నేడు ప్రధాని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. గుజరాత్‌ను నయానో, భయానో గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా యావత్ భారత దేశాన్ని గుప్పిట్లో పెట్టుకో గలరా?
హార్దిక్ పటేల్ గుర్తున్నాడా? పదేళ్ల క్రితం పత్రికలు, టెలివిజన్ల నిండా మార్మోగిన పేరు. 2015లో గుజరాత్‌కు చెందిన పటిదార్ ఉద్యమానికి నాయకుడిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందే సమయానికి అతనికి 22 ఏళ్లు. అతను నిర్వహించిన ప్రదర్శనలతో రాష్ట్రంలో బీజేపీ కలవరపడింది.
బీజేపీలోని లోపాలన్నీ ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఇవన్నీ వెరసి రాష్ట్ర బీజేపీలో భారీ సంక్షోభానికి దారితీశాయి. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామాతో బీజేపీ తన సంస్థాగత సంక్షోభాన్ని వాయిదా వేసుకుంది.
పదేళ్ల క్రితం బీజేపీని మోదీ సొంత గడ్డ మీద గడగడలాడించిన వ్యక్తి నేడు అదే రాష్ట్రంలో అదే బీజేపీలో ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు.
పదేళ్ల క్రితం జరిగిన ఉద్యమాల సందర్భంగా అతనిపై పెట్టిన క్రిమినల్ కేసుల్లో చివరి కేసును ఈ సంవత్సరం జులైలో కోర్టు కొట్టేసింది.
తిరుగుబాటుదారుడిగా మొదలై తిరిగి అదే పార్టీలో కలిసి అస్తిత్వం కోల్పోయిన హార్దిక్ పటేల్ చరిత్ర గమనిస్తే బీజేపీ అసమ్మతిని అదుపు చేయటంలో గుజరాత్ మోడల్ ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుంది.
రాజ్యాధికారం ఒక ఉద్యమాన్ని చిదిమివేయవచ్చు. లేదా ఆ ఉద్యమకారులను అదే రాజకీయ వ్యవస్థలో అంతర్భాగం చేసుకుని ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా చేయవచ్చు.
అదే ఉద్యమకారుడు ఏ వ్యవస్థను ఎదుర్కొని వీధుల్లోకి వచ్చాడో అతడే వ్యవస్థలో అంతర్భాగం అవుతాడు. ఆ ఆందోళనకారుడే వ్యవస్థలో లోపలి మనిషి అవతారం ఎత్తుతాడు. అటువంటి ఉద్యమకారుడికి హార్దిక్ పటేల్‌కి ఉన్నట్టే అతుకుల గతం ఉంటే వ్యవస్థకు అటువంటి వాళ్ళను లోబర్చుకోవడం మరింత తేలిక.
అయితే ఇప్పుడు గుజరాత్‌ను నయానో భయానో అదుపు చేసినట్టే భారతదేశాన్ని కూడా అదుపు చేయవచ్చా అన్న ప్రశ్నకు మోదీ ప్రధానిగా సమాధానం చెప్పాల్సి ఉంది.
తాజాగా కాక్రోచ్ జనతా పార్టీని అణచివేయటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు గమనిస్తే మోదీ ముందున్న సవాలు ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవడం తేలికవుతుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ రాజీనామా డిమాండ్‌తో చేపట్టదలుచుకున్న నిరసన ప్రదర్శన మొదలు కాక ముందే నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇళ్ళ నుండి అపహరించుకు పోయారు. ఇంకా వందలమందిని దూర దూర ప్రాంతాలలో ఉన్న ఖైదు కేంద్రాలకు తరలించారు.
ఈ క్రమంలో ఈ కార్యక్రమాలు దేశానికి చేరవేసే జర్నలిస్టులు కూడా అరెస్టు అయ్యారు. పోలీసుల వ్యవహారం ఎంతగా శ్రుతి మించిందంటే కాస్త చూసి చూడనట్టు ఉండే సుప్రీంకోర్టు కూడా నిరసన హక్కు చట్టబద్ధమే అని ప్రకటించడం ద్వారా తన పలుకుబడిని పునఃప్రతిష్ఠించుకున్నది.
బహుశా మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షంతో తలపడుతున్నాను అనుకుని ఉండొచ్చు. అటువంటి ప్రతిఘటన శక్తులు అయితే పోలీసు చర్యల ద్వారానో లేక రాజకీయ దురుద్దేశంతో ఆందోళన చేస్తున్నారు అన్న ప్రచారంతోనో, నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడం ద్వారానో అణచివేయవచ్చు. అటువంటి అంచనా ఘోరమైన తప్పిదంగా రుజువు అయ్యింది.
ఇదేమీ పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఆందోళన కాదు. నిరసనకారులందర్నీ దేశ ద్రోహులని ప్రచారం చేయటానికి. పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఉద్యమం ఆనాడు ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి మతం రంగు పులుముకుంది.
2020 సంవత్సరం నుండి ఉమర్ ఖాలిద్ జైల్లోనే మగ్గుతున్నాడు. విచారణ పేరుతో ఆరేళ్లపాటు సాగిన నత్తనడక కారణంగా దర్యాప్తు సమయంలో జైలు నిర్బంధం పౌర హక్కుల గురించిన చర్చ జాతీయ అంశంగా మారింది.
లేదా ఇదేమి రైతు ఉద్యమం కాదు. 2021 నవంబర్‌లో మూడు రైతు చట్టాలను ప్రధానమంత్రి ఉపసంహరించుకోవడానికి ముందు నిరసనకు తెరలేపిన రైతాంగంలో కొంతమందిని ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని కూడా ప్రభుత్వం ప్రచారం చేసింది.
పైన చెప్పిన రెండు సందర్భాలలోనూ ప్రభుత్వం ఉద్యమకారులతో తలపడటానికి సిద్ధమయ్యింది. కొన్ని ఉద్యమాల విషయంలో నెలలపాటు ఘర్షణ పడిన ప్రభుత్వం మరికొన్ని ఉద్యమాల విషయంలో ఏండ్ల తరబడి ఘర్షణ పడటానికి సిద్ధపడింది. ఆదరణ వల్ల జరిగిన నష్టాన్ని కూడా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ నేడున్న ఉద్యమం నేపథ్యంలో ఈ ప్రభుత్వం మారుతున్న ఉద్యమ స్వరూప స్వభావాల గురించిన అవగాహన కలిగించుకున్నదా లేదా అన్నదే సమస్య.
ఇదేమి కాంగ్రెస్‌తో వ్యవహరించినంత తేలిక కాదు. రాహుల్ గాంధీతోను, కొంతమంది ప్రాంతీయ పార్టీల నేతలతోనూ వ్యవహరించినందుకు తేలిక అంతకంటే కాదు. బీజేపీకి ఎన్నికలను సమర్థవంతంగా నడపగలిగిన యంత్రాంగం ఉన్నది.
గత దశాబ్ద కాలానికి పైగా నిరంతరం అన్ని ఎన్నికలలో గెలుస్తూనే ఉన్నది. జ్ఞానేష్ కుమార్ ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చాయంటే గెలవడానికి కావలసిన అన్ని వనరులు హంగు ఆర్భాటాలు ఉన్నాయన్నది బీజేపీ నేతల నమ్మకం.
కానీ సాంప్రదాయిక రాజకీయ వేదికల నుండి రావాల్సిన ప్రతిఘటన రాజకీయ వ్యవస్థల పట్ల ఏమాత్రం ఓపికగా ఉండలేని, సాంప్రదాయిక రాజకీయ ప్రత్యామ్నాయాల పట్ల విశ్వాసం లేని, ప్రత్యేకించి పాలకులను ఎదురొడ్డితే నష్టపోవడానికి ఏమీ లేని యువతరం నుంచి ఎదురైతే ఎలా ఉంటుంది?
కాంగ్రెస్‌కి ఉండే గుదిబండలు కాంగ్రెస్‌కు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను అడ్డం పెట్టుకొని మీకు నచ్చిన అధికారులను ఎన్నికల కమిషనర్లుగా నియమించలేదా అని బీజేపీ ప్రశ్నించగలదు.
ప్రాంతీయ పార్టీలు కోల్పోయిన తమ ప్రభావాన్ని తిరిగి పొందే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించవచ్చు. కానీ నిరసనకారులు సాంప్రదాయిక రాజకీయ గణితంతో సంబంధం లేని వాళ్ళు అయి ఉంటే, పలుకుబడి కలిగిన పదవులు కావాలని కోరుకునే వాళ్ళు కాకపోతే అటువంటి వారి పట్ల ప్రభుత్వం ఎలా స్పందించాలి? వారి ఆవేదనంతా ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటే, ఆ వ్యవస్థ కారణంగానే ప్రాణాలు విలవిలలాడుతున్నాయని బాధతో నిండి ఉంటే అటువంటి ఆందోళనల పట్ల ఎలా స్పందించాలి?
ఆ వ్యవస్థలు పరీక్ష నిర్వహణ వ్యవస్థలు కావచ్చు, పోలీసు వ్యవస్థలు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు.
అదొక భిన్నమైన రాజకీయ సవాలు. దాని పట్ల స్పందించాలంటే విలక్షణంగానే వ్యవహరించాలి. అటువంటి యువతరాన్ని, దాని శక్తిని తక్కువగా అంచనా వేయడమే మోదీ ప్రభుత్వం సమస్య.
కాక్రోచ్ జనతా పార్టీ తొలిసారిగా మేలో ప్రజల దృష్టినాకర్షించినప్పుడు దాన్నొక సోషల్ మీడియా వెర్రిగా బీజేపీ కొట్టి పారేసి ఉండొచ్చు. ఆ విధంగా భావించడానికి అది ఎంచుకున్న పేరు, చిహ్నం కూడా కారణం అయి ఉండవచ్చు. అంత పెద్దగా ప్రభావితం చూపగలిగిన ఉద్యమం కాదు కాబట్టి జంతర్ మంతర్‌లో ఆందోళన చేస్తాము అంటే అనుమతించి కూడా ఉండవచ్చు.
నిరసనకారులను ఎగతాళి చేసినంత మాత్రాన ప్రశ్నాపత్రాల లీకేజీ గురించిన ఆందోళన, భవిష్యత్తు గురించి ఆవేదనల నడుమ తలెత్తిన సమస్యలు అంత త్వరగా తొలగిపోయేవి కావు.
కనుమరుగయ్యేది అంతకంటే కావు. ఎగతాళి వ్యాఖ్యలు విస్తరించాయి. విమర్శలు వ్యక్తిగతంగా మారాయి. ఉద్యమం సోషల్ మీడియా పరిధిని దాటి అభిమానులను అనుయాయులను సంపాదించుకుంది.
పరీక్షా నిర్వహణ గురించిన వివాదం పట్ల ప్రభుత్వం స్పందించిన తీరుకు కూడా రాజకీయ పర్యవసానాలు ఉన్నాయి.
ప్రజాభిప్రాయానికి తలొగ్గడం అలవాటు లేని ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక కీలకమైన ఉదంతంగా మారింది.
ఇప్పుడు ఎన్నికల సంఘం ఉద్యమ నినాద కేంద్రంగా మారింది. ప్రతిఘటనా శక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఉడిగిపోయేంతవరకు ఎదురుచూడటం ఉత్తమం అని ప్రభుత్వ ఆంతరంగిక అంచనా చెప్పి ఉండవచ్చు.
ముక్కు మొఖం తెలియని, ఆయుధాలు లేని నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాల సంగతేంటి?
హిందుత్వ భావజాలానికి మద్దతు ఇచ్చే సంస్థగా చెప్పుకునే హిందూ రక్షా దళ్‌కు చెందిన వ్యక్తులు యువ నిరసనకారులపై దాడి చేసిన ఘటనల సంగతేంటి?
ఇలాంటి ఘటనలపై మౌనం వహించడం కాదు సమగ్ర విచారణ జరిపి బాధ్యులెవరో తేల్చి వారిని జవాబుదారీగా నిలబెట్టాలి.
ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలు డిజిటల్ మాధ్యమాల ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తాయి. ప్రభుత్వానికి సాధారణంగా అనుకూలంగా ఉండే టెలివిజన్ ఛానళ్లకు సైతం ఈ ఘటనను విస్మరించడం కష్టంగా మారింది.
ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న మరో అంశం తరాల మధ్య ఉన్న అంతరం. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఎలా రూపొందించాలో, వాటి ద్వారా ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న మంత్రులు, రాజకీయ నాయకులు ఒక ప్రపంచంలో ఉంటే తమంతట తామే రాజకీయ అంశాలపై ఎజెండా రూపొందించి, వాటిని మిగిలిన వారితో పంచుకుంటూ, వాటిపై తక్షణమే స్పందించే యువత మరో ప్రపంచంలో జీవిస్తున్నారు.
ఒక మంత్రి పక్కా ప్రణాళికతో, ముందుగా రూపొందించుకున్న వ్యూహం ప్రకారం ఇచ్చే సందేశం కొంతమంది ప్రేక్షకులకు చేరవచ్చు. కానీ ఆ సందేశాన్ని చూసిన ప్రజలు ఎలా స్పందించాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానిపై ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవాలి అన్నది మాత్రం ఆ మంత్రి శాసించలేరు.
అందుకే ప్రభుత్వం తన వైఖరిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జ్ఞానేశ్ కుమార్‌ను ఆ పదవిలో కొనసాగించాలనే పట్టుదలను ప్రభుత్వం వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.
ఎన్నికల సంఘం చుట్టూ నెలకొన్న వివాదం చివరికి దానంతట అదే సద్దుమణిగిపోతుందని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చు.
కానీ ఈ వివాదానికి మూలమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ప్రస్తుత పరిస్థితినే కొనసాగించడానికి అనుమతిస్తే ప్రభుత్వానికి, నిరసనకారులకు మధ్య ఘర్షణ మరింత కాలం కొనసాగే ప్రమాదం ఉంది.
సమస్యను పరిష్కరించకుండా యథాతథ స్థితిని కొనసాగించడం వల్ల వివాదం ముగిసిపోకపోగా అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వం విస్మరించడానికి వీలులేని ఇతర ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. సెప్టెంబరులో ద్రవ్యోల్బణం 5.54 శాతానికి పెరిగింది. భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశించిన మధ్యకాలిక 4 శాతం లక్ష్యాన్ని ద్రవ్యోల్బణం వరుసగా నాలుగో నెలలోనూ అధిగమించింది. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 7.74 శాతానికి చేరుకుంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి తాజాగా భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ఆర్థిక పరిస్థితులను మరింత అనిశ్చితిలోకి నెడుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు ఈ అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి.
యువ భారతీయుల దృష్టిలో ప్రజాస్వామ్య సంస్థలు జవాబుదారీగా వ్యవహరిస్తున్నాయా లేదా అనే ప్రశ్న ఒక్కటే విడిగా ఉండదు. ఉద్యోగాలు దొరుకుతాయా?
నిత్యావసరాల ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయి? పరీక్షల వ్యవస్థలో అవకతవకలు లేకుండా ఉంటాయా? తమ భవిష్యత్తుకు భరోసా ఉంటుందా? అనే ఆందోళనలతో ఈ ప్రశ్నలన్నీ ముడిపడి ఉన్నాయి.
అందుకే ఈసారి మోదీ ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన వైఖరిని అనుసరించాల్సిన అవసరం ఉంది. భారతదేశం గుజరాత్ కాదు. వి
ద్యార్థుల నిరసనలతో సంబంధం ఉన్న తన అభిప్రాయాలను బహిరంగంగా, నిర్భయంగా వ్యక్తం చేసే ఏఐఎస్ఏ కార్యకర్త నేహా బోరా కూడా హార్దిక్ పటేల్ కాదు.
ఉద్యమ నాయకుడిగా ఎదిగి చివరకు బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్‌తోనూ, సీపీఐ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కన్హయ్య కుమార్‌తోనూ ఆమెను పోల్చలేం.
గుజరాత్ నమూనా అత్యంత కేంద్రీకృతమైన రాజకీయ నాయకత్వం చుట్టూ నిర్మితమైంది. అక్కడ ఒక బలమైన నాయకుడు, ఆయన నాయకత్వంలోని పార్టీ రాజకీయ చర్చల దిశను, ప్రజల్లోకి వెళ్లే రాజకీయ కథనాన్ని తమకు అనుకూలంగా మలచగలిగాయి.
కానీ భారతదేశ విస్తీర్ణం, వైవిధ్యం, ఇక్కడి ప్రజాస్వామ్య సంస్థల స్వభావం భిన్నమైన విధానాన్ని కోరుతున్నాయి.
భిన్నాభిప్రాయాలకు చోటు కల్పించే, వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే, ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలకు అవకాశం ఇచ్చే పాలనా విధానం అవసరం.
గుజరాత్లో అనుసరించిన రాజకీయ పద్ధతులనే దేశమంతటికీ వర్తింపజేయడం సాధ్యం కాదు. భారతదేశ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మరింత సమ్మిళితమైన, ప్రజాస్వామ్యబద్ధమైన విధానాన్ని అనుసరించాలి.
అంటే ప్రతి నిరసన బృందం చేసే ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించాలని కాదు. శాంతిభద్రతలను కాపాడాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.
అలాగే హింసకు పాల్పడినట్లు తగిన ఆధారాలు ఉన్నప్పుడు నిరసనకారులను కూడా బాధ్యులుగా నిలబెట్టాలి.
అయితే చట్టాన్ని అమలు చేయడానికి, అసమ్మతిని వ్యక్తం చేయడాన్నే ఒక ముప్పుగా పరిగణించడానికి మధ్య మౌలికమైన తేడా ఉంది.
చర్చలు జరపడం అంటే లొంగిపోవడం కాదు. ప్రజల అభిప్రాయాలను వినడానికి సిద్ధంగా ఉండటం వల్ల ప్రభుత్వ అధికారం తగ్గిపోదు.
పైగా ప్రజల మాటలను వినడం, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ అధికారంపై ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడుతుంది.
కాబట్టి ప్రతి నిరసన బృందం చేసే డిమాండ్ ప్రకారం ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలా లేక కొంత అసౌకర్యాన్ని కలిగించే ప్రతి నిరసనను అణచివేయాలా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు.
ప్రజల అసమ్మతిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించే రాజకీయ నిర్వహణ విధానాన్ని అనుసరించాలా లేక ప్రజాజీవితంలో అసమ్మతి కూడా ఒక ముఖ్యమైన భాగమని గుర్తించే ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాలా అన్నదే అసలు ప్రశ్న.
తదుపరి ఘర్షణ ప్రారంభమయ్యే ముందే ప్రజల మాటలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అన్నదే కీలకం.
లేకపోతే 2027లో తదుపరి ప్రధాన ఎన్నికల దశ వచ్చే వరకు నిరసనలు, వాటికి ప్రతిగా జరిగే ఆందోళనలతో దేశం గందరగోళ పరిస్థితుల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇది ఆందోళన కలిగించే సంకేతం.
పోస్ట్ స్క్రిప్ట్: ఈ వారం ఢిల్లీ పోలీసులు జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదర్శనలకు కేటాయించిన అధికారిక ప్రదేశాల జాబితా నుంచి తొలగించారు. ప్రత్యామ్నాయ నిరసన ప్రదేశాలుగా రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్‌లను ప్రకటించారు.
దీంతో దేశ రాజధానిలో నిరసనలు జరిగే ప్రదేశాల స్వరూపం మారుతోంది. పార్లమెంటుకు, అధికార కేంద్రాలకు దూరంగా నిరసన ప్రదర్శనలను తరలించడం వల్ల వాటిని నియంత్రించడం ప్రభుత్వానికి సులభం కావచ్చు.
అయితే దీనివల్ల నిరసనలకు ఎంతవరకు ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది, నిరసనకారులు ఆ ప్రదేశాలకు ఎంత సులభంగా చేరుకోగలుగుతారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
నిరసన జరిగే ప్రదేశాన్ని మీరు మార్చగలరు. కానీ అసమ్మతిని వ్యక్తం చేసే హక్కును చట్టాలు చేసి తొలగించలేరు.
నేను ఈ వ్యాసాన్ని రాస్తున్న సమయానికి, కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను తీహార్ జైలుకు పంపారు.
ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాసానికి స్వేచ్ఛానువాదం.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
