ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)కు చెందిన కాంట్రాక్టు డ్రైవర్లు 2026 సెప్టెంబర్ 15న సమ్మెకు దిగారు.
ప్రధానంగా వేతనాలు, కరువు భత్యం(డీఏ), ఉద్యోగ భద్రత, వైద్య–ప్రమాద బీమా, సెలవులు, విశ్రాంతి రోజులు, బోనస్, సామాజిక భద్రత వంటి సమస్యలపై సమ్మె జరిగింది.
ఈ క్రమంలో అనేక సమ్మెల సందర్భంగా జరిగినట్లే కొందరు సమ్మె వ్యతిరేకులు లేదా ప్రభుత్వ అనుకూలురు బస్సులు నడిపేలా డీటీసీని ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
అత్యవసర సర్వీసులలో సమ్మెల నిషేధ చట్టాన్ని(ఎస్మా) ఎందుకు ప్రయోగించలేదని కోర్టు ప్రశ్నించింది. ఆపాటికే ఎస్మా అమలు చేసి సుమారు నాలుగు వందల మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దాంతో ఈ కేసులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని కోర్టు కేసును మూసివేసింది.
కోర్టులు ప్రజల సౌకర్యం ముసుగులో కార్మికులకు వ్యతిరేకంగా ఉంటాయని మరొక మారు రుజువయింది.
తప్పనిసరి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30న కార్మికులంతా విధులకు హాజరయ్యారు.
ప్రభుత్వ వైఖరి
ఢిల్లీలో దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత డబల్ ఇంజిన్ సర్కార్ అయితే తమకు మేలు చేస్తారనే విశ్వాసంతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు.
ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం సమ్మెకు పిలుపునిచ్చిన సంఘంతో చర్చలు జరపలేదు. నిర్బంధానికి పూనుకుంది. పైగా ఒక్క వేతన పెంపు మినహా మిగతా సమస్యలన్నీ పరిష్కరించినట్లు తప్పుడు ప్రకటన చేసింది.
సమ్మె డిమాండ్లు ఏమిటి? అందులో ఏవి పరిష్కరించాము, ఏవి మిగిలి ఉన్నాయి అనేది నిర్దిష్టంగా లేదు. అసలు సమ్మెకు పిలుపునిచ్చిన సంఘంతో చర్చలే జరపలేదు.
రోజువారీ వేతనం సమస్య
ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో సుమారు తొంభై శాతానికి పైగా కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు.
సంవత్సరాలు గడిచినా వారి సర్వీసులు క్రమబద్ధీకరించలేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి.
కాంట్రాక్టు డ్రైవర్లకు రోజుకు ఢిల్లీలో సుమారు 862 రూపాయలు చెల్లిస్తున్నారు.
పైగా ఈ జీతం కూడా రోజువారీ చేసిన కిలోమీటర్లతో ముడిపడి ఉంది. ఢిల్లీ అత్యధిక జనాభా కలిగిన నగరం. పైగా పార్లమెంట్ పరిసర ప్రాంతాలు మినహాయిస్తే మిగతా రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి.
బస్సుల సంఖ్య కూడా ఉండాల్సిన దానిలో దాదాపుగా సగం. వ్యక్తిగత వాహనాలు, కాలుష్యం చెప్పనలవి కాదు.
ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో బస్సులు నడపడం ఎంత దుర్లభమో అర్థమవుతుంది. కనీసం బతకడానికి సరిపడా వేతనం అయినా ఉండాలనేది సమ్మెలో అత్యంత ప్రధానమైన డిమాండ్.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో నిర్దేశించిన జీవించే హక్కును కల్పించాలని కోరడం తప్ప మరొకటి కాదు. కానీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ సమ్మె ప్రారంభమైన మూడు రోజుల తర్వాత సెప్టెంబర్ 18న వేతన పెంపు తప్ప మిగిలిన డిమాండ్లను అంగీకరించినట్లు ప్రకటించారు.
అయితే వేతన పెంపు కోసం కార్మిక శాఖతో సంప్రదించి తగిన మొత్తాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. ఇది పెద్ద మోసం.
వేతనం ఎంత ఇవ్వాలో నిర్ణయించాల్సింది ప్రభుత్వం తప్ప కార్మిక శాఖ కాదు. కానీ కార్మిక శాఖతో సంప్రదించాలని చెప్పి తప్పించుకోవడం పెద్ద మోసం.
డీఏ: మరొక కీలకమైన డిమాండ్
కరువు భత్యం పెంపుదల చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఏను వెంటనే అమలు చేయాలనేది సమ్మె డిమాండ్లలో మరొక ప్రధానమైన డిమాండ్. దీనిపై మంత్రి ప్రకటనలో ప్రస్తావన లేదు.
డ్రైవర్లను డీటీసీ పేరోల్లోకి తీసుకోవాలి
ఇది కీలకమైన డిమాండ్. డీటీసీ బస్సులు నడుపుతున్న కాంట్రాక్టు, ప్రైవేట్ డ్రైవర్లను నేరుగా డీటీసీ ఉద్యోగులుగా పేరోల్‌లో చేర్చాలని యూనియన్ డిమాండ్ చేస్తున్నది.
ఫలితంగా ఉద్యోగ భద్రత, స్థిరమైన వేతనం, డీటీసీ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు, సామాజిక భద్రత వంటి అంశాలు మెరుగుపడతాయి.
శాశ్వత స్వభావం కలిగిన పనులలో తాత్కాలిక లేదా అవుట్ సోర్స్ పద్ధతిలో నియామకాలు చేయడం చట్ట విరుద్ధం. అందునా అత్యంత జాగరూకతతో చేయాల్సిన క్లిష్టమైన డ్రైవర్ విధులలో కూడా తాత్కాలిక పద్ధతిన నియమించడం ప్రమాదకరం.
సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన 1990 నుండి ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానంగా మారింది.
ఇప్పుడు మోడీ ప్రభుత్వం కీలకమైన ఇరవై ఆరు చట్టాలనే రద్దు చేసి లేబర్ కోడ్లను తెచ్చి చట్టబద్ధ హక్కులను హరించింది.
వైద్య సౌకర్యాలు
డ్రైవర్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని సెప్టెంబర్ 18న రవాణా మంత్రి తెలిపారు.
అయితే సెప్టెంబర్ 25న జరిగిన మరొక సమావేశంలో డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రైవేట్ బస్ ఆపరేటర్లను మంత్రి కోరారు.
ఇది మరొక పెద్ద మోసం. నిర్ణయించి, ఆదేశించాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్లను కోరితే వారు దానికి ఎందుకు అంగీకరిస్తారు.
ప్రమాద బీమా – ప్రమాద పరిహారం
ప్రమాదం జరిగిన సందర్భాలలో తమకు, తమ కుటుంబానికి రక్షణ ఉండాలనేది సమ్మె డిమాండ్లలో మరొకటి. ఇది సమ్మె డిమాండ్లలో ఒకటిగా ఉండటమే ప్రభుత్వానికి అవమానకరం.
సంస్థ కోసం పనిచేస్తున్న వారికి ప్రమాదం జరిగితే తగిన సహాయ, సహకారాలు అందించాల్సిన చట్టబద్ధ, నైతిక బాధ్యత ఆయా సంస్థలదే.
ఈ డిమాండ్‌ను ఆపరేటర్లు అంగీకరించారని సెప్టెంబర్ 18న మంత్రి చెప్పారు. ఇది కూడా ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఎవరో చేస్తారని తప్పించుకోవడమే. కానీ తరువాత సెప్టెంబర్ 25 సమావేశంలో ప్రమాద బీమా లేదా పరిహారం చెల్లింపు విధానం గురించి చర్చ జరిగినట్లు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యుడికి ఉద్యోగం
ప్రమాదంలో డ్రైవర్ మరణిస్తే అతని కుటుంబానికి రక్షణగా, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలన్న డిమాండ్ సమ్మె డిమాండ్లలో ఒకటి.
ఇది నైతిక బాధ్యతే కాదు చట్టబద్ధ హక్కుగా అనేక సంస్థలలో అమలులో ఉంది.
ప్రమాదవశాత్తు డ్రైవర్ మరణిస్తే కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించే అంశాన్ని ఆపరేటర్లు అంగీకరించారని సెప్టెంబర్ 18న మంత్రి తెలిపారు.
ఇది కూడా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడమే. అయితే కనీసం దీన్నయినా అమలు చేయడానికి సంబంధించిన అధికారిక నియమాలు, అర్హతలు, నియామక ప్రక్రియ వంటి వివరాలు స్పష్టం చేయలేదు.
వారాంతపు సెలవు
కాంట్రాక్టు డ్రైవర్లకు వారాంతపు సెలవు ఇవ్వాలనేది మరొక డిమాండ్. ఆరు రోజులు పనిచేసిన తర్వాత ఏడవ రోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టం ప్రకారం వారాంతపు సెలవు ఇవ్వాలి.
ఈ చట్టాన్ని రద్దు చేసి తెచ్చిన కోడ్‌లో కూడా ఇది ఉంది. అయినా అమలుకు సమ్మె చేయాల్సి రావడం ఢిల్లీ ప్రభుత్వానికే తలవంపులు.
ప్రభుత్వం నెలకు సుమారు నాలుగు రోజులు విశ్రాంతి కల్పించే అంశాన్ని పరిశీలించినట్లు సెప్టెంబర్ 25న పత్రికల్లో వచ్చింది. పరిశీలన తప్ప అమలు చేస్తామని చెప్పలేదు.
శాలరీ స్లిప్
కార్మికుడి వేతనం, ఇతర అలవెన్సులు, అందులో మినహాయింపులు, వినియోగించుకున్న సెలవులు తదితర వివరాలతో శాలరీ స్లిప్ ఇవ్వాలి. ఇది తప్పనిసరి. అయినా ఈ డిమాండ్ కూడా సమ్మె డిమాండ్లలో చేర్చాల్సిన దుస్థితి దాపురించింది.
శాలరీ స్లిప్ సమయానికి అందించే విధానం రూపొందించాలని మంత్రి ఆపరేటర్లను కోరినట్లు సెప్టెంబర్ 25న హిందుస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
కనీసం ఈ సమస్యపై కూడా ఆదేశాలు ఇవ్వలేని బలహీన స్థితిలో ఢిల్లీ ప్రభుత్వం ఉందని అర్థమవుతున్నది.
అపాయింట్మెంట్ లెటర్స్
కాంట్రాక్టు ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆపరేటర్స్‌కు సూచించింది.
పని సామర్థ్యం ఆధారంగా ఇన్సెంటివ్ ఇవ్వాలి
ఇది కొత్త డిమాండ్ కాదు. డీటీసీలో గతంలోనే కాంట్రాక్ట్ డ్రైవర్లకు కూడా పని సామర్థ్యం ఆధారంగా ఇన్సెంటివ్ చెల్లించే విధానం ఉంది.
హాజరు, కిలోమీటర్లు ఆధారంగా నెలవారీ ఇన్సెంటివ్ చెల్లించే పద్ధతి 2019 డీటీసీ సర్క్యులర్‌లో ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆపరేటర్లను కోరినట్లు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రాసింది.
అదనపు కిలోమీటర్లకు చెల్లింపు
నిర్ణయించిన షెడ్యూల్ కంటే డ్రైవర్ అదనపు కిలోమీటర్లు డ్యూటీ చేస్తే అదనపు మొత్తం ఇవ్వాలని కార్మికుల డిమాండ్.
చట్ట ప్రకారం అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలి. ఉదాహరణకు గంటకు వంద రూపాయల వేతనం ఉంటే అదనపు పనికి రెండు వందలు వేతనం ఇవ్వాలి.
దీన్ని మాత్రం నిర్దిష్టంగా సెప్టెంబర్ 18న మంత్రి అంగీకరించినట్లు పత్రికలు రాశాయి.
జెండాలు వేరైనా అజెండా ఒక్కటే
డీటీసీ కార్మికుల సమ్మె చూస్తే, ఢిల్లీలోని డబల్ ఇంజిన్ సర్కార్ కార్మికుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నదో, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న ప్రైవేట్ యాజమానుల పట్ల ఎంతటి దయ చూపుతూ వేడుకునే దుస్థితిలో ఉందో అర్థమవుతున్నది.
బీజేపీయే కాదు నేడు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు, జెండాలు వేరైనా ప్రజలు, కార్మికులు, ఉద్యోగుల పట్ల ఇవే విధానాలు అమలు చేస్తున్నాయి.
2019లో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు యాభై ఐదు రోజులు సమ్మె చేసినప్పుడు నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు కూడా జరపకుండా తీవ్ర నిర్బంధం ప్రయోగించింది.
బ్రిటిష్ పాలకులను తలదన్ని కార్మిక సంఘాలే ఉండటానికి వీల్లేదని ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లో కార్మిక సంఘాలు సమ్మె విరమించాల్సిన పరిస్థితిని కల్పించింది.
ఆ తర్వాత అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కరించలేదు. కనీసం కార్మిక సంఘాలను పునరుద్ధరించలేదు. దీనికి ఏమాత్రం ఖర్చు లేదు. అయినా చేయలేదు. విసిగి వేసారిన కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే మూడు డిమాండ్లు మినహా అన్నీ అంగీకరించామని ప్రభుత్వం ప్రకటించింది.
ఏ డిమాండ్లు అంగీకరించారు, మిగిలిన మూడు ఏమిటి అనేది మాత్రం ప్రకటించలేదు. చివరకు మూడు రోజుల సమ్మెతో ప్రభుత్వం కార్మిక సంఘాలతో ఒక ఒప్పందానికి వచ్చింది.
అంగీకరించిన అంశాల అమలుకు చర్యలు తీసుకోవడానికి బదులు ఇప్పుడు గుర్తింపు ఎన్నికల తర్వాతనే అని అడ్డం తిరిగింది. అంటే కార్మిక సంఘాల ఐక్యతను విచ్ఛిన్నం చేసి తన పబ్బం గడుపుకోవడం ఉద్దేశ్యంగా కనబడుతున్నది.
విద్యుత్ బస్సుల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేట్ ఆపరేటర్లకే బస్సుల కొనుగోలు, వాటిపై సబ్సిడీ, బస్సుల నిర్వహణ, ఆపరేషన్స్ అప్పగిస్తున్నది.
నేటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కాల్ ఆన్ డ్రైవర్స్ అనే విధానాన్ని గత ప్రభుత్వం తెస్తే నేటి కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణలో కూడా అవుట్ సోర్స్ విధానంలో కండక్టర్లను నియమించడం మొదలైంది.
నేడు ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన దానికి నాటి టీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటి?
కార్మికుల కర్తవ్యం
కార్మికులందరూ ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి.
విద్యుత్ బస్సులు ఆర్టీసీకే ఇవ్వాలని, ఇతర పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారానికి ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నారా అని సంఘాల నాయకులను కార్మికులు ప్రశ్నించాలి.
ముఖ్యంగా విద్యుత్ బస్సుల నేటి విధానాన్ని వేగవంతం చేసి ఆర్టీసీలన్నింటికి సమాధి కట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దాన్ని అడ్డుకోకపోతే ఆర్టీసీ కార్మికులకే కాదు మొత్తం ప్రజానీకానికి తీవ్ర విఘాతం కలుగుతుంది.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా సంస్థ రక్షణ, ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సరైన నిర్ణయం తీసుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
