కాక్రోచ్ జనతా పార్టీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు నేహా బోరా, అభిజీత్ దీప్కేతో పాటు కనీసం 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
గంటల పాటు నిరీక్షణ తర్వాత 2026 అక్టోబరు 17న మధ్యాహ్నం అభిజీత్ దీప్కే తరఫు న్యాయవాదులకు ఊరట లభించింది.
అభిజీత్ దీప్కేకు బెయిల్ మంజూరైంది.
కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య చివరకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చింది. కోర్టు విధించిన షరతులను ఆయన తప్పక పాటించాలి.
నిరసనకు అనుమతి నిరాకరణ
మొదట నిరసన నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిరసనలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకున్నారు.
దాదాపు వారం రోజులుగా ఢిల్లీ పోలీసులు నిరసనలు జరగకుండా అడ్డుకోవడానికి పలు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఆ తర్వాత నిరసన కోసం అధికారికంగా కేటాయించిన జంతర్ మంతర్‌ను రద్దు చేసి సుదూర ప్రాంతాలను కేటాయించారు.
సుమారు 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. యువజన, విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులను, ఇతర నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
నిరసనకారులు చేరుకునే మార్గాలను నియంత్రించే ప్రయత్నంలో సుమారు 250 రైల్వే సర్వీసులను రద్దు చేశారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ చర్యలన్నింటి ద్వారా, ముందుగా ప్రకటించిన నిరసనలు జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు.
విలేకరుల సమావేశం
2026 అక్టోబరు 15న న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభిజీత్ దీప్కే, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, నటుడు ప్రకాశ్ రాజ్, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా తదితరులు పాల్గొని అక్టోబరు 16న తలపెట్టిన “లెహరాదో తిరంగా” కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా, దీప్కేను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
అభిజీత్ దీప్కే విడుదల తర్వాత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. జైహింద్, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం మన హక్కు, గతంలోనూ మన హక్కే, ఇప్పుడు మన హక్కే, భవిష్యత్తులోనూ మన హక్కుగానే ఉంటుందని ట్వీట్ చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. త్రివర్ణ పతాక ఆవిష్కరణ ర్యాలీ నిర్వహిస్తున్న మహిళల పట్ల పోలీసులు అమానుషమైన, అభ్యంతరకరమైన రీతిలో దాడిచేసి నిర్బంధించారని, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన జరిగిందని ట్వీట్ చేశారు.
అభిజీత్ దీప్కే తల్లి మాట్లాడుతూ.. 10 రోజుల క్రితమే దీప్కే నాయనమ్మ చనిపోయి విచారంలో ఉన్నామని, దీప్కే నిర్బంధం చాలా బాధ కలిగించిందని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని, చివరకు అతని విడుదల సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
దీప్కే విడుదల సంతోషాన్ని కలిగించిందని, సారవ్, ఆశుతోష్లను కూడా వెంటనే విడుదల చేయాలని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ ట్వీట్ చేశారు.
అమెరికా చట్టసభ సభ్యుల లేఖ
నిరసనలను అణచివేయడానికి భారత పోలీసులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమెరికా చట్టసభ సభ్యులు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోకు లేఖ రాశారు.
ఈ నిరసనల ముఖ్య ఉద్దేశం కేవలం జాతీయ జెండాను ఎగురవేయడమే కాదని, దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల ఓటు హక్కును తొలగించడం, దీనికి ప్రధాన కారణమైన జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్లు ఉన్నాయని వారు గుర్తు చేశారు.
ది వైర్ ఇంగ్లీష్‌లో ప్రచురితమైన ఈ వార్త తెలుగు అనువాదం: డి వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
