(ప్రభుత్వాలు, పోషకులుగా, సమగ్ర ప్రాధాన్యతలను, అంచనాలను నిర్దేశించే హక్కును కలిగి ఉన్నప్పటికీ, పరిశోధనలను రాజకీయం చేస్తూ సూక్ష్మస్థాయిలో నియంత్రించడానికి సైన్స్ విధానాన్ని ఒక నెపంగా ఉపయోగించకూడదు. మరోవైపు శాస్త్రవేత్తలు పరిశోధనా ప్రాధాన్యతలను, ఫలితాలను తీర్చిదిద్దడంలో పౌరులను భాగస్వాములను చేయడం ద్వారా మరింత విస్తృతమైన మద్దతును కూడగట్టుకోవాలి.)
వందలాది సంవత్సరాలుగా, సైన్స్ సామాజిక ఒప్పందంతో పనిచేస్తోంది. నిధులు, మౌలిక సదుపాయాలు, ప్రాతిపదిక మద్దతును సమాజం అందిస్తుండగా, సైన్స్ మానవాళి పరిస్థితిని మెరుగుపరిచే, పరిధులను విస్తరించే జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది.
పరిశోధనలపై పెట్టిన నిరంతర పెట్టుబడుల మూలంగా విజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలు సమాజానికి ఎన్నో సానుకూల ఫలితాలను అందించాయి.
నేడు, ఈ ఒప్పందం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ప్రభుత్వాలు పరిశోధనలపై పెట్టే పెట్టుబడుల నుంచి ఎక్కువ రాబడిని కోరుకుంటున్నాయి, కానీ సంస్థలపై ప్రజల నమ్మకం తగ్గుతోంది.
ఫలితంగా, సైన్స్ సమాజం కోసం మాత్రమే కాకుండా, సమాజంతో నిమిత్తం లేకుండా కొనసాగే ప్రక్రియగా మార్పు చెందే అవకాశం కనబడుతోంది. అందుకే ఈ దశలో పౌరులను కేవలం ప్రయోజనాలు పొందేవారిగా, పన్ను చెల్లింపుదారులుగానే కాకుండా, ఏ శాస్త్రీయ ప్రశ్నలను పరిష్కరించాలి, శాస్త్రీయ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అని నిర్ణయించడంలో భాగస్వాములుగా విజ్ఞాన శాస్త్ర పురోగతిలో చేర్చుకోవాలి.
సైన్స్ పోషకులు
కుతూహలంతో కూడిన పరిశోధనలు తరచుగా అనుకోని ఆవిష్కరణలకు దారితీస్తాయి. అవి కాలక్రమేణా సమాజాన్ని మారుస్తాయి. అయినప్పటికీ, ప్రధాన పోషకులుగా ఉన్న ప్రభుత్వాలు, పరిశోధనా నిధులు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించడంలో తమ హక్కును ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీనికి న్యాయమైన కారణాలు కూడా ఉన్నాయి.
వనరులు పరిమితంగా ఉన్నందున జాతీయ ప్రాధాన్యతలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ప్రభుత్వాల విధానపరమైన నిర్వహణ అతిగా జోక్యం చేసుకున్నప్పుడు పొరపాట్లు దొర్లడం సహజం.
నిధుల నిర్ణయాలు ప్రధానంగా స్వల్పకాలిక రాజకీయ ప్రాధాన్యతలు లేదా ఆర్థిక రాబడులతో ప్రభావితమైనప్పుడు, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, వాతావరణ పరిశోధనలు, ప్రాథమిక విజ్ఞాన శాస్త్రం వంటి పరిశోధనా రంగాలు దెబ్బతింటాయి.
అవును, సైన్స్ సమాజానికి సేవ చేయాలి, కానీ విస్తృతంగా ఆమోదించబడిన అంచనాలను సవాలు చేయడానికి, తక్షణ ప్రయోజనం కనిపించని విషయాలను అన్వేషించడానికి అవసరమైన మేధో స్వేచ్ఛ ఉన్నప్పుడే సైన్స్ మెరుగ్గా పనిచేస్తుంది.
ప్రభుత్వాలు సమగ్ర ప్రాధాన్యతలను నిర్ణయించవచ్చు, కానీ పరిశోధనలను నియంత్రించడానికి సైన్స్ విధానాన్ని సాకుగా ఉపయోగించకూడదు.
అలాగే సైన్స్‌ను సమాజం నుంచి వేరు చేయడం కూడా పరిష్కారం కాదు. బదులుగా, సమాజాన్ని పరిశోధనా ప్రక్రియలోకి తీసుకురావడం ద్వారా శాస్త్రవేత్తలు సైన్స్ కోసం మరింత విస్తృతమైన మద్దతును కూడగట్టుకోవాలి.
దీనిని సాధించడానికి, శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఎందుకు ముఖ్యమనే దానిపై సమాజాలు, పౌర సమాజం, పరిశ్రమలు, విద్య, ప్రభుత్వ సంస్థలకు బలమైన కథనాలను అందించాలి.
పౌర భాగస్వామ్యం
పరిశోధనలోకి పౌరులను భాగస్వామ్యం చేయడం అంటే శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రజాభిప్రాయంతో భర్తీ చేయడం కాదు.
మహమ్మారుల వ్యాప్తిని అధ్యయనం చేసే నిపుణుడికి సగటు పౌరుడి కంటే వ్యాధి సంక్రమణ గురించి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఒక వాతావరణ శాస్త్రవేత్తకు వాతావరణ మార్పుల ప్రక్రియలు తెలిసినంతగా ఒక రైతుకు తెలియకపోవచ్చు.
అయితే, దీనికి విరుద్ధంగా కూడా ఉండవచ్చు. మట్టి స్వభావం లేదా పంటల మార్పిడి శక్తి గురించి రైతు వద్ద ఒక ల్యాబ్‌లోని శాస్త్రవేత్తకు లేని పరిజ్ఞానం ఉండవచ్చు.
అటవీ ప్రాంతంలో నివసించే సమాజానికి మూలికలు, అడవులు, జీవవైవిధ్యం గురించి అధికారిక డేటాబేస్‌లలో లేని వివరణాత్మక జ్ఞానం ఉండవచ్చు.
శాస్త్రీయ జ్ఞానం, సమాజ జ్ఞానం వేర్వేరు – అవి పరస్పర పూరకంగా ఉండగలవు. భారత్ వంటి అత్యంత జీవ, సాంస్కృతిక వైవిధ్యం ఉన్న దేశానికి ఇవి రెండింటినీ మిళితం చేయడం ఒక పెద్ద సవాలు.
భారతదేశ భూభాగం చాలా విస్తృతమైనది, ప్రతి ప్రాంతాన్ని కేవలం శాస్త్రవేత్తలే స్వయంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.
సంప్రదాయ పరిశోధనలు సేకరించలేకపోయే పరిశీలనలను పౌరుల నెట్వర్క్ వివిధ ప్రాంతాల నుంచి అందించగలదు.
ఉదాహరణకు, ఒక పక్షుల పరిశీలకుడు వలస పక్షుల రికార్డును నమోదు చేయడం పర్యావరణ జ్ఞానానికి దోహదపడుతుంది. పౌర విజ్ఞాన శాస్త్రం ప్రజలకు, శాస్త్రీయ సంస్థలకు మధ్య ఉన్న సంబంధాన్ని మార్చగలదు.
సమాజ ఆధారిత సంరక్షణలో భారతదేశానికి ఉన్న సుదీర్ఘ సంప్రదాయం ఈ వాదనను బలపరుస్తుంది. రక్షిత వనాలు, సహజ అడవులు, సంప్రదాయ నీటి నిర్వహణ వ్యవస్థలు మొదలైన పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి, రక్షించడానికి స్థానిక ప్రజలు ఎంతటి అధునాతన మార్గాలను అభివృద్ధి చేశారో మనకు తెలియజేస్తాయి.
పరిశోధనలో పర్యావరణాన్ని గమనించడం అత్యంత ముఖ్యమైన అంశం, ఇందులో స్థానిక సమాజాలు చాలా ప్రావీణ్యం కలిగి ఉంటాయి. కాబట్టి కేవలం గ్రామానికి వచ్చి డేటా సేకరించి వెళ్లిపోవడం కాకుండా, పరిశోధకులు స్థానిక సమాజాలతో సుదీర్ఘ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి.
నమ్మకాన్ని పునర్నిర్మించడం
యూరోపియన్ యూనియన్ నిర్వహించిన ‘హోరైజన్ 2020’ ప్రోగ్రామ్‌లో, అనేక దేశాల పౌరులు పరిశోధనా ప్రాధాన్యతలను నిర్ణయించడంలో పాల్గొన్నారు. ఇక్కడ, నిపుణుల నాయకత్వంలోని అంచనాలు సాంకేతిక పురోగతికి ప్రాధాన్యత ఇస్తే, పౌరులు బలమైన సమాజాలు, ప్రజారోగ్యం, జీవవైవిధ్యం, విద్య, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
ఇటువంటి విధానం భారతదేశంలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. భూగర్భ జలాలు, పట్టణ కాలుష్యం, సుస్థిర వ్యవసాయం, తీరకోత, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన పరిశోధనా ప్రాధాన్యతలను శాస్త్రవేత్తలు, విధానకర్తలు, ప్రభావిత సమాజాల మధ్య చర్చల ద్వారా అభివృద్ధి చేయవచ్చు.
పౌరుల భాగస్వామ్యానికి మరొక బలమైన కారణం “నమ్మకం”. ప్రభుత్వాలు, సంస్థలపై ప్రజలకు నమ్మకం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు ఒక్కోసారి సామాన్య ప్రజల సమస్యలకు దూరంగా ఉన్న ఉన్నత వర్గాలుగా కనిపిస్తాయి.
అదే సమయంలో, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. దీనికి ప్రతిస్పందనగా మరింత సైన్స్‌ను వివరించడం మాత్రమే కాకుండా, ప్రజల భాగస్వామ్యం, భాగస్వామ్య భావన లేకపోవడమే అసలు సమస్య అని గ్రహించాలి.
ప్రజలు తమ స్వరం వినబడుతోందని నమ్మినప్పుడు ఆ ప్రక్రియకు మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువ. వారు ప్రతి నిర్ణయంతో ఏకీభవించకపోవచ్చు, కానీ నిర్ణయాలు పారదర్శకంగా ఉన్నాయని, తమ ఆందోళనలను తీవ్రంగా పరిగణించారని భావిస్తే నిర్ణయాలను అంగీకరిస్తారు.
వాతావరణ మార్పులు, వ్యాక్సినేషన్, జన్యు మార్పిడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీస్ వంటి విషయాల్లో ఇది చాలా ముఖ్యం.
శాస్త్రవేత్తల వినయం
ప్రస్తుతం, చాలా మంది పరిశోధకులకు ప్రయోగాలు డిజైన్ చేయడం, డేటాను విశ్లేషించడం, పేపర్లు ప్రచురించడం మాత్రమే నేర్పుతున్నారు కానీ, సమాజాలతో దీర్ఘకాలిక సంబంధాలను నిర్మించుకోవడం నేర్పడం లేదు. ఆ పరిస్థితి మారాలి. పరిశోధనా శిక్షణలో సామాజిక భాగస్వామ్యాన్ని అంతర్భాగం చేయాలి.
శాస్త్రవేత్తల నిధుల సంస్థలు కూడా పరిశోధకులు పౌరులతో కలిసి ఎలా పనిచేస్తారో వివరించడాన్ని ప్రోత్సహించాలి.
అయితే, ప్రతి ప్రయోగానికి పౌరుల భాగస్వామ్యం అవసరం లేదు. యాంత్రికంగా అందరినీ భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం కాదు.
సామాజిక ప్రాముఖ్యత కలిగిన పరిశోధనలకు ప్రజా భాగస్వామ్యం ప్రామాణికంగా మారాలి. ఏవైనా నూతన సాంకేతికతలను వేగంగా అమలు చేయాలా లేదా ఆచితూచి అమలు చేయాలా?
సాంకేతిక సౌకర్యం కోసం సమాజం ఎంత గోప్యతను త్యాగం చేయాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా పంపిణీ చేయబడాలి?
వాతావరణ మార్పుల ఖర్చులను ఎలా పంచుకోవాలి? ఇటువంటి ప్రశ్నలకు సమాజ భాగస్వామ్యం ద్వారా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది.
ఈ మార్పుకు శాస్త్రవేత్తల నుంచి కొంత వినయం కూడా అవసరం. శాస్త్రవేత్తలు వినడం నేర్చుకోవాలి, అసౌకర్యమైన ప్రశ్నలను వినడానికి సిద్ధంగా ఉండాలి.
తమ పనిలో ఉన్న అనిశ్చితులను అంగీకరించాలి. అదే సమయంలో, సంక్లిష్టమైన సామాజిక ప్రశ్నలకు సైన్స్ ఎల్లప్పుడూ సూటిగా సమాధానాలను ఇవ్వలేదని ప్రజలు కూడా గుర్తించాలి.
(రచయిత బిజు ధర్మపాలన్ గార్డెన్ సిటీ యూనివర్సిటీ, బెంగళూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ డీన్‌గా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, బెంగళూరులో అడ్జంక్ట్ ఫ్యాకల్టీ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.)
బిజు ధర్మపాలన్ రాసిన ఆంగ్ల వ్యాసాన్ని హిందూ దినపత్రిక సౌజన్యంతో అందిస్తున్నాము. తెలుగు అనువాదం: కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
