జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో(జేఎన్‌యూ) విద్యార్థుల ప్రాథమిక సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం కారణంగానే అక్టోబరు మూడో తేదీన ప్రారంభమైన విద్యార్థుల నిరాహార దీక్షలు నేటికీ కొనసాగుతున్నాయని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ అన్నారు.
న్యూఢిల్లీ: అక్టోబరు 19 నాటికి జేఎన్‌యూలో విద్యార్థులు ప్రారంభించిన నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకోవటంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు.
నిరాహార దీక్షలో కూర్చున్న విద్యార్థుల ఆరోగ్యం విషమిస్తుండటంతో ఆయన ప్రభుత్వాధినేతలకు ఈ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం ప్రతినిధులపై వేసిన రస్టికేషన్ వేటును ఉపసంహరించుకోవాలని, చీఫ్ ప్రోక్టర్స్ ఆఫీస్ మాన్యువల్‌లో చేసిన అభ్యంతరకరమైన మార్పులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో జాన్ బ్రిట్టాస్ కోరారు. ఈ లేఖను కూడా ఆయన విడుదల చేశారు.
ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడాలి
“జేఎన్‌యూ మాజీ విద్యార్థిగా ఈ పరిణామాలతో నేను తీవ్రంగా కలత చెందుతున్నాను. వాదప్రతివాదాల ద్వారా విద్యార్థులను వివేకవంతులుగా చేయాల్సిన విశ్వవిద్యాలయం వారిని శిక్షించడం సరికాదు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రజాస్వామ్య సంప్రదాయాలను కొనసాగించాలి. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం ఆలకించాలి. వారి గొంతు నులిమే ప్రయత్నం చేయకూడదు” అని బ్రిట్టాస్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలంగా సమస్యలు అపరిష్కృతంగా ఉండటం వల్లే విద్యార్థులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యార్థి సంఘంపై ఉక్కుపాదం
ఎన్నికైన విద్యార్థి సంఘం నాయకులను శాశ్వతంగా యూనివర్సిటీ నుంచి తొలగించడం ద్వారా ప్రభుత్వ చర్యల పట్ల తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్వపు విద్యార్థి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన విద్యార్థిని కూడా యూనివర్సిటీ నుంచి పూర్తిగా తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. “విద్యార్థి సంఘ ప్రతినిధులుగా ప్రజాతంత్ర పద్ధతుల్లో ఎన్నికైన విద్యార్థులను క్యాంపస్ దరిదాపుల్లోకి రాకూడదంటూ నిర్ణయించడం విద్యార్థి సంఘం పనితీరును తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా, విద్యార్థుల తరఫున సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకునే ఒక శక్తివంతమైన సాధనాన్ని యూనివర్సిటీ బలహీనపరుస్తోంది” అని జాన్ బ్రిట్టాస్ అన్నారు.
నిరసన కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న విద్యార్థులపై విపరీతమైన జరిమానాలు (అపరాధ సుంకాలు) విధించే అధికారాలను యాజమాన్యానికి కట్టబెడుతున్న చీఫ్ ప్రోక్టర్స్ ఆఫీస్ మాన్యువల్ అమలును తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అడ్డగోలు క్రమశిక్షణ చర్యలు తగవు
తాను విద్యార్థిగా ఉన్న కాలం నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. విశ్వవిద్యాలయం శాంతియుతమైన చర్చలకు, వాదోపవాదాలకు కేంద్రంగా, ప్రజాతంత్ర కార్యకలాపాలకు వేదికగా ఉండేదని ఆయన అన్నారు.
అడ్డగోలు క్రమశిక్షణ చర్యల కారణంగా విద్యార్థులు అర్థవంతమైన సమస్యలను కూడా యాజమాన్యం దృష్టికి తీసుకురావడానికి వెనకాడే ప్రమాదం ఉంటుందని, తద్వారా విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
లైంగిక వివక్ష, లైంగిక న్యాయం, సమాన అవకాశాలు, విద్యార్థులను ఎంపిక చేసే విధానం, విశ్వవిద్యాలయంలో మౌలిక బోధన, బోధనేతర సదుపాయాలు వంటి విషయాలపై దీర్ఘకాలంగా ప్రభుత్వం శీతకన్ను వేస్తోందని, దాంతో గత్యంతరం లేక విద్యార్థులు ఆందోళన మార్గం చేపట్టాల్సి వచ్చిందని లేఖలో ప్రస్తావించారు.
విజిటర్‌గా రాష్ట్రపతికి అధికారాలు
1966 నాటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చట్టాన్ని ప్రస్తావిస్తూ.. సామాజిక న్యాయం, లౌకికవాదం, ప్రజాతంత్ర జీవన విధానం విశ్వవిద్యాలయ నిర్వహణకు మౌలిక పునాది సూత్రాలుగా ఉండాలని నాటి పార్లమెంట్ ఆశించిన విషయాన్ని బ్రిటాస్ గుర్తు చేశారు.
ఈ చట్టం ద్వారానే రాష్ట్రపతిని విశ్వవిద్యాలయానికి విజిటర్‌గా నియమించారని తెలిపారు.
జేఎన్‌యూ చట్టంలోని సెక్షన్ 8 ద్వారా రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని విద్యార్థి సంఘం నాయకులపై విధించిన రస్టికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని, చీఫ్ ప్రోక్టర్స్ ఆఫీస్ మాన్యువల్‌లో చేసిన మార్పులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
