ప్రపంచంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ భూమి ఉంది. మానవాళికి అవసరమైన సరుకులు, సేవలను తయారు చేయగల సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అపారమైన సంపద, సహజ వనరులు, మానవ వనరులు, శాస్త్రీయ అభివృద్ధి కూడా ఉన్నాయి. అయినప్పటికీ కోట్లాది మంది ప్రజలు ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, సరైన వైద్యం లేకపోవడం, నివాసం లేమి వంటి సమస్యలతో మగ్గుతున్నారు.
ఈ నేపధ్యంలో 1992 డిసెంబర్ 22న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం 47/196 ద్వారా అక్టోబర్ 17ను అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది.
కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికం కాదు. ఒక కుటుంబానికి పోషకాహారం, సురక్షితమైన నివాసం, నాణ్యమైన విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్తు, గౌరవప్రదమైన ఉపాధి అందుబాటులో లేకపోవడం కూడా పేదరికమే. పేదరిక నిర్మూలనను మానవ హక్కులు, మానవ గౌరవం, శాంతి, సామాజిక న్యాయం నుంచి వేరు చేసి చూడలేమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఈ దినోత్సవం ఆవిర్భావం:
1987 అక్టోబర్ 17న ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ట్రోకాడెరో ప్రాంతంలో పేదరికం, ఆకలి, హింసతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ప్రజలు సమావేశమయ్యారు. పేదరికం మానవ హక్కుల ఉల్లంఘనతో ముడిపడి ఉందని వారు ప్రపంచానికి చాటిచెప్పారు. 1992 డిసెంబర్ 22న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం 47/196 ద్వారా అక్టోబర్ 17ను అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది. 1993 నుంచి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు.
2026 సంవత్సర ప్రత్యేక దృష్టి- (“Safe Homes for All”) అందరికీ సురక్షితమైన గృహం కల్పించడం. 2026–2028 ఇతివృత్తం (“United for Peace and Human Rights”) శాంతి, మానవ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగడం. సురక్షితమైన ఇల్లు లేకపోతే ఆరోగ్యం, విద్య, ఉపాధి, సామాజిక భాగస్వామ్యం వంటి ఇతర హక్కులు లేనట్లే.
ప్రపంచ పేదరికం- ఐక్యరాజ్యసమితి తాజా సమాచారం:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) 2026 గ్లోబల్ బహుముఖ పేదరిక సూచీ (MPI) ప్రకారం, ప్రపంచంలోని 108 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 6.3 బిలియన్ల జనాభాలో 1.2 బిలియన్ల మంది అంటే 18.9 శాతం మంది బహుముఖ పేదరికంలో జీవిస్తున్నారు. వారిలో సగానికి పైగా పిల్లలే. పేదరికంలో ఉన్నవారిలో 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
పేదరికాన్ని UNO రెండు విధాలుగా వర్గీక రిస్తుంది. 1)తీవ్ర ఆదాయ పేదరికం: రోజుకు 3 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ కొనుగోలు శక్తితో జీవించడం. అంటే భారత దేశంలో సుమారు 280 రూపాయలు. ఇది ప్రపంచ బ్యాంకు 2021 కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ఆధారంగా నిర్వచించిన అంతర్జాతీయ ప్రమాణం. ఈ కొలమానం పూర్తిగా అర్ధం లేనిది. కనీస నిత్యావసర సరుకుల ధరలతో పోల్చినప్పుడు ఇది ఎందుకు పనికి రాదు.
2)బహుముఖ పేదరికం (MPI): ఆదాయంతో పాటు పోషకాహారం, పిల్లల మరణాలు, విద్య, పాఠశాల హాజరు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్తు, గృహవసతి, వంట ఇంధనం, ఆస్తుల వంటి పది సూచికల ఆధారంగా లెక్కించడం.
బహుముఖ పేదరికం అత్యధికంగా ఉన్న పది దేశాలు:

UNDP 2024 నివేదిక ప్రకారం, ఆ సంవత్సరపు MPIలో పేదలుగా గుర్తించిన 1,100 మిలియన్ల మందిలో 455 మిలియన్ల మంది హింసాత్మక సంఘర్షణలు ప్రభావితం చేస్తున్న దేశాల్లో నివసించారు. దీర్ఘకాలిక యుద్ధాలు అభివృద్ధిని వెనక్కి నెడతాయని ఇది తెలియ జేస్తున్నది. యుధ్ధం ఎక్కడ ఏ పేరుతో జరిగిన అది మానవాళి వినాశనమే. అయితే మిగిలిన 645 మిలియన్ల మంది సంగతి ఏమిటి? వీరు బహుముఖ పేదరికంలో ఎందుకు ఉన్నారు? కొద్ది మంది శత కోటీశ్వరుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు అనుసరించే విధానాలే ఇందుకు కారణం.
దీన్ని బట్టి పేదరిక నిర్మూలనకు ఆదాయం పెంచడం తో పాటు శాంతి, ప్రజా సేవలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, మహిళలకు అవకాశాలు, పోషకాహారం, విద్య, నాణ్యమైన ఉపాధి, ఆరోగ్య వ్యవస్థలను కలిపి అభివృద్ధి చేసినప్పుడే పేదరిక నిర్మూలన లక్ష్యం సాధించడం సాధ్యం అవుతుంది తప్ప తీర్మానాలు, ప్రచారాలతో కాదు.
బహుముఖ పేదరికం తక్కువగా ఉన్న పది దేశాలు:

ఈ దేశాల్లో పేదరికం తక్కువగా నమోదవడానికి ఆర్థిక అవకాశాలు, విద్య,ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలు, సామాజిక రక్షణ వంటి అంశాలు దోహదపడవచ్చు. అయితే ఈ పట్టిక ఒక్కటే ఏ దేశంలోనైనా ఆదాయ అసమానతలు లేవని, నిరాశ్రయులు లేరని లేదా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు సమానంగా ఉన్నాయని నిరూపించదు.
పేదరికాన్ని గణనీయంగా తగ్గించిన దేశాలు — వాటి అనుభవాలు:
ఏ దేశమూ పేదరికాన్ని అన్ని రూపాల్లో పూర్తిగా నిర్మూలించిందని చెప్పడం కష్టం. అయితే అనేక దేశాలు దీర్ఘకాలిక విధానాల ద్వారా పేదరికాన్ని గణనీయంగా తగ్గించాయి. వాటి అనుభవాలు భారతదేశంతో సహా ఇతర దేశాలకు ఉపయోగ పడతాయి.
చైనా-గ్రామీణ అభివృద్ధి, ఉపాధి:
చైనా పేదరిక నిర్మూలనలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రాంతాలకు రహదారులు,విద్యుత్తు,నీటి సదుపాయాలు, పారిశ్రామిక ఉపాధి, వృత్తి శిక్షణ, పేద కుటుంబాలను గుర్తించి లక్ష్యిత సహాయం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, గత నాలుగు దశాబ్దాల్లో వందల మిలియన్ల మంది తీవ్ర ఆదాయ పేదరికం నుంచి బయటపడ్డారు. గ్రామీణ అభివృద్ధిని ఉపాధి, పరిశ్రమల విస్తరణతో అనుసంధానించాలని చైనా అనుభవం తెలియ చేస్తున్నది.
వియత్నాం-వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామికీకరణ:
వ్యవసాయ రంగంలో సంస్కరణలు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు, ఎగుమతి ఆధారిత పరిశ్రమలు, విద్యలో పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో భాగస్వామ్యం ద్వారా వియత్నాం పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది. చిన్న రైతులకు ఉత్పత్తిపై ప్రోత్సాహం, పరిశ్రమల్లో ఉద్యోగాలు, నైపుణ్య అభివృద్ధి కలిసి పనిచేయాలని వియత్నాం అనుభవం తెలియ చేస్తున్నది.
కోస్టారికా-ప్రజారోగ్యం, విద్య:
ప్రజారోగ్య సేవలు, విద్య, సామాజిక భద్రతకు దీర్ఘకాలిక ప్రాధాన్యం ఇవ్వడం కోస్టారికా అభివృద్ధి నమూనాలో ముఖ్యమైన అంశాలు. ఈ సేవలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తోడ్పడ్డాయి. ఆర్థిక వృద్ధి ఫలితాలు ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత రూపంలో ప్రజలకు చేరితే పేదరికం తగ్గించవచ్చని కోస్టారికా అనుభవం తెలియ చేస్తున్నది.
నేపాల్-బహుముఖ పేదరికం తగ్గింపు:
UNDP 2024 నివేదికలో నేపాల్, అనేక కాలవ్యవధుల్లో బహుముఖ పేదరిక సూచీ, పేదరిక తీవ్రతను గణనీయంగా తగ్గించిన దేశాల్లో ఒకటిగా గుర్తించింది. విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, విద్యుత్తు వంటి ప్రాథమిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ మార్పులో భాగం. ఆదాయ పెరుగుదలతో పాటు కుటుంబాలకు ప్రాథమిక సేవలు చేరేలా చేయాలని నేపాల్ అనుభవం తెలియ చేస్తున్నది.
UNDP 2026 నివేదిక ప్రకారం, అధ్యయనం చేసిన 89 దేశాల్లో 33 దేశాలు 15 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో తమ బహుముఖ పేదరిక సూచీ విలువను సగానికి తగ్గించ గలిగాయి. అంటే సరైన విధానాలు, నిరంతర పెట్టుబడులు ఉంటే పేదరికం తగ్గింపు సాధ్యమే అని ఈ అనుభవాలు రుజువు చేస్తున్నాయి.
భారతదేశం పరిస్థితి:
భారతదేశం గత దశాబ్దాల్లో పేదరికాన్ని కొంత తగ్గించినప్పటికీ పూర్తిగా నిర్మూలించలేదు. ప్రపంచ బ్యాంకు 2025 అంచనా ప్రకారం, రోజుకు 3 డాలర్ల అంతర్జాతీయ తీవ్ర పేదరిక ప్రమాణం కింద భారతదేశంలో పేదరికం 2022–23లో 2.3%కు తగ్గింది. ప్రపంచ బ్యాంకు 2026 భారతదేశ అభివృద్ధి నివేదికలో, 2023–24కు ఈ రేటు 2.6%గా అంచనా వేసింది. ఈ గణాంకాలు వేర్వేరు సర్వే సంవత్సరాలు, తాజా డేటా, అంచనా పద్ధతులకు సంబంధించినవి. వాటిని నేరుగా ఒకే సంవత్సరపు సంఖ్యలుగా చూడకూడదు.
2023–24లో రోజుకు 4.20 డాలర్ల దిగువ ఆదాయ ప్రమాణం ప్రకారం సుమారు 16.1% మంది పేదరికంలో ఉన్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అందువల్ల తీవ్ర పేదరికం తగ్గినప్పటికీ, తక్కువ ఆదాయంతో జీవిస్తున్న కుటుంబాల సంఖ్య గణనీయంగా ఉంది. వ్యవసాయ కార్మికులు, చిన్న రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు ప్రత్యేకంగా ఈ కోవలోకి వస్తారు.
నిరుద్యోగం, తక్కువ వేతనాలు, అస్థిర ఉపాధి, ఉద్యోగ భద్రత లేకపోవడం పేదరికం నుంచి బయటపడక పోవటానికి కారణాలు.
పోషకాహార లోపం, ప్రభుత్వ వైద్య సేవల లభ్యత, విద్యా నాణ్యత, సరసమైన గృహవసతి కూడా ముఖ్యమైన సమస్యలు. ఉచిత లేదా సబ్సిడీ ఆహార పంపిణీ పేద కుటుంబాల వినియోగాన్ని, ఆహార భద్రతను మెరుగుపరచడంలో కొంతమేర సహాయపడింది. గ్రామీణ ఉపాధి హామీ, ప్రజా గృహ నిర్మాణం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు వంటి పథకాలు కూడా కీలకం.
మహిళల ఉపాధి అవకాశాలు, సమాన వేతనాలు, పిల్లల సంరక్షణ సదుపాయాలు పెరగాలి. చిన్న పరిశ్రమలు, సూక్ష్మ వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరమైన ఉద్యోగాలు కల్పించాలి. పేదరికాన్ని అంచనా వేయడానికి ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్య, పోషకాహారం, నివాస పరిస్థితులను కూడా పరిశీలించాలి.
రాష్ట్రాల మధ్య, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తగ్గించాలి. పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలతో పాటు నాణ్యమైన ప్రభుత్వ సేవలు, కార్మిక హక్కులు, జీవనానికి సరిపడే వేతనాలు అవసరం. ఆర్థిక వృద్ధి ఫలితాలు సమాజంలోని దిగువ ఆదాయ వర్గాలకు చేరినప్పుడే అభివృద్ధి సమగ్రంగా ఉంటుంది.
పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు:
1)ఉపాధి- స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగాల కల్పన, కనీస వేతనాలను విధిగా అమలు. 2)విద్య- ప్రతి చిన్నారికి నాణ్యమైన ఉచిత విద్య, పోషకాహారం, డిజిటల్ విద్యా సదుపాయాలు. 3)వైద్యం- అందుబాటు ధరల్లో ప్రభుత్వ వైద్యం, తల్లి, శిశు ఆరోగ్య సేవలు, పోషకాహార కార్యక్రమాలు. 4)గృహవసతి- నిరుపేదలకు సురక్షితమైన ఇళ్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్తు. 5)సామాజిక భద్రత- వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల సహాయం, ప్రమాద బీమా, కార్మికులకు ఆరోగ్య భద్రత. 6)గ్రామీణ అభివృద్ధి- సాగునీరు, రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ మార్కెట్లు, నిల్వ సదుపాయాలు, గ్రామీణ పరిశ్రమలు. 7)సమానత్వం- మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, వలస కార్మికులకు సమాన అవకాశాలు. 8)ప్రజల భాగస్వామ్యం- పేదరిక నిర్మూలన పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో పేద ప్రజల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పేదరిక నిర్మూలన ఒకరోజు నిర్వహించే కార్యక్రమంతో సాధించే లక్ష్యం కాదు. అది ప్రభుత్వాల నిరంతర బాధ్యత, ప్రజల భాగస్వామ్యం, సమర్థ వంతమైన ప్రజానుకూల ఆర్థిక విధానాలు, సామాజిక న్యాయం ద్వారా సాధించాల్సిన దీర్ఘకాలిక లక్ష్యం.
ప్రపంచంలోని కొన్ని దేశాలు పేదరికాన్ని గణనీయంగా తగ్గించ గలిగాయి. ప్రజలకు ఉపాధి, విద్య, వైద్యం, ఆహారం, గృహవసతి, సామాజిక భద్రత కల్పించి నప్పుడే అభివృద్ధి నిజమైన అభివృద్ధి అవుతుంది. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనను ప్రధాన సామాజిక లక్ష్యంగా స్వీకరించాలి. పేదరికం లేని సమాజం అంటే కేవలం ఎక్కువ ఆదాయం ఉన్న సమాజం కాదు. ప్రతి మనిషి గౌరవంగా, ఆరోగ్యంగా, భద్రంగా జీవించగలిగే సమాజం.
పేదరిక నిర్మూలనకు భారత్ తీసుకోవలసిన చర్యలు:
1)దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) పెరిగినా, దాని ప్రయోజనాలు ప్రజలందరికీ సమానంగా చేరకపోతే పేదరికం, అసమానతలు కొనసాగుతాయి. సంపద పంపిణీలో అసమానతలు తొలగించాలి.
2)ప్రజా సేవలు కీలకం. నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, తాగునీరు, పారిశుధ్యం, రవాణా, గృహవసతి వంటి సదుపాయాలు కుటుంబాల వాస్తవ జీవన ప్రమాణాలను పెంచుతాయి. అవి ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలి.
3)ఉపాధి, వేతనాలు ప్రధానమైనవి. కార్మికులకు స్థిరమైన ఉద్యోగాలు, జీవనానికి సరిపడే వేతనాలు, సామాజిక భద్రత కల్పించకుండా దీర్ఘకాలిక పేదరిక నిర్మూలన సాధించడం అసాధ్యం.
4)మహిళల అభివృద్ధి లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆస్తులపై హక్కులు, నిర్ణయాధి కారంలో మహిళలకు సమాన అవకాశాలు, మహిళలకు భద్రత కల్పించాలి.
5)వ్యవసాయ కార్మికులు, చిన్న రైతులు, అసంఘటిత రంగ కార్మికుల ఆదాయ భద్రతను పెంచాలి.
6)కార్మిక చట్టాల అమలు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతను కల్పించాలి.
7)ప్రభుత్వ విద్య, వైద్యం, పోషకాహారం, గృహవసతిపై నిరంతర పెట్టుబడులు పెట్టాలి.
8)యువతకు నైపుణ్య శిక్షణతో పాటు వాస్తవమైన, స్థిరమైన ఉద్యోగాలు కల్పించాలి.
9)రాష్ట్రాల మధ్య, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను తగ్గించాలి”.
CJP:
పై సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యమే CJP ఆవిర్భావానికి, ఆందోళన లకు కారణం.
నాణ్యమైన విద్య, పరీక్షా విధానంలో లోపాలు, ఉద్యమానికి దారి తీసాయి.
ఈ సమస్యలపై నివురు గప్పిన నిప్పులా పేరుకున్న అసంతృప్తి జూలై 20న బద్దలైంది. చివరకు మంత్రి రాజీనామా అనివార్యం అయింది.
SIR ఆందోళన:
ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించింది. అందుకే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే తమ అధికారం కోల్పోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చింది. 2024 ఎన్నికలలో పలు అక్రమాలకు పాల్పడింది. అయినా సంపూర్ణ మెజారిటీ రాలేదు. అలాంటి ఎన్ని అక్రమాలకు పాల్పడినా 2029 ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చింది. అందుకే ఎవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయించుకునే దుర్మార్గానికి ఒడిగట్టింది. అదే SIR. ఎస్ ఐ ఆర్ నిర్ణయం ఎప్పుడు, ఎవరు తీసుకున్నారు, మినిట్స్ కావాలని సమాచార హక్కు చట్టం కింద అంజలి భరద్వాజ్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసింది. తాము ఆ నిర్ణయం తీసుకోలేదని, తమ వద్ద రికార్డులు లేవని ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. దీంతో ఇది మోడీ, అమిత్ షా కుట్ర అనేది బహిర్గతం అయింది.
ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించినట్లు ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను తప్పిస్తే కూడా పరిస్తితి చక్క పడనంతగా భ్రష్టు పట్టింది. అందుకే బ్రిటీష్ వారిని తలదన్ని, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. నియంత పోకడలకు పాల్పడుతున్నది.
పరిష్కారం:
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మరొక స్వాతంత్ర్య ఉద్యమం నేటి అవసరం. ప్రస్తుత ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలు, ప్రజలకు జవాబుదారీతనం అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
