ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఉద్యమం హింసాత్మక రూపం దాల్చడంపై ప్రతి ఒక్కరూ ఈ పరిణామాలను తమకు నచ్చిన రాజకీయ భూతద్దంలో పెట్టి, ఎవరో ఒకరిపై నిందలు వేయడం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఫ్రాన్స్‌లో అల్లర్లు రేపడానికి బయటి నుంచి సహాయం కావాలన్నట్లుగా “కమ్యూనిజం”, “ఇస్లామిజం”, “థర్డ్ వరల్డిజం”, “రష్యా”, “చైనా” వంటివి కారణాలని కొందరు ప్రస్తావిస్తున్నారు.
బహుశా వాళ్లు ఫ్రెంచ్ చరిత్రను పునశ్చరణ చేసుకోవాలి లేదా విక్టర్ హ్యూగో రాసిన “లెస్ మిజరబుల్స్” నవల చదవాలి.
ఇలా అంటున్నానని నేను అల్లరిమూకలను కీర్తించడం కోసం కాదు. లెస్ మిజరబుల్స్లో ‘తెనార్డియర్’ అనే పాత్రను గుర్తుకు తెచ్చుకోండి. అతను చుట్టూ ఉన్న అరాచకాన్ని సొమ్ము చేసుకుంటూ, శవాలను దోచుకుంటూ, తనకు వీలైన ప్రతి ఒక్కరినీ మోసం చేసే ఒక భయంకరమైన దగాకోరు.
ఫ్రెంచ్ చరిత్రలో ప్రతి అరాచక క్షణానికీ దాని తెనార్డియర్లు ఉంటారు, ఈ క్షణం కూడా దానికి మినహాయింపు కాదు. దీనికి బయటి శక్తులపై నిందలు నెట్టడం చాలా సులువు, పైగా అధికారంలో ఉన్నవారికి అది ఉపయోగం కూడా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ ఆగ్రహం ఫ్రాన్స్‌లో పుట్టింది, ఫ్రాన్స్‌లోనే జరుగుతోంది, ఫ్రాన్స్‌లోనే పరిష్కరించబడాలి.
వినడానికి ఎంత బాధాకరంగా ఉన్నా, చరిత్రను అధ్యయనం చేస్తే, ఫ్రాన్స్ ప్రస్తుతం ఉన్న దశలో ఇది కచ్చితంగా ఆశించదగినదే.
చక్రీయ సిద్ధాంతం – ఫ్రాన్స్ పరిస్థితి
కొంతమంది సామాజికవేత్తలు ఈ అంశంపై లోతైన అధ్యయనం చేశారు. రే డాలియో ఆరు దశల చక్రీయ సిద్ధాంతం కావచ్చు, పీటర్ టర్చిన్ “ఎలైట్ ఓవర్ప్రొడక్షన్” వాదన కావచ్చు, లేదా చైనీస్ రాజవంశం కావచ్చు – అన్నీ ఒకే నిర్ధారణకు వస్తాయి. అప్పులు పేరుకుపోయినప్పుడు, ప్రజా సేవలు కుప్పకూలినప్పుడు, అధికారంలో ఉన్నవారు అసమర్థులుగా మారినప్పుడు, వీధులు ఎప్పటికైనా బద్దలవుతాయి.
నిజానికి, చక్రీయ సిద్ధాంత గడుల్లో ఉన్న దాదాపు ప్రతి అంశాన్నీ ఫ్రాన్స్ టిక్ చేయడం దాదాపు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.
ద్రవ్యపరమైన ఇబ్బంది: అప్పు జీడీపీలో 119% వద్ద ఉంది. మనం ఇప్పుడు ఇటలీ లేదా గ్రీస్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాము.
కుప్పకూలుతున్న ప్రజా సేవలు: విద్యారంగ దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తున్న హైస్కూల్ విద్యార్థులతో ఈ నిరసనలు(ఇప్పుడు అల్లర్లుగా మారుతున్నాయి) ప్రారంభమయ్యాయని ఒకసారి గుర్తు చేస్తున్నా.
రాజకీయ పక్షవాతం, చట్టబద్ధత సంక్షోభం: మాక్రాన్ పట్ల 82% అసమ్మతి రేటు నమోదైంది, అతను కచ్చితంగా ‘స్వర్గపు ఆదేశం’ కోల్పోయాడు.
ప్రజల దైన్యం: 15.4% వద్ద రికార్డు స్థాయి పేదరికంతో, పూర్తికాల ప్రైవేట్ రంగ ఉద్యోగికి నికరంగా నెలకు కేవలం 2,190 యూరోల మధ్యస్థ వేతనం అందుతుంది. ఈ మొత్తంతో మీరు ఏ ప్రధాన ఫ్రెంచ్ నగరంలోనైనా ఒక మంచి ఫ్లాట్‌ను అద్దెకు కూడా తీసుకోలేరు.
అసలు కారణాలు – బలిపశువుల అన్వేషణ
“థర్డ్ వరల్డిజం” లేదా “ఇస్లామిజం” వీటన్నింటికీ కారణం కానే కాదు. “ముస్లిం బ్రదర్హుడ్” చెప్పిందని ఫ్రెంచ్ ప్రభుత్వాలు రేపటి గురించి ఆలోచించకుండా అప్పులు చేయలేదు(చివరి బ్యాలెన్స్డ్ బడ్జెట్ 1974 నాటిది), ఫ్రెంచ్ తరగతి గదులను ఉపాధ్యాయులు లేకుండా చేసింది పుతిన్ లేదా షీ జిన్‌పింగ్ కానే కాదు.
విషాదకరంగా, ఇలా బలిపశువులను చేయడం కూడా ఈ చక్రీయ దశలో సాధారణంగా జరిగేవే. సమస్యలకు మూలం అని సాధారణంగా నమ్మే “బలిపశువుల వర్గాల” ఆవిర్భావాన్ని, ప్రజా క్షేత్రంలో నిజాలను పాతర వేయడాన్ని, పరిష్కారాల కోసం వెతకడం కంటే అపరాధుల కోసం వెతకడంలో ఎక్కువ ఆసక్తి చూపేవారిని 5వ చక్రీయ దశకు క్లాసికల్ నమూనాలుగా డాలియో పేర్కొన్నాడు.
చైనా చరిత్ర – వ్యవస్థాగత మార్పులు
అయితే పరిష్కారం ఏమిటి? చైనీయులు దీనిని ఎదుర్కొన్న విధానం వ్యవస్థను మౌలికంగా రీసెట్ చేయడం – దశాబ్దాల తిరుగుబాటు, యుద్ధం తరువాత కొత్త రాజవంశంతో పాలనా మార్పు చేసుకోవడం. అయితే ఫ్రాన్స్‌లో ఈ ఆశావహ దృక్పథం అంతగా లేదు.
చైనీయులు “పునరుద్ధరణ” అని పిలిచే దానిని ఒక రాజవంశం చేపట్టిన ఉదాహరణ కూడా ఉంది. ఇల్లు కూలిపోకముందే లోపల నుంచి గాఢమైన సంస్కరణ.
ఇది కొన్నిసార్లు విజయవంతమైంది (ఉదాహరణకు క్వింగ్ రాజవంశం సమయంలో టోంగ్జి పునరుద్ధరణ) కానీ సాధారణంగా అది కొన్ని దశాబ్దాలు మాత్రమే మనగలదు, అంతకంటే ఎక్కువ కాలం అది సాగదు.
1945లో, రచయిత హువాంగ్ యాన్పీ ఈ చక్రాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని మావోను ప్రశ్నించాడు. దానిని ఆ నిబంధనలలో రూపొందించారు.
“మొదట్లో ప్రజలు జాగ్రత్తగా కష్టపడి పనిచేస్తారు, ఎందుకంటే విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి సాహసోపేతమైన చర్యలు మాత్రమే సాధ్యమైన మార్గాలు. కానీ క్రమంగా విషయాలు మెరుగైనప్పుడు, ప్రజలు నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తారు. సోమరితనం సుదీర్ఘ చరిత్ర ద్వారా వ్యాపించవచ్చు. అది సాధారణ అభ్యాసంగా మారినప్పుడు సరిదిద్దడం అసాధ్యం. క్రమంగా విస్తరించిన భూభాగం తగిన ప్రతిభ పెంపును కోరుకుంటుంది, కానీ రెండోది సరిపోనప్పుడు, కేంద్ర నియంత్రణ బలహీనంగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజవంశాల ఉత్థాన పతనాల ‘విషాద చక్రం’ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.”
ప్రజాస్వామ్యం, స్వీయ సంస్కరణే మార్గం
‘ప్రజాస్వామ్యమే’ సమాధానం అని మావో బదులిచ్చారు, ఎందుకంటే “ప్రజలు ప్రభుత్వాన్ని పర్యవేక్షించగలిగినంత కాలం, ప్రభుత్వం వెనుకాడటానికి సాహసించదు.” ఆ తర్వాత దానికి షీ జిన్‌పింగ్ మరో సమాధానం జోడించారు – “సంకల్పబద్ధమైన స్వీయ-సంస్కరణ” సామర్థ్యం గల వ్యవస్థ.
చైనా ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేసిందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. కానీ ఫ్రాన్స్ ప్రస్తుత సంక్షోభం నుంచి తప్పించుకునే ఆశ, ఆకాంక్ష ఉంటే, దానికి ఒకేసారి పై రెండు సమాధానాలు ఆలంబనగా చేసుకోవడం అవసరమవుతుంది. అచ్చంగా తన ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం, సంకల్పబద్ధమైన స్వీయ-సంస్కరణ.
కచ్చితంగా సమాధానం కానిది ఒక్కటే – ఒకరిపై ఒకరు తిరగబడటం. ఈ చక్రీయ సిద్ధాంతాలన్నింటిలోనూ, విభజన, బలిపశువులను చేయడం అనేవి మనల్ని అదఃపాతాళానికి నెట్టేస్తాయి.
అనువాదం: కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
