దశాబ్దాల పాటు చిత్రాలు గీసినంత మాత్రాన ఎవరూ లియోనార్డో డా విన్సీ లేదా పాబ్లో పికాసో కాలేరు. 25 ఏళ్ల పాటు పాటలు పాడితే లతా మంగేష్కర్ లేదా మెహదీ హసన్‌లా తయారవ్వరు.
ఎందరో కవులు ఏళ్ల తరబడి రాస్తుంటారు, కొందరు వ్యాపారాత్మకంగా విజయం కూడా సాధిస్తారు, కానీ వారు గాలిబ్, ఫైజ్ లేదా ఫిరాక్లలో ఒక పావు వంతు కూడా కాలేరు.
హాస్యాస్పదమైన స్థాయి నుంచి ఆధ్యాత్మిక లేదా అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి అసాధారణమైన ప్రతిభ, అంకితభావం, నిజాయితీ అవసరం.
రాజకీయాల్లో నాయకత్వ ప్రమాణాలు
రాజకీయాల్లో లేదా అధికారంలో సుదీర్ఘకాలం ఉన్నంత మాత్రాన విలువైన నాయకత్వం లభిస్తుందనే హామీ లేదు.
ప్రపంచం చూసిన అత్యంత గొప్ప నాయకులలో ఒకరైన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ ఏ ప్రభుత్వంలోనూ ఎటువంటి పదవినీ నిర్వహించలేదు.
చాలా దేశాలను అత్యంత సుదీర్ఘకాలం పాలించిన నిరంకుశ పాలకులు, మతాంధులు, నేరస్థుల భయంకరమైన అనుభవాలతో నిండిన చరిత్ర మన ముందు ఉంది.
బెనిటో ముస్సోలిని, సద్దాం హుస్సేన్ వంటివారు రెండు దశాబ్దాలకు పైగా పాలించారు. అడాల్ఫ్ హిట్లర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక ప్రపంచ యుద్ధమే అవసరమైంది. కానీ అసాధారణ నాయకుడైన నెల్సన్ మండేలా తన ప్రజాదరణ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఐదేళ్ల తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు.
అమెరికాకు చెందిన ఇద్దరు అసాధారణ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కేనెడీల పదవీకాలం వరుసగా కేవలం నాలుగు, రెండేళ్లు మాత్రమే ఉంది.
రాజీవ్ గాంధీ తన ఒకే ఒక్క విడత పాలనలో ఎంతో సాధించారు. పాలన కాలవ్యవధి కంటే పరిపాలన నాణ్యత, దృక్పథానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.
రాజకీయాలు – ఆంక్షలు లేని డైరీ
వ్యక్తిత్వ ఉన్నతి అనేది క్యాలెండర్లకు సంబంధించిన అంశం కాదు. నేడు ఒక నాయకుడిని అంచనా వేయడానికి అత్యంత ఆమోదయోగ్యమైన కొలమానం రాజ్యాంగబద్ధత, నైతికత, నిజాయితీ.
నరేంద్ర మోడీ 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ చేస్తున్న పటాటోప ప్రచారం, సంబరాలు ఆయనను గొప్పవారిగా మార్చలేవు.
గొప్పతనం అనేది విజయోత్సవ ఆడంబరాలలో లేదు. మోడీ ఎన్నికల్లో గెలిచి దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ పునాదిని విస్తరించింది నిజమే, కానీ పౌరులు ఆయన రాజకీయాన్ని, పనితీరును అంచనా వేయడానికి అది ప్రామాణికం కాదు.
ప్రజలు తమ జీవితాలను మెరుగుపరిచిన పని ఆధారంగా ప్రధానిని అంచనా వేస్తారు తప్ప, చక్రవర్తి ఎన్ని రోజులు సింహాసనాన్ని అధిష్టించాడనే దాని ఆధారంగా కాదు.
గాంధీని “మహాత్ముడు”గా ప్రజలు స్వీకరించేలా చేసింది ప్రచార బలం కాదు. గాంధీ ఉపదేశాలు ఇవ్వలేదు. ఆయన రాజకీయాల ప్రచారం ఆత్మ స్తుతి ప్రచారం కాదు.
గాంధీ తన ఆదర్శాల ప్రతిరూపంగా నిలిచారు. తన వ్యక్తిగత ప్రవర్తన ద్వారా తాను నమ్మిన సూత్రాల శక్తిని నిరూపించారు. ఆయన ఆదర్శంగా నిలిచి నడిపించారు.
సత్యాగ్రహం అనేది ఆయన తనకు తాను విధించుకున్న క్రమశిక్షణ. ఆయన ఎన్నడూ మోసం, అసత్యాల ద్వారా ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు.
అదే కోణంలో, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి, తన స్వంత పార్టీలోని అనుమానాలను, తన విమర్శకులను, మీడియాను అధిగమించి గౌరవాన్ని సంపాదించారు.
ఆయన భారత్ జోడో యాత్రను ప్రారంభించి, విమానంలో వెళ్లిపోయి, ఇతరులను దానిని పూర్తి చేయనిచ్చి ఉంటే, ఆయనకు ఈ రోజు లభించిన ప్రజా విశ్వాసం ఎంతమాత్రం వచ్చేది కాదు.
తన సాధారణ నేపథ్యాన్ని ప్రచారం చేసుకుంటూ, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే నాయకుడిని తీవ్రమైన అనుమానంతో, అవిశ్వాసంతో చూస్తారు.
సామాన్యుడిలా నటిస్తూ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడి నిబద్ధత పరీక్షించబడుతుంది.
పౌరులను విదేశాలకు వెళ్లవద్దని చెబుతూ, తనే అనవసర ప్రయాణాలు చేసే నాయకుడిని అపనమ్మకంతో చూస్తారు.
పేదలను తక్కువ నూనె తినమని చెబుతూ, తన పుట్టినరోజున ప్రమిదలు వెలిగించడానికి నూనెను ధారాళంగా వాడమని ప్రోత్సహించే నాయకుడిని నిష్పాక్షికంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
కల్పిత కథనాల నిర్మాణం
సెప్టెంబర్ 17న ప్రమిదలు వెలిగించి మోడీ పుట్టినరోజును జరుపుకోవాలని బీజేపీ పౌరులను కోరిన తరుణంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఎన్నికల విజయాలు, మచ్చలేని వ్యక్తిగత సమగ్రత, ఇండియా-ఫస్ట్ విజన్ గురించి మాట్లాడారు.
ఆయన స్వచ్ఛమైన, అవినీతి రహిత జీవితాన్ని ప్రస్తావిస్తూ, మోడీ “బురదలో తామరపువ్వు లాంటివారని, నీరు లేదా బురద ఆయనకు అంటుకోలేదు” అని షా అన్నారు.
ఆ తామరపువ్వు వికసించడానికి ఎంత నీరు, బురద అవసరమైందో ఎవరికీ తెలియనిది కాదు. బహిరంగంగా అవినీతిపరులని తాను విమర్శించిన ఇతర పార్టీల మచ్చపడిన నాయకులను ప్రధాని తమ పార్టీలోకి చేర్చుకున్నారు.
తామరపువ్వును పోషించడానికి ప్రతి మురికి గుంట నుంచి నీరు, బురద తోడుకుని మరీ తీసుకున్నారు. రఫేల్ డీల్ విషయంలో నేరుగా మోడీపైనే బురద చల్లినప్పుడు, పరిశోధనలను నిరోధించడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.
మచ్చలేనిది అనే దావా పూర్తిగా సందేహాస్పదమైనది, ఎందుకంటే 2002 గుజరాత్ అల్లర్ల మచ్చ మోడీ రాజకీయ వ్యక్తిత్వంపై ఉంది.
గుజరాత్‌లోని ఆయన మంత్రులు, సహచరులు ఎందరో జైలుకు వెళ్లగా, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయనకు రాజధర్మం పాటించాలని గుర్తు చేయక తప్పలేదు.
మచ్చలేనిది అనే దావా కపటత్వం, తప్పించుకోవడం, జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి నిరాకరించడంపై ఆధారపడి ఉంది.
కార్పొరేట్ సంస్థలకు భూ కేటాయింపులు, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, నోట్ల రద్దులో కుంభకోణాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ, దేనిపైనా సరిగ్గా విచారణ జరగలేదు.
గౌతమ్ అదానీకి సాయం చేసేందుకు నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం లొంగలేదు.
నిష్కళంకమైన నిబద్ధత ఉన్న నాయకుడు విచారణను ఎదుర్కొనేవారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులను కాపాడుతూ, ప్రతిపక్ష నాయకులను మాత్రం వేధిస్తున్నారని కూడా మోడీపై ఆరోపణలు వచ్చాయి.
అనుమానాస్పద అర్హతలు ఉన్న అధికారులు, న్యాయమూర్తులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణ సర్వసాధారణమైపోయింది. అన్నింటికంటే మించి, ఓటర్ల జాబితాలు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణను ఎదుర్కొన్న ప్రధాని మోడీ తప్ప మరెవరూ లేరు. ప్రజాస్వామ్యంలో ఇంతకు మించిన అత్యంత దారుణమైన అవినీతి ఏదన్నా ఉంటుందా?
బోఫోర్స్ డీల్‌లో రాజీవ్ గాంధీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన సీబీఐ విచారణకు ఆదేశించారు, చివరకు కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కానీ మోడీ తన కెరీర్‌పై నీలినీడలు పరిచే ఏ కేసులోనూ విచారణ జరగకుండా సుప్రీంకోర్టు, పార్లమెంటులో తీవ్రంగా పోరాడారు. ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది, కానీ క్విడ్-ప్రో-కో సంఘటనలపై ఎలాంటి విచారణకు ఆదేశించలేదు.
ఎప్స్టీన్ ఫైళ్లలో పేరు వచ్చిన ఒక మంత్రిని, తన వాహనంతో రైతులను తొక్కి చంపిన కొడుకు ఉన్న మరో మంత్రిని మోడీ కాపాడారు.
విద్యావ్యవస్థలోని లోపాలపై యువత నిరసనలతో ఉద్యమించిన తర్వాతే ఆయన మూడో విడత పాలనలో మొదటి రాజీనామా వచ్చింది.
మోడీ ఒక ఆదర్శప్రాయుడా?
రాజ్యాంగ నైతికత ప్రామాణికంగా మోడీని అంచనా వేయనందుకు షాను మెచ్చుకుందాం. మోడీ 25 ఏళ్ల సాధనపై జరుగుతున్న ప్రచారాన్ని సమర్థిస్తూ షా ఇలా అన్నారు: “కొందరు ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు దీని అవసరం ఏముంది అని అడుగుతున్నారు.
ఈ రోజు నేను వారికి చెప్పాలనుకుంటున్నాను: మోడీ జీవితం ఎలాంటిదంటే, రాబోయే రోజుల్లో వందలాది మంది నరేంద్ర మోడీలు ఉద్భవించి భారత్‌ను సరైన స్థానంలో నిలబెట్టేందుకు భారతదేశంలోని ప్రతి చిన్నారికి, ప్రతి కౌమారదశలో ఉన్నవారికి, ప్రతి యువకుడికి దానిని పరిచయం చేయడం అత్యవసరం”.
కాబట్టి, షా విజన్ ప్రకారం, భారత్‌కు బుద్ధుడు, గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ లేదా ఇందిర కాదు, మరింత మంది మోడీలు కావాలి.
షా ఒక సంచలనాత్మక దావా చేశారు: మోడీ నిరాడంబరతకు ఎవరూ సాటిరారట. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మోడీ అదానీ విమానంలో ఢిల్లీకి చేరుకున్నప్పుడే ఆయన నిరాడంబరత్వం దేశ ప్రజల మనస్సుల్లో ముద్రించబడింది.
రూ 4.3 కోట్లకు వేలం వేయబడిన సూట్ వివాదాన్ని ఇక్కడ గుర్తుచేసుకోకూడదు, ఆ సూట్ వస్త్రంలో నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ అనే పేరు బంగారు దారంతో నేయబడింది.
మోడీ దుస్తుల ఎలైటిజం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. ఆయన అత్యంత ఖరీదైన పెన్ను, కళ్లద్దాలు, శాలువాలు ఉపయోగిస్తారు. ఆయన ప్రధాని కార్యాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత కార్లు, విమానాల శ్రేణి ఆధునీకరించబడింది. ఆయన ఊహించిన సెంట్రల్ విస్టాను ప్రతిపక్షాలు ఆయన అహంకార ప్రాజెక్ట్‌గా అభివర్ణించాయి.
ఏ మంత్రి లేదా సహచరుడిని కూడా అనుమతించని మోడీ మల్టీ-కెమెరా ఫోటోషూట్లు ఆయన నిరాడంబరతను, వినయాన్ని తరచుగా ప్రకటనల రూపంలో ప్రదర్శిస్తుంటాయి.
మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నత పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారనేది వివాదాస్పదమైన విషయం కాదు. అది నిజంగా ప్రశంసనీయం.
అయితే బీజేపీ ఆయనకు ఆపాదించడానికి ప్రయత్నిస్తున్న ప్రాముఖ్యత అనేది కొన్ని క్లిష్టమైన ప్రశ్నల సమాధానాలపై ఆధారపడి ఉంటుంది.
♦ మోడీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు ప్రయత్నించారా?
♦ ఆయన పరిపాలన పక్షపాతాలు, ముందస్తు అభిప్రాయాలు లేకుండా చట్టబద్ధ పాలనను అమలు చేయడానికి కట్టుబడి ఉందా?
♦ కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు సాయం చేయడానికి బదులు పేదల అనుకూల విధానాలను ఆయన అనుసరించారా?
♦ పారదర్శకత, జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన చట్టపరమైన నిబంధనలను ఆయన బలోపేతం చేశారా?
♦ బాహ్య అంశాల ప్రభావానికి లోనుకాకుండా, ప్రబుద్ధ జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఆయన విదేశాంగ విధానాన్ని రూపొందించారా?
♦ ఏదో ఒక రకంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి బదులు నైతిక, వివేకవంతమైన రాజకీయం చేయడానికి ఆయన ప్రయత్నించారా?
ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే చరిత్రలో ఆయన స్థానాన్ని నిర్ణయిస్తాయి. ఆయన పదవిలో గడిపిన సంవత్సరాల సంఖ్య దేశానికి, దేశ ప్రజలకు అంతగా విలువైనది కానే కాదు.
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
