ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్సార్సీపీ) నాయకుడు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన చట్టానికి నాడు మద్దతు తెలిపినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ‘ది న్యూస్ మినిట్’ వార్తా సంస్థ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య రాజకీయ హింస చోటుచేసుకుంటోందంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ), బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
చట్టం – సుప్రీంకోర్టు విచారణ
2023లో తీసుకొచ్చిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాల చట్టం’ ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు ఒక ఎంపిక కమిటీ సిఫార్సులు చేయాలి.
ఈ కమిటీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గంలోని ఒక మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్లు ‘స్క్రోల్’ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ ఎంపిక కమిటీలో ప్రభుత్వానికి ఆధిక్యం ఉండేలా సభ్యుల కూర్పు ఉంది. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు తలెత్తితే ప్రతిపక్ష నేత కంటే ప్రభుత్వానికి 2:1 నిష్పత్తిలో మెజారిటీ ఉంటుంది.
నిష్పాక్షికతపై సందేహాలు
ఆదివారం జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ఈ చట్టానికి తమ పార్టీ మద్దతు తెలిపి తప్పు చేసిందని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లోనూ ఎన్నికల కమిషనర్ల నియామకాలు నిష్పాక్షికంగా జరగాలని ఆయన స్పష్టం చేసినట్లు ది న్యూస్ మినిట్ వార్తా సంస్థ వెల్లడించింది.
“విద్యార్థి తనకు పరీక్ష పెట్టే పరీక్షకుణ్ని నియమించుకోలేడు” అని జగన్ వ్యాఖ్యానించినట్లు ‘ఇండియా టుడే’ పేర్కొంది.
నిష్పాక్షికత లేని విధానంలో ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తే, ఆ పదవిలో ఉన్న వ్యక్తి నిజాయితీపరుడైనప్పటికీ ఆయన నిష్పాక్షికతపై సందేహాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని జగన్ అన్నారు.
ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నియంత్రణలో ఉండకూడదని ఆయన వాదించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు
రాష్ట్ర యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని ది న్యూస్ మినిట్ వార్తా సంస్థ వెల్లడించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కున్నారని, పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారని, వారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేశారని జగన్ ఆరోపించినట్లు ఇండియా టుడే పేర్కొంది.
పోలీసుల అండతోనే తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, ఆస్తులకు నిప్పు పెడుతోందని, తప్పుడు కేసులు నమోదు చేయిస్తోందని జగన్ ఆరోపించినట్లు ది న్యూస్ మినిట్ పేర్కొంది.
“లోపాన్ని సరిచేస్తే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది” అని జగన్ అన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది.
కమిటీ కూర్పుపై వివాదం
2023 డిసెంబరులో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పాటైన నియామక విధానాన్ని మార్చివేసింది.
2023 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకానికి సిఫార్సులు చేసేందుకు ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని కోర్టు నిర్దేశించింది. తాజా చట్టం ద్వారా ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
మే నెలలో జరిగిన విచారణ సందర్భంగా ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఎంపిక కమిటీలో కేంద్ర మంత్రివర్గానికి చెందిన ఒక మంత్రిని చేర్చాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
2025 ఫిబ్రవరిలో జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అయితే ఈ నియామకానికి సంబంధించిన ఎంపిక కమిటీ సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన అసమ్మతిని తెలియజేస్తూ ప్రత్యేక నోట్ సమర్పించారు. అయినప్పటికీ ఆయన అభ్యంతరాలను పక్కనపెట్టి జ్ఞానేశ్ కుమార్ నియామకం జరిగింది.
2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ చట్టం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం చట్టం రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించనుంది.
సంపాదకత్వం: అనామికా పాఠక్
అనువాదం: కె. మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
