సెప్టెంబరులో జర్మనీలోని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పన్నులు, పెన్షన్లు, ఆరోగ్య వ్యవస్థ లాంటి ప్రజా సంక్షేమానికి చేసే ఖర్చుల్లో కోత పెట్టాలని ప్రభుత్వం సంస్కరణలను ప్రతిపాదించింది.
అసలే పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు జర్మనీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉద్యోగాల కోతలు, వలసలపై రాజకీయ చర్చలు, మితవాద పార్టీల ఎదుగుదల కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయి.
ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమ బడ్జెట్లో కోతలు పెట్టాలన్న ప్రతిపాదన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
జర్మనీ ఎన్నికల విధానం
జర్మనీలో 16 రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంలో కొన్ని జిల్లాలున్నాయి. వీటిని జిల్లా మండళ్లు అంటారు. మన దేశంలోలా స్థానిక ఎన్నికలు (మునిసిపల్, పంచాయతీ) విడిగా జరగవు.
జిల్లా మండళ్ల ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా కూటమికి మెజారిటీ స్థానాలొస్తే ఆ పార్టీ లేదా కూటమి అభ్యర్థి మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ లేదా కార్పొరేషన్ మేయర్ అవుతారు.
జర్మన్ పార్లమెంట్ (బుండెస్టాగ్) ఎన్నికలు 2025 సెప్టెంబరులో జరగాల్సి ఉండగా అప్పటి అధికార కూటమి ప్రభుత్వం పతనమైన ఫలితంగా 2025 మార్చిలోనే ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో కూడా ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. దాంతో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయూ), సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్పీడీ)ల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చిన సీట్లు: సీడీయూ-208, ఎస్పీడీ-120, ఏఎఫ్‌డీ-120, గ్రీన్స్-85, వామపక్ష పార్టీ డై లింకే-64, స్వతంత్ర సభ్యులు-3.
ఈ ఎన్నికల్లో ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ ఏఎఫ్‌డీ తరఫున ఎలాన్ మస్క్ ప్రత్యక్షంగా పాల్గొని ప్రచారం చేశారు. భారీ ఆర్థిక సహాయం కూడా అందించారని వార్తలు వచ్చాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిణామం.
బ్రిటన్‌లోని ఇలాంటి పార్టీ ‘రిఫార్మ్ యూకే’కి కూడా ఎలాన్ మస్క్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ పార్టీ 2025లో లండన్‌లో భారీ వలస వ్యతిరేక ర్యాలీ నిర్వహించింది.
జర్మనీతో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలన్నింటిలో సంక్షోభం ముదురుతోంది. సంక్షోభం నుంచి బయటపడటానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపడం, ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్లో కోతలు విధించడం, మిలిటరీ బడ్జెట్ పెంచడం మామూలైపోయింది.
ఇందులో భాగంగా జర్మనీ ప్రభుత్వం పన్నులు, పెన్షన్లు, ఆరోగ్య వ్యవస్థ లాంటి ప్రజా సంక్షేమానికి చేసే ఖర్చుల్లో కోత పెట్టాలని ప్రతిపాదించింది.
ఇది ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి ఆజ్యం పోసింది. ఫలితంగా 2026లో జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కూటమి తన స్థానాలను గణనీయంగా కోల్పోయింది.
శాసనసభ ఎన్నికల వివరాలు
బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలో 2026 మార్చి 8న ఎన్నికలు జరిగాయి. మొత్తం స్థానాలు 157.
గ్రీన్స్ 30.2% ఓట్లతో 56 సీట్లు, సీడీయూ 29.7% ఓట్లతో 56 సీట్లు, ఏఎఫ్‌డీ 18.8% ఓట్లతో 35 సీట్లు, ఎస్పీడీ 5.5% ఓట్లతో 10 సీట్లు గెలుచుకున్నాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
రైన్లాండ్-పాలటినేట్ రాష్ట్రంలో 2026 మార్చి 22న ఎన్నికలు జరిగాయి. మొత్తం స్థానాలు 105. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ 31% ఓట్లు, 39 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ 25.9% ఓట్లతో 32 స్థానాలు, ఏఎఫ్‌డీ 19.5% ఓట్లతో 24 స్థానాలు, గ్రీన్ పార్టీ 7.9% ఓట్లతో 10 స్థానాలు గెలుచుకున్నాయి.
సాక్సనీ-ఆన్హాల్ట్ రాష్ట్రానికి 2026 సెప్టెంబరు 6న, బెర్లిన్, మెక్లెన్బర్గ్-వోర్పోమెర్న్ రాష్ట్రాలకు 2026 సెప్టెంబరు 20న ఎన్నికలు జరిగాయి.
మెక్లెన్బర్గ్-వోర్పోమెర్న్ రాష్ట్రంలో మొత్తం 71 స్థానాలున్నాయి. ఏఎఫ్‌డీ 38.2% ఓట్లతో 32 స్థానాలు గెలిచి మొదటి స్థానంలో నిలిచింది.
స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 8 స్థానాలు తక్కువయ్యాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ 35.5% ఓట్లు, 29 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ 17.2% ఓట్లు, 15 స్థానాలతో మూడో స్థానంలో నిలవగా- వామపక్ష పార్టీ డై లింకే 6.5% ఓట్లతో 5 సీట్లు, గ్రీన్ పార్టీ 5.7% ఓట్లతో 5 స్థానాలు గెలుచుకున్నాయి.
సాక్సనీ-ఆన్హాల్ట్ రాష్ట్ర ఎన్నికల్లో ఏఎఫ్‌డీ 43.8% ఓట్లతో 83 స్థానాల అసెంబ్లీలో 39 స్థానాలు పొందింది. సంపూర్ణ మెజారిటీకి కేవలం మూడు స్థానాలు తక్కువయ్యాయి.
క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ 17.2% ఓట్లు, 15 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, వామపక్ష పార్టీ డై లింకే 8.6% ఓట్లతో 8 సీట్లు, గ్రీన్ పార్టీ 8.9% ఓట్లతో 8 స్థానాలు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ 9.3% ఓట్లతో 8 స్థానాలు గెలుచుకున్నాయి.
బెర్లిన్ రాష్ట్రంలో మొత్తం 153 స్థానాలున్నాయి. వామపక్ష పార్టీ ‘డై లింకే’ 25.7% ఓట్లు, 45 సీట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ 18.8% ఓట్లు, 33 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా- ఏఎఫ్‌డీ 16.3% ఓట్లతో 29, గ్రీన్ పార్టీ 14.3% ఓట్లతో 25 స్థానాలు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ 12.1% ఓట్లతో 21 స్థానాలు గెలుచుకున్నాయి.
వామపక్ష పార్టీ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు 32 స్థానాలు తక్కువయ్యాయి. దీంతో ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది.
బెర్లిన్ రాష్ట్ర శాసనసభతో పాటు 2026 సెప్టెంబరు 20న 12 జిల్లా మండళ్లకు కూడా ఎన్నికలు జరిగాయి. ప్రతి జిల్లా మండలిలో 55 స్థానాలు ఉంటాయి.
మొత్తం 660 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ‘డై లింకే’ ఆరు జిల్లాల్లో, సీడీయూ నాలుగు జిల్లాల్లో, గ్రీన్స్ ఒక జిల్లాలో, ఏఎఫ్‌డీ ఒక జిల్లాలో అత్యధిక ఓట్లు సాధించాయి. ఎస్పీడీ ఏ జిల్లాలోనూ మొదటి స్థానంలో నిలవలేదు.
సంస్కరణల వివాదం
ప్రస్తుత ప్రభుత్వం 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత జర్మనీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ముసుగులో ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ, పెన్షన్ వ్యవస్థను దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో పలు సంస్కరణలను ముందుకు తెచ్చింది.
45 సంవత్సరాల పాటు పెన్షన్ విరాళాలు చెల్లించిన ఉద్యోగులు 63 ఏళ్ల వయసులో కోతలు లేకుండా పూర్తి పెన్షన్ పొందే అవకాశాన్ని రద్దు చేసే లేదా మార్చే ప్రతిపాదన వివాదానికి దారితీసింది.
ముఖ్యంగా తక్కువ ఆదాయాలు, తక్కువ పొదుపు కలిగిన తూర్పు జర్మనీ ప్రజలపై ఈ మార్పులు ఎక్కువ ప్రభావం చూపవచ్చని విమర్శలు వచ్చాయి.
ప్రభుత్వ కూటమిలో భాగస్వామి అయిన ఎస్పీడీకి చెందిన కొందరు నాయకులు కూడా ఈ ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని కోరారు.
నిరుద్యోగులకు ఆర్థిక సహాయం
జర్మనీలో ఉద్యోగం కోల్పోయిన వారికి, తక్కువ ఆదాయం కలిగిన వారికి అందించే ప్రాథమిక ఆదాయ సహాయ వ్యవస్థలో ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించింది.
ముఖ్యంగా ‘బుర్గర్గెల్డ్’ పథకానికి సంబంధించిన ఖర్చులను తగ్గించడం, ఉద్యోగ అన్వేషణకు సంబంధించిన బాధ్యతలు, నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది.
తగిన ఉద్యోగాలు అందుబాటులో లేనప్పుడు ఆర్థిక సహాయాన్ని తగ్గించడం వల్ల నిరుద్యోగులు, పేద కుటుంబాలు మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.
అనారోగ్య సెలవులు, ఆరోగ్య వ్యవస్థ
అనారోగ్య సెలవులకు సంబంధించిన నిబంధనలు, ఆరోగ్య బీమా ఖర్చులు, దీర్ఘకాలిక సంరక్షణ వ్యయాలను నియంత్రించేందుకు ప్రభుత్వం మార్పులపై చర్చించింది. అనారోగ్య సెలవులపై కఠిన వైఖరి కార్మికుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని విమర్శలు వచ్చాయి.
సామాజిక వ్యయాల పునర్వ్యవస్థీకరణ
పెన్షన్లు, నిరుద్యోగ భృతి, గృహవసతి సహాయం, వికలాంగుల సంక్షేమం, ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రభుత్వ ఖర్చులను సమీక్షించడం కూడా వివాదానికి కారణమైంది.
కొన్ని ఖర్చులు తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉద్యోగ అన్వేషకుల ప్రాథమిక సహాయానికి కేటాయింపులు తగ్గాయి.
2026 బడ్జెట్ ముసాయిదాలో 51.02 బిలియన్ యూరోలు ప్రతిపాదించగా, 2025లో అది 51.96 బిలియన్ యూరోలుగా ఉంది.
బుర్గర్గెల్డ్ చెల్లింపుల కోసం కేటాయింపులను 29.6 బిలియన్ యూరోల నుంచి 28.05 బిలియన్ యూరోలకు తగ్గించాలని ప్రతిపాదించారు.
ధరలు – పారిశ్రామిక ఉద్యోగాలు
నిత్యావసర సరుకులు, ఇంధనం, గృహవసతి తదితర ఖర్చులు పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల కనిపించింది. అయినప్పటికీ ఆ ప్రయోజనం తమ కుటుంబాల జీవితాల్లో కనిపించడం లేదని భావించిన ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు.
ప్రపంచంలో ప్రముఖ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థల్లో జర్మనీ ఒకటి. ఆటోమొబైల్, యంత్ర పరికరాలు, రసాయన పరిశ్రమలు తదితర రంగాల్లో పోటీ, ఉత్పత్తి వ్యయాలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
ఉద్యోగాలు కోల్పోతామనే భయం, ఆదాయం పెరగకపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి తదితర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.
సంప్రదాయ పార్టీలపై తగ్గిన విశ్వాసం
ప్రభుత్వ కూటమిలోని సీడీయూ, ఎస్పీడీ రెండూ కొన్ని ప్రాంతాల్లో తమ బలాన్ని కోల్పోయాయి. ఇది కేవలం ఒక పార్టీపై వ్యతిరేకత మాత్రమే కాకుండా, సంప్రదాయ రాజకీయ పార్టీలు ప్రజల ఆర్థిక సమస్యలకు తగిన పరిష్కారాలు అందించలేకపోతున్నాయనే భావన ప్రజల్లో నెలకొంది.
అదే సమయంలో ఏఎఫ్‌డీ, వామపక్ష పార్టీ డై లింకే కూడా కొన్ని ప్రాంతాల్లో బలాన్ని పెంచుకున్నాయి.
ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి: మొదటిది, ప్రభుత్వ విధానాల వల్ల పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఆరోగ్య సేవలు తదితర అంశాల్లో ప్రజలకు నష్టం కలుగుతుందనే భయం.
రెండోది, దేశ ఆర్థిక వృద్ధి గురించి ప్రభుత్వం ఏమి చెప్పినా, కుటుంబాల ఆదాయాలు, ఉద్యోగ భద్రత, గృహవసతి ఖర్చుల్లో మెరుగుదల లేకపోవడం.
మూడోది, అధికార పార్టీలపై అసంతృప్తి పెరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడం.
అయితే ఏఎఫ్‌డీ ఎదుగుదలకు సంక్షేమ పథకాల్లో కోతతో పాటు వలసలు, జాతీయ గుర్తింపు, ఇంధన విధానం తదితర అంశాలు కూడా కారణమయ్యాయి.
భారత్‌కు పాఠాలు
భారత పరిస్థితులు జర్మనీ పరిస్థితులకు భిన్నమైనప్పటికీ, అనేక అంశాలు మన దేశానికి కూడా వర్తిస్తాయి. ప్రధానంగా ప్రభుత్వ విధానాలు మొత్తం ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికా? లేక ఎంపిక చేసిన కొద్దిమంది కార్పొరేట్ల ప్రయోజనానికా? అన్నది చూడాలి.
రెండు దేశాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో మెజారిటీ ప్రజల జీవన పరిస్థితులు దిగజారుతున్నాయి.
ఉద్యోగ కల్పన, కనీస వేతనాలు, పెన్షన్లు, ఆరోగ్య సేవలు, ప్రజా రవాణా, ఆహార భద్రత తదితర అంశాలను ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా అంచనా వేయాలి.
సంక్షేమ పథకాలపై ఖర్చును తగ్గిస్తే అసంఘటిత రంగ కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
బడ్జెట్లో ఒక శాఖకు కేటాయింపులు పెరిగాయా? తగ్గాయా? అనే అంశంతో పాటు- ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాస్తవంగా ప్రజల జీవన ప్రమాణాలు, ప్రయోజనం పెరిగాయా లేదా అన్నది ప్రధానంగా చూడాలి.
దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలతో పాటు ఉపాధి నాణ్యత, వేతనాల పెరుగుదల, సామాజిక అసమానతలు, ప్రజా సేవల అందుబాటు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ప్రస్తుత జర్మన్ ప్రభుత్వం ఆ విధంగా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో దాన్ని మితవాద పార్టీ తన ఎన్నికల ప్రయోజనానికి వినియోగించుకుంది.
భారత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే జర్మనీ ఎన్నికల నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

