ఇప్పుడు స్వేచ్ఛా మార్కెట్లు అనేవి ఎక్కడా లేవు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వంటి బిగ్ టెక్ కంపెనీలు సృష్టించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అసలు నిజమైన మార్కెట్లు కావు. అవి ఆధునిక డిజిటల్ భూస్వాముల ప్రైవేట్ సామ్రాజ్యాలు.
ఒకప్పుడు మార్కెట్ అంటే కొనుగోలుదారుడు-అమ్మకందారుడు స్వేచ్ఛగా కలుసుకునే వేదిక. కానీ నేడు ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఎవరు ఏం కొనాలో, ఎవరు ఏం చూడాలో, ఏ వస్తువు ఎవరికి కనబడాలో ఏకపక్షంగా ‘అల్గారిథమ్’ నిర్ణయిస్తుంది.
ఈ టెక్ దిగ్గజాల చేతిలో ఉన్నది సాంప్రదాయ పెట్టుబడి కాదు, అది క్లౌడ్ క్యాపిటల్. ఇది మనుషుల ప్రవర్తనను, కోరికలను, ఆలోచనలను శాసించే, నియంత్రించే అదృశ్య సాధనం.
టెక్నో-ఫ్యూడలిజం: నయా సామంతులు
ఈ టెక్నో-ఫ్యూడలిజంలో టెక్ కంపెనీలు సొంతంగా ఏ వస్తువునూ ఉత్పత్తి చేయవు. బదులుగా తమ ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారం చేసుకునే చిన్న పెట్టుబడిదారులు/కౌలుదారుల నుంచి ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు కమీషన్ లాక్కుంటాయి. ఇది కచ్చితంగా మధ్య యుగాల నాటి భూస్వామి రైతుల నుంచి వసూలు చేసే ‘శిస్తు’ లాంటిదే.
ఈ వ్యవస్థలో సొంతంగా వ్యాపారం చేసే చిన్న, మధ్యతరగతి ఉత్పత్తిదారులకు ఎలాంటి ఆర్థిక స్వయంప్రతిపత్తి లేదు.
అమెజాన్ వంటి సైట్లలో వస్తువులు అమ్మే వ్యాపారులు కేవలం ఈ టెక్ దిగ్గజాలకు కప్పం కట్టే సామంతులు మాత్రమే. ఆ సంస్థలు తమ అల్గారిథమ్‌ను కొద్దిగా మార్చితే చాలు, ఈ చిన్న వ్యాపారుల సామ్రాజ్యాలు రాత్రికి రాత్రే కూలిపోతాయి. మార్కెట్ శక్తుల ద్వారా కాకుండా, కేవలం కోడ్ రాసిన అల్గారిథమ్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికే ఈ నయా సామంతుల పరిస్థితి అత్యంత దయనీయం.
ఉచితంగా శ్రమిస్తున్న క్లౌడ్ పాలేర్లు
ఇక కోట్లాది మంది సగటు మనుషుల విషయానికి వస్తే, మనమంతా ఈ డిజిటల్ సామ్రాజ్యంలో ‘క్లౌడ్ పాలేర్లుగా’ మారిపోయాం.
ఒకప్పుడు జమీందారు భూమిలో రైతు వెట్టిచాకిరీ చేసినట్టు, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది సామాన్య వినియోగదారులు టెక్ కంపెనీల కోసం ఉచితంగా శ్రమిస్తున్నారు. మనం ఇంటర్నెట్లో గడిపే ప్రతీ క్షణం, చేసే ప్రతీ లైక్, షేర్, సెర్చ్, మనం చేసే ప్రతీ వీడియో వాచ్‌కు ‘డేటా’ అనే అపారమైన అదనపు విలువను సృష్టిస్తోంది.
మన మేధోశ్రమ దీని వెనుక గుప్తంగా ఉండి అపారమైన విలువను సృష్టిస్తోంది. ఈ అదృశ్య శ్రమకు వాళ్లు మనకు ఎలాంటి వేతనం ఇవ్వరు. మన సొంత జీవితాలను, మన ఆసక్తులను, మన వ్యక్తిగత భావోద్వేగాలను పెట్టుబడిగా మార్చుకుని అపారమైన సంపదను పోగేసుకుంటున్నారు.
ఈ కొత్త దోపిడీ వ్యవస్థలో మధ్యతరగతి పూర్తిగా ఛిద్రమైపోయి, అస్థిరమైన కొత్త శ్రామిక వర్గం ఆవిర్భవించింది. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం ప్రభుత్వాలు చెప్పే పైపై ఆర్థిక గణాంకాలను కాకుండా, మౌలిక మార్పుల వెనుక ఉన్న భౌతిక మూలాలను, వనరుల కేంద్రీకరణ స్వభావాన్ని నిశితంగా విశ్లేషించాలి.
పెరుగుతున్న ఆర్థిక అసమానతలు
మధ్యతరగతి పతనానికి మూలాలు, వనరుల కేంద్రీకరణ స్వభావంలోనే ఉన్నాయి. ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెటీ తన విస్తృత పరిశోధనల ద్వారా అత్యంత స్పష్టంగా నిరూపించిన ఆర్థిక సూత్రం $r > g$. అంటే, పెట్టుబడిపై వచ్చే రాబడి రేటు ($r$) ఎప్పుడూ కూడా సమాజంలో శ్రామికుల వేతనాల వృద్ధి రేటు ($g$) కన్నా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు వ్యవస్థాగత లక్షణం.
దీనిని అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ చూద్దాం. 2025 నాటికి ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల సంపద ఏకంగా 780 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ నివేదికలు చెబుతున్నాయి.
‘ఒరాకిల్’ సంస్థ యజమాని లారీ ఎల్లిసన్ ఒక్క ఉదయంలోనే, స్టాక్ మార్కెట్లో తన షేర్ల విలువ పెరగడం ద్వారా దాదాపు 100 బిలియన్ డాలర్లు సంపాదించాడు. ఆయన అక్కడ కొత్తగా ఏ శ్రమా చేయలేదు, ఏ విలువా సృష్టించలేదు. కానీ, సంవత్సరానికి 60 వేల డాలర్లు సంపాదించే సామాన్య ఉపాధ్యాయురాలు ఆ డబ్బు సంపాదించాలంటే అక్షరాలా 15 లక్షల సంవత్సరాలు శ్రమించాలి. అంటే మనిషి నిప్పును కనుగొనక ముందు కాలం నుంచి పనిచేస్తూనే ఉండాలి. ఇంతటి భయానకమైన, అమానుషమైన అసమానత ఉన్న సమాజంలో, కేవలం ‘శ్రమ’ ద్వారా పైకి రావచ్చు అనే మధ్యతరగతి నమ్మకం ఎంత పెద్ద అబద్ధమో మనకు అర్థమవుతుంది.
దోపిడీ వ్యవస్థలో ప్రభుత్వాల పాత్ర
ఇంతటి బహిరంగ దోపిడీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సామాన్య ఉద్యోగి తన శ్రమశక్తిని అమ్ముకుని పొందే జీతం తన చేతికి రాకముందే, మూలం దగ్గరే పన్ను(టీడీఎస్) రూపంలో కోతకు గురవుతుంది.
శ్రామికుడు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా తప్పించుకోలేడు. కానీ, పదుల సంఖ్యలో ఉన్న కుబేరులు మాత్రం చట్టం సృష్టించిన లొసుగులను, టాక్స్ హెవెన్లను వాడుకుంటూ, ఏళ్ల తరబడి ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను కట్టకుండా తమ సంపదను కోట్లానుకోట్లు పెంచుకుంటున్నారు.
మరోవైపు శ్రమించే వర్గాల వద్ద నుంచి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం లాక్కున్న సొమ్మును, మౌలిక సదుపాయాల కల్పన, రాయితీల పేరిట కార్పొరేట్లకు, టెక్ దిగ్గజాలకు పరోక్షంగా దోచిపెడుతున్నాయి.
ప్రభుత్వాలు ప్రజల డబ్బుతో పబ్లిక్ రోడ్లు, ఇంటర్నెట్ కేబుళ్లు వేస్తే, వాటి మీద ప్రైవేట్ టెక్ సామ్రాజ్యాలు నిర్మాణమవుతున్నాయి.
ఈ ఆదాయ వ్యత్యాసాల వల్ల సమాజంలో ఒకప్పుడు స్థిరంగా ఉన్న మధ్యతరగతి క్రమంగా అట్టడుగుకు పడిపోతోంది.
ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని తాకుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, పూర్తిగా వ్యాపారంగా మారిపోయిన విద్య, వైద్యం కలిసి సగటు మనిషి ఆర్థిక భద్రతను నిర్దాక్షిణ్యంగా లాగేసుకున్నాయి. చిన్న ఆర్థిక సంక్షోభం వచ్చినా, ఇంట్లో పెద్ద జబ్బు చేసినా ఈ మధ్యతరగతి వెంటనే సర్వస్వం కోల్పోయి అట్టడుగు శ్రామిక వర్గంలోకి జారిపోతోంది.
అస్థిరత్వంలోకి ‘ప్రికేరియట్’ వర్గం
ఆర్థికవేత్త గై స్టాండింగ్ విశ్లేషించినట్లుగా, నేటి సమాజంలో కొత్త వర్గం పుట్టుకొచ్చింది. అదే ‘ప్రికేరియట్’ వర్గం. ఇది అస్థిరత్వం, శ్రామిక వర్గం కలయిక.
నయా-ఉదారవాద విధానాలు శాశ్వత ఉద్యోగాలను, ఉద్యోగ భద్రతను, కార్మిక చట్టాలను నాశనం చేశాయి. వాటి స్థానంలో కాంట్రాక్ట్ లేబర్, ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్, గిగ్ ఎకానమీ (ఫుడ్ డెలివరీ యాప్స్, క్యాబ్ సర్వీసులు, ఫ్రీలాన్సింగ్) వచ్చి చేరాయి.
గతంలో కార్మికుడికి ఉద్యోగంతో అంటే కేవలం జీతం మాత్రమే కాదు, అందులో పింఛను, వైద్య బీమా, వేతనంతో కూడిన సెలవులు లాంటి కనీస సామాజిక భద్రత ఉండేది. కానీ నేటి ప్లాట్‌ఫామ్ క్యాపిటలిజంలో యజమానులు ఆ సామాజిక బాధ్యతలను పూర్తిగా వదిలించుకున్నారు.
కార్మికుడి శ్రమను మాత్రమే కొనుక్కుని, అతని జీవితానికి, ఆరోగ్యానికి, రేపటి మనుగడకు ఎలాంటి భరోసా ఇవ్వని అత్యంత అమానుష వ్యవస్థ ఇది. దీనివల్ల ఈ ‘ప్రికేరియట్’ వర్గం ఎప్పుడూ భయానకమైన మానసిక అస్థిరతతో జీవిస్తోంది. ఏ క్షణంలో అల్గారిథమ్ తమను పనిలోంచి తీసేస్తుందోననే ఆందోళన, తన శ్రమతో తనకు ఏ మాత్రం సంబంధం లేని తీవ్రమైన పరాధీనత, భవిష్యత్తుపై ఆశ లేకపోవడం, వ్యవస్థపై తీవ్రమైన ఆగ్రహం దీనిని నిరంతరం వెన్నాడుతున్నాయి.
కార్మికులు ఒక దగ్గర చేరి ఐక్యం కాకుండా చేయడానికి, సంఘాలుగా ఏర్పడకుండా చేయడానికి ఈ ‘గిగ్ ఎకానమీ’ అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ చేసిన అత్యంత కుటిలమైన వ్యూహం.
కనుమరుగవుతున్న మధ్యతరగతి
టెక్నో-ఫ్యూడలిజంలో ఈ వనరుల కేంద్రీకరణ, క్లౌడ్ ఆధిపత్యం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో సమాజం రెండు స్పష్టమైన వర్గాలుగా విడిపోతుంది.
ఒకటి, అంతులేని ఆర్థిక వనరులను, సాంకేతికతను, ప్రపంచపు డేటాను తమ గుప్పెట్లో పెట్టుకున్న అతి కొద్దిమంది టెక్-కుబేరులు (డిజిటల్ భూస్వాముల వర్గం). రెండు, ఎలాంటి ఆర్థిక, సామాజిక భద్రత లేకుండా రోజువారీ మనుగడ కోసం పోరాడే అసంఖ్యాక క్లౌడ్ పాలేర్లు, అస్థిర కార్మికులు(ప్రికేరియట్ వర్గం). ఈ రెండు ధ్రువాల మధ్యలో ఒకప్పుడు బలంగా నిలబడిన ‘మధ్యతరగతి’ అనే భావన పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.
ఈ డిజిటల్ జమీందారీ వ్యవస్థను, దాని వెనుక ఉన్న అమానుషీయ దోపిడీ పునాదులను మనం అర్థం చేసుకుని రాజీపడని ప్రశ్నలతో నిలదీయడమే భవిష్యత్తును కాపాడుకునే మార్గం. ఆ భయంకరమైన రేపటిని నివారించాలంటే, ముందుగా ఈనాటి వాస్తవాన్ని దాని అసలు పేరుతో, వర్గ స్వభావంతో పిలవడం ప్రారంభించాలి.
క్లౌడ్ పాలేర్లుగా మారుతున్న శ్రామిక వర్గం తమను తాము సంఘటితం చేసుకుని, ఈ టెక్నో-ఫ్యూడలిజంపై కొత్త తరహా పోరాటాన్ని నిర్మించడమే మన ముందున్న కర్తవ్యం.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
