అర్హత గల ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుండి తొలగించబడకూడదని నిర్ధారించడానికి సమగ్రమైన ప్రక్రియలను కలిగి ఉన్న మునుపటి సర్ల వలె కాకుండా, ప్రస్తుత సర్ ప్రక్రియ తీవ్ర లోపాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తోంది. ఇది లక్షలాది మంది అర్హులైన ఓటర్ల తొలగింపుకు దారితీసింది. దీనికి సంబంధించిన అంశాల వారీ వ్యత్యాసాలు పొందుపరుస్తున్నాం.
ప్రత్యేక తీవ్ర సవరణ(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు మళ్లీ మొదలయ్యాయి. మాజీ ఎన్నికల కమిషనర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ ప్రక్రియ ప్రస్తుత రూపాన్ని ప్రశ్నించారు. దీనికి భిన్నంగా, ప్రస్తుత సర్ ప్రక్రియకు మద్దతు తెలిపిన మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు కూడా ఉన్నారు.
సర్ అంటే ఏమిటి?
ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 21(3) ప్రకారం, ఏదైనా నియోజకవర్గంలో లేదా కొన్ని నియోజకవర్గాలలో తగిన విధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘానికి అధికారం ఉంది.
దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను నిర్వహించాలని ఎన్నికల సంఘం 2025 జూన్‌లో నిర్ణయించింది. దీని మొదటి విడత బిహార్‌తో ప్రారంభమైంది.
2025 అక్టోబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య జరిగిన రెండవ విడతలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
2026 మేలో ప్రారంభమైన మూడవ విడతలో 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
2026 మేలో, ఒక రాష్ట్రంలోని అనేక లేదా అన్ని నియోజకవర్గాలకు సర్ నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
గతంలో సర్ ఎలా నిర్వహించబడింది?
గతంలో ఎనిమిది వేర్వేరు సమయాల్లో ప్రత్యేక తీవ్ర సవరణ నిర్వహించబడింది. చివరిగా 2002-2004 మధ్య జరిగింది. చివరి సర్ కోసం మే 2002లో జారీ చేసిన ప్రధాన మార్గదర్శకాలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.
మొదటిది – ప్రచురించిన ప్రాథమిక జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయాలని ఎన్యూమరేటర్లను ఆదేశించింది.
ఈ ప్రక్రియలో సహాయం చేయడానికి ఎన్నికైన పంచాయతీ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు.
రెండవది – పర్యవేక్షణ కోసం వివరణాత్మక మార్గదర్శకాలు అందించబడ్డాయి. ఎన్యూమరేటర్లు సర్వే చేసిన ఇళ్లలో కనీసం 25 శాతం ఇళ్లను సూపర్వైజర్లు తమకు తోచిన విధంగా తనిఖీ చేయాల్సి ఉంది.
పదేపదే వెళ్లినా ఒక ఇల్లు తాళం చేసి ఉందని ఎన్యూమరేటర్ నివేదిస్తే, సూపర్వైజర్ ఆ ఇంటిని స్వయంగా సందర్శించాలి.
సీనియర్ అధికారులు — సహాయ ఎన్నికల నమోదు అధికారులు(ఏఈఆర్ఓలు), ఎన్నికల నమోదు అధికారులు(ఈఆర్ఓలు), జిల్లా ఎన్నికల అధికారులు — వరుసగా కనీసం 12 శాతం, 5 శాతం, 2 శాతం ఇళ్లను తనిఖీ చేయాల్సి ఉంది.
మూడవది – పౌరసత్వానికి సంబంధించి, మొదటిసారిగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపైనే పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత ఉంటుందని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.
అయితే, లాల్ బాబు హుస్సేన్, ఇతరుల(1995) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం, ప్రస్తుత ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారు పేరు ఉండటం అనేది అతని పౌరసత్వానికి తగిన ప్రాథమిక ఆధారంగా ఎన్నికల నమోదు అధికారి పరిగణించాలి.
నాలుగవది – నివాసం మారిన ఓటర్లను తొలగింపుగా కాకుండా “బదిలీ”గా పరిగణించారు. ప్రాథమిక జాబితాలోని వారి పేర్లను కొట్టివేయకుండా, వాటిపై “ఎస్” అని గుర్తుపెట్టారు.
ఓటరు ఎక్కడికి మారారనే చిరునామా సమాచారాన్ని ఎన్యూమరేటర్లు నమోదు చేశారు. ఒకవేళ కుటుంబం మొత్తం మారితే, సూపర్వైజర్లు అటువంటి కేసులను స్వయంగా తనిఖీ చేయాలి. ఆ కాలంలో అన్ని ప్రాంతాలు ఒకేసారి సర్వే చేయబడినందున, మారిన ఓటర్లు తమ కొత్త చిరునామాలో అదే సవరణ ప్రక్రియలో నమోదు చేయబడ్డారు.
తుది జాబితా నుంచి పాత ఎంట్రీ తొలగించబడిందో లేదో ప్రధాన ఎన్నికల అధికారి చూసుకున్నారు. తమ కొత్త చిరునామాలో నమోదు కాకుండా పోయిన వారు మాత్రమే అభ్యంతరాల నమోదు గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది.
చివరగా – ఏ వ్యక్తి, సంస్థ లేదా రాజకీయ పార్టీ సమర్పించిన గంపగుత్త అభ్యంతరాలను తిరస్కరించాలని మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్నాయి. అన్ని దావాలు, అభ్యంతరాలను సరిగ్గా పరిష్కరించిన తర్వాత మాత్రమే తుది జాబితాను సిద్ధం చేయాలి.
ప్రస్తుత సర్‌లో ఉన్న ప్రధాన సమస్యలు ఏమిటి?
మొదటిది – సాధారణ నివాస స్థలంలో కనిపించని లేదా అందుబాటులో లేని ఓటర్లను దరఖాస్తు పూరించనందుకు గాను, వారు మునుపటి ఎన్నికలలో ఓటు వేసినప్పటికీ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుండి మినహాయించారు.
2002తో పోలిస్తే, “మారినవారు”గా నమోదైన వారు అదే ప్రక్రియలో వారి కొత్త చిరునామా వద్ద నమోదు చేయబడలేదు.
సాధారణ ప్రక్రియ ప్రకారం, వారు వారి కొత్త నివాస స్థలంలో ఫారం ఎనిమిది(నివాస మార్పు కోసం) పూరించాలి.
ఒకవేళ వారు తప్పితే, వారు ఫారం ఆరు ద్వారా కొత్త ఓటరుగా మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇది ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా మాన్యువల్(2023)కి విరుద్ధం.
ఆ మాన్యువల్ ప్రకారం— మారిన ఓటరు చిరునామా తెలిస్తే నోటీసు ఇవ్వాలి. చిరునామా తెలియకపోతే పబ్లిక్ సాక్షుల సమక్షంలో చివరిగా తెలిసిన చిరునామా వద్ద నోటీసు అంటించాలి. నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత మాత్రమే పేరు తొలగించాలి.
రెండవది – ప్రస్తుత సర్‌లో పర్యవేక్షణ నిబంధనలు గత సర్ ప్రక్రియలో పేర్కొన్నంత సమగ్రంగా లేవు.
బిహార్ సర్ ముందు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సూపర్వైజర్ల ద్వారా 10 శాతం యాదృచ్ఛిక తనిఖీలు, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ అధికారులు, బూత్ స్థాయి అధికారులతో క్రమం తప్పకుండా పర్యవేక్షణ సమావేశాలు మాత్రమే సరిపోతాయని పేర్కొన్నది.
మూడవది – ఓటర్లు దాదాపు రెండు దశాబ్దాల క్రితం నాటి చివరి తీవ్ర సవరణ సమయంలో సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలలో తమ పేర్లు లేదా తమ తల్లిదండ్రుల పేర్లను గుర్తించాలనే నిబంధన, లేదా పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఆధారాలను సమర్పించాలనే షరతు మూలంగా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవడానికి నిరూపణ బాధ్యతను ఓటర్లపైనే మోపుతోంది.
నాలుగవది – సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించబడిన సహేతుక వ్యత్యాసాలు(లాజికల్ వ్యత్యాసాలు – తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసం 15 నుంచి 45 ఏళ్ల కంటే తక్కువ లేదా ఎక్కువ ఉండటం, అక్షర దోషాలు మొదలైనవి) వల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్లు అపారదర్శకంగా జాబితా నుండి మినహాయించబడ్డారు.
చివరగా – వివిధ ప్రాంతాలలో ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగించడం కోసం ఫారం ఏడు (అభ్యంతర ఫారమ్‌లు)ను గంపగుత్తగా సమర్పించినట్లు ససాక్ష్యంగా వెలుగులోకి వచ్చాయి.
అసంబద్ధమైన ఆధారాలతో ఫారమ్‌లను సమర్పించకుండా నిరోధించడానికి, ఎన్నికల సంఘం అక్టోబర్ 9న ఒక వ్యక్తి సమర్పించగల అభ్యంతర ఫారమ్‌ల సంఖ్యపై పరిమితి విధించింది.
ఇవే కాకుండా, ఫారం ఆరుతో జత చేసిన డిక్లరేషన్ చెల్లుబాటుపై కూడా చట్టపరమైన ప్రశ్నలు తలెత్తాయి.
ముందుకు వెళ్లే దారి ఏమిటి?
ఓటు హక్కు అనేది మన ప్రజాస్వామ్యానికి పునాది. మూడు విడతలలో దాదాపు 13.3 కోట్ల ఓటర్లు తొలగించబడటానికి సర్ ప్రక్రియ కారణమైంది.
సుమారు 2.7 కోట్లు (20 శాతం) మరణం కారణంగా, 1.01 కోట్లు (8 శాతం) నకిలీ ఎంట్రీలుగా గుర్తించబడ్డాయి. వీటిలో గణనీయమైన భాగం—9.5 కోట్లు (71 శాతం)—’హాజరుకాని, ఇల్లు మారిన, ఇతర’ కేటగిరీ కిందకు వస్తారు. వీరిలో చాలామంది సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి కొత్తగా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
ప్రస్తుత ప్రక్రియపై తలెత్తిన సమస్యల దృష్ట్యా, ఇప్పటివరకు సిద్ధం చేసిన జాబితాలపై వివరణాత్మక ఆడిట్ జరగాలి.
ఇంటింటికీ వెళ్లి సర్వే చేయడం, రోల్ నవీకరణలతో సహా ఓటర్ల పునః-నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి. దావాలు, అభ్యంతరాలన్నీ పరిష్కరించబడిన తర్వాత మాత్రమే తుది జాబితాను ఖరారు చేయాలి.
(రంగరాజన్ ఆర్. పూర్వపు ఐఏఎస్. అధికారి, ‘కోర్స్‌వేర్ ఆన్ పాలిటీ సింప్లిఫైడ్’ రచయిత.)
హిందూ దినపత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. అనువాదం కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
