1975లో హెన్రీ కిసింజర్ సుడిగాలి దౌత్య పర్యటన చేశారు. ఆ పర్యటనలో ఒకరోజు ఇజ్రాయెల్‌కు కేటాయించారు. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ కిసింజర్ “ప్రధానమంత్రి రాబిన్‌ను రక్షణ మంత్రి షిమోన్ పెరెస్ నుంచి కాపాడటానికి వచ్చాను” అన్నారు.
చతురతను పక్కనపెడితే ఏ దేశంలోనైనా రాజ్యాధినేత ఎదుర్కొనే అతి ముఖ్యమైన సవాళ్ల గురించి అమెరికా కార్యదర్శి చర్చలోకి తెచ్చాడు.
రాజ్యాధినేత అనుయాయి గానీ, సహచరులు గానీ, నమ్మకస్థులు గానీ పరిస్థితిని చెడగొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది ఆ ప్రశ్న. వందిమాగధులలోని తెంపరితనాన్ని అదుపులో పెట్టకపోతే పోయేది ఆ నాయకుడి పరువు ప్రతిష్ఠలే.
స్వాతంత్ర్య అనంతర భారతదేశంలో కూడా ఇటువంటి అనేక సందర్భాలను చరిత్ర నమోదు చేసింది: జవహర్లాల్ నెహ్రూ గోవింద్ వల్లభ్ పంత్‌ను ఇష్టారాజ్యంగా వదిలేయటం గానీ, 1961లో చైనా అధ్యక్షుడు చౌ ఎన్ లైతో మొరార్జీ దేశాయ్ ఒప్పందం కుదుర్చుకోవడం గానీ, సంజయ్ గాంధీని కాదనలేని దుస్థితిలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం గానీ, ఆగ్రాలో వాజ్‌పేయి, ముషారఫ్‌ల శిఖరాగ్ర సమావేశంలో పీటముడి పడేలా అద్వానీ వ్యవహరించడం గానీ ఈ కోవకు చెందిన సన్నివేశాలే. ఈ జాబితా ఇంకా పెద్దది.
వ్యవస్థాగత వైఫల్యం అంచున ప్రజాస్వామ్యం
క్రియాశీలంగా వ్యవహరించే రాజకీయ వ్యవస్థలో పనిచేసే పరస్పర ఆధారిత వ్యవస్థలు ఏది ఎలా వ్యవహరించినా అంతిమంగా వ్యవస్థాగత సంక్షోభానికి, వైఫల్యానికి అవకాశం లేకుండా చూడాలన్న ప్రయత్నం చేస్తాయి.
వ్యవస్థాగత వైఫల్యంతో సతమతమవుతున్న భారత ప్రజాస్వామ్యం నేడు భారీ వైఫల్యం అంచున ఉన్నది. ఏదైనా సరికొత్త సృజనాత్మకత తోడైతే తప్ప ఈ వైఫల్యం ఖాయం.
వ్యవస్థల మధ్య పడిన పీటముడి క్లిష్టమైనదిగానే కనిపిస్తూ ఉంది. వితండవాదానికి, కరుడుగట్టిన వ్యవహార శైలికి తావు లేదనే ప్రధానమంత్రి ఒకవైపు, సూత్రపరంగా ఏ రాజకీయ పార్టీకి తలవంచాల్సిన అవసరం లేని ఎన్నికల సంఘం పాలక రాజకీయ పార్టీ ప్రయోజనాలను భుజాన వేసుకుని వ్యవహరిస్తున్న తీరు మరొకవైపు, పోరాడితే పోగొట్టుకోవడానికి ఏమీ లేని నాయకుడి నేతృత్వంలో పోరాడుతున్న ప్రతిపక్షం ఇంకొకవైపు, సాంప్రదాయిక మంచి మర్యాదలు, దిశానిర్దేశం చేసే సైన్యాధ్యక్షుడు లేకుండానే యుద్ధంలోకి దిగిన తిరుగుబాటుదారులు మరొకవైపు హోరాహోరీ తలపడుతున్నారు.
గత కొన్ని రోజులలో ఈ పీటముడిని దేశం కళ్లారా చూస్తోంది. దేశ రాజధానిలో ప్రతిఘటన కేంద్రాలపై పట్టు సాధించే ప్రయత్నంతో జరుగుతున్న పోరాటాలలో ఇది వ్యక్తమవుతోంది.
రాజ్యాధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న సంస్థలు జూలై 20 నుంచి అక్టోబర్ 10 మధ్యకాలంలో నిరాయుధులైన ప్రదర్శనకారులపై తమ ఆధిపత్యాన్ని చలాయించాయి.
యువతీయువకులపైనా, ఇతర పౌరులపైనా అడ్డు అదుపు లేకుండా ముష్టిఘాతానికి పాల్పడుతున్న పోలీసుల కండకావరాన్ని తెలియజేసే చిత్రాలు, దృశ్యాలు చూస్తుంటే కడుపులో దేవినట్టు అవుతోంది.
ఈ రకమైన వైఖరి గణతంత్ర రాజ్యానికి నప్పదు. ఈ పీటముడిని విప్పాల్సిందే.
ఎన్నికల యంత్రాంగం – రాజ్యాంగ భద్రత
ఈ పీటముడికి పునాది ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉద్దేశపూర్వకంగా చేపట్టిన చట్టవిరుద్ధమైన చర్యలు. ఉద్దేశపూర్వకంగానే అన్ని విషయాలు తెలిసీ ఎన్నికల యంత్రాంగాన్ని ఒక మోసపూరిత కార్యాచరణ వైపు నడిపించిన జ్ఞానేష్ కుమార్ గురించి గానీ, ఈ కాలంలో ఆయన తీసుకున్న చర్యల గురించి గానీ పెద్దగా చెప్పటానికి ఏమీ లేదు.
ఇక్కడ పుండు మీద కారం చల్లే విషయం ఏమిటంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఎటూ కలిసి వచ్చే రాజ్యాంగపరమైన భద్రతలతో పాటు ఆయన చేసే ఏ రకమైన నిర్ణయాలకైనా- అవి తప్పయినా, ఒప్పయినా – భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన శిక్షలు లేకుండా రక్షణ కవచాలను పొందారు.
మోదీ ప్రభుత్వంలో కొందరు అధికారులు సదరు రక్షణ కవచాల అవసరం ఉందని ముందుగానే గుర్తించారంటే, ఏయే పొరపాట్లు చేయాలో ముందుగానే నిర్ణయించుకున్నారు అన్నది తేటతెల్లం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి లేదు అనిపిస్తోంది. ప్రధానమంత్రి మోదీ జ్ఞానేష్ కుమార్‌తో ఎంతగా లబ్ధి పొందినా, ఇంకా పొందాలనుకున్నా అంతిమంగా జ్ఞానేష్ ప్రధానికి గుదిబండగా మారిన విషయం వాస్తవం.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పార్లమెంట్లో తీర్మానం ద్వారా మాత్రమే తొలగించగలరు. కానీ పాలకపార్టీ అందుకు ససేమిరా సిద్ధపడదు.
నైతిక అధికారం – తాజా పరిణామాలు
అయినా సరే, పాలక పార్టీలో అత్యంత సన్నిహిత అంతరంగీకులు జ్ఞానేష్ కుమార్‌ను మోయలేము అన్న నిర్ణయానికి వస్తారా అన్నది కూడా చెప్పలేము.
ఒకవేళ అధినేతలు జ్ఞానేష్‌పై వేటు వేసి జరిగిన తప్పులు సవరించుకుని నష్టాన్ని పూడ్చుకోవాలంటే వారి చేతుల్లో లేని ఆయుధం లేదు. మార్గాలు కరువు కాదు. ఈ మధ్యనే ఆరోగ్య కారణాలతో ఈ దేశ ఉపరాష్ట్రపతి స్వయంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రజాభిప్రాయానికి తలొగ్గడం ఈ ప్రభుత్వాధినేతలకు అలవాటే లేని విద్య. ఈ విషయాన్ని ఆంతరంగిక సమావేశాల్లో పంచుకుని మరీ సంబరపడిపోతూ ఉంటారు. అధికారం అంతటి అహంకారాన్ని వారికి సొంతం చేసింది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే లక్షణం ఉంటే ఎంతటి వారైనా విధి వికటించినప్పుడు తలవంచక తప్పదని రాజుగారికి తెలియకపోదు.
మోదీ ఈ విషయాన్ని పూర్తిగా మరువకపోతే, చరిత్ర ఇచ్చే సూచనలను సేకరించే జ్ఞానేంద్రియాలు పూర్తిగా మూసుకోకపోతే, ఒక ప్రధానమంత్రికి అత్యంత విలువైన ఆస్తిగా ఉండాల్సిన విషయాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జాగ్రత్తగా రూపొందించి అమలు చేసిన చట్టవ్యతిరేక చర్యలు మసకబారుస్తున్నాయి అన్న ఇంగితం తెలిసి రావాలి.
ప్రజల విశ్వాసం చూరగొనగలిగిన నిజాయితీపరుడు మా నాయకుడు లేదా నాయకురాలు అన్న భావనలో ప్రజలు ఉండటం, ఒక నాయకుడు తన నైతిక అధికారాన్ని చలాయించడానికి అత్యంత ప్రాథమిక అవసరం. తాజా పరిణామాల నేపథ్యంలో మోదీ ప్రభుత్వపు నైతికతే సవాలుగా మారింది.
ఇక్కడ మరో ప్రాథమిక ప్రశ్న తలెత్తుతోంది: ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడటానికి కావాల్సిన విధానాలు, మార్గాలను రాజ్యాంగ అమరిక అందిస్తుందా అన్నది ఆ ప్రశ్న.
కొద్దిరోజుల క్రితం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే “వ్యవస్థలు నీ చేతుల్లో ఉంటే వీధులు మా చేతుల్లో ఉంటాయి” అన్నారు. దీనిపై స్పందిస్తూ భాజపా అధికార ప్రతినిధి, జాతీయ ఎజెండాను నిర్ధారించేది పార్లమెంటు వేదికే తప్ప వీధులు కాదు అని బదులిచ్చారు. ఈ రెండు రకాల రాజకీయాల నడుమ విధాన నిర్ణయం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది.
న్యాయవ్యవస్థ జోక్యం – భవిష్యత్తు మార్గం
ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు గతంలో న్యాయవ్యవస్థ సహకారం తీసుకునేవాళ్లు. ఇప్పుడు కూడా అటువంటి జోక్యానికి సమయం ఆసన్నమైందా?
రాజకీయాల నడుమ ఉన్న వివాదాలను పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ జోక్యాన్ని కోరే సమయం వచ్చిందా?
నిజం చెప్పాలంటే న్యాయవ్యవస్థ జోక్యంపై కూడా పూర్తిగా భరోసా ఉంచలేము. అయితే గతంలో కొన్ని సందర్భాలలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పటానికి రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థ జోక్యం కోరిన ఉదంతాలు ఉన్నాయి.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరటానికి ప్రధానమంత్రికి ఒక సాకు కావాలి: ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కూడా గౌరవంగా వీడ్కోలు పలకాలి, ఎన్నికల స్వయంప్రతిపత్తి, స్వచ్ఛతను కాపాడాలి, ప్రస్తుత ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడలేదు అని ప్రతిపక్షానికి కూడా భరోసా కలగాలి.
సుప్రీంకోర్టు జ్ఞానేష్ కుమార్‌ను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించలేదు. అదే సమయంలో జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను సమగ్రంగా పరిశీలించి ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా తగిన ఆదేశాలు జారీ చేసే సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టు చేతులలో ఉన్నది. అటువంటి ఆదేశాలు అడ్డుపెట్టుకుని ప్రధానమంత్రి కూడా జ్ఞానేష్‌ను సున్నితంగానే హెచ్చరించి గౌరవంగా బయటికి పంపవచ్చు.
ఈమాత్రం ఇంగితజ్ఞానాన్ని మన నాగరికత అనుభవం మనకు సమకూర్చింది. కర్ర విరగకుండానే పామును చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ మించి ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పూర్తిగా రక్షిస్తున్నారన్నది వాస్తవం.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
