ఇటీవల గృహ సమస్యపై 87 సంవత్సరాల వృద్ధ మహిళను ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. అనంతరం ఆమె ఆసుపత్రిలో చేరి కొద్ది రోజుల్లోనే మరణించింది. ఇది స్పెయిన్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు, ఆందోళనలకు దారితీసింది.
ఇది కేవలం ఆ మహిళ మృతి లేదా గృహ సమస్య మాత్రమే కాదు. స్పెయిన్ దేశ సాధారణ ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలతో నివురుగప్పిన నిప్పులాగా గూడుకట్టుకున్న అసంతృప్తి కట్టలు తెంచుకొని ఉద్యమాలకు దారితీసింది.
ప్రభుత్వ స్పందన
ఇంటి సమస్యపై వచ్చిన ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం రెండు డిక్రీలను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైట్ వింగ్, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీలు ఆ డిక్రీలను ఓడించాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే దుర్బుద్ధితో అధ్యక్షుడు ముందస్తు ఎన్నికలను ప్రకటించారు.
నవంబరు 29న ఎన్నికలు జరుగుతాయి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని గోరికాడ నక్కల్లాగా ఎదురుచూస్తున్న రైట్ వింగ్, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను పూర్తిగా బలపరిచే కార్మిక సంఘం ఇప్పుడు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిందని డబ్ల్యూఎఫ్‌టీయూ అనుబంధ కార్మిక సంఘం తీవ్రంగా విమర్శించింది.
డబ్ల్యూఎఫ్‌టీయూ అనుబంధ కార్మిక సంఘం విమర్శ
ఆ సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో “సామాజిక ఆగ్రహం నిప్పుకణం మరోసారి రగులుకుంది. ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, మీడియా, ముఖ్యంగా రాజీ పద్ధతుల యూనియనిజం ద్వారా గత దశాబ్ద కాలంగా ఉద్యమాలు అణచివేయబడిన తర్వాత, శ్రామిక వర్గం ఇక చాలు ఆపండి మీ నాటకాలు అని జవాబు చెప్పాలి” అని కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది.
ఇంటి సమస్యకు మూలం
స్పెయిన్ దేశం యూరోపియన్ యూనియన్‌లో చేరిన తర్వాత ఆ దేశం పారిశ్రామికంగా బాగా దెబ్బతిన్నది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక రంగం నుంచి పర్యాటక రంగం వైపు మళ్లింది. ఇది గృహ సముదాయాలు, హోటళ్లు తదితర నిర్మాణ రంగం అభివృద్ధికి దారితీసింది.
స్పెయిన్‌లో ఇంటి కొనుగోలు ధరలు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరగడం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక కొనుగోలు శక్తి పడిపోవడం కారణంగా గృహ సమస్య ఒక తీవ్రమైన సమస్యగా స్పెయిన్ దేశ ప్రజలను వెంటాడుతోంది.
పర్యాటక రంగ అభివృద్ధి – ప్రజల అవస్థలు
తీరప్రాంతాల్లో పర్యాటక వసతి గృహాలు, హోటల్స్ నిర్మాణంతో మొదట ఇది ప్రారంభమైంది. రెండు గృహాలు కలిగి ఉన్న యజమానులు ఇది తమకు లాభదాయకం అనుకొని ఆ నిర్మాణాలకు తమ రెండో ఇంటిని అమ్ముకున్నారు. కానీ క్రమంగా కార్పొరేట్ సంస్థలు, వల్చర్ ఫండ్ సంస్థలు వ్యక్తుల నుంచి ఆస్తులను కొనుగోలు చేసి భారీ నిర్మాణాలు ప్రారంభించాయి.
ఫలితంగా బలేరిక్, కానరీ దీవుల వంటి పర్యాటక ప్రాంతాల్లో కార్మికుల వేతనాలు ఇంటి అద్దెల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో వారు అద్దె ఇళ్లలో షేరింగ్ పద్ధతుల్లో నివసించడానికి లేదా మొబైల్ గృహాల్లో నివసించడానికి నెట్టబడుతున్నారు. ఈ దుస్థితికి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అని పేరు పెట్టారు.
నదీ పరివాహక ప్రాంతాలే కాకుండా పెద్ద నగరాల్లో కూడా ఇదే ప్రక్రియ జరిగింది. నగర కేంద్రాల్లో భవనాల పునరుద్ధరణ పేరుతో పాత ఇంటి యజమానులు తమ ఇళ్లలో నివసించడానికి వీలులేని పరిస్థితులను కార్పొరేట్ సంస్థలు సృష్టించాయి. దీన్ని “జెంటిఫికేషన్” అని పిలిచారు.
సంపన్నులు నగర పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాత గృహాల్లో ఉండేవారు అక్కడి నుంచి ఖాళీ చేసి పోవడం, తమ ఆస్తులు అమ్ముకోవడం చేయాల్సిన స్థితికి నెట్టబడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల కొనుగోలు చాలా ఖరీదుగా మారింది. కార్మికుల వేతనాల్లో ఎక్కువ భాగం ఇంటి అద్దెలకు కేటాయించాల్సి రావడం కార్మిక వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
పెన్షనర్లు ఇంటి అద్దెలు భరించలేక దాదాపు బహిష్కరించబడిన విధంగా తయారైంది. యువకులలో మనం ఇల్లు కొనలేము, కనీసం అద్దెలు కూడా చెల్లించలేమనే భావన బలంగా నాటుకుపోయింది.
ఇంటి అద్దెలు
స్పెయిన్ దేశంలో ఒక చదరపు మీటరుకు 15 యూరోలు ఇంటి అద్దె ఉంది. అంటే 60 చదరపు మీటర్ల ఇంటికి నెలకు 900 యూరోల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది దేశ రాజధాని నగరమైన మ్యాడ్రిడ్‌లో అయితే చదరపు మీటరుకు 21.5 యూరోలు, బలేరిక్ దీవుల్లో చదరపు మీటరుకు 20.2 యూరోలు, బార్సిలోనా నగరంలో 30 యూరోలుగా ఇంటి అద్దెలున్నాయి.
స్పెయిన్ దేశంలో నెలకు కనీస వేతనం కేవలం 1221 యూరోలు. ఇక ఇంటి అద్దె చెల్లించడం ఎలా సాధ్యమవుతుందనే పరిస్థితి ఏర్పడింది.
అద్దె చెల్లించలేదని గెంటివేత
ఈ నేపథ్యంలో ఇంటి అద్దె చెల్లించలేదనే నెపంతో మ్యాడ్రిడ్‌లో 87 ఏళ్ల వృద్ధ మహిళను బలవంతంగా ఖాళీ చేయించారు. ఆమె ఆసుపత్రిలో చేరి మరణించింది.
2025 ఒక్క సంవత్సరంలోనే స్పెయిన్ దేశంలో 2440 మందిని బలవంతంగా ఖాళీ చేయించారు. వీటికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి వృద్ధ మహిళ గెంటివేత, మరణం ఆజ్యం పోసినట్లయింది.
ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం పార్లమెంటులో రెండు డిక్రీలను ప్రవేశపెట్టింది. అయితే రైట్ వింగ్ శక్తులు, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ శక్తులు తమ రాజకీయ లబ్ధి కోసం ఈ డిక్రీలను ఓడించాయి. దాంతో నవంబరు 29న సాధారణ ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి ప్రకటించారు.
రైట్ వింగ్, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ శక్తులు
“ప్రభుత్వ వైఫల్యాలను ఉపయోగించుకొని ఈ శక్తులు గత కొంతకాలంగా బలాన్ని పెంచుకుంటున్నాయి. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో గెలవాలని ఈ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రైట్ వింగ్ శక్తులు, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ శక్తులు ఈ ఎన్నికల్లో గెలిస్తే కేవలం గృహ సమస్య మాత్రమే కాదు, వలసలు, మైనారిటీల, మహిళల, యువత హక్కులు ప్రమాదంలో పడతాయని” డబ్ల్యూఎఫ్‌టీయూ హెచ్చరించింది.
“అంతేకాకుండా వేతనాల పెంపు, వేతన ఒప్పందాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణ వంటి కార్మికుల డిమాండ్లు నెరవేర్చుకోవడం కూడా దుర్భరం అవుతాయి” అని పేర్కొంది.
సమస్యలకు మూలం
“రాజకీయ, న్యాయ వ్యవస్థ, పోలీసు అధికారుల మద్దతు ఉన్న ఒక రాబందు సంస్థ నుంచి రక్షించని కారణంగా 87 సంవత్సరాల వయసు గల మారి కార్మెన్ దారుణంగా ఇంటి నుంచి గెంటివేయబడింది. అనంతరం ఆమె మరణం లేదా హత్య ప్రజల్లో అణగి ఉన్న ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఇది కేవలం ఒకే ఒక సంఘటన కాదు. ఈ కుళ్లిపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతినెలా వందలాది కుటుంబాలు తమ ఇళ్ల నుంచి గెంటివేయబడుతున్నాయి”.
“చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. మనం ఆ ఉచ్చులో పడకూడదు అని స్పెయిన్‌లోని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్‌లో భాగమైన మేము హెచ్చరిస్తున్నాము. ఏదీ యాదృచ్ఛికం కాదు. వారు మమ్మల్ని చౌరస్తాల్లో బంధించారు. జీవన పరిస్థితులు మెరుగు చేయడానికి బదులుగా, మిమ్మల్ని రిక్తహస్తాలతో నేలమీద వదిలిపెట్టారు”.
దివాళాకోరు సంఘాలు
“ఇప్పుడు, గృహ సంక్షోభం నేపథ్యంలో, సీసీఓఓ, యూజీటీ రెండు యూనియన్లు తమ యంత్రాంగాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నాయి. జీవన వ్యయం విపరీతంగా పెరిగి, కొనుగోలు శక్తి కోల్పోయినప్పటికీ, పనికిరాని కలెక్టివ్ ఒప్పందాలపై వీరు సంతకాలు చేశారు. గత 14 సంవత్సరాలుగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వని వారు, ఇప్పుడు తమను తాము కార్మికుల రక్షకులుగా ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనం మోసపోకూడదు. వారు ‘ఫుల్ స్టాప్’ సమ్మెకు పిలుపునిస్తున్నారు. ఫొటోలో కనిపించడానికి, శ్రామిక శక్తిని నిర్వీర్యం చేయడానికి, మరుసటి రోజు నుంచి ప్రతిదీ యథావిధిగా ఉండేలా చూసుకోవడానికి ఒక రోజు నిరసనకు పిలుపునిచ్చారు”.
లొంగుబాటు ఒప్పందాలు
“ఉచిత తొలగింపు, ప్రొసీజరల్ వేతనాలు(సానియోస్ డి ట్రమిటాసియోన్), పదవీ విరమణ వయసును 67 సంవత్సరాలకు పెంచడం (దానిని 72 సంవత్సరాలకు పొడిగించేందుకు వీలుంది), నిర్మాణం లేదా మెటల్ వర్కింగ్ వంటి కీలక రంగాల్లో పెన్షన్ల ప్రైవేటీకరణ, సాధారణ అనారోగ్యానికి సంబంధించిన సిక్ లీవ్‌లను యజమానుల మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు(ముటువాస్) అప్పగించడం లాంటి కార్మిక వ్యతిరేక అంశాలను ఈ యూనియన్లు అంగీకరించాయి. పని ప్రదేశాల్లో భద్రత లేని కారణంగా ప్రమాదాలతో సంవత్సరానికి దాదాపు 300 మంది కార్మికులు మరణిస్తున్నారు”. ఇలాంటి యాజమాన్య ఏజెంట్ యూనియన్లు సమ్మె పేరుతో మోసం చేయడానికి పూనుకుంటున్నాయని డబ్ల్యూఎఫ్‌టీయూ సంఘం విమర్శించింది.
పోరాటాలకు అనుకూల వాతావరణం
“సార్వత్రిక, విడతలవారీగా, దీర్ఘకాలిక సమ్మె చేయడానికి తగినన్ని కారణాలున్నాయి. కార్మిక వర్గం గెలవాలన్నా, యజమానులను, పెట్టుబడిదారీ విధానాన్ని అడ్డుకోవాలన్నా, మనం వ్యూహాన్ని మార్చుకోవాలి. ఫ్రెంచ్ పోరాట ఉదాహరణను చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు వెళ్లాలి. రవాణాను, పరిశ్రమ, గ్రామీణ ప్రాంతాలు, సేవా రంగం పూర్తిగా నిలిపివేయాలి”.
డిమాండ్లు
“మన డిమాండ్ కేవలం అద్దె మాత్రమే కాదు, అసలు సమస్య పెట్టుబడిదారీ విధానం. అందుకే ఈ పోరాటంలో మన లక్ష్యాలు సమగ్రంగా ఉండాలి. యోగ్యమైన గృహ నిర్మాణం, ఖాళీ చేయడాలపై నిషేధం. తొలగింపులకు స్వస్తి, నిజమైన జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు, అధిక పని గంటలకు ముగింపు. ప్రభుత్వ రంగ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ, డిపెండెన్సీ కేర్, విద్య, నగర కౌన్సిళ్లలో ప్రైవేటీకరణలను ఆపాలి. గ్యాగ్ లా (లే మోర్డాజా) రద్దు, యజమానులకు న్యాయవ్యవస్థ లొంగిపోవడానికి ముగింపు మన డిమాండ్లు.
పోరాట యోగ్యమైన సార్వత్రిక సమ్మె కోసం, విడతలవారీగా విజయం సాధించే వరకు, శ్రామిక వర్గ పోరాటం వర్ధిల్లాలి” అని స్పెయిన్‌లోని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ భాగస్వామ్య యూనియన్లు కార్మికవర్గానికి పిలుపునిచ్చాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
