దేశంలోని గ్రామీణ కుటుంబాలు పెరుగుతున్న ధరల కారణంగా గతంతో పోలిస్తే తక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేస్తున్నాయి. మరోవైపు, ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నాయి. కుటుంబాలు తమ ఖర్చులో సగానికి పైగా ఆహారం కోసమే వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. అయితే, రాబోయే ఏడాదిలో తమ ఆదాయం పెరుగుతుందని చాలామంది గ్రామీణ కుటుంబాలు ఆశిస్తున్నాయి.
అలీగఢ్: నాబార్డ్(NABARD – జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు) నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో గ్రామీణ కుటుంబాల పొదుపులు తగ్గి, అప్పులు పెరుగుతున్నాయి.
జూలైలో 4.84 శాతం, ఆగస్టులో 5.24 శాతం, సెప్టెంబర్లో 6.08 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా ఈ వివరాలను నివేదిక వెల్లడించింది. ఈ సర్వే 13వ విడతలో భాగంగా జరిగింది.
దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని 600 గ్రామాలకు చెందిన 6,000 కుటుంబాలను సర్వేలో చేర్చారు. ఆగస్టు చివరి వారంలో, సెప్టెంబర్ మొదటి వారంలో సర్వే బృందాలు ఆయా గ్రామాలను సందర్శించాయి.
నాబార్డ్లోని ఆర్థిక విశ్లేషణ, పరిశోధన విభాగం ఈ సర్వేను రూపొందించగా, అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నిర్వహించింది.
ఈ సర్వే ఫలితాలు కుటుంబాలు తమ పరిస్థితుల గురించి వెల్లడించిన అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తాయని, వీటిని నాబార్డ్ అధికారిక అభిప్రాయాలుగా భావించకూడదని నివేదిక స్పష్టం చేసింది.
వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులు
సర్వే జరిగిన సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవన వర్షాలు ఒకే విధంగా కురవలేదు. 2026 అక్టోబర్ 2 నాటికి రైతులు 1,302.47 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు వేశారు.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇది గత ఏడాదితో పోలిస్తే 11.04 లక్షల హెక్టార్లు తక్కువ. మొత్తంగా గ్రామీణ ఆర్థిక పరిస్థితి కొన్ని సానుకూల, మరికొన్ని ప్రతికూల అంశాలతో ఉన్నప్పటికీ, ఇంకా నిలదొక్కుకునే స్థితిలో ఉందని నివేదిక పేర్కొంది.
ఆదాయం పెరిగిందని చెప్పిన కుటుంబాలు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ
గత ఏడాదితో పోలిస్తే తమ ఆదాయం పెరిగిందని చెప్పిన కుటుంబాలు కేవలం 27.1 శాతం మాత్రమే. నాబార్డ్ సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యల్ప శాతం.
నవంబర్ 2025లో ఆదాయం పెరిగిందని చెప్పిన కుటుంబాలు 42.2 శాతం ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 27.1 శాతానికి తగ్గింది. 20.5 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది. 52.4 శాతం కుటుంబాల ఆదాయంలో ఎలాంటి మార్పు లేదు. ఆదాయం పెరిగిందని చెప్పిన కుటుంబాల శాతం నుంచి తగ్గిందని చెప్పిన కుటుంబాల శాతాన్ని తీసివేస్తే వచ్చే నికర సూచిక 6.7కి పడిపోయింది. జూలైలో ఇది 7.9గా ఉండేది. నవంబర్ 2025లో అత్యధికంగా 26.6గా నమోదైంది.
ఆదాయం పెరిగిన కుటుంబాల్లో కూడా సగటు పెరుగుదల 10.5 శాతం మాత్రమే. సెప్టెంబర్ 2024లో ఈ పెరుగుదల 13.9 శాతంగా ఉండేది. ఆదాయం పెరిగిన కుటుంబాల్లో 31.9 శాతం కుటుంబాలకు 5 శాతం కంటే తక్కువగానే ఆదాయం పెరిగింది. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 23.4 శాతంగా ఉండేది.
కుటుంబాల పొదుపులు ఆదాయంలో అత్యల్ప స్థాయికి పడిపోయాయి
గ్రామీణ కుటుంబాలు తమ నెలవారీ ఆదాయంలో కేవలం 12.6 శాతం మాత్రమే పొదుపు చేస్తున్నాయి. సెప్టెంబర్ 2024లో సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యల్ప స్థాయి. అప్పుడు కుటుంబాలు తమ ఆదాయంలో 16.8 శాతం పొదుపు చేసేవి. ఆదాయంలో 65 శాతం రోజువారీ వినియోగం, కుటుంబ అవసరాలకు, 13.2 శాతం తీసుకున్న అప్పుల వాయిదాల చెల్లింపులకు ఖర్చవుతోందని కుటుంబాలు తెలిపాయి.
దాదాపు మూడింట ఒక వంతు కుటుంబాలు(32.1 శాతం) తమ ఆర్థిక పొదుపులు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయని తెలిపాయి. కేవలం 16.7 శాతం కుటుంబాలు మాత్రమే పొదుపులు పెరిగాయని చెప్పాయి.
పొదుపులకు సంబంధించిన నికర సూచిక జూలైలో మైనస్ 10.8 ఉండగా, ఇప్పుడు మైనస్ 15.4కి పడిపోయింది. పెట్టుబడుల పరిస్థితి కూడా బలహీనపడింది. 20.2 శాతం కుటుంబాలు తమ పెట్టుబడులు తగ్గాయని తెలిపాయి. సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక శాతం. 23.1 శాతం కుటుంబాలు తమ పెట్టుబడులు పెరిగాయని తెలిపాయి.
అప్పులు తీసుకుంటున్న కుటుంబాలు పెరుగుతున్నాయి
అప్పులు పెరిగాయని చెప్పిన కుటుంబాల శాతం జూలైలో 28.7 ఉండగా, ఇప్పుడు 32.4 శాతానికి పెరిగింది. అయితే, సెప్టెంబర్ 2024లో నమోదైన 40.2 శాతం కంటే ఇది తక్కువే.
కుటుంబాలు అప్పులు తీసుకుంటున్న మార్గాలను పరిశీలిస్తే, 52.6 శాతం కుటుంబాలు బ్యాంకులు, ఇతర అధికారిక ఆర్థిక సంస్థల నుంచే అప్పులు తీసుకుంటున్నాయి.
22.1 శాతం కుటుంబాలు ప్రైవేటు వ్యక్తులు, ఇతర అనధికారిక మార్గాల నుంచి అప్పులు తీసుకుంటున్నాయి. జూలైలో అధికారిక మార్గాలపై ఆధారపడిన కుటుంబాలు 51 శాతం ఉండగా, అనధికారిక మార్గాలపై ఆధారపడినవి 23.7 శాతంగా ఉన్నాయి.
ప్రైవేటు మార్గాల్లో అప్పులు తీసుకున్న వారిలో దాదాపు మూడొంతుల మంది స్నేహితులు, బంధువుల నుంచే అప్పులు తీసుకున్నారు.
ప్రైవేటు అప్పులపై అధిక వడ్డీ
అనధికారిక మార్గాల్లో తీసుకున్న అప్పులపై సగటు వార్షిక వడ్డీ రేటు 18.3 శాతానికి పెరిగింది. జూలైలో ఇది 17.8 శాతంగా ఉండేది. మధ్యస్థ వడ్డీ రేటు 13 శాతం.
ప్రైవేటు అప్పులు తీసుకున్న వారిలో 20.4 శాతం మంది ఎలాంటి వడ్డీ చెల్లించడం లేదు. వీరు స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తీసుకుని ఉండవచ్చని నివేదిక చెబుతోంది. అయితే, దాదాపు 18 శాతం మంది 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారు.
ఆహారానికే అధిక ఖర్చు
గ్రామీణ కుటుంబాల నెలవారీ వినియోగ ఖర్చులో సగటున 53.5 శాతం ఆహారం కోసమే వెచ్చిస్తున్నారు. సెప్టెంబర్ 2024 నుంచి జరిగిన అన్ని సర్వేల్లో ఆహార ఖర్చు వాటా 52.4 నుంచి 56.7 శాతం మధ్యనే ఉంది. ఇతర ఖర్చుల్లో విద్య, వైద్యానికి 24.1 శాతం, వంట, రవాణాకు అవసరమైన ఇంధనానికి 16.6 శాతం ఖర్చు చేస్తున్నారు.
ధరల పెరుగుదలపై ప్రజల అభిప్రాయం
వస్తువుల ధరలు పెరుగుతున్నాయనే భావన గ్రామీణ ప్రజల్లో మరింత బలపడుతోంది. ప్రజలు అంచనా వేసిన సగటు ద్రవ్యోల్బణం జూలైలో 4.5 శాతం ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పెరిగింది.
రాబోయే మూడు నెలల్లో ధరలు 5 శాతం పెరుగుతాయని కుటుంబాలు భావిస్తున్నాయి. మే 2025 సర్వే తర్వాత నమోదైన అత్యధిక అంచనా ఇదే. రాబోయే ఏడాది కాలంలో ధరలు 5.9 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. జూలైలో ఈ అంచనా 5.8 శాతంగా ఉండేది.
రాబోయే ఏడాదిలో ధరల పెరుగుదల 5.9 శాతం కంటే తక్కువగా ఉంటుందని భావించిన కుటుంబాల సంఖ్య జూలైలో 69.2 శాతం ఉండగా, ఇప్పుడు 60.6 శాతానికి తగ్గింది.
ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(FAO) రూపొందించిన ఆహార ధరల సూచిక కూడా సెప్టెంబర్లో 136 పాయింట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.8 శాతం ఎక్కువ.
కుటుంబ ఆదాయంలో ప్రభుత్వ సహాయం వాటా తగ్గుతోంది
ప్రభుత్వం అందించే సబ్సిడీలు, ఆర్థిక సహాయం గ్రామీణ కుటుంబాల నెలవారీ ఆదాయంలో సగటున 8.3 శాతంగా ఉంది. జూలైలో ఇది 8.1 శాతంగా ఉండేది.
అయితే, ఏడాది క్రితం 9.3 శాతంగా ఉండేది. జనవరి 2025లో అత్యధికంగా 10.3 శాతానికి చేరింది. ప్రభుత్వ సహాయం ద్వారా తమ మొత్తం ఆదాయంలో 20 శాతానికి మించి పొందుతున్న కుటుంబాలు కేవలం 2.8 శాతం మాత్రమే.
సెప్టెంబర్ 2025లో ఈ సంఖ్య 7 శాతంగా ఉండేది. అసలు ప్రభుత్వ ఆర్థిక సహాయం ఏదీ పొందని కుటుంబాలు 14.9 శాతం ఉన్నాయి. జూలైలో ఈ సంఖ్య 16.2 శాతంగా ఉండేది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాధాన్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు గ్రామీణ కుటుంబాలకు ఇప్పటికీ ముఖ్యమైన ఆధారంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. వాటిలో ముఖ్యమైనవి:
– ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN): అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించే పథకం.
– ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన: పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు అందించే పథకం.
ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి సమర్థవంతంగా, సరైన లక్ష్యంతో, డిజిటల్ విధానాల ద్వారా చేరేలా చూడాలని నివేదిక సూచించింది.
రాబోయే ఏడాది ఆదాయం పెరుగుతుందని గ్రామీణ కుటుంబాల ఆశ
గ్రామీణ కుటుంబాల్లో ఆశావాదం కొంత తగ్గినప్పటికీ, చాలామంది భవిష్యత్తుపై సానుకూలంగా ఉన్నారు. రాబోయే మూడు నెలల్లో తమ ఆదాయం పెరుగుతుందని 43 శాతం కుటుంబాలు భావిస్తున్నాయి. జూలైలో ఈ సంఖ్య 41.2 శాతంగా ఉండేది.
అయితే, సెప్టెంబర్ 2024లో నమోదైన 54.1 శాతం కంటే ఇప్పుడు తక్కువగా ఉంది. రాబోయే ఏడాది కాలంలో తమ ఆదాయం పెరుగుతుందని 67.9 శాతం కుటుంబాలు ఆశిస్తున్నాయి. జూలైలో ఈ సంఖ్య 66.8 శాతంగా ఉండేది.
ఉద్యోగాల పరిస్థితి
94.8 శాతం కుటుంబాలు రాబోయే కాలంలో ఉద్యోగ పరిస్థితులు యథాతథంగా ఉంటాయని లేదా మెరుగుపడతాయని భావిస్తున్నాయి.
అయితే, ఉద్యోగాలపై నికర ఆశావాద సూచిక 33.6కి పడిపోయింది. సర్వే ప్రారంభమైన తర్వాత నుంచి ఇదే అత్యల్ప స్థాయి.
గ్రామీణ అభివృద్ధికి ప్రజలు కోరుకుంటున్నవి
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఏవి ముఖ్యమని అడిగినప్పుడు ప్రజలు ఈ విధంగా అభిప్రాయపడ్డారు. రహదారులు 45.3 శాతం, విద్య 13 శాతం, విద్యుత్ సౌకర్యం 8.9 శాతం.
దాదాపు మూడొంతుల కుటుంబాలు (74.1 శాతం) గత ఏడాదితో పోలిస్తే గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని తెలిపాయి.
అయితే, ఈ విషయంలో నికర సానుకూల సూచిక జూలైలో 72.7 ఉండగా, ఇప్పుడు 69.6కి తగ్గింది.
సర్వేలో భాగంగా గ్రామాలను దశలవారీగా మారుస్తున్నారు. ఈ విడత సర్వేలో ఒక కొత్త మార్పును ప్రారంభించారు. ఇప్పటివరకు సర్వేలో ఉన్న 600 గ్రామాల్లో, రాబోయే ఆరు విడతల్లో ప్రతిసారీ 100 గ్రామాలను యాదృచ్ఛికంగా మార్చనున్నారు. అదే జిల్లాల్లోని, దాదాపు ఒకే విధమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఉన్న ఇతర గ్రామాలను ఎంపిక చేస్తారు.
ఈ విధంగా ఆరు విడతలు పూర్తయ్యేసరికి ప్రస్తుతం ఉన్న 600 గ్రామాల స్థానంలో కొత్త 600 గ్రామాలు వస్తాయి.
గ్రామాలను ఎందుకు మారుస్తున్నారు?
ఒకే కుటుంబాలను పదే పదే సర్వే చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని నివేదిక తెలిపింది. కొంతమంది కుటుంబాలు మళ్లీ సర్వేలో పాల్గొనడానికి నిరాకరిస్తున్నారు.
కొన్ని చిన్న గ్రామాల్లో సర్వే చేయడానికి కొత్త కుటుంబాలు అందుబాటులో ఉండటం లేదు. అందుకే గ్రామాలను దశలవారీగా మార్చాలని నిర్ణయించారు.
కొత్త గ్రామాలను ఎలా ఎంపిక చేస్తారు?
2011 జనాభా లెక్కల ఆధారంగా ఒక సమగ్ర సూచికను రూపొందించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాల(SC), షెడ్యూల్డ్ తెగల (ST) జనాభా శాతం, అక్షరాస్యత స్థాయి, పక్కా రహదారి సౌకర్యం, బ్యాంకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ అంశాల ఆధారంగా పాత గ్రామాలకు సమానమైన పరిస్థితులు ఉన్న కొత్త గ్రామాలను ఎంపిక చేస్తారు. ఈ మార్పుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో సర్వే ఫలితాల్లో వచ్చే మార్పులను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నివేదిక సూచించింది.
అనువాదం: డి. వెంకన్న.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
