కొత్త మలుపులు తిరుగుతున్న భారత ఎన్నికల సంఘ వివాదం. నిన్నటి దాక ఉద్యమాల సునామీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుడిగుండంలో ముంచింది.
నేడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా లాగిందా, రేపు ఎవరు, ఇదే పెద్ద చర్చనీయాంశం అయింది. డెక్కన్ క్రానికల్ పత్రికలో సీనియర్ జర్నలిస్ట్ అనిల్ త్యాగి అక్టోబర్ 6న రాసిన పరిశోధనాత్మక వ్యాసం అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నది.
ఈ వివాదం ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంది?
భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘం(ఈసీఐ) రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఎవరు ఓటు వేయాలి, ఎవరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి, ఎవరి పేరును తొలగించాలి అనే అంశాలు కోట్లాది ప్రజల ప్రజాస్వామ్య హక్కులతో ముడిపడి ఉంటాయి.
ఈ ప్రక్రియలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ వినియోగం పెరగడం సహజమైన పరిణామం. అయితే, ఓటర్ల వివరాలను నమోదు చేయడం, ధ్రువీకరించడం, మార్పులు చేయడం, పేర్లను చేర్చడం లేదా తొలగించడం లాంటి కీలకమైన పనులకు ఉపయోగించే సాఫ్ట్వేర్ ఎవరు రూపొందించారు, దాని నిర్వహణ ఎవరి చేతుల్లో ఉంది, ఏ అధికారికి అందులో ఎంతవరకు భాగస్వామ్యం ఉంది, ఒక ఓటరు పేరు తొలగించడానికి చట్ట ప్రకారం ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలకు ఇప్పుడు స్పష్టమైన సమాధానాలు రావాలి.
ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టు అనిల్ త్యాగి రాసిన “హూ రన్స్ ఈసీఐ: ఏ పొలిటికల్ డుయో, యాన్ అటానమస్ ట్రియో, అడ్మిన్ సెక్స్ట్యుప్లెట్?” అనే వ్యాసం చర్చకు వచ్చింది.
ఇది 2026 అక్టోబర్ 6న డెక్కన్ క్రానికల్‌లో ప్రచురితమైంది. ఎన్నికల సంఘంలోని పరిపాలనా అధికారాలు, అధికారుల పాత్ర, ఈఆర్ఓనెట్ 2.0 సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రైవేటు సంస్థ టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) పాత్ర, ప్రభుత్వ సంస్థ సీ-డ్యాక్ పాత్ర తదితర అంశాలను ఆ వ్యాసం ప్రశ్నించింది.
తీగలాగితే డొంక అంతా కదిలింది అనే సామెత యదార్థమని ఇప్పుడు రుజువు అవుతున్నదా, ఇంకెన్ని విషయాలు బయట పడతాయో వేచి చూడాలి.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్ర:
అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రివర్గంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖ, రైల్వే శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి. అనిల్ త్యాగి వ్యాసంలో ఆయన ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన 2021 జూలై నుంచి జరిగిన సంబంధిత పరిపాలనా పరిణామాలను ప్రస్తావించారు.
ఇక్కడ మరొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. అశ్విని వైష్ణవ్ ఎంటెక్ చేసి తర్వాత ఐఏఎస్ ఉత్తీర్ణత సాధించారు. ఒడిశా రాష్ట్ర క్యాడర్‌గా కటక్ జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారు.
నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించిన “వైబ్రెంట్ గుజరాత్” కు బ్లూప్రింట్ తయారు చేసి ఇచ్చారని ఒక కథనం ప్రచారంలో ఉంది.
ఆ తర్వాత ఐఏఎస్ బాధ్యతలకు ఆయన చేసిన రాజీనామా 2011 అక్టోబర్ 13న ఆమోదించబడింది. 2019 జూన్ 22న అధికారికంగా బీజేపీలో చేరారు.
ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కేంద్ర ప్రభుత్వ విభాగాలు. ఈ రెండింటి మధ్య సాంకేతిక సహకారం, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం లేదా కాంట్రాక్టర్ల ద్వారా సేవల కొనుగోలు చేయడం సహజం.
ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇందులో కొన్ని చీకటి ఒప్పందాలు(అండర్ హ్యాండ్ డీలింగ్స్) లేవని కొట్టి పారేయగలమా అనేదే ఆ ప్రశ్న.
అశ్విని వైష్ణవ్ 2021 జూలైలో సమాచార సాంకేతిక శాఖ బాధ్యతలు చేపట్టిన విషయాన్ని డెక్కన్ క్రానికల్ వ్యాసం పేర్కొంది.
అయితే ఆయన ఈఆర్ఓనెట్ 2.0 రూపకల్పనకు వ్యక్తిగతంగా ఆదేశించారని, టీసీఎస్‌ను ఆయనే ఎంపిక చేశారని లేదా ఓటర్ల జాబితాల నిర్వహణను నియంత్రించారనే ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్ విచారణలో నిజా నిజాలు బయటకు రావాలి.
ఈఆర్ఓనెట్ – ఓటర్ల జాబితాల నిర్వహణలో దాని ప్రాముఖ్యత:
ఈఆర్ఓనెట్ పూర్తి పేరు ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్స్ నెట్వర్క్. ఇది ఓటర్ల జాబితాల నిర్వహణకు ఉపయోగించే డిజిటల్ వేదిక.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం, గతంలో రాష్ట్రాలు వేర్వేరు కంప్యూటర్ అప్లికేషన్లు, డేటాబేస్లు ఉపయోగించేవి. దీనివల్ల ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్లిన ఓటర్ల వివరాలను సమన్వయం చేయడం, నకిలీ నమోదులను గుర్తించడం, దరఖాస్తుల స్థితిని తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి.
ఈ సమస్యలను నివారించేందుకు ఈఆర్ఓనెట్ లాంటి ఏకీకృత వ్యవస్థను అభివృద్ధి చేశారని తెలుస్తున్నది.
కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ప్రాసెస్ చేయడం, ఓటర్ల వివరాల్లో మార్పులను నమోదు చేయడం, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నదా అని పరిశీలించడం, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను సమన్వయం చేయడం, ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు తొలగింపు దరఖాస్తులను సంబంధిత అధికారుల పరిశీలనకు పంపడం, దరఖాస్తుల పురోగతిని, అధికారుల పనితీరును పర్యవేక్షించడం ఈఆర్ఓనెట్ ప్రధాన విధులు.
ఈ మొత్తం ప్రక్రియలో వివిధ భాషలు, లిపి ఉంటాయని అందువల్ల ఒకే జాతీయ డేటాబేస్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల నమోదును సమన్వయం చేయడం దీని లక్ష్యంగా ఎన్నికల సంఘం వివరణ తెలియజేస్తుంది.
సాంకేతికంగా ఒక ముఖ్యమైన తేడా:
సాఫ్ట్వేర్ ఒక పేరును అనుమానాస్పదంగా గుర్తించడం వేరు, ఆ పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని చట్టబద్ధంగా నిర్ణయించడం వేరు.
ఉదాహరణకు, ఒక వ్యక్తి పేరు పాత జాబితాలో “రామయ్య” గా, కొత్త జాబితాలో “రామన్న” గా నమోదై ఉండవచ్చు.
కంప్యూటర్ ఈ వివరాలను సరిపోల్చ లేకపోతే దాన్ని పరిశీలించాల్సినదిగా గుర్తించవచ్చు. కానీ ఆ తేడా మాత్రమే ఆధారంగా వ్యక్తి ఓటు హక్కును రద్దు చేయకూడదు. సంబంధిత అధికారి వాస్తవాలను, పత్రాలను, వర్తించే చట్టాన్ని పరిశీలించాలి.
ఈఆర్ఓనెట్ 2.0లో టీసీఎస్ పాత్ర ఎలా వచ్చింది?
డెక్కన్ క్రానికల్ వ్యాసంలోని ప్రధాన ప్రశ్నల్లో ఇది ఒకటి. జర్నలిస్ట్ అనిల్ త్యాగి ప్రకారం 2018 ప్రాంతంలో ఈఆర్ఓనెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ప్రారంభించారు.
ప్రారంభ సాంకేతిక అభివృద్ధిలో సీ-డ్యాక్(సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) లాంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
2023లో ఈఆర్ఓనెట్ 2.0 తదుపరి దశ అమల్లోకి వచ్చింది. 2022–2023 కాలంలో టీసీఎస్ ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వామిగా ప్రవేశించింది.
ఎన్నికల సంఘం 2023 డిసెంబరులో విడుదల చేసిన నియామక ప్రకటనలో ఈఆర్ఓనెట్ 2.0, దానికి సంబంధిత అప్లికేషన్ల అభివృద్ధిని టీసీఎస్‌తో అనుసంధానం చేసినట్లు ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
టీసీఎస్ లాంటి ప్రైవేటు సంస్థ ప్రభుత్వానికి సాఫ్ట్వేర్ అభివృద్ధి సేవలు అందించడం తప్పు కాకపోవచ్చు. అనేక ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సాంకేతిక సంస్థల సేవలను వినియోగిస్తున్నాయి.
అయితే ఎన్నికల నిర్వహణ లాంటి అత్యంత కీలకమైన రంగంలో కాంట్రాక్టు ఇచ్చే విధానం, ఎంపికకు ఆధారాలు, సాంకేతిక నియంత్రణ, డేటా భద్రత, బాధ్యతల విభజన స్పష్టంగా ఉండాలి.
అందువల్ల ఈ సందర్భంలో నాలుగు ప్రశ్నలు కీలకం. టీసీఎస్‌ను ఎంపిక చేయడానికి అనుసరించిన టెండర్ లేదా ఇతర కొనుగోలు విధానం ఏమిటి, ఆ ఎంపికను ఏ కమిటీ లేదా ఏ అధికారి ఆమోదించారు, సీ-డ్యాక్ పాత్ర ఎందుకు తగ్గింది, తగ్గితే ఏ పనుల్లో ఏ ఒప్పందం ప్రకారం తగ్గింది, సాఫ్ట్వేర్ కోడ్, డేటాబేస్, వినియోగదారులకు సమాచార లభ్యత, సాంకేతిక మార్పులపై తుది నియంత్రణ ఎవరి వద్ద ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఒప్పందాలు, ఎంపిక పత్రాలు, సాంకేతిక బాధ్యతల వివరాలు, ఆడిట్ నివేదికలు బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి.
ఈసీఐనెట్, ఈఆర్ఓనెట్తో సంబంధం:
ఈసీఐనెట్ అనేది ఎన్నికల సేవల ఏకీకృత డిజిటల్ వేదిక. 2026 జనవరి 22న ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ సందర్భంగా దీన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఆలోచనతో ఈ వేదిక అభివృద్ధి చేయబడింది. దీని అభివృద్ధి గురించి 2025 మేలో ప్రకటించారు.
ఈసీఐనెట్ ద్వారా ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన సేవల్లో ఓటరు నమోదు, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, దరఖాస్తుల పురోగతిని తెలుసుకోవడం, ఓటరు గుర్తింపు కార్డు(ఈ-ఎపిక్) డౌన్లోడ్ చేసుకోవడం, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల పరిష్కారం, ఎన్నికల సమాచారం, ఎన్నికల సిబ్బందికి అవసరమైన వివిధ డిజిటల్ సేవలు ఉన్నాయి.
ఈ వేదిక నలభైకి పైగా యాప్‌లను, పోర్టళ్లను ఏకీకృతం చేసింది. ఇది ఇరవై రెండు షెడ్యూల్డ్ భారతీయ భాషలతో పాటు ఆంగ్లంలో అందుబాటులో ఉందని ఎన్నికల సంఘం ద్వారా తెలుస్తున్నది.
ఈఆర్ఓనెట్ లేదా ఈఆర్ఓనెట్ 2.0 అంటే ఓటర్ల జాబితా నిర్వహణ, నమోదు ప్రక్రియ. దీన్ని ఓటర్ల నమోదు అధికారులు, సంబంధిత ఎన్నికల సిబ్బంది మాత్రమే ఉపయోగించుకోగలరు.
ఇది నిర్వహించాల్సిన పనులు నమోదు, వివరాల మార్పులు, ధ్రువీకరణ, జాబితా నిర్వహణ. ఇది కేవలం ఓటర్ల జాబితాకు సంబంధించిన వ్యవస్థ.
ఈసీఐనెట్ అంటే అనేక ఎన్నికల సేవలకు ఏకీకృత డిజిటల్ వేదిక. దీన్ని ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు వినియోగించుకోవచ్చు. ఓటరు సేవలు, దరఖాస్తుల స్థితి, సమాచార సేవలు, సిబ్బంది అప్లికేషన్లు దీని పని. ఈఆర్ఓనెట్తో సహా నలభైకి పైగా యాప్‌లు, పోర్టళ్లను అనుసంధానం చేసే వ్యవస్థ ఇది.
సాఫ్ట్‌వేర్‌పై నియంత్రణ ఎవరిది?
2026 సెప్టెంబరులో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాలు ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకొచ్చాయి. ఆ కథనాల ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఓటర్ల జాబితాల నిర్వహణకు సంబంధించిన కొన్ని నిర్ణయాలపై, సాఫ్ట్వేర్ అందుబాటు కేంద్రీకరణపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సాఫ్ట్వేర్ ద్వారా చట్టబద్ధంగా అధికారాలు పొందిన స్థానిక అధికారులు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పరిమితం కాకూడదని వారు ప్రశ్నించినట్లు వార్తలు పేర్కొన్నాయి. ఇందులో ప్రధానంగా మూడు రకాల ఆందోళనలు ఉన్నాయి.
స్థానిక అధికారుల చట్టబద్ధమైన అధికారాలు:
ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల చేర్పు తొలగింపు విషయంలో చట్ట ప్రకారం నిర్దిష్ట అధికారులు బాధ్యత వహిస్తారు. కానీ కంప్యూటర్ వ్యవస్థలో ఒక అధికారి చేయగలిగే పనులను మరొక కేంద్ర విభాగం సాంకేతికంగా పరిమితం చేస్తే, చట్టంలో ఇచ్చిన అధికారాలు ఆచరణలో ఎంతవరకు అమలు అవుతాయనే ప్రశ్న వస్తుంది.
సాఫ్ట్వేర్ ఒక నిర్దిష్ట చర్యకు మాత్రమే అవకాశం ఇస్తే, సంబంధిత అధికారి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన ఇతర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి సమస్యలను సాంకేతిక రూపకల్పనలోనే నివారించాలి.
సాఫ్ట్‌వేర్‌లో కీలక మార్పులు ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ఆమోదించారు, ఎప్పుడు అమలు చేశారు, ఏ అధికారులు అభ్యంతరాలు తెలిపారు, వాటికి ఏమి సమాధానం ఇచ్చారు అనే వివరాలు అధికారిక ఆధార పత్రాల ద్వారానే తెలుస్తుంది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాల్లో వచ్చిన వివరాలు అంతర్గత పత్రాల ఆధారంగా చేసిన పరిశోధనాత్మక కథనాలు కాబట్టి అవి విచారణలో తేలాలి.
ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానం:
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనాలకు ఎన్నికల సంఘం స్పందించింది. 2026 సెప్టెంబరు ఇరవై మూడున వెలువడిన వివరణలో, కమిషనర్లు వ్యక్తిగతంగా అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు తెలియజేయడం నిర్ణయ ప్రక్రియలో భాగమని, గత సంవత్సరంలో కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఏకగ్రీవంగా జరిగాయని తెలిపింది.
డిజిటల్ వ్యవస్థల్లో అనధికారిక మార్పులను నిరోధించే భద్రతా చర్యలు ఉన్నాయని కూడా పేర్కొంది. అయితే అంతర్గత అభ్యంతరాల్లో లేవనెత్తిన నిర్దిష్ట ప్రశ్నకు ఆ ప్రకటన సమాధానం ఇవ్వలేదని పత్రిక పేర్కొంది.
2026 సెప్టెంబరు 24న ఈసీఐనెట్ రోజువారీ నిర్వహణపై మరో వివరణ ఇచ్చింది. ఇది ఒక వికేంద్రీకృత వేదిక అని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులు తమ చట్టబద్ధమైన విధులను ప్రత్యేక గుర్తింపులు, పాస్‌వర్డ్‌ల ద్వారా నిర్వహిస్తారని తెలిపింది.
రోజువారీ కార్యకలాపాల నిర్వహణను తాను కేంద్రంగా నియంత్రించదని, సైబర్ భద్రతా రక్షణను మాత్రం అందిస్తుందని పేర్కొంది.
ఎన్నికల సంఘం ప్రకారం ఓటర్ల జాబితాలకు సంబంధించిన చట్టబద్ధమైన చర్యలను సంబంధిత అధికారులే చేపట్టాలి. ఇతర అధికారులు వారి స్థానంలో ఆ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించరాదు అనేది ఈ వివరణలో ముఖ్యమైన అంశం.
అయితే, చట్టబద్ధమైన అధికారాలు వికేంద్రీకృతంగా ఉన్నాయని చెప్పినంత మాత్రాన సాఫ్ట్‌వేర్‌లోని అన్ని సాంకేతిక పరిమితులు సముచితంగా ఉన్నాయని నిరూపించినట్లు కాదు.
ఆచరణలో అధికారులు చేయగలిగే చర్యలు, సాఫ్ట్‌వేర్‌లోని అందుబాటు నియమాలు, నిర్ణయాల ఆడిట్ రికార్డులను పరిశీలించడం ద్వారా మాత్రమే ఈ అంశాలు నిర్ధారించబడతాయి.
సెప్టెంబరు 26న ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం:
ఈసీఐనెట్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుందో లేదో సమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎన్నికల సంఘం 2026 సెప్టెంబరు ఇరవై ఆరున అధికారికంగా ప్రకటించింది.
ఈ కమిటీకి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నాయకత్వం వహిస్తారు. ఐఐటీ లేదా ట్రిపుల్ ఐటీకి చెందిన స్వతంత్ర నిపుణుడిని కూడా కమిటీలో చేర్చనున్నట్లు ప్రకటించారు.
ఇంకా మూడు ముఖ్యమైన నిర్ణయాలు కూడా వెల్లడించింది. ఫీల్డ్ అధికారులకు వారి చట్టబద్ధమైన అధికారాలకు అనుగుణంగా సాంకేతిక అందుబాటు కల్పించడం.
రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా అవసరమైన సాంకేతిక మార్పులు చేయడం.
భవిష్యత్తులో కొత్త ఐటీ మాడ్యూళ్లు, పోర్టళ్లకు సంబంధించిన ప్రతిపాదనలను కమిషన్ ఆమోదానికి ముందు అధికారుల కమిటీ(కమిటీ ఆఫ్ ఆఫీసర్స్)లో చర్చించడం.
ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఎందుకంటే సాఫ్ట్వేర్ రూపకల్పన, చట్టబద్ధమైన అధికారాలు, సాంకేతిక అందుబాటు (ప్రాప్యత) మధ్య సమన్వయం అవసరమని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలే సూచిస్తున్నాయి.
కమిటీని ఏర్పాటు చేయడం అంటేనే సాఫ్ట్‌వేర్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
సాఫ్ట్వేర్ లోపాలు ఓటర్లపై ప్రభావం:
ఈ వివాదం కేవలం అధికారుల మధ్య పరిపాలనా తగాదా కాదు. సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు లేదా అందుబాటు (ప్రాప్యత) పరిమితులు సాధారణ ఓటర్ల హక్కులను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు పాత ఓటర్ల జాబితాలోని వివరాలతో సరి పోక పోవడం లాంటివి.
2026 సెప్టెంబరు 24న హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో సుమారు కోటి డెబ్బై ఆరు లక్షల మంది ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియలో “లాజికల్ డిస్క్రిపెన్సీ” అనే కారణంతో నోటీసులు జారీ అయ్యాయి.
పాత జాబితాలోని పేర్లు, వయస్సులు, కుటుంబ వివరాలు ప్రస్తుతం సమర్పించిన వివరాలతో సరిపోకపోవడం ఇందుకు ఒక కారణంగా పేర్కొన్నారు.
2002 ఓటర్ల జాబితా తయారు అయ్యే నాటికి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో లేదు. అప్పుడు ఓటర్ల నమోదుకు వచ్చిన అధికారులు అడిగినప్పుడు వివరాలు చెప్పే వారు. చెప్పిన దాన్ని అధికారి రాసుకోవడంలో పొరపాట్లు జరగవచ్చు.
లేదా ఉచ్ఛారణను అర్థం చేసుకోవడంలో తేడా ఉండవచ్చు. అది పొరపాటుగా రాయడానికి దారి తీయవచ్చు. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావడం, ఓటరు జాబితా నుండి పేరు ఎందుకు తొలగించకూడదని నోటీసులు జారీ చేయడం వివాదానికి మూలం.
అదే సందర్భంలో నాటి కుటుంబ పెద్దలలో ఇప్పుడు ఎంతమంది జీవించి ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. అప్పటివారు ఎలా ఉచ్ఛరించారు, దానిని అధికారులు ఎలా అర్థం చేసుకొని ఓటర్ల జాబితాలో నమోదు చేశారు అనే విషయాలు ఎవరు, ఎలా నిర్ధారించగలరు?
తెలంగాణకు సంబంధించిన ఉదాహరణలో, పాత జాబితాలో తెలుగు భాషలో ఉన్న పేర్లను ఆంగ్ల భాషలోకి మార్చినప్పుడు అక్షరాల తేడాలు ఏర్పడటం వల్ల కొందరి వివరాలు సరిపోలేదని ఆ కథనం తెలిపింది.
హైదరాబాద్‌లోని ఒక ఓటరు పేరు పాత రికార్డులో వేరే ఆంగ్ల స్పెల్లింగ్‌తో నమోదవడంతో నోటీసు అందుకున్న ఉదాహరణను కూడా ప్రచురించింది.
కంప్యూటర్ గుర్తించిన వ్యత్యాసం నిజమైన తప్పిదమా, కంప్యూటర్ రికార్డులో లోపమా, లేక అర్హతకు సంబంధించిన సమస్యా అనేది మానవ పరిశీలన ద్వారా మాత్రమే నిర్ధారించాలి.
వయసు వివరాల్లో తప్పులు:
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2026 అక్టోబరు పది ప్రాంతంలో ప్రచురించిన వార్త ప్రకారం, మహారాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,70,313 మంది వయస్సులు 101- 150 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తప్పుగా నమోదయ్యాయి.
జనన సంవత్సరానికి సంబంధించిన డేటా లోపం దీనికి కారణంగా పేర్కొన్నారు. ఈ సమస్యను సరిచేయడానికి ఒక నెలకు పైగా పట్టినట్లు నివేదిక తెలిపింది.
ఇది ఓటర్ల జాబితాలోని సాంకేతిక నాణ్యతను నిరంతరం పరీక్షించాల్సిన అవసరాన్ని తెలియచేస్తుంది.
నిర్ణయం తీసుకున్నా, సాఫ్ట్‌వేర్‌లో అమలు కాకపోవడం:
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్త ప్రకారం, గోవాలో 97 మంది ఓటర్లకు సంబంధించి అధికారులు అనుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ, డేటాబేస్‌లో మార్పులు చేయలేకపోవడంతో వారి పేర్లు తుది జాబితాలో చేరలేదని తేలింది.
ఒక అధికారి చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయం సాంకేతిక కారణాల వల్ల అమలు కాకపోతే, దాన్ని సరిదిద్దేందుకు వేగవంతమైన విధానం ఉండాలి. అందుకే సాఫ్ట్‌వేర్‌లో చేసిన ప్రతి మార్పుకు రికార్డు, తప్పులను వెనక్కి తీసుకునే అవకాశం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అవసరం.
ఓటర్ల జాబితా విషయంలో చట్టం ఏమి చెబుతోంది?
ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి భారత రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950(రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్), ఓటర్ల నమోదు నియమాలు 1960(రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్) అత్యంత ముఖ్యమైనవి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు, ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి అధికారాలను కల్పిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 13 బీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు అధికారుల నియామకానికి సంబంధించినది.
ఓటర్ల నమోదు నియమాలు 1960 ఓటర్ల జాబితాల తయారీ, సవరణ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం లాంటి ప్రక్రియలకు వర్తిస్తాయి.
ఈ చట్టపరమైన విధానంలో ఓటర్ల నమోదు అధికారి(ఈఆర్ఓ)కి ముఖ్యమైన బాధ్యత ఉంటుంది. సాఫ్ట్వేర్ అనేది ఆ చట్టబద్ధమైన విధులను నిర్వహించేందుకు ఉపయోగించే సాధనం మాత్రమే. అది చట్టానికి ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల సాఫ్ట్వేర్ రూపకల్పనలో పాటించాల్సిన ప్రధాన సూత్రాలు – చట్టబద్ధమైన అధికారి తన విధులను స్వతంత్రంగా నిర్వహించగలగాలి.
కంప్యూటర్ ఇచ్చిన హెచ్చరిక ఒక్కటే ఓటరు హక్కును తొలగించడానికి తుది కారణం కాకూడదు. ప్రతి నిర్ణయానికి బాధ్యత వహించిన అధికారి కారణాలు, తేదీ, సంబంధిత రికార్డు అందుబాటులో ఉంచాలి.
ఓటరుకు నోటీసు, సమాధానం చెప్పే అవకాశం, అప్పీల్ లేదా పునఃపరిశీలనకు వర్తించే చట్టబద్ధమైన మార్గాలు ఉండాలి. సాఫ్ట్వేర్ మార్పులు చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది స్వతంత్రంగా పరీక్షించాలి.
సమాధానం రావాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు:
ఈ అంశాన్ని సమగ్రంగా పరిష్కరించాలంటే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, సాంకేతిక సేవల సంస్థలు ప్రజలకు సమాచారం అందుబాటులో ఉంచాలి.
ఈఆర్ఓనెట్ 2.0 అభివృద్ధికి టీసీఎస్‌ను ఎలా ఎంపిక చేశారు, అందుకు సంబంధించిన టెండర్, ఒప్పందం, ఎంపిక కమిటీ రికార్డులు అందుబాటులో ఉంచాలి. సీ-డ్యాక్ పాత్ర ఏ మేరకు తగ్గింది అనేది పరిశీలించడానికి పాత, కొత్త ప్రాజెక్టు పరిధులు, ఒప్పందాలు బయట పెట్టాలి.
అశ్విని వైష్ణవ్‌కు ఈ ప్రాజెక్టులో నిర్దిష్ట పాత్ర ఉందా అనేది శాఖా ఉత్తర్వులు, ఆమోద పత్రాలు, సమావేశాల మినిట్స్ బయట పెడితే గాని తేలదు.
ఓటర్ల జాబితా సాఫ్ట్‌వేర్‌పై తుది సాంకేతిక నియంత్రణ ఎవరిది అన్నది తెలుసుకోవడానికి యూజర్ యాక్సెస్ విధానం, అధికారాల విభజన పత్రాలు పరిశీలించాలి. పేర్ల చేర్పు, తొలగింపు నిర్ణయాలను ఎవరు తీసుకుంటారు, సాఫ్ట్వేర్ లోపాలను ఎవరు పరీక్షిస్తున్నారు అనేవి స్వతంత్ర ఆడిట్ నివేదికలు, సెక్యూరిటీ పరీక్షలు బయట పెట్టాలి.
2026 సెప్టెంబరు ఇరవై ఆరున ప్రకటించిన సమీక్ష కమిటీ ఏమి తేల్చింది, ఇందుకు కమిటీ నివేదిక, సిఫార్సులు, అమలు వివరాలు అవసరం.
ప్రజాస్వామ్యానికి పారదర్శకత అవసరం:
ఓటర్ల జాబితా కేవలం ఒక ప్రభుత్వ డేటాబేస్ కాదు. అది ప్రజాస్వామ్యంలో పౌరుడి రాజకీయ భాగస్వామ్యానికి పునాది. అందువల్ల ఎన్నికల సాంకేతిక వ్యవస్థల విషయంలో కనీసంగా ఈ చర్యలు చేపట్టాలి.
స్వతంత్ర సాంకేతిక ఆడిట్ జరగాలి. సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, అనధికారిక మార్పులు, చట్టవిరుద్ధమైన పరిమితులు ఉన్నాయా అని నిపుణుల కమిటీ పరిశీలించాలి.
పారదర్శక కాంట్రాక్టులు ఉండాలి. సాఫ్ట్వేర్ అభివృద్ధి, నిర్వహణ, భద్రత, డేటా ప్రాప్యతకు సంబంధించిన బాధ్యతలను స్పష్టంగా ప్రకటించాలి. అధికారాల విభజన స్పష్టంగా ఉండాలి. సాంకేతిక సిబ్బంది, సాఫ్ట్వేర్ కాంట్రాక్టర్లు, ఓటర్ల నమోదు అధికారులు, ఎన్నికల కమిషనర్ల పాత్రలు స్పష్టంగా నిర్వచించాలి. మార్పుల రికార్డులు ఉంచాలి.
ఓటర్ల వివరాల్లో ప్రతి మార్పు ఎవరు చేశారు, ఏ ఆధారంతో చేశారు, ఎవరు ఆమోదించారు అనే వివరాలు భద్రపరచాలి. ఓటర్లకు సులభమైన పరిష్కార మార్గం ఉండాలి. తప్పుగా పేరు తొలగించబడినవారు లేదా నోటీసులు అందుకున్నవారు తమ సమస్యను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించాలి. సాంకేతిక నిర్ణయాలకు ప్రజాస్వామ్య పర్యవేక్షణ అవసరం.
సాఫ్ట్వేర్ నిర్ణయాలు చట్టబద్ధమైన అధికారుల బాధ్యతను భర్తీ చేయకుండా చూసుకోవాలి. ఈ చర్యలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉండటానికి కాదు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికి మాత్రమే అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
