కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) నియామకం కోసం తీసుకొచ్చిన 2023 బిల్లుకు మద్దతునివ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
“ఆ పొరపాటు చేసినందుకు మేము విచారిస్తున్నాము. ఎందుకంటే ఒక పరిశీలకుణ్ని ఒక విద్యార్థి నియమించలేడు” అని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకానికి సంబంధించి చేసిన ప్రతిపాదన, దాని కోసం తెచ్చిన బిల్లుకు మద్దతు తెలిపినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అక్టోబరు 18 ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన పై విషయాన్ని తెలిపినట్టు ‘న్యూస్ మినట్’ కథనం వెల్లడించింది.
“అధికార పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్లను నియమించకూడదు. అధికార పార్టీ నియామకాలు చేపట్టడానికి వీలు కల్పించే కేంద్ర ప్రభుత్వ విధానానికి గతంలో మేము మద్దతునిచ్చాము. కానీ ఈ రోజు విచారిస్తున్నాము. ఈ పొరపాటు చేసినందుకు చింతిస్తున్నాము. ఎందుకంటే ఒక పరిశీలకుణ్ని ఒక విద్యార్థి నియమించలేరు” అని జగన్ అన్నారు.
నియామక కమిటీలో మార్పులు
సీఈసీ నియామకానికి సంబంధించిన బిల్లును 2023లో పార్లమెంటు ఆమోదించింది. ప్రధానమంత్రి, ఆయన నియమించే ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడితో కూడిన త్రిసభ్య కమిటీ వ్యవస్థ ఈ కీలక నిర్ణయానికి బాధ్యత వహిస్తుంది. నియామక కమిటీ విధానంలో మార్పులు చేసే ఈ 2023 బిల్లును అప్పట్లో ఆమోదించారు.
గతంలో సీఈసీ నియామకం కోసం ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితో కలిపి సెలెక్షన్ ప్యానల్ ఉండేది.
“ప్రస్తుత ఏర్పాట్లలో రెండు ఓట్లు అధికార పక్షానికి ఇవ్వగా, ఒక ఓటు ప్రతిపక్షానికి ఉంటుంది. కమిటీలో ప్రధాన న్యాయమూర్తి ఏ మాత్రం భాగం కాలేరు. ఇదే వ్యవస్థలో ఉన్న ప్రధాన లోపం” అని విలేకరులకు జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
వైఎస్సార్సీపీ వైఖరిలో మార్పు
సీఈసీ నియామకం కోసం 2023లో తీసుకొచ్చిన బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత పార్టీ వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.
బీహార్ ఓటరు జాబితాల సర్(ప్రత్యేక విస్తృత సవరణ)పై 2025 డిసెంబరు లోక్‌సభ సమావేశాలలో, ఇండియా కూటమేతర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా తిరిగి బ్యాలెట్ పత్రాల ఆలోచనకు మద్దతు తెలిపినట్టు ‘ది వైర్’ కథనం వెల్లడించింది.
కాంగ్రెస్‌పై డీఎంకే ధ్వజం
ఇదిలా ఉండగా, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకత్వాన చేపట్టిన నిరసనల్లో భాగంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్టు డీఎంకే తెలిపింది.
మరోపక్క రాష్ట్రంలో టీవీకేతో జతకట్టాలని ఎంచుకున్న “కాంగ్రెస్ వంటి వెన్నుపోటుదారులతో ఎలాంటి బంధం ఉండబోదు” అని ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ స్పష్టం చేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
