ఉత్తరప్రదేశ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సందర్భంగా అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ, తమ కుటుంబ సభ్యుల పేర్లను ఆఖరి ఓటర్ల జాబితా నుంచి మినహాయించారని బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు సుధీంద్ర భదోరియా ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు సుధీంద్ర భదోరియా 2026 అక్టోబరు 16న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా, రాష్ట్రంలో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో దాదాపు తమ కుటుంబ సభ్యులందరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.
“బీఎల్ఓకి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ, నా కుటుంబ సభ్యుల పేర్లను తొలగించి, ఇప్పుడు వాటిని చేర్చకపోవడం ఆందోళనకరం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ పొరపాటును సరిదిద్దాలని ఇటావా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌కు నా విజ్ఞప్తి” అని బీఎస్పీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి భదోరియా ‘ఎక్స్’లో రాశారు.
రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించే భదోరియా ‘ది వైర్’తో ఫోన్లో మాట్లాడుతూ.. వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పేరు నమోదు చేయలేకపోయానని బీఎల్ఓ తెలిపారని, అయితే తమ పూర్వీకులు, వ్యవసాయ భూములు ఈ ప్రాంతంలోనే ఉన్నాయని భదోరియా పేర్కొన్నారు. అధికారి ఈ పొరపాటును సరిదిద్దుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
యూపీలో 2026 ఏప్రిల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో 2 కోట్లకు పైగా పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
యూపీలో జరిగిన ఎస్ఐఆర్పై ‘ది వైర్’ చేసిన విశ్లేషణ ప్రకారం, డ్రాఫ్ట్ లిస్ట్ ప్రకారం నోటీసులు పంపిన 2.86 కోట్ల మంది ఓటర్లలో అత్యధికులు యువత ఉన్నారు.
40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో 39% మందికి నోటీసులు రాగా, 40 ఏళ్లు పైబడిన వారిలో 15% మంది ఉన్నారు.
భదోరియా భార్య, సామాజిక కార్యకర్త రంజనా కుమారితో పాటు వారి కుమారుడు, కుమార్తెల పేర్లు కూడా ఏప్రిల్‌లో ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు.
లోకల్ బీఎల్ఓ చేసిన ఈ పొరపాటు గురించి కుటుంబానికి నెల రోజుల కిందటే తెలిసింది. అప్పటి నుంచి ఓటర్ల జాబితాలో పేర్లు మళ్లీ చేర్చాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారుల వివరణ ఇదీ
ఇటావాలోని కట్రా బాల్ సింగ్ ప్రాంత ఇన్ఛార్జ్ బీఎల్ఓ సౌరభ్ కుమార్‌ను ‘ది వైర్’ సంప్రదించగా- “నేను వారి(భదోరియా) ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ పనిచేసే వారికి నాలుగు ఫారమ్‌లు ఇచ్చాను, కానీ సుధీంద్ర భదోరియా పేరు మీద ఒకే ఫారమ్ పూర్తి చేసి తిరిగి వచ్చింది. ఇప్పుడు మేము వారికి అవసరమైన ఫారమ్‌ను ఇచ్చాము, ఐడీ ప్రూఫ్‌లు సమర్పించిన తర్వాత దీనిని పరిష్కరిస్తాము” అని చెప్పారు.
“వారు ఇక్కడ ఉండకపోవడం వల్ల, మేము కుటుంబంతో కమ్యూనికేట్ చేయలేకపోయాము. చివరికి, ఇటావా వారి నివాస చిరునామా అని నిరూపించే ఎటువంటి ఐడీ ప్రూఫ్ మాకు లభించలేదు” అని బీఎల్ఓ స్పష్టం చేశారు.
అయితే, తన భార్య, పిల్లల తరఫున ఫారమ్ 6ను సమర్పించిన భదోరియా, ఈ అధికారిక వివరణను తోసిపుచ్చారు. నమోదు ప్రక్రియ చాలా లోపభూయిష్టంగా ఉందని ఆయన విమర్శించారు.
“ఈ ప్రాంతంతో (ఇటావా) మా కుటుంబ బాంధవ్యం 150-200 ఏళ్ల నాటిది. నా తల్లిదండ్రులు ఇద్దరూ ఈ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా గెలిచారు. నేను కూడా ఇక్కడి నుంచి పోటీ చేశాను. నాలాంటి వారికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సాధారణ ప్రజల పరిస్థితిని ఊహించండి” అని భదోరియా వ్యాఖ్యానించారు.
“ఎమర్జెన్సీ సమయంలో ఇటావాలో ములాయం సింగ్ యాదవ్‌తో కలిసి జైలు శిక్ష అనుభవించాను. నా తల్లిదండ్రులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం లేదా ప్రజాస్వామ్యానికి సంబంధించిన పోరాటంలో మేము ముందున్నాము. కానీ ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలంటే మేము ఎక్కడికి వెళ్లాలి?” అని ప్రశ్నించారు.
తన తండ్రి అర్జున్ సింగ్ భదోరియా 1942లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడని, తరువాత 1957, 1967, 1977లలో ఇటావా లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారని పేర్కొంటూ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రచురించిన పుస్తకాలను ఈ సందర్భంగా ఆయన చూపించారు.
2026 ఏప్రిల్ రివిజన్ వివరాలు
ఏప్రిల్‌లో జరిగిన ఎస్ఐఆర్ ప్రకారం ప్రయాగ్‌రాజ్ (3,29,421 మంది ఓటర్లు) అత్యధికంగా ఓటర్ల సంఖ్య పెరిగిన జిల్లాగా నిలిచిందని, ఆ తర్వాత లక్నో (2,85,961 ఓటర్లు), బరేలీ (2,57,000 ఓటర్లు), ఘజియాబాద్ (2,43,666 ఓటర్లు), జౌన్పూర్ (2,37,590 ఓటర్లు) ఉన్నాయని ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా చెప్పారు.
డిసెంబరు 2025లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూ “నాలుగు కోట్ల మంది ఓటర్లు మిస్ అయ్యారు” అని పేర్కొన్న తర్వాత ఇటువంటి చేరికలు జరిగాయి.
అయితే, జనవరి 2026లో గ్రౌండ్ రిపోర్టింగ్ సమయంలో, ప్రయాగ్‌రాజ్ నియోజకవర్గంలోని ఖుల్దాబాద్, ఫూల్పూర్ వంటి ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విపరీతమైన వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతాల్లో ఏకంగా 11 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు.
తొలగింపుల ఆరోపణలపై లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీ ఎస్ఐఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒకే వ్యక్తి “వికాస్ యాదవ్” పది వేర్వేరు చిరునామాల్లో ఓటరుగా నమోదయ్యాడని ఆయన లిస్ట్‌ను ప్రదర్శించారు.
“దేశవ్యాప్తంగా 13 కోట్ల పేర్లు ఎలా తొలగించబడ్డాయి? నేను ఇక్కడ నివాసముంటున్నానని నిరూపించడానికి అఫిడవిట్ సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని భదోరియా అన్నారు.
ఈ విషయమై ఇటావా సబ్ డివిజినల్ మాజిస్ట్రేట్ మనోజ్ పాఠక్, డీఎం శుభ్రాంత్ కుమార్ శుక్లాలను వారి అధికారిక నంబర్ ద్వారా సంప్రదించినప్పటికీ, వార్త రాసే సమయానికి స్పందన లభించలేదు.
ది వైర్ ఇంగ్లీష్‌లో ప్రచురితమైన ఈ వార్త రాసినవారు: ఆకాంక్ష కుమార్
తెలుగు అనువాదం: కె. గంగాధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
