ప్రపంచంలో మానవుడు సాధించిన శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధి అపారమైనది. అంతరిక్షంలో అడుగులు మోపారు. సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తున్నారు. కృత్రిమ మేధస్సుతో అనూహ్యమైన కొత్త పుంతలు తొక్కుతున్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు ఆహారం పొందలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఇది నాగరిక, శాస్త్ర సాంకేతికరంగాలలో సాధించిన విజయాల నాణానికి రెండవ వైపు దృశ్యం.
ఒక వైపు ఆహార పదార్థాలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. మరో వైపు పిల్లలు పోషకాహార లోపంతో అల్లాడుతున్నారు. ఒక వైపు ఆహారాన్ని నిల్వ చేయడానికి గోదాములు సరిపోవడం లేదు.
మరో వైపు ఆకలితో డొక్కలెండి నిద్రలోకి జారుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహారం వృథా అవుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో కనీస ఆహారం కూడా అందని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వైరుధ్యాలను ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకురావడానికి, ఆకలి నిర్మూలనకు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు కృషి చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఇది కేవలం ఆహారానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ దినోత్సవం మాత్రమే కాదు. ఆహారం మనిషి హక్కు. వ్యవసాయం సమాజానికి పునాది. పోషకాహారం ఆరోగ్యకరమైన జీవితానికి అవసరం. ఆకలి నిర్మూలన ప్రభుత్వాల సామాజిక బాధ్యత అనే విషయాలను గుర్తుచేసే సందర్భం కూడా.
ప్రపంచ ఆహార దినోత్సవం చారిత్రక నేపథ్యం
రెండవ ప్రపంచ యుద్ధం(1939–1945) ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి.
ఆహార ఉత్పత్తి, రవాణా, పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఆకలి, పోషకాహార లోపం తీవ్రమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తిని పెంచడం, వ్యవసాయాన్ని పునరుద్ధరించడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, దేశాల మధ్య సహకారాన్ని అభివృద్ధి చేయడం అత్యవసరమని ప్రపంచ నాయకులు గుర్తించారు.
1943లో అమెరికాలోని హాట్ స్ప్రింగ్స్‌లో 44 ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై ఆహారం, వ్యవసాయం కోసం శాశ్వత అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. దాని ఫలితంగా 1945 అక్టోబర్ 16న కెనడాలోని క్యూబెక్ నగరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆహార వ్యవసాయ సంస్థ ఏర్పడింది. దీనినే ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) అని పిలుస్తారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నియంత హిట్లర్ ఓడిపోయి సోవియట్ యూనియన్ సహకారంతో తూర్పు యూరప్‌లోని పలు దేశాలు సోషలిస్ట్ వ్యవస్థలుగా రూపాంతరం చెందాయి. దాంతో బెంబేలెత్తిన అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలు కూడా గత్యంతరం లేని పరిస్థితులలో ప్రజలకు కొన్ని హక్కులు, సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు తదితర సంస్థల ఆవిర్భావం జరిగింది.
ఆహార, వ్యవసాయ సంస్థ స్థాపన జరిగిన అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరపాలనే నిర్ణయం 1979లో తీసుకున్నారు.
1981లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఈ దినోత్సవం ద్వారా ఆకలి నిర్మూలన, వ్యవసాయ అభివృద్ధి, పోషకాహారం, గ్రామీణ పేదరికం, ఆహార భద్రత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన ఉద్దేశం.
సంస్థ లక్ష్యాలు
ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ సంస్థ వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. దీని ప్రధాన లక్ష్యాలు ఆకలి నిర్మూలన. ప్రతి వ్యక్తికి తగినంత ఆహారం అందే పరిస్థితులను కల్పించాలి.
పోషకాహార భద్రత. కేవలం కడుపు నింపే ఆహారం కాకుండా, శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు తదితర పోషకాహారం పొందగలిగే స్తోమతను కల్పించడం.
వ్యవసాయ అభివృద్ధి. చిన్న, సన్నకారు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాలు, సాగునీరు, మార్కెట్ సదుపాయాలు కల్పించడం. ప్రకృతి వనరుల పరిరక్షణ. భూమి, నీరు, అడవులు, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ స్థిరమైన ఆహార ఉత్పత్తిని పెంపొందించడం. అంతర్జాతీయ సహకారం. కరువులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆహార సంక్షోభాలు ఎదుర్కొంటున్న దేశాలకు సహాయం చేయడం.
ఈ లక్ష్యాలన్నింటిలో ఒక కీలకమైన అంశం “ఆహారం ఉత్పత్తి చేయడమే సరిపోదు. అది ప్రజలకు అందుబాటులో ఉండాలి, కొనుగోలు చేయగలిగే ధరలో ఉండాలి, పోషక విలువలు కలిగి ఉండాలి.
పేదరికం, ఆదాయ అసమానతలు
ఒక కుటుంబానికి అవసరమైన ఆదాయం లేకపోతే మార్కెట్లో ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ దానిని కొనుగోలు చేయలేరు. కాబట్టి ఆకలి అనేది ఎల్లప్పుడూ ఆహార ఉత్పత్తి కొరత వల్లనే ఏర్పడదు.
ఆహారాన్ని కొనుగోలు చేసే ఆర్థిక సామర్థ్యం లేకపోవడం ప్రధాన కారణం. కార్మికులకు తగిన వేతనాలు లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉపాధి అస్థిరంగా ఉండటం, నిరుద్యోగం, సామాజిక భద్రతా లోపాలు పేద కుటుంబాల ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయి.
మరొక వైపు యుద్ధాల కారణంగా రవాణా మార్గాలు మూసుకుపోతాయి. ఆహార నిల్వలు ధ్వంసమవుతాయి. సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. ఫలితంగా ఆహార ధరలు పెరిగి, ప్రజలు ఆకలితో బాధపడతారు.
వాతావరణ మార్పులు
అనావృష్టి, వరదలు, తుపానులు, తీవ్ర ఉష్ణోగ్రతలు వ్యవసాయ దిగుబడులను ప్రభావితం చేస్తాయి. వర్షపాతంలో మార్పులు సాగునీటిపై ఆధారపడే రైతులకు మాత్రమే కాకుండా వర్షాధార రైతులకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
ఆహార వృథా
పంట కోత తర్వాత నిల్వ సదుపాయాలు లేకపోవడం, రవాణాలో నష్టాలు, శీతల గిడ్డంగుల కొరత, వినియోగదారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద మొత్తంలో ఆహారం వృథా అవుతోంది.
పండ్లు, కూరగాయలు, ధాన్యాలను సక్రమంగా నిల్వ చేయడం, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా ఈ నష్టాలను తగ్గించవచ్చు. ప్రపంచంలో సాలీనా సగటున 105 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నది.
ఆహార భద్రత అంటే ప్రజలకు అన్ని సమయాల్లో తగినంత, సురక్షితమైన, పోషకాహారం అందుబాటులో ఉండడం.
దీనికి నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
1) లభ్యత – దేశంలో లేదా ప్రాంతంలో తగినంత ఆహారం ఉత్పత్తి కావాలి లేదా దిగుమతులు చేసుకోవాలి.
2) అందుబాటు – ప్రజలు ఆహారాన్ని కొనుగోలు చేయగలగాలి లేదా ఇతర మార్గాల్లో పొందగలగాలి.
3) వినియోగం – ఆహారం పోషక విలువలతో ఉండాలి. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య సదుపాయాలు కూడా అవసరం.
4) స్థిరత్వం – ఈ సదుపాయాలు తాత్కాలికంగా కాకుండా నిరంతరం అందుబాటులో ఉండాలి.
ఈ నాలుగు అంశాల్లో ఏ ఒక్కటి బలహీనపడినా ఆహార భద్రత దెబ్బతింటుంది. ఉదాహరణకు దేశంలో ధాన్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా పేదలకు కొనుగోలు శక్తి లేకపోతే వారికి ఆహార భద్రత ఉన్నట్లు కాదు.
భారతదేశంలో ఆహార సమస్యలు
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు వంటి అనేక ఆహార ఉత్పత్తుల్లో దేశానికి గణనీయమైన స్థానం ఉంది. అయినప్పటికీ పోషకాహార లోపం, పేదరికం, ధరల పెరుగుదల, ప్రాంతీయ అసమానతలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ
భారతదేశంలో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఆహార ధాన్యాలు అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ కీలకమైనది.
జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ఈ రంగంలో ముఖ్యమైన చట్టపరమైన పునాది. అయితే కొందరికే రేషన్ కార్డులున్నాయి. ఉన్న వారికి కూడా ఆచరణలో దీనికింద పంపిణీ చేసే ఆహార ధాన్యాలు తినడానికి వీలు కాకుండా ఉంటున్నాయనేది ప్రధాన ఆరోపణ. బయట మార్కెట్లో ధరలు భగ్గుమంతున్నాయి.
మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం
పాఠశాలల్లో పిల్లలకు భోజనం అందించే పథకాలు విద్యార్థుల ఆకలిని తగ్గించడంతోపాటు పాఠశాల హాజరు, పోషకాహారం మెరుగుపడేందుకు సహాయపడతాయి.
చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు, అనుబంధ ప్రభుత్వ పథకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
అయితే ఈ పథకాల విజయాన్ని కేవలం ఎంతమందికి భోజనం అందించామనే లెక్కతో కాకుండా, పిల్లల పోషక స్థితి, ఆహార నాణ్యత, నిరంతరం అందించడం వంటి వాటిని కూడా అంచనా వేయాలి.
రైతుల సమస్యలు
ఆహార భద్రతకు రైతుల సంక్షేమం నేరుగా సంబంధించినది. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ధాన్యం కొనుగోలు దళారులు, సాగు ఖర్చులు పెరగడం, రుణభారం, వాతావరణ మార్పులు, మార్కెట్ అనిశ్చితి రైతుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.
రైతు ఆదాయం స్థిరంగా లేకపోతే వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గుతాయి. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఆహార ఉత్పత్తిపై పడుతుంది. అందువల్ల రైతులకు గిట్టుబాటు ధరలు, నీటిపారుదల, పంటల బీమా, నిల్వ సదుపాయాలు, సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలు కల్పించడం అవసరం.
కార్మికుల వేతనాలు, ఆహార హక్కు
ఆహార సమస్యను వ్యవసాయ సమస్యగా మాత్రమే చూడకూడదు. అది కార్మికుల జీవన ప్రమాణాలతో కూడా ముడిపడి ఉంది.
వేతనాలు పెరగకపోయినా బియ్యం, పప్పులు, కూరగాయలు, వంటనూనె, ఇంధనం ధరలు పెరిగినా కుటుంబం ఆహారంపై చేసే ఖర్చును తగ్గించుకోవాల్సి వస్తుంది. దాని ప్రభావం ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల పోషకాహారంపై పడుతుంది.
అందువల్ల కనీస వేతనాల అమలు, సమయానికి వేతనాల చెల్లింపు, ఉపాధి భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం, ఆరోగ్య సదుపాయాలు, సామాజిక భద్రతా పథకాలు ఆహార హక్కును కాపాడటంలో కీలకమైనవి.
ఆహార భద్రత అనేది కేవలం ఒక్క వ్యవసాయ మంత్రిత్వ శాఖ బాధ్యత మాత్రమే కాదు. కార్మిక, ఆరోగ్య, విద్య, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక రంగాల విధానాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి.
మహిళలు, పిల్లలు, గ్రామీణ కుటుంబాల పాత్ర
ప్రపంచవ్యాప్తంగా మహిళలు వ్యవసాయం, పశు పోషణ, ఆహార తయారీ, నిల్వ, కుటుంబ పోషణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారికి భూమిపై హక్కులు, రుణ సదుపాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవకాశాలు సమానంగా అందడం లేదు.
మహిళలకు భూమి హక్కులు, రైతుగా గుర్తింపు, శిక్షణ, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక అవకాశాలు కల్పించడం గ్రామీణ కుటుంబాల ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది.
పిల్లలకు చిన్న వయసులో సరైన పోషకాహారం అందకపోతే శారీరక ఎదుగుదల, అభ్యాస సామర్థ్యం, భవిష్యత్తు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. అందుకే గర్భధారణ నుంచి బాల్యం వరకు పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆహార వ్యవస్థలను పర్యావరణ హితంగా మార్చాలి
భవిష్యత్తు తరాలకు ఆహారాన్ని అందించాలంటే ప్రకృతి వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. భూసారం క్షీణించడం, భూగర్భజలాల అధిక వినియోగం, రసాయనాల దుర్వినియోగం, జీవ వైవిధ్యం తగ్గడం వ్యవసాయ స్థిరత్వానికి సవాళ్లు.
ప్రభుత్వాలు అభివృద్ధి ముసుగులో పంట భూములను, అటవీ భూములను భారీ మొత్తంలో ఇతర అవసరాలకు కొద్దిమంది పలుకుబడి కలిగిన వారికి ధారాదత్తం చేస్తున్నాయి. పర్యావరణ వినాశకర ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నాయి.
పంటల వైవిధ్యాన్ని పెంచడం, నీటి పొదుపు పద్ధతులు అనుసరించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడడం, స్థానిక విత్తనాలను సంరక్షించడం, పంటల మార్పిడి, శాస్త్రీయ పంటల ప్రణాళిక వంటి చర్యలు అవసరం.
అలాగే వినియోగదారులు అవసరానికి తగినంత ఆహారం కొనుగోలు చేయడం, మిగిలిన సురక్షితమైన ఆహారాన్ని బాధ్యతాయుతంగా వినియోగించడం, సాధ్యమైన చోట ఆహార దాన కార్యక్రమాలకు సహకరించడం ద్వారా వృథాను తగ్గించవచ్చు.
ఆకలి లేని ప్రపంచం సాధ్యమా?
లక్ష్యం, చిత్తశుద్ధి ఉంటే సాధ్యమవుతుంది. ఆకలి నిర్మూలన అనేది కేవలం దాతృత్వంతో సాధించే లక్ష్యం కాదు. దీనికి శాస్త్రీయ వ్యవసాయం, సరైన ఆర్థిక విధానాలు, సమర్థవంతమైన ప్రజా పంపిణీ, ఉపాధి, సరైన వేతనాలు, మహిళా సాధికారత, అంతర్జాతీయ సహకారం అవసరం.
ఒక వైపు ఆహార ఉత్పత్తిని పెంచుతూ, మరో వైపు పేదలకు ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలి. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టాలి. రైతులకు రక్షణ కల్పించాలి. ఆహార ధరలు సామాన్య ప్రజల కొనుగోలు శక్తికి అనుగుణంగా ఉండే విధానాలు అవసరం.
ఆకలి అనేది వ్యక్తిగత వైఫల్యం కాదు. అది సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లోని లోపాల ఫలితమని ప్రపంచ ఆహార దినోత్సవం తెలియజేస్తుంది.
ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం లభించాలంటే తగినంత ఆహారం, పోషకాహారం, జీవనోపాధి భద్రత తప్పనిసరి.
ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతు, పంటను కోసే వ్యవసాయ కార్మికుడు, ఆహారాన్ని రవాణా చేసే కార్మికుడు, దానిని కొనుగోలు చేసే వినియోగదారుడు, ప్రతి ఒక్కరి జీవితం ఆహార వ్యవస్థతో ముడిపడి ఉంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆకలి నిర్మూలనను ఒక నినాదంగా కాకుండా మెజారిటీ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా విధానాల రూపకల్పన జరగాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
