2024 నుంచి 2026 వరకు కెన్యా, బంగ్లాదేశ్ నుంచి నేపాల్, మొరాకో, మడగాస్కర్, ఇండోనేషియా… తాజాగా అల్బేనియా, ఇటలీ, ఫ్రాన్స్ వరకు మనం ఎన్నో జెన్-జీ నిరసనలను చూశాం, చూస్తున్నాం.
సందర్భాలు వేరైనా అవినీతి, అసమానత, నిరుద్యోగం, రాజకీయ అణచివేత వంటి అంశాలు మాత్రం ఒకేలా ఉన్నాయి.
కెన్యాలో ఫైనాన్స్ బిల్‌ను ఉపసంహరించుకోవడం, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోటాలను సంస్కరించడం, నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేయడం, మొరాకోలో ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడం, మడగాస్కర్‌లో నీరు, విద్యుత్ కొరతను పరిష్కరించడం వంటి నిర్దిష్ట డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ ఉద్యమాలు నడిచాయి.
వీటిలో కొన్ని విధానపరమైన మార్పుల నుంచి ప్రభుత్వాలు పడిపోవడం వరకు నిజమైన విజయాన్నే సాధించాయి. అయినప్పటికీ, నిరసన వ్యక్తం చేయడానికి, ఆ తర్వాత వచ్చే రాజకీయ మార్పునకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందనేది నా అభిప్రాయం.
స్వల్పకాలంలో తాము దేనికోసం పోరాడుతున్నారో ప్రజలకు తెలుసు, కానీ సుదీర్ఘకాల రాజకీయ దృక్పథాన్ని నిర్మించడంలో వామపక్షాలు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.
ఫానన్ రచనలు మనకు గుర్తుచేసినట్లుగా, విముక్తి అనేది కేవలం అధికారంలో ఉన్నవారిని మార్చడం మాత్రమే కాదు, అది ఆధిపత్య నిర్మాణాలనే మార్చాలని కోరుకుంటుంది. కాబట్టి మనం నిరసన నుంచి విముక్తి వైపు ఎలా అడుగులు వేయాలి?
ఫానన్ తత్వశాస్త్రం – విముక్తిపై అన్వేషణ
నేను చాలా సమయం వెచ్చించి చదివిన పీటర్ హుడిస్ రాసిన ‘ఫ్రాంట్జ్ ఫానన్: ఫిలాసఫర్ ఆఫ్ ది బారికేడ్స్’ పుస్తకంలో దీనికి ఏమైనా సమాధానం దొరుకుతుందేమో చూద్దాం.
ఫానన్ కేవలం విప్లవాత్మక హింస, వలసవాద వ్యతిరేక పోరాటాలకే పరిమితమైన వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప తత్వవేత్త.
హెగెల్, మార్క్స్, సార్త్రే వంటి తత్వవేత్తలతో పాటు ఫినామినాలజీ(దృగ్విషయ శాస్త్రం) ద్వారా, ఫానన్ నిర్వచించిన పరాయీకరణ, అస్తిత్వం, మానవ స్వేచ్ఛ, వాస్తవంగా ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం అంటే ఏమిటి అనే ఆలోచనలను పీటర్ హుడిస్ అన్వేషించారు.
మతం, సంప్రదాయాలు రాజకీయ అధికారానికి సాధనాలుగా మారినప్పుడు ఏం జరుగుతుందనే దానిపై కూడా ఫానన్ తీవ్ర విమర్శలు చేశారు.
వలసవాద ఆధిపత్యం స్థానంలో, మతం లేదా జాతీయవాదం పేరుతో సమర్థించుకునే కొత్త అధికార రూపాలు వస్తాయేమోనని ఆయన తీవ్రంగా ఆందోళన చెందారు.
విప్లవం స్వేచ్ఛను ఇస్తానని వాగ్దానం చేసి, చివరికి మహిళల శరీరాలపై మతపరమైన నిబంధనలను రుద్దినప్పుడు అక్కడ ఒక పెద్ద వైరుధ్యం ఏర్పడుతుందని ఫానన్ స్పష్టం చేశారు.
ఫానన్ ఊహించిన విముక్తి కచ్చితంగా ఇది కాదు. విప్లవం అనేది మానవ స్వేచ్ఛకు కొత్త అవకాశాలను, ఒక నూతన మానవతావాదాన్ని ఆవిష్కరించాలంటారు ఫానన్.
నిరసనల నుంచి విముక్తి వైపు
కాబట్టి నిరసన నుంచి విముక్తి వైపు మనం ఎలా ముందుకు సాగాలి? ఫానన్ అభిప్రాయం ప్రకారం, ప్రజలు కేవలం మరొక బృందం అధికారంలోకి రావడానికి సహాయపడేవారిగా కాకుండా, విప్లవంలో క్రియాశీలక భాగస్వాములుగా మారాలి.
‘ది రెచ్డ్ ఆఫ్ ది ఎర్త్’ పుస్తకంలో, వలసవాదం ముగిసిన తర్వాత జాతీయ బూర్జువా వర్గం పగ్గాలు చేపట్టి, పాత దోపిడీ నిర్మాణాలనే అలాగే కొనసాగించడం గురించి ఫానన్ హెచ్చరించారు.
విప్లవం అనేది ప్రజలకు నిజమైన రాజకీయ అధికారాన్ని ఇవ్వాలి, సామాజిక, ఆర్థిక సంబంధాలను మార్చాలి, ప్రజలు తమ జీవితాలను తామే మలచుకునే పరిస్థితులను కల్పించాలి.
ఒక ప్రభుత్వం పడిపోయి దాని స్థానంలో అవే శక్తులతో కూడిన మరో ప్రభుత్వం వచ్చినంత మాత్రాన, రోడ్లపైకి వచ్చి పోరాడిన ప్రజల జీవితాల్లో నిజంగా ఏం మార్పులు సంభవిస్తాయి?
అనువాదం: కె. సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
