యువజన నిరసనల పట్ల బీజేపీ నిర్వహణపై ఇంతవరకు ఎంకే స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి అస్పష్టతతో ఉన్నారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ల అరెస్టులను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు.
ఇంతవరకు మౌనం పాటించిన తర్వాత వారు మొదటిసారి ఈ విధంగా స్పందించారు.
జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 13న నిరసన తెలియజేయడంతో ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన ఆ ఇద్దరు నాయకులకు న్యాయపరంగా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్టోబర్ 15న స్టాలిన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఇలాంటి చర్యలు పూర్తిగా వ్యర్థం అని, ఎంత మంది నిరసనకారులను ప్రభుత్వం నిర్బంధించగలదు, ఎంత మంది యువ గొంతుకలను బీజేపీ అణిచివేయగలదు అని ఆయన ప్రశ్నించారు.
ఎంత ఎక్కువ మంది యువకులను జైళ్లో పెడితే, ఎలాంటి రాజకీయ గుర్తింపు లేని సామాన్య పౌరులు మరింత ఎక్కువ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిజమైన ప్రజా బలం ఏమిటో చూపించగలరని స్టాలిన్ అన్నారు.
రాంకా, దాస్లకు సంఘీభావాన్ని తెలియజేస్తూ వారికి అవసరమైన అన్ని విధాల న్యాయ సహాయాన్ని అందచేయడానికి ద్రావిడ మున్నేత్ర కజగం(డీఎంకే) సిద్ధంగా ఉందని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ఖండన
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా అయిన జగన్మోహన్ రెడ్డి సీజేపీ నాయకుల అరెస్టులను ఖండించారు.
ఇలాంటి చర్యలు పరిస్థితులను మరింత జటిలం చేస్తాయే తప్ప ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించలేవని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతిచర్య విధానం కంటే కూడా క్రియాశీలకమైన వైఖరి ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యవస్థలో లోపాలున్నాయి వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని ఆయన రాశారు.
దాస్ రాంకాల అరెస్టులు దేనిని పరిష్కరించలేవు, అది కేవలం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది, వారికి నా సంఘీభావం అంటూ జగన్మోహన్ రెడ్డి రాశారు.
రాహుల్ గాంధీ విమర్శల అనంతరం స్పందన
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టులపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఒక్క రోజు తర్వాత స్టాలిన్, రెడ్డిల స్పందనలు వచ్చాయి.
జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా యువకులను జైలులో పెట్టడం పిరికిపంద చర్యగా వర్ణించారు.
యువకుల నిరసనలను రాజ్యం పర్యవేక్షించే తీరుపై ప్రతిపక్ష, రాజకీయ నాయకుల ప్రకటనలు సర్వత్రా విమర్శలకు ఊపునిస్తున్నాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
