ఉత్తర భారతదేశంలో ఇది రామ్‌లీలా సమయం. పాత కాలాన్ని కళ్లముందు ఉంచే నాటకాలను చూసేందుకు ప్రతి సాయంత్రం పబ్లిక్ మైదానాల్లో జనాలు గుమిగూడుతుంటారు. వారిని అనుమతి పత్రం కావాలని ఎవరూ అడగరు.
అక్టోబర్ 11 ఆదివారం ఉదయం రామాయణంలోని ఒక ఘట్టం నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు సుప్రీంకోర్టు అత్యవసర(అసాధారణ) విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టులో సాధారణంగా ఆదివారాలు సెలవు దినాలు. కానీ, ఆ రోజు ధర్మాసనం నిరసనలు, పోలీసుల అధికారాలపై న్యాయవాదులకు వరుస ప్రశ్నలు సంధించింది.
శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును పోలీసులు ఉల్లంఘించారా లేదా అన్న దానిపై తనకు వివరణ ఇవ్వాలని జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ కోరారు.
ఇది సరైన ప్రశ్నే. దీనికి సంబంధించిన సమాధానంలో కొంత భాగం అయోధ్య నగరంలోని ఒక గదిలో ఉంది.
రామాయణంలో ‘కోపగృహం’
రామాయణంలో ఒక నిరసన ప్రదేశం ఉంది. వాల్మీకి దాన్ని ‘క్రోధాగారం’ లేదా ‘కోపగృహం’ అని వర్ణించారు.
తీవ్రమైన అసంతృప్తితో ఉన్న రాణి అక్కడికి వెళ్లింది. నేలపై పడుకుంది. తన ఆభరణాలను తీసి పక్కన పెట్టి వేచి చూసింది. కోపపడేందుకు కైకేయి రాజు అనుమతి కోరలేదు. తలుపు దగ్గర ఏ కావలివాడూ ఆమెను అడ్డుకోలేదు. ఏ అధికారీ రాజప్రాసాద కారిడార్లను మూసివేయలేదు. విభేదాలను వ్యక్తం చేయడానికి అయోధ్యలో ఒక గదిని నిర్మించారు. ఆ గది ఎప్పుడూ తెరిచే ఉండేది.
రాజు ఆ గదికి రాక తప్పలేదు. ఆమె మాట వినాల్సి వచ్చింది. కైకేయి ఏమి డిమాండ్ చేసిందనే దానిపై మనం వాదించుకోవచ్చు. కానీ ఆ కోపగృహం ఎందుకు కట్టించారనే దానిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఆ రాజ్యం కోపానికి, అసమ్మతికి ఒక ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించింది.
ఢిల్లీలో జంతర్ మంతర్
ఢిల్లీకి కూడా సొంత ‘కోపగృహం’ ఉంది. దాన్నే జంతర్ మంతర్ అని పిలుస్తారు. సుప్రీంకోర్టు దీనిని నిరసనలు తెలిపే స్థలంగా గుర్తించింది. కానీ, ఢిల్లీ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
పౌరులు జంతర్ మంతర్‌కు బయలుదేరినప్పుడు, వారు అక్కడికి చేరుకోకుండా తరచుగా అడ్డుకుంటారు. నగరం అంతటా మెట్రో స్టేషన్లను మూసివేస్తారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. రైళ్లను సైతం రద్దు చేస్తారు.
రాజధానికి వచ్చే మార్గాలు కాంక్రీట్ గోడలు, ఇనుప మేకులతో నిండిపోవడాన్ని రైతుల నిరసనల సమయంలో చూశాం.
జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చున్న రెజ్లర్లను అక్కడి నుంచి తొలగించి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
నిరసనల కోసం కేటాయించిన స్థలం తెరిచే ఉంటుంది. కానీ, దానికి వెళ్లే దారిని మూసివేస్తారు. మనం చేరుకోలేని ప్రదేశంలో నిరసన తెలిపే హక్కు కేవలం కాగితాలకే పరిమితం. ఇది తలుపులు మూసి ఉన్న థియేటర్‌కు టికెట్ కొనుక్కోవడం లాంటిది.
రాజ్యాంగం కల్పించిన హక్కు
పౌరులందరికీ “శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కు” ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(బీ) స్పష్టంగా పేర్కొంది. ఆ పదాలను నిశితంగా గమనించండి. పౌరులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రాజ్యాంగం చెప్పడం లేదు. పౌరులకు ఇప్పటికే ఉన్న హక్కును అది స్పష్టం చేస్తోంది.
ఈ నిబంధన ఏ అధికారిక అనుమతి పత్రాన్ని కోరదు. అనుమతి పొందే విధానం కొత్తగా వచ్చి చేరింది. సమావేశమవ్వడమే పౌరుల అసలైన హక్కు అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది.
ప్రజలు ఒకచోట చేరినప్పుడు రక్షణ లభిస్తుంది. ఒక అధికారి ఫారమ్‌పై సంతకం చేసిన తర్వాతే సమావేశం చట్టబద్ధం అవుతుందనే నిబంధన- రాజ్యాంగం ఇవ్వని అధికారాలను ఒక పదవికి కట్టబెట్టడమే.
ఆర్టికల్ 19(1)(బీ)లో రెండు షరతులు ఉన్నాయి. సమావేశం శాంతియుతంగా ఉండాలి. ఆయుధాలు లేకుండా ఉండాలి. ఈ రెండు షరతులు సమావేశమైన వారి ప్రవర్తనకు సంబంధించినవి. అధికారిక అనుమతులకు సంబంధించినవి కావు.
‘శాంతియుతంగా’ అనేది ఒక ప్రవర్తనా విధానం. సమావేశం ఎలా జరుగుతుందో లేదా ముగిసిన తర్వాత న్యాయమూర్తులు దానిని అంచనా వేస్తారు. కానీ, అనుమతి విధానం అనేది ఇంకా జరగని ఒక సమావేశం శాంతియుతంగా ఉంటుందో లేదో ముందే నిర్ణయించమని అధికారిని కోరుతుంది.
రాజ్యాంగం ప్రవర్తనకు ప్రమాణాలను నిర్దేశిస్తే, లైసెన్సింగ్ విధానం అంచనాల ఆధారంగా పనిచేస్తుంది. ఇవి రెండూ ఒకే రకమైన పరీక్షలు కావు.
రాజ్యాంగ నిర్మాతలు రెండు షరతులను మాత్రమే పేర్కొన్నారు. ఇక్కడ ‘ఎక్స్ప్రెసియో ఉనియస్ ఎస్ట్ ఎక్స్క్లూసియో ఆల్టీరియస్’ అనే పాత చట్టపరమైన సూత్రం వర్తిస్తుంది. అంటే ఒకదానిని పేర్కొనడం అంటే మరొకదానిని మినహాయించడమే.
ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారంటే రెండో దాన్ని పక్కన పెట్టారని అర్థం. రాజ్యాంగ నిర్మాతలు మూడో షరతుగా ముందస్తు అనుమతిని కోరుకుని ఉంటే, వారు తప్పకుండా దానిని ఆ రెండింటి పక్కన రాసేవారు.
సహేతుక పరిమితులు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(3) ద్వారా ప్రభుత్వం దీనికి సమాధానమిస్తుంది. శాంతిభద్రతలు, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత ప్రయోజనాల దృష్ట్యా సహేతుకమైన పరిమితులను విధించడానికి ఈ నిబంధన అనుమతిస్తుంది.
అయితే, ఆ వ్యాఖ్యను సరిగ్గా చదవాలి. ఆ పరిమితులు హక్కును వినియోగించుకోవడంపై మాత్రమే ఉండాలి.
పరిమితి అనేది ఆ హక్కును వినియోగించుకుంటున్నారనే ఊహపై ఆధారపడి ఉంటుంది. ఇది సమయం, ప్రదేశం, విధానాన్ని క్రమబద్ధీకరిస్తుంది. కానీ, లైసెన్స్ విధానం దీనికి విరుద్ధంగా పనిచేస్తుంది. అధికారి అనుమతించే వరకు ఇది హక్కును నిలిపివేస్తుంది. ఇది మినహాయింపుతో కూడిన నిషేధం. ఇది కేవలం ఒక పరిమితి మాత్రమే కాదు.
వర్తకం, వ్యాపారాల కోసం రాజ్యాంగ నిర్మాతలు “వృత్తిపరమైన లేదా సాంకేతిక అర్హతలను” నిర్దేశించే చట్టాలను అనుమతించారు. అది ముందస్తు షరతు. కానీ, ఆర్టికల్ 19(3)లో అలాంటి పదాలు ఏవీ లేవు.
పౌరుడి స్వేచ్ఛపై ముందస్తు షరతు విధించే ఉద్దేశం రాజ్యాంగానికి ఉంటే, అది స్పష్టంగా చెప్పేది. రాజ్యాంగం చెప్పని మాటను మనం స్వయంగా చేర్చకూడదు.
ఇవేవీ పోలీసులను నిస్సహాయులను చేయవు. వారు ముందస్తు నోటీసు ఇవ్వమని కోరవచ్చు. ఆ నోటీసు ఆధారంగా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించవచ్చు. కానిస్టేబుళ్లను మోహరించవచ్చు. రద్దీ నియంత్రణకు ప్రణాళికలు వేయవచ్చు.
నోటీసు అనేది పౌరుల హక్కును కాపాడుతుంది. కానీ, ‘అనుమతి’ అనేది హక్కు స్థానాన్ని ఆక్రమిస్తుంది. నోటీసు ఇచ్చే పౌరుడు తాను ఏమి చేయబోతున్నాడో ప్రభుత్వానికి చెబుతాడు. అదే అనుమతి కోరే పౌరుడు తాను ఏమి చేయవచ్చో ప్రభుత్వాన్ని అడుగుతాడు.
సుప్రీంకోర్టు తీర్పుల సమతుల్యత
సుప్రీంకోర్టు ఈ విషయంలో మధ్యస్థ మార్గాన్ని అనుసరించింది. హిమత్ లాల్ కె షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్(1973) కేసులో, వీధి సమావేశాలకు తన ఇష్టానుసారం అనుమతి నిరాకరించే అధికారాన్ని పోలీస్ కమిషనర్‌కు ఇచ్చే నిబంధనను కోర్టు కొట్టివేసింది.
రామ్‌లీలా మైదాన్ ఘటన (2012) కేసులో, నిద్రిస్తున్న నిరసనకారులపై అర్ధరాత్రి పోలీసులు జరిపిన దాడిని తీవ్రంగా తప్పుబట్టింది.
అయితే ఇటీవలి తీర్పులు మరోలా ఉన్నాయి. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2018) కేసులో, జంతర్ మంతర్ సమీప నివాసితుల ప్రయోజనాలతో నిరసనలను కోర్టు పోల్చి చూసింది.
అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (షాహీన్ బాగ్ కేసు, 2020)లో, నిరసనలు కేటాయించిన ప్రదేశాల్లోనే జరగాలని స్పష్టం చేసింది.
ప్రతి తీర్పు సమతుల్యత గురించి మాట్లాడుతుంది. కానీ, ఆచరణలో ప్రతీసారి పోలీసుల వైపే మొగ్గు చూపుతోంది.
సమతుల్యత అనేది గౌరవప్రదమైన పదమే. కానీ ఒక ప్రాథమిక హక్కును, ఢిల్లీ పోలీస్ చట్టంలోని ఒక సెక్షన్‌ను ఒకే త్రాసులో వేసి తూచలేము. రాజ్యాంగం అత్యున్నతమైన చట్టం. పోలీస్ చట్టం దానికి లోబడి పనిచేస్తుంది.
చట్టబద్ధమైన ఒక అధికారాన్ని పౌరుల నిరసన హక్కుతో సమానంగా కోర్టు చూసినప్పుడు, అది అసమతుల్యతకు దారితీస్తుంది. అప్పుడు హక్కు అనేది మినహాయింపుగా మారిపోయి, నిషేధ ఉత్తర్వులే సాధారణ నియమంగా మారుతాయి.
జస్టిస్ బాగ్చీ వేసిన ప్రశ్న ఇక్కడికే దారితీస్తోంది. పోలీసులు తమ అధికారాలను ఎలా ఉపయోగించాలో ఆయన అడగడం లేదు. పోలీసులకు ఆర్టికల్ 19(1)(బీ) కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.
కోర్టు ఈ విచారణను దశాబ్దాలుగా వాయిదా వేస్తూ వస్తోంది. గొడవలు జరుగుతాయనే ముందస్తు అంచనాతో సమావేశాన్ని నిషేధించే అధికారాన్ని ఒక అధికారికి ఇచ్చే చట్టాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఆ విషయాన్ని నిరూపించాల్సిన భారం ప్రభుత్వంపైనే ఉంటుంది. సమావేశం కావాలనుకునే పౌరులపై కాదు.
ఈ ప్రమాదాన్ని ముందే ఊహించారు. రాజ్యాంగ సభలో సోమ్‌నాథ్ లాహిరి మాట్లాడుతూ.. అనేక ప్రాథమిక హక్కులు “ఒక పోలీస్ కానిస్టేబుల్ కోణం నుంచి” రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ హక్కుల పత్రాన్ని ఒక కానిస్టేబుల్ అనుమతుల జాబితాగా చదువుతారని ఆయన భయపడ్డారు. డెబ్బైతొమ్మిది సంవత్సరాల తర్వాత, ఆ కానిస్టేబుల్ వద్ద ఇప్పుడు మెట్రో మ్యాప్, బారికేడ్లు ఉన్నాయి.
హక్కే ప్రాథమిక నియమం
నేను ఇచ్చే సూచన ఇది. ఈ దేశంలో మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వాటికి కొన్ని సహేతుకమైన పరిమితులు కూడా ఉన్నాయి. పరిమితుల చుట్టూ ప్రాథమిక హక్కులు లేవు, ప్రాథమిక హక్కుల చుట్టూనే పరిమితులు ఉన్నాయి.
హక్కే ఇక్కడ ప్రాథమిక నియమం. పరిమితి అనేది కేవలం ఒక మినహాయింపు మాత్రమే. ప్రభుత్వం దీనిని ప్రదేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి సమర్థించుకోవాలి.
ఒక కమిషనర్ కొన్ని వందల మందిని అడ్డుకోవడానికి ఏకంగా డజను మెట్రో స్టేషన్లను మూసివేసినప్పుడు, ఆయన ఆ క్రమాన్ని తలకిందులు చేస్తున్నట్లే లెక్క.
ఆయన పరిమితిని ప్రాథమిక నియమంగా, హక్కును ఒక ఉపకారంగా భావిస్తున్నారని అర్థం.
ఒక ప్రజాస్వామ్యానికి కచ్చితంగా ‘కోపగృహం’ అవసరం. బాధితులు నేలపై పడుకుని రాజు కోసం వేచి ఉండే గది దానికి కావాలి. ఆ గదికి పౌరులు వెళ్లలేకపోతే దాన్ని నిర్మించడం అనవసరమని అయోధ్య అర్థం చేసుకుంది. కానీ, ఢిల్లీ ఆ గదిని ఉంచి, దానికి వెళ్లే దారికి అడ్డుగోడలు కడుతోంది.
కోపపడేందుకు కైకేయి దశరథుడి అనుమతి అడగలేదు. భారతీయ పౌరులు కూడా తమ కోపాన్ని వ్యక్తపరిచేందుకు, నిరసన తెలిపేందుకు పోలీస్ కమిషనర్ అనుమతి అడగాల్సిన అవసరం ఉండకూడదు.
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే రాశారు . తెలుగు అనువాదం కె సత్యరంజన్ చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
