14 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు తగ్గిన వారంలోనే భారత రూపాయి విలువ కూడా సుమారు 0.3 శాతం క్షీణించి, ఒక డాలర్‌కు రూ.94.24కు చేరుకుంది.
న్యూఢిల్లీ: భారతదేశ విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) వారం రోజుల వ్యవధిలో 14 బిలియన్ డాలర్లకు పైగా తగ్గిపోయాయి.
నవంబర్ 13తో ముగిసిన వారానికి సంబంధించిన గణాంకాల ప్రకారం, దేశ విదేశీ మారక నిల్వలు గత మూడు నెలల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. నవంబర్ 20న భారత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ ఈ వార్తను ప్రచురించింది.
విదేశీ మారక నిల్వల్లో ఇంత భారీ తగ్గుదలకు ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ కరెన్సీ, బంగారం నిల్వల విలువ తగ్గడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వారంవారీగా విదేశీ కరెన్సీ నిల్వల విలువ 7.8 బిలియన్ డాలర్లు, బంగారం నిల్వల విలువ 6.1 బిలియన్ డాలర్లు చొప్పున తగ్గిపోయాయి.
డాలర్ల రూపంలో లెక్కించే విదేశీ కరెన్సీ ఆస్తుల విలువలో మార్పులు కేవలం వాటి పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉండవు. ఆర్బీఐ నిల్వల్లో ఉన్న ఇతర దేశాల కరెన్సీల విలువ డాలర్‌తో పోలిస్తే పెరగడం లేదా తగ్గడం కూడా ఈ నిల్వల మొత్తం విలువపై ప్రభావం చూపుతుంది.
విదేశీ మారక నిల్వలు 14 బిలియన్ డాలర్లకు పైగా తగ్గిన అదే వారంలో భారత రూపాయి విలువ కూడా సుమారు 0.3 శాతం పడిపోయింది. దీంతో ఒక అమెరికన్ డాలర్‌కు రూపాయి మారకం విలువ రూ.94.24కు చేరుకుంది.
ఆసియా దేశాల కరెన్సీల్లో భారత రూపాయి అత్యంత బలహీనమైన కరెన్సీగా కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే రూపాయి విలువ క్షీణించడం మొదలైంది. ఆ యుద్ధ పరిణామాలు రూపాయి పతనాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
భవిష్యత్తులో రూపాయి విలువ మరింత పడిపోయి, ఒక అమెరికన్ డాలర్‌కు రూ.100 లేదా అంతకంటే తక్కువ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంతకుముందు ఈ ఏడాది మే నెలలో కూడా భారత విదేశీ మారక నిల్వలు ఏడాదికి పైగా కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రజలు విదేశీ ప్రయాణాలను తగ్గించాలని, ఇంధన వినియోగాన్ని పరిమితం చేయాలని, ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ విజ్ఞప్తులు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.
ప్రధానంగా గమనించాల్సిన అంశాలు
♦ భారత విదేశీ మారక నిల్వలు ఒక్క వారంలోనే 14 బిలియన్ డాలర్లకు పైగా తగ్గాయి.
♦ విదేశీ కరెన్సీ నిల్వల విలువ 7.8 బిలియన్ డాలర్లు తగ్గింది.
♦ బంగారం నిల్వల విలువ 6.1 బిలియన్ డాలర్లు తగ్గింది.
♦ రూపాయి విలువ ఒక డాలర్‌కు రూ.94.24కు పడిపోయింది.
♦ రూపాయి విలువ రూ.100కు చేరుకునే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక.
♦ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగం, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని గతంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
(ద వైర్ ఇంగ్లిష్‌లో ప్రచురితమైన ఈ వ్యాసానికి తెలుగు అనువాదం: కె. గంగాధర్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
