్మికులు, రైతులు, కమ్యూనిస్టు కార్యకర్తలు సంస్థాన పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో ఈ ఉద్యమం ముడిపడి ఉంది.
అచ్యుతానందన్ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో అరెస్టులు, జైలు జీవితం, అజ్ఞాతవాసం అంతర్భాగం.
1980కి ముందు దశాబ్దాల్లో ఐదున్నర సంవత్సరాలకు పైగా జైలులో గడిపారు, నాలుగున్నర సంవత్సరాలకు పైగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ అనుభవాలు ఆయనలో ఉద్యమ రాజకీయాల పట్ల దృఢమైన నిబద్ధతను పెంపొందించాయి.
1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక-ఒక చారిత్రక పాత్ర
భారత కమ్యూనిస్టు ఉద్యమంలో 1964లో జరిగిన విభజన ఒక కీలక పరిణామం. అప్పటి అవిభక్త కమ్యూనిస్టు పార్టీ జాతీయ మండలిలోని 32 మంది నాయకులు బయటకు వచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ఏర్పాటులో భాగమయ్యారు. అచ్యుతానందన్ వారిలో ఒకరు.
తరువాత ఆయన కేరళలో సీపీఐ(ఎం) నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1980 నుంచి 1992 వరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1985లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు.
1992–1996, 2001–2006, 2011–2016 కాలాల్లో కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాలు, ఎన్నికల రాజకీయాలు అనే మూడు రంగాల్లోనూ ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అయితే, ఆయన రాజకీయ ప్రయాణం అనేక ఒడుదొడుకులున్నాయి.
సీపీఐ(ఎం)లో అంతర్గత విభేదాలు, కొన్ని సందర్భాల్లో పార్టీ క్రమశిక్షణా చర్యలు ఆయన రాజకీయ జీవితంలో భాగమయ్యాయి.
నమ్మిన విలువల కోసం, ప్రజా జీవితంలో పార్టీ ప్రమాణాలు అమలు జరపటం కోసం అహర్నిశలు అంతర్గత పోరాటం చేసిన ధీశాలి.
ఈ పోరాటంలో భాగంగా కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రానికి కట్టుబడి కొన్నిసార్లు పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా తాను నమ్మిన పార్టీ ప్రమాణాల కోసం నిలబడ్డ గొప్ప ప్రజా నాయకుడు. పార్టీ నాయకుడు.
ఆయనకు మద్దతుదారులు ఆయనను సూత్రాల విషయంలో రాజీపడని నాయకుడిగా చూశారు. విమర్శకులు కొన్నిసార్లు ఆయన తీరును కఠినమైనదిగా అభివర్ణించారు.
ప్రజాస్వామిక రాజకీయాల్లో పార్టీ నిర్ణయాలను గౌరవించడం అవసరం. అదే సమయంలో, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నలను చర్చించే అవకాశం, అంతర్గత విమర్శలకు స్థానం, సమష్టి నిర్ణయాల పారదర్శకత కూడా అంతే అవసరం. అచ్యుతానందన్ రాజకీయ జీవితంలోని ఈ కోణం నేటి రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది.
ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్
2006 కేరళ శాసనసభ ఎన్నికల్లో మలంపుళ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అచ్యుతానందన్, 2006 మే 18న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాల ఏడు నెలలు. 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆయన ప్రభుత్వ కాలాన్ని కేవలం సంక్షేమ పథకాల కోణంలోనే కాకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వ స్పందన, అవినీతి ఆరోపణలపై వైఖరి, పర్యావరణం, కార్మికులు, సామాజిక న్యాయం వంటి అంశాలను కూడా పరిశీలించాలి.
అవినీతి ఆరోపణలపై ప్రశ్నించడం
ప్రజా జీవితంలో ఉన్నవారి నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రభుత్వ వనరుల వినియోగంపై జవాబుదారీతనం కోరడం ప్రజాస్వామ్యానికి అవసరం.
అవినీతి వ్యతిరేకత అంటే ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం మాత్రమే కాదు. సొంత పార్టీ, సొంత ప్రభుత్వం, తమకు దగ్గరగా ఉన్న వారి వ్యవహారాల్లోనూ అదే ప్రమాణాలను అనుసరించడం.
ఈ సూత్రం అచ్యుతానందన్ రాజకీయ జీవితాన్ని పరిశీలించేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
అచ్యుతానందన్ ప్రజా జీవితంలో పర్యావరణ సంబంధిత సమస్యలు కూడా ముఖ్యమైన స్థానం పొందాయి. కేరళలోని ప్లాచిమడలో కోకా-కోలా కంపెనీకి సంబంధించిన నీటి వినియోగ వివాదం, ఎండోసల్ఫాన్ పురుగుమందు ప్రభావిత ప్రజల సమస్యలు, అక్రమ తవ్వకాలు, భూ ఆక్రమణలపై ఆయన వైఖరి విస్తృత చర్చకు దారితీశాయి.
ప్లాచిమడ పోరాటం స్థానిక ప్రజల నీటి హక్కులు, భూగర్భజలాల వినియోగం, పారిశ్రామిక కార్యకలాపాలపై నియంత్రణ వంటి అంశాలను జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది.
ఎండోసల్ఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, పరిహారం, బాధిత కుటుంబాల పునరావాసం వంటి సమస్యలు కూడా ఆయన జోక్యంతో రాజకీయ ప్రాధాన్యం పొందిన అంశాల్లో ఉన్నాయి.
పర్యావరణ పరిరక్షణ అంటే పరిశ్రమలకు వ్యతిరేకంగా నిలబడటంగా చూడకూడదు. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, స్థానిక ప్రజల జీవనోపాధి, నీరు–నేల–గాలి పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వాల బాధ్యత.
అచ్యుతానందన్ ఈ ప్రశ్నలను రాజకీయ చర్చల్లో నిలబెట్టిన తీరు ఆయన ప్రజా జీవితంలో గుర్తించదగిన అంశం.
నిరాడంబర జీవితం: పదవి మారినా వ్యక్తిగత ప్రాధాన్యాలు మారకపోవడం
అచ్యుతానందన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన రాజకీయ పదవులకంటే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేది ఆయన సాదాసీదా జీవనశైలి.
పేదరికంలో పెరిగి, కార్మికుడిగా పనిచేసి, ఉద్యమాల ద్వారా ఎదిగిన ఆయన జీవిత నేపథ్యం ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి పునాది వేసింది.
ముఖ్యమంత్రిగా ఎదిగిన తరువాత కూడా ఆయన ప్రజా జీవితంలో కార్మిక నాయకుడిగా, సాధారణ ప్రజల సమస్యలను ప్రస్తావించే నాయకుడిగా గుర్తింపు పొందారు.
నిరాడంబరతను కేవలం సాధారణ దుస్తులు ధరించడం లేదా ఆడంబరాలకు దూరంగా ఉండటంగా మాత్రమే అర్థం చేసుకోకూడదు.
ఒక ప్రజా ప్రతినిధి నిరాడంబర జీవనశైలి కనీసం నాలుగు అంశాల్లో ప్రతిఫలించాలి.
మొదటిది ప్రజా ధనంపై బాధ్యత- ప్రభుత్వ పదవిలో ఉన్నవారు ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి.
రెండోది అధికారాన్ని సేవగా చూడటం. ముఖ్యమంత్రి పదవి వ్యక్తిగత గౌరవానికి గుర్తు మాత్రమే కాదు. అది కోట్లాది ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించిన బాధ్యత.
మూడోది ప్రజలకు అందుబాటులో ఉండటం. పేదలు, కార్మికులు, రైతులు, అణగారిన వర్గాలు తమ సమస్యలను నాయకుడి దృష్టికి తీసుకెళ్లగలగాలి.
నాలుగోది వ్యక్తిగత ప్రవర్తనలో జవాబుదారీతనం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమ నిర్ణయాలకు, ఆస్తుల వివరాలకు, అధికార వినియోగానికి సంబంధించి సముచితమైన పారదర్శకతను పాటించాలి.
నిరాడంబరతకు రాజకీయ అర్థం
ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికల ప్రచారం, భారీ సభలు, ప్రచార నిర్వహణ, వ్యక్తిగత ప్రతిష్ఠ వంటి వాటికి విపరీతమైన ప్రాధాన్యం లభిస్తోంది.
నాయకుడి ప్రజాదరణను కొన్నిసార్లు ఆయన ప్రచార యంత్రాంగం, మీడియా దృశ్య మానత, సామాజిక మాధ్యమాల అనుచరుల సంఖ్యతో కొలుస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో “ప్రజా నాయకుడి విలువను నిర్ణయించేది ఆయన చుట్టూ ఏర్పడిన ఆడంబరం కాదు ప్రజల జీవితాల్లో ఆయన కలిగించిన మార్పు” అని అచ్యుతానందన్ జీవితం తెలియజేస్తుంది.
పార్టీకి విధేయత — ప్రజలకు నిబద్ధత
అచ్యుతానందన్ రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఉన్న నిబద్ధతను, ప్రజా సమస్యలపై ఆయన తీసుకున్న వైఖరిని కలిపి చూడాలి. ఆయనకు కమ్యూనిస్టు రాజకీయాలు అంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. కార్మికులను సంఘటితం చేయడం, రైతుల సమస్యలను ముందుకు తీసుకురావడం, సామాజిక అసమానతలను ప్రశ్నించడం అందులో భాగం.
శ్రమకు గౌరవం, కార్మికులకు హక్కులు
కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన అచ్యుతానందన్‌కు కార్మిక సంఘాల ప్రాధాన్యత ప్రత్యక్షంగా తెలుసు.
కొబ్బరి నార పరిశ్రమ కార్మికుల నుంచి వ్యవసాయ కార్మికుల వరకు వివిధ రంగాల శ్రామికులను సంఘటితం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
నేటి పరిస్థితుల్లో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగాలు, తాత్కాలిక ఉపాధి, సామాజిక భద్రత లోపం, పెరుగుతున్న జీవన వ్యయం, వేతనాలకు– ఉత్పాదకతకు మధ్య సంబంధం వంటి ప్రశ్నలు కార్మిక ఉద్యమాల ముందు ఉన్న ప్రధాన సవాళ్ళు.
ఈ నేపథ్యంలో అచ్యుతానందన్ జీవితం మనకు గుర్తు చేసేదేమంటే, కార్మికుల హక్కులు కేవలం చట్టాల్లో ఉంటే సరిపోదు. అవి అమలయ్యేలా సంఘటిత కృషి, సమర్థమైన తనిఖీ వ్యవస్థ, న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని వాతావరణం అవసరం.
భూమి, వ్యవసాయ కార్మికులు, సామాజిక న్యాయం
కేరళలో భూసంస్కరణల చరిత్రకు కమ్యూనిస్టు ఉద్యమం, రైతాంగ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల సంఘటనలతో గాఢమైన సంబంధం ఉంది.
అచ్యుతానందన్ భూసంస్కరణల అమలు, భూమి సమస్యలపై సాగిన పోరాటాల్లో పాల్గొన్నారు. 1970లో భూసంస్కరణల అమలుకు సంబంధించిన పోరాటాలు ఆయన రాజకీయ కార్యకలాపాల్లో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.
నేడు కూడా భూమిలేని వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చిన్న రైతులు, ఆదివాసీలు భూమి హక్కులు, సాగు ఖర్చులు, జీవనోపాధి భద్రత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అచ్యుతానందన్ రాజకీయ వారసత్వాన్ని ప్రస్తుతానికి అన్వయించడం అంటే గతంలో జరిగిన భూసంస్కరణలను మాత్రమే గుర్తుచేసుకోవడం కాదు. మిగిలిపోయిన భూహక్కుల సమస్యలను గుర్తించడం, చట్టాలు నిజంగా ఎవరికి ప్రయోజనం కలిగిస్తున్నాయో పరిశీలించడం కూడా అవసరం.
సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటం
కేరళలో సామాజిక సంస్కరణ ఉద్యమాలు కుల వివక్ష, అంటరానితనం, విద్యలో అసమానతలు, ప్రజా ప్రదేశాల్లో ప్రవేశానికి సంబంధించిన అడ్డంకులను సవాలు చేశాయి.
కమ్యూనిస్టు ఉద్యమం ఈ విస్తృత సామాజిక మార్పుల ప్రక్రియలో కీలక పాత్ర పోషించింది. అచ్యుతానందన్ జీవితాన్ని పరిశీలించినప్పుడు, రాజకీయ మార్పుతో పాటు సామాజిక సంబంధాల్లో మార్పు ఎందుకు అవసరమో అర్థమవుతుంది.
నేటి సమాజంలో కుల ఆధారిత వివక్ష, మహిళలపై హింస, ఆదివాసీ హక్కుల సమస్యలు, మతపరమైన విద్వేషం వంటి అంశాలు ప్రజాస్వామిక విలువలకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.
రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు. సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను అంచనా వేయాల్సింది దాని ప్రకటనల ఆధారంగా కాదు, దాని విధానాలు, ఆచరణ, ఫలితాల ఆధారంగా మాత్రమే.
ప్రజా ఉద్యమాల పట్ల ఆయన వైఖరి
అచ్యుతానందన్ రాజకీయ ప్రయాణంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వ పదవిలో ఉండటమే కాకుండా ప్రజా సమస్యలను రాజకీయ చర్చలో నిలబెట్టడానికి కూడా ప్రాధాన్యమిచ్చారు.
ప్లాచిమడలో నీటి వినియోగ వివాదం, ఎండోసల్ఫాన్ బాధితుల సమస్యలు, అక్రమ భూఆక్రమణలు, అక్రమ తవ్వకాలు వంటి అంశాలపై ఆయన జోక్యం ప్రస్తావనకు వచ్చింది.
ఈ అంశాల నుంచి మూడు ముఖ్యమైన అంశాలు చూడాలి. స్థానిక సమస్యలు కూడా ప్రజా విధానాల సమస్యలే.
ఒక గ్రామంలో తాగు నీటి కొరత ఏర్పడితే అది కేవలం స్థానిక సమస్యగా మిగల కూడదు. నీటి వనరుల నిర్వహణ, పరిశ్రమల నియంత్రణ, ప్రజల హక్కులపై ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి. బాధితుల గొంతు వినిపించాలి.
పేదరికం, అనారోగ్యం, పర్యావరణ నష్టం ఎదుర్కొనే ప్రజలకు రాజకీయంగా మాట్లాడే అవకాశం కల్పించాలి.
పరిష్కారం విధానాల్లో కనిపించాలి. నిరసనలు, ప్రకటనలతో సరి పెట్టడం కాకుండా చట్టాలు, బడ్జెట్ కేటాయింపులు, పరిహారం, పునరావాసం, అమలు వ్యవస్థల్లో మార్పు రావాలి.
ఒక ఉద్యమం విజయాన్ని కొలవడానికి నాయకుడి ప్రసంగం ఎంత ప్రభావవంతంగా ఉందన్నది మాత్రమే సరిపోదు.
బాధితుల జీవితం ఎంత మెరుగుపడింది? సమస్య ఎంతవరకు పరిష్కారమైంది? ప్రభుత్వ విధానంలో ఏ మార్పు వచ్చింది? అనేది కీలకం.
రాజకీయాల్లో వ్యక్తిగత నిజాయితీ
అచ్యుతానందన్‌ను అవినీతి ఆరోపణలను ప్రశ్నించిన నాయకుడిగా పలువురు గుర్తు చేసుకుంటారు.
అయితే అవినీతి వ్యతిరేక పోరాటాన్ని ఒక వ్యక్తి నిజాయితీతో మాత్రమే పరిమితం చేయడం సరిపోదు. వ్యక్తిగతంగా నిజాయితీ కలిగిన నాయకుడు అవసరమే. కానీ ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలిక మార్పు కోసం వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అందుకు కొన్ని ముఖ్యమైన చర్యలు అవసరం.
ప్రభుత్వ టెండర్లు, ఒప్పందాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం. ప్రభుత్వ ఖర్చులపై స్వతంత్ర ఆడిట్, సమర్థవంతమైన పర్యవేక్షణ కల్పించడం. అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చూడటం.
సమాచార హక్కు, సామాజిక తనిఖీలు, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలను బలోపేతం చేయడం. అధికార పార్టీ, ప్రతిపక్షం, ఉన్నతాధికారులు అనే తేడా లేకుండా ఒకే చట్టపరమైన ప్రమాణాలను వర్తింపజేయడం.
ఈ ప్రమాణాలు అచ్యుతానందన్‌కు మాత్రమే వర్తించేవి కావు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకునే ప్రతి రాజకీయ వ్యవస్థకు వర్తిస్తాయి.
ప్రజా ఉద్యమాల్లో చురుకైన నాయకుడిగా ఉండటం, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం రెండూ వేర్వేరు బాధ్యతలు.
ఒక నాయకుడి రాజకీయ నిబద్ధతను గుర్తించడం ఎంత అవసరమో, ఆయన ప్రభుత్వ పనితీరును ఫలితాల ఆధారంగా అంచనా వేయడం కూడా అంతే అవసరం.
నాయకుడి పట్ల గౌరవం అంటే విమర్శను విడిచిపెట్టడం కాదు. ఆయన జీవితాన్ని వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకోవడం.
నేటి రాజకీయ పరిస్థితులకు అచ్యుతానందన్ జీవితం
అచ్యుతానందన్ జీవితం నేటి భారత రాజకీయాలకు అన్వయించే అనేక అంశాలున్నాయి. ఇవి ఆయన పార్టీకి మాత్రమే సంబంధించినవి కావు. ప్రజాస్వామ్యంలో పనిచేసే అన్ని పార్టీలకు, ప్రజా ప్రతినిధులకు, కార్మిక సంఘాలకు వర్తించేవి.
ఎన్నికల రాజకీయాల నుంచి ప్రజా సమస్యల రాజకీయాల వైపు
నేడు రాజకీయ చర్చల్లో ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, వ్యక్తిగత విమర్శలు, సామాజిక మాధ్యమాల్లో ఆధిపత్యం వంటి అంశాలు ప్రధానంగా ఉంటున్నాయి.
అయితే ప్రజలకు ప్రధానంగా అవసరమైనవి ఉపాధి, తగిన వేతనం, నాణ్యమైన విద్య, అందుబాటులో ఆరోగ్య సేవలు, గృహవసతి, సామాజిక భద్రత.
అచ్యుతానందన్ కార్మిక సంఘ కార్యకలాపాలతో ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ప్రజల జీవన సమస్యల నుంచి రాజకీయాలు ప్రారంభం కావాలనే భావన స్పష్టమవుతుంది.
నేటి రాజకీయ నాయకులు తమ పనితీరును అంచనా వేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. తమ నియోజకవర్గంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి? కార్మికుల వేతనాలు, పని పరిస్థితుల్లో ఏమైనా మెరుగుదల వచ్చిందా?
ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల సేవలు మెరుగుపడ్డాయా? పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిజంగా చేరుతున్నాయా?
ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజల అభిప్రాయాలకు స్థానం లభిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ప్రజాస్వామిక జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తాయి.
వ్యక్తి ఆరాధన స్థానంలో రాజకీయ విలువలు
అచ్యుతానందన్‌కు కేరళలో విస్తృత ప్రజాదరణ లభించింది. అదే సమయంలో ఆయన రాజకీయ జీవితం విభేదాలు, విమర్శలతో కూడుకున్నది. ఆయనను గుర్తుచేసుకోవడం అంటే ఆయన ఫొటోలు పెట్టడం, జయంతి లేదా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాదు.
ఆయన లేవనెత్తిన/ పరిష్కరించిన సమస్యలు నేడు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించాలి. కార్మికుల హక్కులు, అవినీతి నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాల్లో పురోగతి సాధించడానికి ఏమి చేయాలో చర్చించాలి.
జీవితపు చివరి దశ, రాజకీయ వారసత్వం
2016లో అచ్యుతానందన్ కేరళ పరిపాలనా సంస్కరణల కమిషన్‌కు అధ్యక్షుడయ్యారు. 2019లో అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయ కార్యకలాపాల నుంచి క్రమంగా దూరమయ్యారు.
2021 వరకు ఆ కమిషన్ అధ్యక్షుడిగా కొనసాగారు. 2025 జూలై 21న ఆయన మరణంతో కేరళ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది.
ఒక శతాబ్దానికి పైగా సాగిన ఆయన జీవితం, కేరళ సమాజంలో జరిగిన మార్పులతో ముడిపడి ఉంది. కార్మిక సంఘాల విస్తరణ, భూసంస్కరణల రాజకీయాలు, కమ్యూనిస్టు ఉద్యమ ఎదుగుదల, సంక్షేమ విధానాలు, ఎన్నికల రాజకీయాల్లో మార్పులు ఆయన జీవించిన కాలంలోని పరిణామాలు.
రాజకీయాలు పదవులను సంపాదించే మార్గం కాదు, సమాజంలోని అసమానతలను ప్రశ్నించి, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేసే బాధ్యత అని వీఎస్ అచ్యుతానందన్ జీవితం మనకు తెలియజేస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
