Pope Leo XIV. Photo: Edgar Beltran / The Pillar via Wikimedia Commons (CC BY-SA 4.0)
పోప్ లియో XIV, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే అనుసరిస్తున్న కఠినమైన పొదుపు చర్యలను, ఆయన ప్రదర్శించే అహంకార పూరిత శైలిని పరోక్షంగా విమర్శించారు. తనకు ముందు పోప్ స్వంత దేశంలో నెలకొన్న, రాజకీయంగా అత్యంత సున్నితమైన జాతీయ చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నవంబర్ 8 న ఈ నగరంలోని పలాసియో లిబర్టాడ్‌లో అర్జెంటీనా రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలను ఉద్దేశించి పోప్ లియో చేసిన ప్రసంగం తరచుగా ఒక రాజకీయ ప్రసంగంలా అనిపించింది. అది కొందరికి ఇష్టం కావచ్చు కొందరికి కష్టం కావచ్చు. అర్జెంటీనా నాయకుడి విధానాలపై విమర్శలుగా భావించదగిన చోట్ల అధ్యక్షుడు మిలే ప్రత్యర్థులు గట్టిగా చప్పట్లు కొట్టారు. బహుశా, “ఆర్థిక వ్యవస్థ వ్యక్తికి సేవ చేయాలి, అంతేగాని వ్యక్తి ఆర్థిక వ్యవస్థకు సేవ చేయకూడదు.” అని లియో(పోప్) అన్నారు. దీనికి పెద్ద ఎత్తున చప్పట్లు వినిపించాయి.
లియో నిర్దిష్టంగా లేదా సూటిగా కాకుండా ప్రత్యేక శైలిలో మాట్లాడారు. కానీ అర్జెంటీనా అధ్యక్షుడు మిలే తగ్గించి న వివాదాస్పద సామాజిక కార్యక్రమాలను, ప్రయోజనాలను లియో(పోప్) తప్పు పట్టారు. ఒక విధంగా హెచ్చరిక జారీ చేసినట్లు కనిపించింది. ఇతర చర్యలతో పాటు, మిలే పెన్షన్లు, వైకల్య భత్యాల పెంపును కూడా వీటో (నిరాకరించాడు)చేశారు.
“అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్న కుటుంబాలు, నిరుద్యోగులు, సంవత్సరాల తరబడి సమాజానికి సేవ చేసిన వృద్ధులు, ఎంత కష్టపడినా తమ ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారందరి గురించి నేను ఆలోచిస్తున్నాను,” అని లియో పోప్ అన్నారు.
సెయింట్ పీటర్ సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్(గత పోప్ అర్జెంటీనా దేశస్థుడు) ఎన్నడూ తిరిగి రాని దేశానికి లియో ఆదివారం వచ్చారు. దానికి కారణం ఏమిటో ఫ్రాన్సిస్ తరచుగా పరోక్షంగా సూచించారు. మొట్టమొదటి లాటిన్ అమెరికన్ పోప్‌ను “మూర్ఖుడు,” “వామపక్ష వాది”, సైతాను సేవకుడు అని ప్రస్తుత అర్జెంటీనా అధ్యక్షుడు మిలే తీవ్రంగా నిందించాడు. మిలే దేశానికి నాయకుడిగా ఉంటూ దీర్ఘకాలంగా సాగిస్తున్న విషపూరితమైన రాజకీయాలే దేశంలో ఈ దుస్థితి కి కారణం.
తన 12 రోజుల దక్షిణ అమెరికా పర్యటనలో భాగంగా నాలుగు రోజుల పాటు లియో (పోప్) అర్జంటీనా వచ్చారు. ఆయనను కలిసినప్పుడు మిలే సంయమనంతో నే ఉన్నారు. ఆదివారం నాడు కొత్త పోప్‌తో పాటు గత పోప్ వారసత్వాన్ని ఆయన కొనియాడారు. లియో పర్యటన “నిజంగా ఉద్వేగభరితం” అని వర్ణిస్తూ మిలే ఆయనకు స్వాగతం పలికారు. 71 ఏళ్ల పోప్ తన ప్రారంభోపన్యాసం చేస్తుండగా ఆయన మర్యాదపూర్వకంగా చప్పట్లు కొట్టారు. మిలే యొక్క దూకుడు, నిర్మొహమాట ప్రసంగాలకు అలవాటుపడిన దేశంలో, ప్రజాస్వామ్యంలో “పదాలను జాగ్రత్తగా వాడవలసిన” ఆవశ్యకత గురించి లియో పరోక్షంగా హిత బోధ చేశారు.
1970, 1980 లలో మితవాద సైనిక పాలన చేతిలో ఎన్నో అదృశ్యాలు జరిగాయి. ఆకాలాన్ని ‘డర్టీ వార్’ అంటారు. అర్జెంటీనా దేశం దీనిపై చారిత్రాత్మక పునఃసమీక్ష చేస్తోంది. దానిని నేరుగా ప్రస్తావించకుండా, “దేనిని పరిరక్షించాలో విచక్షణతో నిర్ణయించుకోవడం, గత అన్యాయాలను ఎదుర్కోవడం ప్రతి తరం యొక్క బాధ్యత” అని పోప్ లియో అన్నారు.
నవంబర్ 9 న దివ్యాంగుల కేంద్రానికి లియో ఒక ఉన్నత స్థాయి పర్యటన చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని, ప్రభుత్వం సామాజిక ప్రయోజనాలకు చేసిన భారీ కోతలపై ఒక సూటి వ్యాఖ్యగా అర్జెంటీనా చర్చిలోని సీనియర్ అధికారులు భావించి ఆ పర్యటనకు అనుమతి నిరాకరించారు.
మిలే యొక్క కార్మిక సంఘ వ్యతిరేక అజెండాను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. లియో, కార్మిక సంఘ కార్యకర్తలతో పాటు, అగ్రశ్రేణి వ్యాపార నాయకులతో కూడా సమావేశమయ్యారు. కార్మికుల హక్కులను ప్రోత్సహించడానికి, “దురాశ”, “దోపిడీ” పట్ల హెచ్చరించడానికి ఆయన ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు.
లియో 8 ప్రసంగం తర్వాత, అధ్యక్షుడు మిలే LN+ టెలివిజన్‌తో మాట్లాడుతూ, రాజకీయ సంభాషణ, సయోధ్య కోసం లియో చేసిన పిలుపునకు తాను అనుకూలంగా ఉన్నానని చెప్పారు.
“నేను ఆ విషయాల్లో దేనికీ వ్యతిరేకం కాదు. అది రాజకీయ వ్యవస్థలోని ఒక వర్గం, పత్రికల సహకారంతో ముందుకు తెచ్చిన దురుద్దేశ పూర్వకమైన చిత్రీకరణ. చర్చలు మేధో పరంగా నిజాయితీగా ఉండాలని నేను భావిస్తున్నాను, కానీ అర్జెంటీనాలో అవి మేధో పరంగా నిజాయితీగా లేవు,” అని మిలే అన్నారు.
ప్రమాదకర రాజకీయ స్థితి ని ఈ పోప్ పర్యటనలు ఎత్తి చూపుతున్నాయి. అంతేకాకుండా, లియో ఆయన పోప్‌గా ఉన్న కాలంలోని ప్రధాన ఇతివృత్తమైన మానవ గౌరవంతో కొన్నిసార్లు విభేదించే అతి ధన స్వామ్య రాజకీయ వర్గాల మధ్య ఉన్న ప్రాథమిక ఉద్రిక్తతను కూడా ఇవి స్పష్టం చేస్తున్నాయి.
“పోప్ లియో వికలాంగుల కేంద్రానికి వెళ్లడం ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇది ప్రాథమికంగా వారి విధానాలపై విమర్శకు సంకేతం, ఇది ఫ్రాన్సిస్ పోప్‌గా ఉన్న కాలంతో కొనసాగింపునకు స్పష్టమైన సంకేతం కూడా. ఎందుకంటే ఆయన కూడా ఇదే చేసి ఉండేవారు. అనేక విధాలుగా, మనం పోప్ లియోలో పోప్ ఫ్రాన్సిస్‌ను చూస్తాము.” అని యూనివర్సిడాడ్ నేషనల్ డి రోసారియోలోని అర్జెంటీనా చర్చి చరిత్రకారుడు డియెగో మౌరో అన్నారు. “కానీ ఆయనను ఎదుర్కోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అధ్యక్షుడు మిలే కి అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను,” అని మౌరో అన్నారు.
ఇంటికి తిరిగి రాని పోప్‌కు ప్రతిరూపంగా ఆయనను చూస్తున్న చాలా మంది అర్జెంటీనా వాసులతో సహా, లియోకు ఇక్కడ గర్జించే జన సమూహాలు స్వాగతం పలికాయి. నగరంలోని పలెర్మో పరిసర ప్రాంతంలో సోమవారం జరిగిన భారీ బహిరంగ ప్రార్థన సభకు ఆయన పోప్‌గా ఉన్న కాలంలోనే అత్యధికంగా 25 లక్షల మంది హాజరయ్యారు. ఒకప్పుడు ఫ్రాన్సిస్‌కు సుపరిచితమైన, ఇక్కడ “దుఃఖ గ్రామాలు”గా పిలువబడే మురికివాడల నుండి కూడా కొందరు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కొన్ని టాంగో స్వరాలతో ప్రారంభమైంది.
ఒక ప్రాణాంతక కణితిని, అతని ఊపిరితిత్తులలో కొంత భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స జరిగిన నెల రోజుల లోపే, లియో సాపేక్షంగా దృఢంగా కనిపించాడు. అతను తెల్లవారుజాము నుండి రాత్రి బాగా పొద్దుపోయే వరకు కార్యక్రమాలకు హాజరవుతూ, తన కార్యకలాపాలను అత్యంత వేగంగా కొనసాగిస్తున్నాడు.
తన పర్యటనలో మొదటి గమ్య స్థానమైన ఉరుగ్వేకు రోమ్ నుండి ప్రయాణిస్తున్న విమానంలో, అర్జెంటీనా పర్యటన ఫ్రాన్సిస్ గురించినదేనా అని అడిగినప్పుడు, లియో ఇలా అన్నాడు, “ఖచ్చితంగా అనేక ముఖ్యమైన సంబంధాలు ఉంటాయి, కానీ అది ఈ పర్యటన యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం కాదు.” ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం చర్చి సందేశాన్ని వ్యాప్తి చేయడమేనని పోప్ చెప్పాడు.
నవంబర్ 8 రాత్రి, నగరంలోని ‘పలాసియో లిబెర్టాడ్’ వద్ద సమావేశమైన అధికారులతో లియో మాట్లాడుతూ, తాను ఒక రకంగా తన పూర్వీకుడు నడిచిన బాటలోనే మళ్లీ నడుస్తున్నానని, ఆయన “ఇక్కడ పొందిన అనుభవాలను, ఇక్కడి ప్రజలను, ఇక్కడి విశ్వాసాన్ని తన జ్ఞాపకాల్లో, తన హృదయంలో ఎంతో విలువైనవిగా దాచుకున్నారని” పేర్కొన్నారు.
అయితే, అప్పటికే ఆయన పర్యటనకు రాజకీయ రంగు పులమడం మొదలైంది. గృహ నిర్బంధంలో ఉన్న, ఫ్రాన్సిస్‌తో విభేదించి ఆ తర్వాత ఆయనతో రాజీపడిన పెరోనిస్ట్ మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్నర్, ‘ది వాషింగ్టన్ పోస్ట్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఇక్కడ లియో యొక్క అజెండాను తన రాజకీయ శత్రువైన మిలేపై ఒక దెబ్బగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు.
“పోప్ వికలాంగులను, ఖైదీలను సందర్శించడంతో సహా పలు కార్యక్రమాలను నిర్వహించారు,” అని ఆమె అన్నారు. “ఆయన ఉనికి, చర్చి యొక్క ఆదర్శాలు, సమాజంలోని బలహీనుల పట్ల దాని నమ్మకాలు ఇవన్నీ మిలే ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్నాయి.”
కానీ ఇక్కడున్న చాలామందికి, లియో పర్యటన ఈ దేశపు అత్యంత ప్రసిద్ధ పుత్రులలో ఒకరైన – మిలోంగా, సాకర్‌ను ప్రేమించే యువకుడు, మొట్టమొదటి లాటిన్ అమెరికన్ పోప్‌గా ఎదిగిన జార్జ్ మారియో బెర్గోగ్లియోను స్మరించుకోవడానికి ఒక అవకాశంగా నిలిచింది.
ఒకప్పుడు ఫ్రాన్సిస్ ఆర్చ్ బిషప్‌గా, కార్డినల్‌గా నడిచిన ఇనుప బాల్కనీలు ఉన్న వీధుల్లో, 50 ఏళ్ల మిర్నా ఫ్లోరెంటిన్ ఆయన వారసుడి కోసం ఎదురు చూసింది. ఆమె నగరంలోని అత్యంత పేద నివాసితులకు ఆహారం అందించే ఒక స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహిస్తోంది. బలహీనుల రక్షణపై లియో ఇచ్చిన సందేశం ఫ్రాన్సిస్ మాటలను పోలి ఉందని ఆమె ప్రశంసించింది.
పోప్ లియో చికాగోలో జన్మించినప్పటికీ, అక్కడ మిషనరీగా, బిషప్‌గా పనిచేస్తున్నప్పుడు పెరూ ద్వంద్వ పౌరసత్వం పొందారు. ఆయన అనర్గళంగా స్పానిష్ మాట్లాడటం, ద్వంద్వ జాతీయత కలిగి ఉండటం ఇక్కడి చాలా మందికి ఆయనను ప్రియమైన వ్యక్తిగా మార్చాయి.
“మేము లియోను ఫ్రాన్సిస్ సోదరుడిగా చూస్తాము. ఆయన ఉత్తర అమెరికన్ కంటే లాటిన్ అమెరికన్ ఎక్కువ ఇష్టుడు. ఫ్రాన్సిస్ ఉన్నత ప్రమాణాలను నిర్దేశించారు. కాబట్టి లియో కాథలిక్ చర్చి యొక్క సామాజిక బోధనలను స్వీకరించడం తప్ప మరో మార్గం లేదు.” అని ఆమె చెప్పింది.
అయితే, ఫ్రాన్సిస్ ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా పేరు పొందారు. ఇక్కడి వారిలో కొందరు పోప్ లియో యొక్క మరింత మితమైన స్వరం, తక్కువ ఘర్షణ పూరిత శైలి పట్ల అంతగా ప్రభావితం కాలేదు. “ఫ్రాన్సిస్ మరింత సూటిగా, మరింత మానవతా దృక్పథంతో ఉండేవారు,” అని బ్యూనస్ ఎయిర్స్‌లోని శాన్ జోస్ డి ఫ్లోర్స్ బసిలికాలో పారిష్ సభ్యురాలైన, 73 ఏళ్ల విశ్రాంత ఉద్యోగిని స్టెల్లా మారిస్ అన్నారు. ఫ్రాన్సిస్‌కు మత జీవితంలోకి ప్రవేశించాలనే పిలుపును మొట్టమొదటగా విన్నది కూడా ఈ చర్చిలోనే. ఆమె ఇంకా చెబుతూ “ప్రస్తుత ప్రభుత్వం గురించి, అది పేదల పట్ల ఎలా ప్రవర్తిస్తోందనే దాని గురించి ఆయన ఏమనుకుంటున్నారో బహిరంగంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజం ఏమిటంటే, మిలే పేదలను రక్షించరు పైగా పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.”
పరిశీలకులు వాటికన్ ఉన్నతాధికారులు, ఫ్రాన్సిస్-లియోల మధ్య కీలక పదవుల విషయంలో విస్తృతమైన కొనసాగింపు ఉందని, అలాగే ముఖ్యంగా వారి శైలిలో కొన్ని తేడాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తికరంగా, లియో అగస్టీనియన్ ఆర్డర్‌కు నాయకత్వం వహిస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ బ్యూనస్ ఎయిర్స్లో కార్డినల్‌గా పనిచేస్తున్నప్పుడు, సిబ్బంది మార్పులకు సంబంధించిన ఒక వివాదం కారణంగా, ఫ్రాన్సిస్‌కు తనంటే ఇష్టం లేదని, తనను ఎప్పటికీ బిషప్‌గా నియమించక పోవచ్చని ఒకానొక సమయంలో తాను భావించినట్లు లియో గతంలో పేర్కొన్నారు. “ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికైనప్పుడు, ‘సరే, ఈయనకు నేను కాదనడానికి ఏమాత్రం సంకోచించనని తెలుసు కాబట్టి, ఈయన నన్ను ఎప్పటికీ బిషప్‌గా చేయడు’ అని లియో అనుకున్నారు,” అని లియో జీవితచరిత్ర రచయిత్రి ఎలిస్ ఆన్ అలెన్ అన్నారు. “నిజానికి, దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది.”
ఫ్రాన్సిస్ వెంటనే లియోను పెరూలోని చికలాయోలో బిషప్ పాత్రలోకి నియమించారు. ఈ వారం లియో ఒక విజయవంతమైన స్వదేశీ పునరాగమనం కోసం అక్కడికి వెళ్లనున్నారు. 2023లో, ఫ్రాన్సిస్ అప్పటి రాబర్ట్ ప్రివోస్ట్ అయిన లియోను వాటికన్ సిటీకి పిలిపించి, ఆయనను కార్డినల్‌గా నియమించి, చర్చి యొక్క శక్తివంతమైన బిషప్‌ల కార్యాలయానికి అధిపతిగా అత్యున్నత పదవులలో ఒక దాన్ని ప్రదానం చేశారు. తిరిగి చూస్తే, ఫ్రాన్సిస్ లియోను కాబోయే పోప్‌గా సిద్ధం చేస్తున్నారని ఆ చర్యను చాలామంది వ్యాఖ్యానించారు.
“నిస్సందేహంగా వారు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు. కానీ పోప్ లియో, పోప్ ఫ్రాన్సిస్‌కు గొప్ప శిష్యుడు,” అని వాటికన్ యొక్క లాటిన్ అమెరికా పోంటిఫికల్ కమిషన్ కార్యదర్శి రోడ్రిగో గెర్రా లోపెజ్ అన్నారు. “దానిలో ఎలాంటి సందేహం లేదు.”
వాషింగ్టన్ పోస్ట్ వార్తా కధనానికి తెలుగు అనువాదం: సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
