ఎంపిక చేసిన కొద్ది మందితో త్రివర్ణ పతాకం ఎగురవేయటానికి సహకరిస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం ఆసక్తికరమైన అంశం.
న్యూఢిల్లీ: పరిపాలనాపరమైన కారణాలతో అక్టోబర్ 16, 17 తేదీలలో సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తున్నామని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది.
శుక్రవారం నాడు సెంట్రల్ పార్క్ లో తిరంగా పతాకం ఎగరవేసే కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన మరునాడు ఎన్డీఎంసీ ఈ ప్రకటన విడుదల చేయటం గమనించాల్సిన విషయం. అటువంటి కార్యక్రమాలకు హాజరు కారాదని ఢిల్లీ పోలీసులు కూడా విలేకరుల సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు.
అదే సమయంలో ఎంపిక చేసిన కొద్ది మందితో సెంట్రల్ పార్క్‌లో జాతీయ పతాకం ఎగరవేస్తామని, జాతీయ గీతం ఆలపించేందుకు సహకరిస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
ఎన్డీఎంసీ డైరెక్టర్ పేరుతో విడుదలైన ప్రకటనలో “అక్టోబర్ 16, 17 తేదీలలో పరిపాలన పరమైన కారణాల వలన సెంట్రల్ పార్క్‌లో సాధారణ ప్రజల ప్రవేశాన్ని రద్దు చేస్తున్నాము” అని తెలిపింది.
దేశ రాజధానిలో త్రివర్ణ పతాకం ఎగరవేయాలన్న సీజేపీ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు ముంబైలో ఆజాద్ మైదాన్‌లో జాతీయ పతాకం ఎగరవేయడానికి ముంబై పోలీసులు అనుమతించారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు 15వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు.
ఈ ప్రాంతంలో సాధారణ పౌరుల రాకపోకలకు అంతరాయాలు కలిగే అవకాశం ఉందని, ప్రజా రవాణా కూడా కుంటుపడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసు విభాగం హెచ్చరించింది.
“సెంట్రల్ పార్క్‌లో తలపెట్టిన కార్యక్రమం కారణంగా కన్నాట్ ప్లేస్ చుట్టూ రాకపోకలకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అంతరాయం కలిగే అవకాశం ఉంది”అని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.
అప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి అవసరమైతే ట్రాఫిక్ మళ్లింపు కూడా ఉంటుందని ఈ ప్రకటన తెలిపింది.
సీజేపీ సహ ప్రారంభకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకలు కోర్టు ఆదేశాలు ధిక్కరించి నిరసన ప్రదేశంగా రద్దు చేయబడిన జంతర్ మంతర్‌లో నిరసన తెలపడానికి వెళ్లడం ద్వారా కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించారంటూ న్యాయస్థానం వారిద్దరిని ఐదు రోజులపాటు తీహార్ జైల్లో రిమాండ్‌కు పంపింది.
అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా తీహార్ జైల్లో ఉన్న సహచరులకు సంఘీభావం తెలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు.
“జాతీయ జెండా ఎగరవేయటం నేరం కాదు” అని కూడా అభిజిత్ అన్నారు.
ఎన్డీఎంసీ ప్రకటనపై స్పందిస్తూ అభిజిత్ “మేము 100 ప్రదేశాలలో జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిస్తే మోదీ ప్రభుత్వం 100 ప్రదేశాలను మూసివేస్తుందా”అని నిలదీశారు.
అంతేకాకుండా తనపై ప్రభుత్వం నిరంతరం నిఘా పెడుతున్నట్టు కూడా దీప్కే ప్రకటించారు.
గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్నేహ యాదవ్ అటువంటి సభలు, సమావేశాలకు హాజరుకాకూడదని పౌరులకు బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163 ఈ ప్రాంతంలో అమలులో ఉన్నదని ఆమె వెల్లడించారు.
“సోషల్ మీడియా ద్వారా, విలేకరుల సమావేశం ద్వారా అక్టోబర్ 16వ తారీకు సాయంత్రం 5 గంటలకు ప్రజలందరూ సెంట్రల్ పార్క్ కన్నాట్ ప్లేస్ కు వచ్చి జాతీయ జెండా ఎగరవేయాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ పిలుపునకు స్పందిస్తూ తన పార్టీ శ్రేణులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరింది. ప్రస్తుత పరిస్థితి, శాంతిభద్రతల సమస్య దృష్టిలో పెట్టుకొని బీఎన్ఎస్ఎస్ చట్టం 163వ సెక్షన్ కింద ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు భగ్నం కాకుండా చూసేందుకు, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాన్ని నిలువరించేందుకు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి అని తెలియజేస్తున్నాము” అని డీసీపీ తెలిపారు.
ఎన్డీఎంసీ కూడా సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తున్న విషయాన్ని ఢిల్లీ పోలీసు విభాగానికి తెలియజేసినట్లు వెల్లడించారు.
“సెంట్రల్ పార్క్ భద్రత విషయంలో ఢిల్లీ పోలీసులు జోక్యం చేసుకోవాలని, ఈ పార్కు ప్రత్యేకత, సున్నితత్వం దృష్టిలో పెట్టుకొని అనుమతి లేని ప్రవేశాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని ఎన్డీఎంసీ ఢిల్లీ పోలీసులను కోరింది. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఉన్న పలు వ్యాపార, వాణిజ్య సంఘాలు చట్ట విరుద్ధంగా సమావేశం అవుతున్న వారి నుండి తమ షాపులు, దుకాణాలు కాపాడాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలతో పండుగ సీజన్లో తమ వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా ఈ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి” అని డీసీపీ ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రాంతంలో వ్యాపారాలకు అంతరాయం కలుగటం గురించి ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ప్రస్తావిస్తూ డీసీపీ “తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మీ ఆందోళనలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు” తెలిపారు.
అక్టోబర్ 16వ తేదీన సీజేపీ ఇచ్చిన పిలుపు కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటూ కొందరు ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో దానిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, సీజేపీ నిర్ణయాలపై, అభిజిత్ పై చర్యలు తీసుకోనున్నట్లు ఢిల్లీ పోలీసు వాంగ్మూలాన్ని కూడా హైకోర్టు నమోదు చేసింది.
“ఈ పరిణామాల నేపథ్యంలో నిరసనకారులకు, సాధారణ ప్రజలకు ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిషేధాజ్ఞలు ఉన్న సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం చట్ట వ్యతిరేకమని, పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని” ఆమె తెలిపారు.
“అయితే, ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రం జాతీయ పతాకాన్ని పట్టుకొని జాతీయ గీతం ఆలపించే విధంగా ఢిల్లీ పోలీసులు సహకరిస్తారు. ఈ విధంగా ఎంపిక చేసిన వారితో నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే ఈ కార్యక్రమం జరపడానికి అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో జాతీయ పతాకం ప్రదర్శించడం, జాతీయగీతం ఆలపించటం చట్టం నిర్దేశించిన పరిధి, పరిమితులలోనే వాటి గౌరవానికి భంగం కలగకుండా నిర్వహించాలి” అని కూడా ఆమె తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

