భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో కొందరు నాయకులు ప్రజలను ప్రత్యక్ష పోరాటాలకు సమీకరించారు. మరికొందరు తమ రచనలతో, పత్రికలతో, విద్యాసంస్థలతో జాతీయ చైతన్యాన్ని కలిగించారు.
కొలవెన్ను రామకోటేశ్వరరావు ఈ రెండో కోవకు చెందిన విశిష్ట వ్యక్తి. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా, భారతీయ సంస్కృతి, సాహిత్యం, కళలు, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.
ఆయన స్థాపించిన ‘త్రివేణి’ పత్రిక భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, ఉన్నతమైన పాత్రికేయ విలువలకు ప్రతీకగా నిలిచింది. అక్టోబరు 22 ఆయన జయంతి.
జననం, విద్యాభ్యాసం
కొలవెన్ను రామకోటేశ్వరరావు 1894 అక్టోబరు 22న అప్పటి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో జన్మించారు. ఆయన తండ్రి వియ్యన్న పంతులు న్యాయవాదిగా మంచి పేరు సంపాదించారు.
రామకోటేశ్వరరావు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. మంచి విద్యార్హతలు ఉండి, న్యాయవాద వృత్తిలో స్థిరపడి సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఆయనకు ఉంది. కానీ రామకోటేశ్వరరావు తన వ్యక్తిగత అభివృద్ధి కంటే జాతీయోద్యమానికి, సమాజానికి సేవ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
మహాత్మా గాంధీ ఆలోచనల ప్రభావంతో ఆయన జాతీయోద్యమంలోకి ప్రవేశించారు.
జాతీయోద్యమంలో పాత్ర
గాంధీజీ నాయకత్వంలో భారత స్వాతంత్య్రోద్యమం కొత్త దశలోకి ప్రవేశించినప్పుడు, దేశవ్యాప్తంగా అనేక మంది విద్యావంతులు తమ వృత్తులను పక్కనపెట్టి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.
రామకోటేశ్వరరావు కూడా ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. ఆయన జాతీయోద్యమానికి అనుకూలంగా పనిచేసే పత్రికా రంగంలో సేవలందించారు.
ప్రముఖ జాతీయవాది టంగుటూరి ప్రకాశం పంతులుతో సంబంధం ఉన్న ‘స్వరాజ్య’ పత్రికలో పనిచేశారు. అనంతరం మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉపాధ్యాయుడిగా, తరువాత ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు.
1930 నాటి ఉప్పు సత్యాగ్రహం, 1940 నాటి వ్యక్తి సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు.
1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ జీవితం ప్రజాసేవ, జాతీయోద్యమం, విద్యారంగాలతో ముడిపడి ఉంది.
‘త్రివేణి’ పత్రిక స్థాపన
రామకోటేశ్వరరావు జీవితంలో అత్యంత విశిష్టమైన ఘట్టం ‘త్రివేణి’ పత్రిక స్థాపన. 1927 చివరిలో ప్రారంభమైన ఈ ఆంగ్ల సాంస్కృతిక పత్రిక తొలి సంచిక 1928 జనవరిలో వెలువడింది.
భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, కళలు, తత్వశాస్త్రం, జాతీయ భావనలను దేశవ్యాప్తంగా పాఠకులకు పరిచయం చేయడం దీని ప్రధాన లక్ష్యం.
ఆ కాలంలో ప్రాంతీయ భాషల్లో వెలువడే గొప్ప రచనలు ఇతర భాషల ప్రజలకు సులభంగా చేరేవి కావు. ఈ సమస్యను గుర్తించిన రామకోటేశ్వరరావు, వివిధ భారతీయ భాషల సాహిత్యాన్ని ఆంగ్లం ద్వారా విస్తృత పాఠకలోకానికి పరిచయం చేయాలని సంకల్పించారు. తద్వారా భారతదేశ సాంస్కృతిక వైవిధ్యంలోని ఏకత్వాన్ని ప్రతిబింబించాలని ఆశించారు.
త్రివేణి పత్రికలో జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సీ రాజగోపాలాచారి తదితర ప్రముఖుల రచనలు ప్రచురితమయ్యాయి.
భారతీయ మేధావులు, రచయితలు, కళాకారులకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది.
పత్రికను నిర్వహించడం ఆర్థికంగా ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ, దాని ఆశయాలను పక్కనపెట్టి కేవలం లాభాల కోసం నడపడానికి ఆయన సిద్ధపడలేదు.
నాణ్యత, స్వతంత్ర ఆలోచన, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. పత్రికను నిలబెట్టడానికి ఆయన చేసిన దీర్ఘకాల కృషి భారతీయ పాత్రికేయ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది.
పాత్రికేయ విలువలు – నేటి తరానికి ఆదర్శం
నేటి కాలంలో వార్తాపత్రికలు, టెలివిజన్, డిజిటల్ మీడియా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సమాచారాన్ని వేగంగా అందించడం ఎంత ముఖ్యమో, దానిని బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందించడం కూడా అంతే ముఖ్యం. రామకోటేశ్వరరావు జీవితం నిలువెల్లా విలువల మయం.
ఆయన ఆశయాలకు కట్టుబడి పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన పత్రిక లక్ష్యాలను వదులుకోలేదు.
సాంస్కృతిక సమైక్యత, భిన్న భాషలు, సాహిత్య సంప్రదాయాలను పరస్పరం పరిచయం చేయడం ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని గౌరవించారు.
విద్యకు ప్రాధాన్యం: జాతీయ కళాశాలలో పనిచేయడం ద్వారా యువతలో జాతీయ చైతన్యం, విజ్ఞానం పెంపొందించడానికి కృషి చేశారు.
ప్రజాసేవ: వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశం, సమాజం, ప్రజాస్వామ్య విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
నేడు మీడియా సంస్థలు ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ ప్రభావాలు, వాణిజ్య ప్రయోజనాలు, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి అనైతిక పద్ధతులకు తలొగ్గుతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో రామకోటేశ్వరరావు పాత్రికేయ జీవితం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
పత్రిక అనేది కేవలం వార్తలను ప్రచురించే సాధనం కాదు. ప్రజలకు జ్ఞానాన్ని అందించే, సమాజాన్ని ఆలోచింపజేసే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే వేదిక కూడా కావాలి.
సాహిత్యం, చరిత్ర, కళలు, శాస్త్రీయ ఆలోచనలకు మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే, రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించడం, వివిధ భాషల ప్రజల మధ్య అవగాహన పెంచడం అత్యంత అవసరం.
త్రివేణి ద్వారా రామకోటేశ్వరరావు సాధించాలనుకున్న లక్ష్యం నేటికీ ప్రాధాన్యం కలిగి ఉంది. 1970 మే 19న ఆయన కన్నుమూసినా, ఆయన నెలకొల్పిన పాత్రికేయ ఆదర్శాలు, సాంస్కృతిక సమైక్యత పట్ల నిబద్ధత చిరస్మరణీయమైనవి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
