The Origin of the ‘Legislative Council’ – The Necessity for Independent Candidates
ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘చట్టసభ’ అనేది కేవలం అధికార మార్పిడికి వేదిక మాత్రమే కాదు; అది కోట్ల మంది ప్రజల జీవితాలను, భవిష్యత్తును నిర్ణయించే సంకల్ప సభ కూడా. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రను లోతుగా పరిశీలిస్తే, చట్టాల రూపకల్పనలో ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా, అత్యున్నత ప్రమాణాలు పాటించడానికి, దీనికి మేధోమథనం జరగాలనే గొప్ప ఆశయంతో మన రాజ్యాంగ నిర్మాతలు ‘ద్విసభా విధానాన్ని’ (Bicameral System) ప్రవేశపెట్టారు. అందులో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడే అభ్యర్థులతో రూపుదిద్దుకునేది ‘శాసనసభ’ (Legislative Assembly) అయితే, అనుభవం, ఆలోచన, మేధస్సు కలబోతగా సమతుల్యతను అందించే మేధావుల సభే ‘శాసన మండలి’ (Legislative Council ).
మన భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని చట్టసభలలో ప్రతిబింబించేలా చేయడానికి శాసన మండలికి ఒక ప్రత్యేకమైన చారిత్రక, రాజ్యాంగ ప్రాధాన్యత ఉంది. రాజకీయ కోలాహలాలు, పార్టీల ఆధిపత్య పోరాటాలు, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా;సమాజంలోని ప్రతికూల పరిస్థితులను లోతుగా విశ్లేషించే మేధావులు, విద్యావంతులు, నిపుణులు,సమాజ హితాన్ని కోరే ప్రజాస్వామ్యవాదుల గొంతుకగా శాసన మండలి నిలబడాలన్నది రాజ్యాంగం స్పష్టం చేసిన విషయం.
అంతర్జాతీయ రాజ్యాంగ మూలాలు:
భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశానికి ఒక పటిష్టమైన, సమతుల్యమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అందించడానికి ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. చట్టాల రూపకల్పనలో ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా, మేధావుల సలహాలు ఉండేలా ఏర్పాటు చేయబడిన శాసన మండలి (ద్విసభా విధానం) ,విద్యావంతుల ప్రాతినిధ్యం వెనుక ప్రధానంగా రెండు దేశాల రాజ్యాంగాల ప్రేరణ ఉంద
మొదటిది బ్రిటన్ దేశం. బ్రిటన్ లోని పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం నుంచే మన దేశం ‘ద్విసభా విధానం’ (Bicameralism) అనే ప్రాథమిక సూత్రాన్ని స్వీకరించింది. బ్రిటన్‌లో ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పోటీ చేసే ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అనే దిగువ సభతో పాటు, ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ అనే ఎగువ సభ కొనసాగుతోంది. ఈ ఎగువ సభలో రాజకీయేతర నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రముఖ న్యాయకోవిదులు ,కళాకారులు సభ్యులుగా ఉంటారు. దిగువ సభ చేసే చట్టాలను క్షుణ్ణంగా పునఃసమీక్షించడం ,వాటిలోని లోపాలను సవరించడమే ఈ ఎగువ సభ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
ఇక రెండవది ఐర్లాండ్ రాజ్యాంగం. భారతదేశంలో ప్రత్యేకంగా అమలులో ఉన్న “పట్టభద్రుల, నిపుణుల ప్రాతినిధ్యం” అనే భావన 1937 నాటి ఐర్లాండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 నుండి ప్రేరణ పొందింది. ఐర్లాండ్‌లోని ఎగువ సభ అయిన ‘షానెడ్ ఈరన్’ లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ డబ్లిన్ వంటి విశ్వవిద్యాలయాల పట్టభద్రులు తమ ప్రతినిధులను నేరుగా ఎన్నుకునే ‘యూనివర్సిటీ నియోజకవర్గాల’ విధానం ఉంది. దీనితో పాటు విద్య, సంస్కృతి, వ్యవసాయం, కార్మిక రంగాలకు చెందిన నిపుణులకు అక్కడ ప్రత్యేక స్థానాలు కేటాయిస్తారు.
ఈ ప్రజాస్వామ్య విధానాలను మన రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, ఆయంతో పాటు రాజ్యాంగ పరిషత్ లోతుగా అధ్యయనం చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు, పార్టీల ఆధిపత్యానికి అతీతంగా విద్యావంతులు, పట్టభద్రులు చట్టసభలకు నేరుగా రావాలనే ఉన్నతమైన ఆశయంతోనే,మన రాజ్యాంగంలో ఆర్టికల్ 171 ద్వారా ప్రత్యేకమైన పట్టభద్రుల నియోజకవర్గాలను వారు పొందుపరిచారు.
ఉమ్మడి ఏపీ నుండి తెలంగాణ వరకు:
మన దేశంలో చట్టాలను తయారు చేసే అత్యున్నత వ్యవస్థ వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సరిగ్గా చెప్పాలంటే, స్వాతంత్ర్యానికి ముందే ఆంగ్లేయుల పాలనలో 1919 ,1935 సంవత్సరాలలో వచ్చిన చట్టాల ద్వారానే దేశంలో ‘ద్విసభా విధానం’ (అంటే శాసనసభతో పాటు శాసన మండలి ఉండటం) అనే ఆలోచనకు పునాది పడింది. ఆ తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం, మన రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకించి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా, సమాజంలోని విద్యావంతులు, నిపుణులు, ఉపాధ్యాయులు ,పట్టభద్రులు కూడా చట్టాల రూపకల్పనలో భాగస్వాములు కావాలనే గొప్ప ఆశయంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 168,169,171 ద్వారా శాసన మండలి (విధాన పరిషత్) ఏర్పాటు,అధికారాలు ,ఎన్నికలు అన్నిటికి మార్గం స్పష్టం చేశారు.
ఈ రాజ్యాంగ నిబంధనల ఆధారంగానే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1958 జూలై 1న తొలిసారిగా శాసన మండలి ఆవిర్భవించింది. పద్మభూషణ్ గ్రహీత మాడపాటి హనుమంతరావు ఈ మండలికి తొలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ప్రముఖ మేధావులు, విద్యావేత్తలు ఈ సభలో సభ్యులుగా ఉండి ప్రభుత్వాలను నిలదీశారు, ప్రజా సమస్యలపై గొంతుక ఎత్తారు. చట్టాల రూపకల్పనలో ఈ సభ అత్యున్నత విలువలతో కూడిన చర్చలకు వేదికగా ఉండేది.
కాలక్రమేణా 1980ల నాటికి దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెను మార్పులు వచ్చాయి. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన అతి తక్కువ కాలంలోనే నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) సంచలన విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించి ముఖ్యమంత్రి అయ్యారు.
అప్పటికి శాసనసభలో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ, శాసన మండలిలో మాత్రం అప్పటికే పాత సభ్యుల పదవీకాలం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సంఖ్యాబలం ఉంది. దీనివల్ల ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు, సంస్కరణలను శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వ బిల్లులకు అక్కడ తీవ్రమైన ప్రతిష్టంభన ఎదురైంది.
ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడని ఈ సభ ప్రజాధనానికి భారం గా మారుతోందని, కేవలం ఓడిపోయిన నాయకులకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందనే ప్రతిపాదనతో ఎన్టీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, 1985 మే 31న శాసన మండలిని రద్దు చేయించింది.దీనితో దాదాపు 22 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి ఉనికే లేకుండా పోయింది.
అయితే, సమాజంలో విద్యావంతులు, పట్టభద్రులు ,ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి మేధావుల సభ ఎంతైనా అవసరమని భావించి, సుదీర్ఘ విరామం తర్వాత 2007 మార్చి 30న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి శాసన మండలిని మళ్లీ విజయవంతంగా పునరుద్ధరించారు. ఆ తర్వాత కాలచక్రంలో వచ్చిన పెను మార్పులతో, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని సెక్షన్ 40 ప్రకారం నూతన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా 40 మంది సభ్యులతో కూడిన శాసన మండలి లభించింది.
ఈ 40 మంది సభ్యుల సభలో ప్రాంతీయ ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ… అత్యంత కీలకమైన 3 స్థానాలు పట్టభద్రుల నియోజకవర్గాలకు, మరో 3 స్థానాలు ఉపాధ్యాయుల) నియోజకవర్గాలకు కేటాయించబడ్డాయి. ఈ చారిత్రక నేపథ్యంతోనే ఉద్యమాలు, చైతన్యానికి గడ్డయిన “వరంగల్ – నల్గొండ – ఖమ్మం” పట్టభద్రుల నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చరిత్ర మనకు నేర్పిన సత్యం ఒక్కటే ; రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మండలిని రద్దు చేసినా, మళ్లీ తెచ్చినా, విద్యావంతులు, పట్టభద్రుల గొంతుకగా నిలిచే ఈ శాసన మండలి స్థానం మాత్రం ఎప్పటికీ అత్యంత అమూల్యమైనది!
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్లు ఎందుకు?
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలను రూపొందించే అత్యున్నత వేదికలైన శాసనసభ ,శాసన మండలుల నిర్మాణం, వాటి ఉద్దేశాలు రెండూ పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న మౌలికమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నప్పుడే, పట్టభద్రుల నియోజకవర్గాల్లో స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థుల ప్రాముఖ్యత ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.
శాసనసభ అనేది ప్రత్యక్షంగా రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఉద్దేశించిన రాజకీయ రంగస్థలం. ఇక్కడ రాజకీయ పార్టీలు, పార్టీల అధికారిక అజెండాలు, సంఖ్యాబలం మరియు సంఖ్యా సమీకరణాలదే అంతిమ నిర్ణయం. ఈ సభలో ప్రతి రాజకీయ పార్టీ తన శాసనసభ్యులకు కఠినమైన ‘విప్’ జారీ చేస్తుంది.”విప్” అనేది ఒక రాజకీయ పార్టీ తన ఎమ్మెల్యేలకు జారీ చేసే ఆదేశం. పార్టీ అధిష్టానం (అధ్యక్షుడు లేదా పెద్ద నాయకులు) ఏది చెబితే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదే చేయాలి. సభలో ప్రభుత్వం ఏదైనా బిల్లు పెట్టినప్పుడు, ఆ బిల్లు ఎలాంటిది అయినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యే దానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి వీలుండదు.
సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని ఆ ఎమ్మెల్యేకి లోలోపల బాగా తెలిసినప్పటికీ, నిరుద్యోగులకు లేదా ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నట్లు గమనించినప్పటికీ… పార్టీ జారీ చేసిన ‘విప్’ నిబంధన వల్ల నోరు మెదపలేడు. ఒకవేళ పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ఓటు వేసినా, వెంటనే అతను శాసనసభ్య రద్దవుతుంది. అందుకే, ఎంత మంచి మేధావి అయినప్పటికీ, రాజకీయ పార్టీ గుర్తుపై గెలిచిన ఏ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కూడా పార్టీ గీసిన గీత దాటి బయటకు రాలేకపోతారు.
రాజ్యాంగ నిర్మాతలు ఉన్నతమైన ఆశయాలతో రూపొందించిన శాసన మండలి (విధాన పరిషత్) రూపురేఖలను నేటి ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తిగా మార్చివేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల చేత తిరస్కరించబడి ఓడిపోయిన సీనియర్ నాయకులకు, లేదా పార్టీలో టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న అభ్యర్థులకు పదవులు కట్టబెట్టడానికి రాజకీయ పార్టీలు శాసన మండలిని ఒక “రాజకీయ పునరావాస కేంద్రం” గా వాడుకుంటున్నాయి. ఓడిపోయిన నాయకుడికి శాసనసభ సభ్యత్వం లేకపోయినా, మంత్రి పదవులో లేదా రాజ్యాంగబద్ధమైన ఇతర ప్రాధాన్యతలో కల్పించడానికి ఎమ్మెల్సీ స్థానాలను ఒక రహదారిగా ఉపయోగించుకోవడం నేటి రాజకీయ వ్యవస్థలో నిత్యకృత్యమైంది.
దీనివల్ల చట్టసభలకు జరిగే నష్టం అంతాఇంతా కాదు. అసెంబ్లీలో ఓడిపోయిన పార్టీ నాయకులు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మండలిలోకి అడుగుపెట్టినప్పుడు, వారు కేవలం తమ పార్టీ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ,తమ పార్టీ అధిష్టానం కనుసన్నల్లో పనిచేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ప్రజా సమస్యలపై మేధోమథనం జరగాల్సిన సభ కాస్తా, చివరకు రాజకీయ పగలు, ప్రతికారాలు ,పార్టీ రచ్చబండగా మారిపోతుంది. నిజమైన విద్యావేత్తలు, న్యాయకోవిదులు, నిపుణులు, ప్రజాసేవకులకు దక్కాల్సిన ప్రాతినిధ్యాన్ని ఈ రాజకీయ పునరావాస సంస్కృతి పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది.
ఈ సందర్భంలోనే పార్టీలతో సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిని గెలిపించుకోవడం అత్యంత ఆవశ్యకం. పట్టభద్రుల స్థానం నుండి ఒక స్వతంత్ర ఆలోచనాపరుడిని చట్టసభకు పంపడం ద్వారా, రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ పదవులను తమ సొంత నాయకులకు పంచిపెట్టే దురాచారానికి, స్వార్థ రాజకీయ పునరావాస సంస్కృతికి విద్యావంతులుగా చెక్ పెట్టవచ్చు. పార్టీ ప్రయోజనాలు పక్కన పెట్టి, కేవలం పట్టభద్రులు, నిరుద్యోג యువత ,విద్యా రంగ సంక్షేమానికి కట్టుబడే స్వతంత్ర అభ్యర్థి మాత్రమే మేధావుల సభగా పిలవబడే శాసన మండలి పవిత్రతను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడగలడు.
అంతే కాకుండా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా, కేవలం పట్టభద్రుల ఓట్లతో గెలుపొందిన స్వతంత్ర ఎమ్మెల్సీకి ఏ పార్టీ విప్ వర్తించదు.ఆయనకు ఏ రాజకీయ భయం ఉండదు, పార్టీ అధిష్టానం హెచ్చరికలు ఉండవు.ప్రభుత్వాలు ఏ తప్పు చేసినా, నిరుద్యోగ యువతకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసినా, ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయినా; శాసన మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజల గొంతును నిర్భయంగా వినిపించే పూర్తి స్వేచ్ఛ, తెగువ కేవలం ఒక స్వతంత్ర ఎమ్మెల్సీకి మాత్రమే ఉంటుంది.
ఒక దేశం యొక్క లేదా రాష్ట్రం యొక్క భవిష్యత్తు కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వాల చేతుల్లోనే కాకుండా, చైతన్యవంతమైన పౌరుల ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో మేధావుల సభగా రూపొందించిన శాసన మండలిని నేడు పార్టీల రాజకీయ క్రీడాక్షేత్రంగా మార్చేశారు. ఈ దుస్థితిని మార్చాల్సిన బాధ్యత కేవలం ఎవరిదో కాదు,సమాజానికి దిశ నిర్దేశం చేయాల్సిన విద్యావంతులు, పట్టభద్రులపైనే ఉంది. పార్టీల జెండాలు, విప్‌లు, ఒత్తిళ్లకు తలవంచకుండా కేవలం నిరుద్యోగ యువత ఆశయాలు, విద్యారంగ సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి కోసం శాసన మండలి సాక్షిగా రాజీలేని పోరాటం చేసే ఒక నిజమైన స్వతంత్ర (ఇండిపెండెంట్) గొంతుకను చట్టసభకు పంపాల్సిన అవసరం ఎంతో ఉంది.
మనం వేసే ప్రతి ఓటు కేవలం ఒక ఎమ్మెల్సీని గెలిపించడం కోసం మాత్రమే కాదు, మన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి, మేధావుల సభ పవిత్రతను నిలబెట్టడానికి మనం చేసే చారిత్రక ధర్మం. పార్టీల రాజకీయ పునరావాస సంస్కృతికి స్వస్తి పలికి, మన హక్కులను నిర్భయంగా ప్రశ్నించే సమర్థుడైన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకోవాలి. అదే రేపటి మన తరాల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
