ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన సమస్యలపై చర్యలు తీసుకోకుండా, వారి లేఖలను ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపిన క్యాబినెట్ కార్యదర్శి టి.వి.సోమనాధన్. సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు.
పారదర్శకత కోసం పనిచేసే మాజీ నౌకాదళ అధికారి, కమోడోర్ లోకేశ్ బాత్రా సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. దానికి వచ్చిన సమాధానం ఆశ్చర్యకరంగాను వింతగాను ఉంది.
భారత ఎన్నికల కమిషన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియతో పాటు, కమిషన్ అంతర్గత పనితీరుపై కూడా విభేదాలు ఉన్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక గతంలో ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.
ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఇద్దరూ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌కు లేఖలు రాశారు. ఎన్నికల కమిషన్‌లో పనుల కేటాయింపులో చేసిన మార్పుల వల్ల కీలకమైన పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందని వారు ఆ లేఖల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి మార్పులు చేయవద్దని తాము ముందుగానే సూచించినప్పటికీ, వాటిని పట్టించుకోలేదని ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్కొన్నారు.
ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన సమస్యలపై నేరుగా చర్యలు తీసుకోవడానికి బదులుగా, క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ వారి లేఖలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కార్యాలయానికి పంపించారు.
క్యాబినెట్ కార్యదర్శి సోమనాథన్ ఒకవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు సమాన హోదా కలిగిన వారని, నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీ ఆధారంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే, విచిత్రంగా “పై లేఖలు ఎన్నికల కమిషనర్లు వ్యక్తిగత హోదాలో పంపినవి. వాటిని తగినంత తీవ్రతతో పరిగణించాలి. అయితే, వాటిని మొత్తం ఎన్నికల కమిషన్ తరఫున వచ్చిన అధికారిక సమాచారం గా చూడలేము” అని సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించిన కమోడోర్ లోకేశ్ బాత్రా కి క్యాబినెట్ కార్యదర్శి టీ.వీ. సోమనాథన్ సమాధానం ఇచ్చారు.
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఇద్దరు కమిషనర్లు ఒకే సమస్యపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ, వారి లేఖలను కమిషన్ సమష్టి అభిప్రాయంగా పరిగణించ లేదు.
ఎన్నికల కమిషనర్ల నిర్ణయాధికారంపై చట్టం ఏమి చెబుతోంది?
క్యాబినెట్ కార్యదర్శి తన వ్యాఖ్యల్లోనే 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టంలోని 18వ సెక్షన్ ను ప్రస్తావించారు. ఆ సెక్షన్ ప్రకారం, సాధ్యమైనంత వరకు ఎన్నికల కమిషన్ పనులకు సంబంధించిన నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకోవాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య ఏదైనా అంశంపై అభిప్రాయభేదాలు ఉంటే, మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. అలాగే, తన పనుల నిర్వహణకు సంబంధించిన విధానాన్ని ఏకగ్రీవ నిర్ణయం ద్వారా కమిషన్ నియంత్రించు కోవచ్చని కూడా ఆ చట్టం పేర్కొంటుంది.
ఈ నిబంధనలను ప్రస్తావిస్తూ, క్యాబినెట్ కార్యదర్శి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు సమాన హోదాలో ఉన్నారని అంగీకరించారు. నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు.
అయితే, ఇద్దరు కమిషనర్లు ఒకే అంశంపై అభ్యంతరాలు తెలిపి నప్పటికీ, వారి లేఖలను వ్యక్తిగత లేఖలు గా పరిగణించడం ఎందుకు అనే ప్రశ్న ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. చట్టం ప్రకారం కమిషనర్లు సమాన హోదాలో ఉండి, మెజారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం ఉన్నప్పుడు, ఇద్దరు కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఏ విధంగా పరిగణించాలి?
వివాదానికి కారణమైన పనుల కేటాయింపు ఉత్తర్వులు:
సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 2026 జూలై 29న క్యాబినెట్ కార్యదర్శికి వేర్వేరుగా పంపిన లేఖలు ఉన్నాయి.
ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ వ్యవహార శైలిపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పరిపాలనా విభాగానికి బాధ్యత వహిస్తున్న భాను ప్రకాశ్ యేతురు 2026 జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో అదనపు బాధ్యతలను మనీష్ గార్గ్‌కు అప్పగించారు. ఆ బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే గార్గ్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డైరెక్టర్ జనరల్‌లు, సమాన హోదా కలిగిన ఇతర అధికారుల మధ్య పనులను తిరిగి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు ఎన్నికల కమిషన్ తో చర్చించలేదని, కమిషన్ కు సమాచారం కూడా ఇవ్వలేదని సంధు, జోషి తమ లేఖల్లో పేర్కొన్నారు. తమతో చర్చించకుండా, ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇలాంటి చర్యలు చేపట్ట రాదని సంబంధిత అధికారులకు గతంలో పలుమార్లు మౌఖికంగా, లిఖిత పూర్వకంగా స్పష్టమైన సూచనలు ఇచ్చినప్పటికీ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని వారు అభ్యంతరం తెలిపారు.
సుఖ్బీర్ సింగ్ సంధు లేఖలో ఏముంది?
ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు 2026 జూలై 29న క్యాబినెట్ కార్యదర్శి సోమనాథన్ కు రాసిన లేఖలో ఈ వ్యవహారాన్ని వివరించారు. మనీష్ గార్గ్ 2024 సెప్టెంబర్ 2 నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భాను ప్రకాశ్ యేతురు పరిపాలనా విభాగానికి బాధ్యత వహిస్తున్న డిప్యూటీ ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. ఆయనకు లింక్ ఆఫీసర్ గా మరో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ ఉన్నారు.
2026 జూలై 28న యేతురు సెలవులోకి వెళ్లడంతో, ఆయన బాధ్యతలను మనీష్ గార్గ్‌కు అప్పగించారు. ఆ బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే గార్గ్ పనుల కేటాయింపులో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని సంధు వివరించారు. “డిప్యూటీ ఎన్నికల కమిషనర్ (పరిపాలన)కు అనుసంధాన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే, శ్రీ మనీష్ గార్గ్ ఐఏఎస్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డైరెక్టర్ జనరల్‌లు, సమాన హోదా కలిగిన అధికారుల మధ్య పనుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల గురించి ఎన్నికల కమిషన్‌తో గానీ, నాతో గానీ చర్చించలేదు. సమాచారం కూడా ఇవ్వలేదు.”
ఈ ఉత్తర్వుల్లో గార్గ్ తనకు తానే కొన్ని పనులను కేటాయించు కున్నారని, తనకంటే సీనియర్ హోదాలో ఉన్న అధికారులకు, తనతో సమాన హోదాలో ఉన్న అధికారులకు కూడా పనులు కేటాయించారని సంధు అభ్యంతరం వ్యక్తం చేశారు. మనీష్ గార్గ్ గతంలో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ (పరిపాలన)గా పనిచేసిన సమయంలో కూడా ఇలాంటి ఉత్తర్వులను జారీ చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సంధు తన లేఖలో మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు:
భాను ప్రకాశ్ యేతురు సెలవులోకి వెళ్లే ముందు ఎలాంటి కొత్త పనుల కేటాయింపు ఉత్తర్వులూ జారీ చేయలేదని ఆయన తెలిపారు. అదేవిధంగా, గతంలో అనుసంధాన అధికారిగా ఉన్న సంజయ్ కుమార్ కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నారు.
అయితే, 2026 జూలై 28న అనుసంధాన అధికారి బాధ్యతలు అకస్మాత్తుగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్‌కు అప్పగించ బడ్డాయని, బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పనుల కేటాయింపులో మార్పులు చేశారని సంధు వివరించారు. ఇది గతంలో కమిషన్ అనుసరించిన విధానానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, కమిషన్ తో ముందుగా చర్చించకుండా లేదా అనుమతి పొంద కుండా ఇటువంటి చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులకు తాను పలు మార్లు మౌఖికంగా, లిఖితపూర్వకంగా స్పష్టమైన సూచనలు ఇచ్చానని కూడా పేర్కొన్నారు. సంధు అభిప్రాయం ప్రకారం, ఈ చర్యలు కేవలం గత సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టంలోని సెక్షన్ 18(1), 18(2) నిబంధనలను ఉల్లంఘించాయి.
వివేక్ జోషి లేవనెత్తిన అభ్యంతరాలు:
ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి కూడా అదే రోజు ( 2026 జూలై 29న) క్యాబినెట్ కార్యదర్శి సోమనాథన్ కు మరో లేఖ రాశారు. ఆయన లేఖలోని విషయాలు సంధు లేఖలోని అంశాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. మనీష్ గార్గ్ కొత్త బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే పనుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేశారని జోషి పేర్కొన్నారు. అయితే, ఆయన లేఖలో అదనంగా మరో ముఖ్యమైన అభ్యంతరం ఉంది. “అంతేకాకుండా, సంబంధిత ఫైలును ఇవ్వాలని నేను పరిపాలనా విభాగాన్ని కోరినప్పుడు, ఆ ఫైలును నాకు అందించలేదు. సంబంధిత ఉత్తర్వులో, మనీష్ గార్గ్ తనకు తానే పనులను కేటాయించు కోవడంతో పాటు, తనకంటే సీనియర్ హోదాలో ఉన్నవారికి, తనతో సమాన హోదాలో ఉన్న అధికారులకు కూడా పనులను కేటాయించారు.” గార్గ్ గతంలో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ (పరిపాలన)గా పనిచేస్తున్నప్పుడు కూడా ఒకసారి ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని జోషి తన లేఖలో పేర్కొన్నారు.
ఈ విధంగా, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఒకే అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పనుల కేటాయింపులో మార్పులు చేయడానికి ముందు కమిషన్ కు సమాచారం ఇవ్వలేదని ఇద్దరూ ఆరోపించారు. సంబంధిత ఫైలును చూపించ లేదనే అదనపు అభ్యంతరాన్ని జోషి లేవనెత్తారు.
ఈ వివాదానికి ఓటర్ల జాబితా సాఫ్ట్వేర్ కు ఏమిటి సంబంధం ?
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గతంలో ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ కార్యదర్శికి రాసిన లేఖలు సాధారణ పరిపాలనా అభ్యంతరాలకు మాత్రమే పరిమితం కాలేదు.
ఓటర్ల జాబితాల నిర్వహణకు ఉపయోగించే ECINet సాఫ్ట్ వేర్ వ్యవస్థ సమగ్రత, పర్యవేక్షణ గురించి కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ పత్రిక తెలిపింది. పనుల కేటాయింపులో చేసిన మార్పుల వల్ల సమాచార సాంకేతిక వ్యవస్థపై ఉన్న కీలకమైన పర్యవేక్షణ స్థాయిలో ఒకటి తొలగిపోయి నట్లయిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వివరించింది. అంటే, ఎన్నికల సమాచార సాంకేతిక వ్యవస్థలో జరిగే పనులను పర్యవేక్షించే అధికారుల మధ్య బాధ్యతల మార్పు వల్ల, ముఖ్యమైన నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందనే ఆందోళన ఈ వివాదంలో ఉంది.
ఇది ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం వంటి ప్రక్రియలు ఎన్నికల నిర్వహణలో కీలకమైనవి. ఈ ప్రక్రియలకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థపై సరైన పర్యవేక్షణ, బాధ్యతాయుతమైన నిర్వహణ ఉండటం అవసరం.
సంజయ్ కుమార్ బదిలీ, ఐటీ ఫైళ్ల పర్యవేక్షణ పై మరో నివేదిక:
హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కూడా ఈ వ్యవహారంపై మరో కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం, ఎన్నికల కమిషన్ ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్ కు సంబంధించిన ఫైళ్లు మొదట డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ ద్వారా వెళ్లేవి. అయితే, మనీష్ గార్గ్ సూచన మేరకు సంజయ్ కుమార్‌ను ఆ బాధ్యత నుంచి తొలగించినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. ఆ తరువాత ఆ ఫైళ్ల పర్యవేక్షణ ను గార్గ్ స్వయంగా చేపట్టినట్లు ఆ కథనం పేర్కొంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెలువడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. సంజయ్ కుమార్ ను తొలగించి, ఫైళ్లను గార్గ్‌కు పంపాలన్న ఆదేశం వాస్తవానికి అమలు కాలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అయితే, హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, సంజయ్ కుమార్ ను 2026 ఆగస్టులో ఆయన సొంత రాష్ట్ర క్యాడర్‌కు తిరిగి పంపించారు. అదే సమయంలో, ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నాకు సంబంధించిన ఫైళ్లు గార్గ్ ద్వారా ఎన్నికల కమిషనర్ల కు పంప బడినట్లు కూడా హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.
రెండు భిన్న వాదనలు:
సంజయ్ కుమార్‌ను తొలగించి ఫైళ్లను గార్గ్‌కు పంపాలన్న ఆదేశం అమలు కాలేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సంజయ్ కుమార్‌ను ఆగస్టులో సొంత క్యాడర్‌కు తిరిగి పంపించారని, సీమా ఖన్నా ఫైళ్లు గార్గ్ ద్వారా కమిషనర్లకు వెళ్లాయని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
ఓటర్ల సమాచారాన్ని ఎవరు చేర్చాలి/ తొలగించాలి?
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనంలో మరో ముఖ్యమైన అంశాన్ని వివరించింది. ఎన్నికల కమిషన్ ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నా, ఆమె విభాగం కలిసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఆ వ్యవస్థ వల్ల ఓటర్ల డేటాబేస్ ను ఉపయోగించాల్సిన కొంతమంది కీలక అధికారులకు ఆ సమాచారాన్ని నేరుగా అందుబాటులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయిందని వివరించింది. ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడం, తొలగించడం వంటి ముఖ్యమైన పనులకు ఈ డేటాబేస్ అవసరం. అలాంటి పనులు నిర్వహించే అధికారులకే ఓటర్ల డేటాబేస్ ను ఉపయోగించే అవకాశం లేకుండా చేసే వ్యవస్థ ఏర్పడిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. దీంతో, ఓటర్ల జాబితా నిర్వహణలో సాంకేతిక వ్యవస్థలపై ఎవరి నియంత్రణ ఉండాలి, ఏ అధికారులకు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి, బాధ్యతల మార్పులకు ఎవరి అనుమతి అవసరం వంటి ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
