పాలస్తీనాలో ఇజ్రాయెల్ మారణకాండ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు పుతిన్లను విచారిస్తామని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) ప్రకటించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
సభ్యులు కాని దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని అంతర్జాతీయ కోర్టును అమెరికా యంత్రాంగం కోరింది.
పారిస్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును(ఐసీసీ) రద్దు చేస్తామని బెదిరిస్తూ, ట్రంప్ యంత్రాంగం ఐసీసీపై ఆంక్షలు ప్రకటించింది. ఈ వార్తను మాథ్యూ డాల్టన్, వెరా బెర్గెన్గ్రున్, లారెన్స్ నార్మన్ రాశారు.
ఐసీసీని అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి వేరు చేయడం, డాలర్లలో లావాదేవీలు నిర్వహించకుండా నిషేధించి ఐసీసీని నిర్వీర్యం చేయడం ఈ ఆంక్షల లక్ష్యం.
ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థల డాలర్ వ్యాపారాన్ని ఇతర ప్రధాన కరెన్సీల లావాదేవీల నుంచి వేరు చేయడం కష్టం కాబట్టి, పాశ్చాత్య బ్యాంకులు సాధారణంగా అటువంటి సంస్థలతో వ్యవహరించడానికి నిరాకరిస్తాయి.
అమెరికా హెచ్చరికలు
“ఐసీసీ తన బెదిరింపులను ఆపాలి, లేదా మేమే ఐసీసీని అంతం చేస్తాము” అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక వీడియోలో స్పష్టం చేశారు.
వాషింగ్టన్ ఎప్పుడూ ఐసీసీలో చేరనప్పటికీ, అమెరికా పౌరులను విచారిస్తామని బెదిరించడం ద్వారా ఈ కోర్టు అమెరికా సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
ఈ ఆంక్షల అమలుకు 2027 ఏప్రిల్ 7 వరకు గడువు ఉంది. ఈ గడువు వల్ల అమెరికా, ఐసీసీ సభ్య దేశాల మధ్య చర్చలకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
అమెరికా ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి చర్చలు ప్రారంభమైనట్లు సీనియర్ యూరోపియన్ అధికారి ఒకరు వెల్లడించారు.
కోర్టు అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకోదని హామీ ఇవ్వాలని అమెరికా అధికారులు కోరుతున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్, రష్యా వంటి సభ్యులు కాని దేశాల పౌరులను తాను విచారించగలననే కోర్టు వైఖరిని కూడా వారు తీవ్రంగా ఆక్షేపించారు.
రోమ్ రాజ్యాంగ సవరణపై చర్చలు
ఈ గ్రేస్ పీరియడ్ “చాలా కీలకమైనది, రాబోయే నెలల్లో చర్చలకు మనకు తగిన సమయం ఉంటుంది” అని డచ్ ప్రధాని రాబ్ జెటెన్ అన్నారు.
అయితే, కోర్టు అధికార పరిధిని నియంత్రించాలంటే సభ్య దేశాలు ఐసీసీ వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.
సభ్య దేశాల భూభాగంలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేస్తే సభ్యులు కాని దేశాల పౌరులను కూడా విచారించడానికి ఈ రాజ్యాంగం కోర్టుకు అనుమతిస్తుంది.
ఈ నిబంధనను అంతర్జాతీయ క్రిమినల్ చట్టం ప్రాథమిక సూత్రంగా కోర్టు మద్దతుదారులు భావిస్తున్నారు.
కోర్టులో సభ్య దేశంగా పరిగణించే పాలస్తీనా భూభాగంలో జరిగిన యుద్ధ నేరాల ఆరోపణలపై నెతన్యాహును, ఉక్రెయిన్లో జరిగిన నేరాల ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను విచారించడానికి ఐసీసీ ఈ అధికారాలను ఉపయోగించుకుంది.
ఆఫ్ఘనిస్తాన్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) అధికారులు, అమెరికా సైన్యం చేసిన నేరాల ఆరోపణలను దర్యాప్తు చేయడానికి కూడా ఇది కోర్టుకు అవకాశం కల్పించింది.
వెనకడుగు వేయబోమన్న ఐసీసీ
అమెరికా ఆంక్షలకు తాము వెనకడుగు వేయబోమని ఐసీసీ స్పష్టం చేసింది. “తీవ్రమైన నేరాల బారిన పడిన, లెక్కలేనంత మంది బాధితుల కోసం, చట్టం, సాక్ష్యాల ఆధారంగా మాత్రమే పని చేస్తూ, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా కోర్టు తన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూనే ఉంటుంది” అని ఐసీసీ అధ్యక్షురాలు టొమోకో అకానీ స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ఎక్కువ జనాభా కలిగిన దేశాలైన అమెరికా, చైనా, భారతదేశం, రష్యాలు ఐసీసీలో సభ్యులుగా లేనప్పటికీ, యూరోపియన్ ప్రభుత్వాలు, మానవ హక్కుల సంఘాలు అంతర్జాతీయ చట్టాన్ని అమలు చేయడానికి కోర్టును ఒక ముఖ్యమైన సంస్థగా భావిస్తున్నాయి.
న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన ఈ వార్త తెలుగు అనువాదం: బీ గంగాధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
