(షార్జీల్ ఇమామ్ ప్రముఖ ముస్లిం కార్యకర్త, జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన సామూహిక నిరసనల్లో ప్రసంగాలు చేసినందుకు ఆయన ప్రస్తుతం ఉపా, రాజద్రోహ చట్టాల కింద జైలులో ఉన్నారు. షార్జీల్ ఇమామ్, సెప్టెంబరు 10న తీహార్ జైలు నుంచి ఈ వ్యాసాన్ని రాశారు.)
ఈ జైలు జీవితం నన్ను ఎంతగానో మార్చివేసింది. ఆ మార్పు లోతుపాతులు నేను ఇప్పటికీ పూర్తిగా గ్రహించలేకపోతున్నాను. దీనిలో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి.
ఒకటి నా గురించి నేను ఏమనుకుంటున్నాను, ఎలా ప్రవర్తిస్తాను. రెండోది ఇతరులు నన్ను ఎలా చూస్తున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది.
మొదటిగా రెండో అంశాన్ని పరిశీలిద్దాం – ఇతరుల దృష్టిలో నేను ఎవరు?
వివిధ తరగతుల ప్రజలకు నేను వివిధ రకాలుగా కనిపిస్తాను. మెజారిటీగా ఉన్న ప్రజల దృష్టిలో నేను ఒక ఉగ్రవాదిని. అధికార వర్గాలు వారిని నమ్మించినట్లుగా, ఢిల్లీలో అల్లర్లు సృష్టించడానికి నేను కుట్ర పన్నానని వారు బలంగా నమ్ముతున్నారు.
నేను అరెస్టయిన నెల రోజుల తర్వాత అల్లర్లు జరిగాయనే వాస్తవంతో వారికి సంబంధం లేదు. ఆ అల్లర్లకు బాధ్యుడైన ఉగ్రవాదిగా ఇప్పటికీ నన్ను పరిగణిస్తున్నారు.
తర్వాత, కొంచెం విచక్షణ గల మరో తరగతి ప్రజానీకం “అతను ఉగ్రవాది కాకపోవచ్చు, కానీ కచ్చితంగా దేశద్రోహి” అని అంటుంటారు. అసోంను భారతదేశం నుంచి వేరు చేయాలని నేను కోరుకున్నాననే వారి నమ్మకం ఆధారంగా ఈ విచక్షణ గల తరగతి నన్ను అంచనా వేస్తుంది.
మూడో తరగతి ప్రజానీకం నన్ను రాత్రికి రాత్రే పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుని ఆశించిన ఒక రాజకీయ నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. దానికి గానూ నేను సరైన శిక్షే అనుభవిస్తున్నానని భావిస్తుంటారు.
జైలు లోపల, వెలుపల ఉన్న పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ మూడు తరగతుల కిందకే వస్తారు. వీరు నా అరెస్టును, జైలు జీవితాన్ని సమర్థిస్తారు.
నా గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇష్టపడరు. మీడియా వారికి అందించే నా ప్రతిరూపంతో సంతృప్తి చెందుతారు. వారి రాజకీయ నమ్మకాల తీవ్రతను బట్టి వారు నన్ను ద్వేషిస్తారు, అసహ్యించుకుంటారు లేదా చిన్నచూపు చూస్తారు.
నాకు మరింత కాలం జైలు శిక్ష పడాలని కోరుకునే ఈ తరగతి ప్రజానీకంతో పాటు నన్ను అన్యాయంగా బంధించారని భావించే సానుభూతిపరుల వర్గం కూడా ఉంది. ఈ వర్గంలో అతి మితవాదులు, పై మూడు వర్గాల్లో చివరిదైన వర్గానికి దాపున ఉంటారు.
“అవును, అతను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాడు. అవును, పేరు తెచ్చుకోవడానికి రెచ్చగొట్టాడు. కానీ కేవలం ఒక ప్రసంగం ఆధారంగా ఎవరినైనా సంవత్సరాల తరబడి జైలులో ఉంచడం న్యాయం కాదు కదా. అంతా చేస్తే అతను ఒక కాలేజీ విద్యార్థి అంతే తప్ప ఉగ్రవాది కాదు” అని వారు చెబుతుంటారు.
ఈ ఆలోచనా విధానం అంతగా ఉపయోగకరమైనదని నేను భావించనప్పటికీ, ఏదేమైనా వారికి ధన్యవాదాలు.
ఈ గ్రూపును దాటి, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ముస్లింలపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా నేను గొంతెత్తి మాట్లాడానని, బహుశా కాస్త హద్దు మీరి మాట్లాడి ఉండొచ్చని, ఏదేమైనా ఒక మంచి పోరాటం చేశానని, బూటకపు కేసుల ద్వారా జైలులో నిర్బంధించబడ్డానని భావించే ప్రజలూ ఉన్నారు. ఈ వర్గం ప్రజలు చాలా వరకు బీజేపీ వ్యతిరేకులే.
వీరు సీఏఏ వ్యతిరేక నిరసనల ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు, ముస్లింల పట్ల సానుభూతి చూపుతారు. ఈ వర్గం నాకు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది.
వీరి తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్న పేద ముస్లింలు ఉన్నారు. సీఏఏ గురించిన అవగాహన లేకపోయినా, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరుపై లోతైన జ్ఞానం లేకపోయినా, వారు సహజసిద్ధంగానే నాపై సానుభూతి చూపుతారు. మరింతగా ఆధిపత్య ధోరణిని సంతరించుకుంటున్న ఈ తిరోగమన సమాజంలో వారు పేదరికంతో పాటు హింసను కూడా ఎదుర్కొంటున్నారు. వారి నుంచి నాకు లభిస్తున్న అవ్యాజమైన ప్రేమ నాకు తృప్తినిస్తుంది, నాలో ఉత్సాహం నింపుతుంది. నా జీవితంలో మరేదీ నన్ను కదిలించని విధంగా వారి హావభావాలు నన్ను కదిలిస్తాయి.
నా జీవితంలో నేను మాట్లాడిన లేదా రాసిన ప్రతీదీ వారికి వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ దానిలో ఎక్కువ భాగంతో వారు మమేకమై ఉంటారు.
సమానత్వం, న్యాయం అనే భావనలకు పెద్దగా వివరణలు అవసరం లేదు. వారే నా అతిపెద్ద సానుభూతిపరుల వర్గం, అత్యంత ముఖ్యమైన వారు.
ఇక మొదటి అంశానికి వద్దాం – నా గురించి నేను ఏమనుకుంటున్నాను.
ఒక స్పష్టత కోసం చెప్పాలంటే, నన్ను జైలుకు పంపినప్పుడు నా వయసు 31న్నర సంవత్సరాలు, ఇప్పుడు నాకు 34 సంవత్సరాలు పైబడ్డాయి.
నేను 16 సంవత్సరాల క్రితం, 2006లో ఐఐటీ బాంబేలో చేరాను. 2011 నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించాను. నన్ను జైలుకు పంపే వరకు అదే వృత్తిలో కొనసాగాను.
నేను 2013లో జేఎన్‌యూలో చరిత్ర అధ్యయనం ప్రారంభించాను, 2017లో నా ఎంఫిల్ థీసిస్‌ను పూర్తి చేశాను.
2020లో నన్ను జైలుకు పంపినప్పుడు నా పీహెచ్డీ డిసర్టేషన్ రాస్తున్నాను. ప్రస్తుతానికి, మారుతున్న నా స్వీయచిత్రాన్ని రెండు వేర్వేరు – కానీ పరస్పరపూరకంగా ఉండే – ఆలోచనల ద్వారా వివరించవచ్చు.
ఒకటి రాజకీయపరమైనది, మరొకటి మతపరమైనది. ఈ రెండింటి సంక్షిప్త వివరణ ఇప్పుడు మీ ముందు ఉంచుతాను.
రాజకీయ కోణం
రాజకీయ కోణంలో జాతీయవాదం, కేంద్రీకరణ, ఆధిపత్యవాదం, ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ ఎన్నికల వ్యవస్థ, ఎస్సీ వర్గం నుంచి అర్హత గల ముస్లింలు, క్రైస్తవుల మినహాయింపు మొదలైన ఆందోళనలను అర్థం చేసుకునేవారు ఉంటారు.
అందువల్ల ఈ కోణంలో వికేంద్రీకరణ డిమాండ్లు, రాష్ట్రాల స్వయంప్రతిపత్తి, దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఎన్నికలు, ముస్లిం – క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్లు, వెనుకబడిన కులాలకు సమాన అవకాశాలు, భాషా, మతపరమైన మైనారిటీల పరిరక్షణ, ప్రజాప్రయోజన సంస్థలపై ప్రభుత్వ యాజమాన్యం వంటి అంశాల వైపు నిలుస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే, మన వ్యవస్థలోని లోపాలను పూర్తిగా అంచనా వేయడం, జాతీయవాదం అనే విషపూరిత భావజాలాన్ని విశ్లేషించడం.
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సోషలిజం, మైనారిటీ హక్కులు, సమాఖ్యవాదం గురించిన సంపూర్ణ అవగాహన వైపు ఇది నిలుస్తుంది.
దక్షిణ ఆసియా చరిత్ర నేపథ్యంలో, మనం అంబేద్కర్, జిన్నా, లోహియా, పెరియార్ ఆలోచనలను అనుసరించాలి, వాటితో మమేకం కావాలి.
మతపరమైన కోణం
ముస్లింలు మతపరమైన కోణంలో ఉంటారు. వారు ఖురాన్ ఆదేశాల పరిరక్షకులుగా, ఇస్లాంపై ఉన్న ఇమామ్‌ల గుత్తాధిపత్యానికి, దానిలోని చెడు లక్షణాలకు, గత కాలపు అవశేషాలైన వర్గపోరాటాలు, మూఢనమ్మకాలు, స్థానికత, కులతత్వం, పితృస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై విధించే అసంబద్ధమైన పరిమితులకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు.
వ్యక్తిగతంగా, భారత జాతీయ కాంగ్రెస్‌పై మౌలానా ఆజాద్ చేసిన రాజకీయ విశ్లేషణతో నేను విభేదించవచ్చు లేదా విమర్శించవచ్చు, కానీ 20వ శతాబ్దంలో దక్షిణ ఆసియాలో మతపరమైన పాండిత్యంలో, ముఖ్యంగా ఖురాన్‌కు స్పష్టమైన, శక్తివంతమైన వ్యాఖ్యానంలో ఆయనకు ఎవరూ సాటి రారు. మౌలానా ఆజాద్ ఇలా వివరిస్తారు –
“మానవాళి వెల్లడించిన అన్ని విశ్వాసాల్లోనూ మతం (దీన్) ఒకటేనని, తౌహీద్ (ఏకేశ్వరవాదం) సమానత్వాన్ని, మానవాళి సౌభ్రాతృత్వాన్ని సూచిస్తుందని, జాజా-ఓ-సజా (తీర్పు దినం) న్యాయానికి, సత్కార్యాలకు ప్రాధాన్యం ఇస్తుందని ఖురాన్ మనకు చెబుతోంది. వివిధ మతపరమైన సమాజాల్లో దీన్ ఈ మౌలిక అంశానికి సంబంధించి, అవసరమైనప్పటికీ, మిగిలినవన్నీ ప్రాథమికేతర అంశాల కిందకే వస్తాయి. ముస్లింలు – ముస్లిమేతరులు, షియా – సున్నీ, నిజాయితీ, భక్తిగల ప్రతి విశ్వాసికి మోక్షం ఒక హక్కు” [మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, తర్జుమాన్ అల్-ఖురాన్, సంపుటి 2 – వచనం 2:62, 5:48, 5:69, 2:177, 3:113; సంపుటి 3 10:1 మొదలైన వాటిపై ఆయన వివరణలు చూడండి].
మన మత విశ్వాసంలో ఇమిడి ఉన్న అత్యంత ముఖ్యమైన నమ్మిక ఏమిటంటే, సహజ వనరులు, ప్రకృతి సంపద వ్యక్తులకు లేదా దేశాలకు చెందినవి కావు, అవి దేవునికి, మొత్తం మానవాళికి చెందినవి.
ఇస్లాం అనేది న్యాయాన్ని కోరుకునే వ్యక్తుల మతం. తమ మతపరమైన వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటంలో నిమగ్నమైన ముస్లిమేతరులు కూడా నా పట్ల సానుభూతితో ఉంటారని నేను ఆశిస్తున్నాను.
నా విశ్వాసం ఇంత సరళంగా ఉన్నప్పటికీ ఈ వివరణ కొంతమందికి ముతకగా, అమాయకంగా కనిపించవచ్చు, మరికొందరికి దైవదూషణగా అనిపించవచ్చు. కానీ ఇది ఆధునిక గురువులు ఏర్పరచిన సుపరిచితమైన మార్గం. ఇక్కడ నేను మౌలానా ఆజాద్, అల్లామా ఇక్బాల్, ఇరాన్ విప్లవానికి చెందిన అలీ షరియాటి అలాగే ఈ గురువులందరికీ గురువైన, అంతిమ మూలస్రవంతి ప్రవక్త అడుగుజాడలను అనుసరిస్తాను.
గాలిబ్ తనను తాను వర్ణించుకోవడానికి ఉపయోగించిన అవే పదాలతో నన్ను నేను అభివర్ణించుకుంటాను.
గులామ్-ఇ సాకి-ఇ కుసార్ హుం ముజ్కో ఘమ్ క్యా హై (నేను కౌసర్‌కు దైవిక దాసుడిని, నేను ఎందుకు చింతించాలి.)
(సాకి: దాసుడు, కౌసర్: స్వర్గంలో “సమృద్ధి కొలను” అని పిలువబడే పవిత్ర సరస్సు, సాకి-ఇ కౌసర్: ప్రవక్త ముహమ్మద్ అలాగే హజ్రత్ అలీకి అలంకారిక వ్యక్తీకరణ)
ఫైజ్ అహ్మద్ ఫైజ్ తన పర్షియన్ ‘ఓడ్ టూ ది ప్రాఫెట్’లో ప్రవక్త న్యాయం వైపు, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడమని ఆశించినట్లు రాశారు. నేను కూడా ఆయన ఆశించినట్లే నిలబడతాను.
బయాద్ కి జలిమాన్-ఇ జహాన్ రా సదా కునాద్ రోజి బేసో-ఇ అదల్-ఓ-ఇనాయత్ సదా-యె తు.
(ప్రపంచంలోని అణచివేతదారులు, న్యాయం, కరుణకు దారితీసే మీ గొంతుకకు స్పందించడానికి ఒక రోజు తప్పకుండా పిలువబడాలి.)
జైలుకు రాకముందు పైన పేర్కొన్న ఈ రెండు వర్గాలకు చెందిన కొద్దిమంది వ్యక్తులు మాత్రమే నాకు వ్యక్తిగతంగా తెలుసు, ఈ రెండు గ్రూపుల మేలు కలయికలో చూస్తే ఇంకా తక్కువ మందే తెలుసు.
బయట నేను కలిసే గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఆ కోవలోకి వస్తారని నేను దేవుణ్ని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నా ఉద్దేశం ప్రకారం మన సమాజానికి అత్యంత అవసరమైనది ఈ వర్గమే.
కమ్యూనిస్టుల గురించి ఒక మాట
నేను కమ్యూనిస్ట్ వ్యతిరేకిని కాను. నా ఉద్దేశంలో మానవాళి చరిత్రను అత్యంత ఫలవంతమైన రాజకీయ ఆర్థిక విశ్లేషణ కావించింది కమ్యూనిజం మాత్రమే.
వర్గ పోరాటాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానపు అసహ్యకరమైన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వారు చేసిన కృషి ప్రశంసనీయం.
సహజంగానే మానవాళి భవిష్య అభివృద్ధిలో ఈ భావజాలం అంతర్భాగమవుతుంది. కానీ కమ్యూనిస్టులతో వచ్చిన చిక్కు ఏమిటంటే, భౌతికవాద సిద్ధాంతం శతాబ్దానికి పైగా భౌతిక శాస్త్రం ద్వారా విస్మరించబడినప్పటికీ, చారిత్రక భౌతికవాదం ఒక శాస్త్రం అని వారు చెబుతుంటారు.
అంతేకాదు, హైసన్‌బర్గ్ క్వాంటం విప్లవానికి ముందే – ఇది భౌతికవాద సిద్ధాంతం, నిర్దిష్టవాదం రెండింటి అంతానికి దారితీసింది – ‘స్థల కాలాల’ స్వతంత్ర భావనల కూల్చివేతకు దారితీసిన ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంత విప్లవానికి ముందే, ఈ సంఘటనలన్నింటికంటే ముందే మానవ చరిత్ర పట్ల సంప్రదాయ మార్క్సిస్ట్ దృక్పథం సంకుచితమైనదని గుర్తించబడింది. అది నిర్దిష్టవాద న్యూటోనియన్ మెకానిక్స్ సరళత ద్వారా ప్రేరేపించబడి, చారిత్రక భౌతికవాద శాస్త్రం అని పిలవబడుతోంది అని నా అభిప్రాయం.
శాస్త్రీయ జ్ఞానం పట్ల తప్పుదోవ పట్టించిన ఈ నమ్మకం, కొన్ని కమ్యూనిస్ట్ సమాజాల్లో మనం చూసినటువంటి నియంతృత్వానికి దారితీసింది.
ఇది సమకాలీన ముస్లిం సమాజాల్లో పాలకుడు ‘విశ్వాసాన్ని ధ్రువీకరించదగిన సత్యంగా’ పౌరుల గొంతుకల్లోకి బలవంతంగా రుద్దాలని ప్రయత్నించే నియంతృత్వ ధోరణి లాంటిదే.
అంతేకాదు, ప్రాథమికంగా ఒక సామాజిక సిద్ధాంతమైన దానికి శాస్త్రీయ ఆధారం ఉండాలనే ఈ నిమగ్నత కారణంగానే అనేక సమస్యలు వస్తున్నాయి.
ఉదాహరణకు, అణగారిన కులం, జాతి లేదా మతపరమైన మైనారిటీ అస్తిత్వాల ఆధారంగా జరిగే సమీకరణలను ప్రతీఘాత అస్తిత్వ రాజకీయాలుగా వారు అభివర్ణిస్తున్నారు.
ఇది మానవ చరిత్ర శాస్త్రీయ గతి తర్కానికి విరుద్ధమని వారు చెబుతుంటారు. దాని మూలంగా విప్లవాత్మక మతపరమైన చైతన్యాన్ని పెటీ బూర్జువా భ్రమలుగా తిరస్కరిస్తుంటారు.
ప్రస్తుతానికి నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో తెలిపే సంక్షిప్త వివరణ ఇది. మరింత అనుభవం, జ్ఞానం గడిచేకొద్దీ ఇది మారవచ్చు, అయితే నా రాజకీయ, మతపరమైన నమ్మకాల ప్రాథమిక రూపురేఖలను నేను పైన వివరించాను. వాటి ఆధారంగా నన్ను పాఠకులను స్వయంగా అంచనా వేయమని కోరుకుంటున్నాను. రూమి చెప్పిన రెండు ద్విపదలతో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.
నా అజ్ హిందామ్, నా అజ్ చీనామ్, నా అజ్ బుల్గర్-ఓ-సాక్సినామ్ నా అజ్ ముల్క్-ఇ ఇరాకీనామ్, నా అజ్ ఖాకే-ఇ ఖురాసానామ్.
(నేను భారతదేశం నుంచి కాదు, చైనా నుంచి కాదు, బల్గేరియా లేదా సాక్సిన్ (తుర్క్మెనిస్తాన్, రష్యాలో భాగం) నుంచి కాదు నేను ఇరాక్ దేశం నుంచి కాదు, ఖురాసన్ భూముల నుంచి కాదు – ఆధునిక ఈశాన్య ఇరాన్, దక్షిణ తుర్క్మెనిస్తాన్, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో విస్తరించి ఉన్న విశాలమైన భూమి)
తన గురువైన రూమి అడుగుజాడలను అనుసరించి 6 శతాబ్దాల తరువాత అదే భావాన్ని ఇక్బాల్ ఉర్దూలో వ్యక్తపరిచాడు.
దర్విష్-ఇ ఖుదా మస్త్ నా షర్కీ హై నా గర్బీ, ఘర్ మేరా నా దిల్లీ, నా సఫాన్ నా సమర్కంద్.
(దేవునికి అంకితమైన సన్యాసిది తూర్పు కాదు, పడమర కాదు. అలాగే నా ఇల్లు ఢిల్లీకి గానీ, ఇస్ఫహాన్ లేదా సమర్కంద్కు గానీ చెందదు.)
(సఫాన్: మధ్య ఇరాన్‌లోని ఒక నగరం, దీనిని సాధారణంగా ఇస్ఫహాన్ అని పిలుస్తారు. సమర్కంద్: ఉజ్బెకిస్తాన్‌లోని ఆగ్నేయ నగరం)
తొలి ముద్రణ : మక్తూబ్ – 2022 సెప్టెంబరు 25
అనువాదం : కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
