నిర్బంధించిన వందలాది మందిలో ఇద్దరు ఎంపీలు వి శివదాసన్, ఏఏ రహీమ్ ఉన్నారని ఎస్ఎఫ్ఐ ఒక పోస్టులో తెలియచేసింది. ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ నిరసనకారులను కూడా నిర్బంధించినట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను కోరుతూ, ప్రజాస్వామిక అసమ్మతిని అణచివేయడానికి నిరసన వేదిక హోదాను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్‌కు చేరుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు ఎంపీలతో సహా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐకి చెందిన అనేక మంది నాయకులను ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 14న నిర్బంధించారు.
విద్యార్థి నిరసనకారులను దారుణంగా అణచివేయడంతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, సభ్యులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు దూసుకెళ్లారు.
ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ నిరసనకారులు కూడా పట్టబడినట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి.
ఫిరోజ్‌షా రోడ్డు నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ చేయడానికి ప్రయత్నించిన వామపక్ష ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలను పోలీస్ బ్యారికేడ్ల వద్ద ఆపేసి ఆ తర్వాత నిర్బంధించారు.
జంతర్ మంతర్‌ను తిరిగి పొంది తీరుతామని, అనేక మంది ప్రజలు చేరడంతో నిరసన బలాన్ని పుంజుకుంటుందని విద్యార్థి కార్యకర్తలు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు.
పోలీసులు నిర్బంధించి తెలియని ప్రదేశానికి తరలించిన వారిలో ఎంపీలు వి శివదాసన్, డివైఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు ఏఏ రహీమ్, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజి, డివైఎఫ్ఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు జైక్ సి థామస్, ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ కమిటీ సభ్యులు అభిజిత్ ఉన్నారు.
వారితో పాటు వందలాది మంది విద్యార్థి యువజనులను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఎస్ఎఫ్ఐ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ నిర్వహణను వ్యతిరేకిస్తూ చెలరేగిన దుమారంలో వేదిక వద్దకు చేరడానికి ప్రయత్నించిన నిరసనకారులను ఢిల్లీ పోలీసులు దారుణంగా అణచివేస్తున్న సమయంలో జంతర్ మంతర్‌కు నిరసన వేదిక హోదాను అక్టోబర్ 12న రద్దు చేసింది.
జంతర్ మంతర్‌లోకి అక్టోబర్ 13న దూరి జాతీయ జెండాను ఎగురవేసిన కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) నాయకులు అషుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు అతిక్రమించారన్న ఆరోపణలపై ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
న్యూఢిల్లీ వ్యాప్తంగా అక్టోబర్ 10, 11 తేదీలలో నిరసనలు తెలిపిన కారణంగా పిల్లలు, జర్నలిస్టులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది ప్రజలను దారుణంగా చితకబాది నిర్బంధించారు.
ముందుగా నిర్ణయించినదాని ప్రకారం అక్టోబర్ 10 నిరసనల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు అంచెలంచెలుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇంకా అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిరసనకారుల నిర్బంధానికి, పోలీస్ సిబ్బంది విధుల కోసం ఉపయోగిస్తున్న కారణంగా బస్సుల అందుబాటును తగ్గించడం, పోలీసులు దారులను మళ్లించడంతో ఢిల్లీ ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని ది హిందు కథనం తెలియచేసింది.
భద్రతా సిబ్బంది లేదా నిర్బంధించిన వారి రవాణాకు కనీసం 600 బస్సులను వినియోగిస్తున్నారని, ప్రభుత్వ డేటా లేని కారణంగా ప్రజా రవాణాలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ఏర్పడిన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏక్తా కర్మచారి యూనియన్ తెలిపింది.
పోస్టుల “తొలగింపు”
కాగా పుకార్లను వ్యాప్తి చేయడం లేదా ప్రజల్లో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ దాదాపు 500 సామాజిక మాధ్యమాల పోస్టులను ఢిల్లీ పోలీసులు తొలగించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
సెంట్రల్ ఢిల్లీలో అక్టోబర్ 10న ఇంటర్నెట్ సేవలను హోం మంత్రిత్వ శాఖ మూసివేసింది. వేలాది మంది నిరసనకారులను తీసుకెళ్లి విడుదల చేసినందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాలలో కూడా ఇంటర్నెట్ లేదని తర్వాత ఆలస్యంగా గుర్తించడం జరిగింది.
దేశ రాజధానిలో ఇటీవల నిరసనలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కృత్రిమంగా, తప్పుదోవ పట్టించే, బూటకపు సమాచారాన్ని సృష్టిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై పోలీస్ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అదనపు కమీషనర్ సంజయ్ భాటియా చెప్పారు.
నిరసనకారుల ఫోన్లలో వివిధ అకౌంట్ల ద్వారా వచ్చే వీడియోలు, ఫోటోలను తొలగించాలని పోలీసులు ఆదేశించారు. కొన్ని కేసుల్లో వారి ఫోన్ల నుంచి పోలీసులే వారికి వారే పోస్టులను తొలగించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
