నవంబర్ 20 ప్రపంచ బాలల దినోత్సవం. బాలలే దేశ భవిష్యత్తు అని తరచుగా చెప్పుకుంటాం. కానీ ఆ బాలలందరికీ సమానమైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, భద్రత, ఆడుకునే హక్కు, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అవకాశాలు లభిస్తున్నాయా అనేది నేడు ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది.
ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరోవైపు కోట్లాది మంది పిల్లలు పేదరికం, ఆకలి, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, విద్యకు దూరమవడం నిత్యకృత్యమయ్యాయి. అందువల్ల నవంబర్ 20 కేవలం ఒక ఉత్సవ దినం కాదు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలకు గుర్తుచేసే రోజు.
చారిత్రక నేపథ్యం.. బాలల హక్కుల ఒడంబడిక..
ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహణకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1954 డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలు బాలల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించాలని సిఫార్సు చేసింది.
బాలల మధ్య స్నేహభావం, సౌభ్రాతృత్వం, పరస్పర అవగాహన పెంపొందించడం దీని ఉద్దేశం.
1959 నవంబర్ 20న ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది. బాలలకు విద్య, ఆరోగ్యం, సంరక్షణ, వివక్ష నుంచి రక్షణ వంటి హక్కులు ఉండాలని ఈ ప్రకటన స్పష్టం చేసింది. 1989 నవంబర్ 20న ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడికను ఆమోదించింది. ఈ ఒప్పందం 1990 సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
ప్రపంచంలోని బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి అత్యంత విస్తృతంగా ఆమోదం పొందిన అంతర్జాతీయ మానవ హక్కుల ఒడంబడికల్లో ఇది ఒకటి.
బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికలో ప్రధానంగా నాలుగు సూత్రాలకు ప్రాధాన్యం ఉంది:
1. వివక్షకు తావులేని హక్కు: కులం, మతం, భాష, ప్రాంతం, లింగం, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి బాలుడికి సమాన హక్కులు ఉండాలి.
2. బాలల శ్రేయస్సుకు ప్రాముఖ్యం: బాలలకు సంబంధించిన ప్రతి నిర్ణయంలో వారి సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణించాలి.
3. జీవించే హక్కు, అభివృద్ధి హక్కు: ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి.
4. అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు: తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాల్లో బాలల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి.
ఈ హక్కులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి బాలుడి జీవితంలో అమలు కావాలి.
భారతదేశంలో బాలల పరిస్థితి – బాల కార్మిక వ్యవస్థ
భారతదేశం ప్రపంచంలో అత్యధిక బాలల జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. దేశ అభివృద్ధిలో బాలల పాత్ర అత్యంత కీలకం.
అయితే భారతదేశంలో బాలలందరికీ సమానమైన అవకాశాలు అందడం లేదనేది చేదు నిజం. పేద కుటుంబాల్లోని పిల్లలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్య ఎండమావిలోని నీటి చందంగా మారాయి. కుటుంబ ఆదాయం కోసం చిన్న వయసులోనే పనులకు వెళ్లడం సర్వసాధారణం. సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు.
బాల్య వివాహాలు, బాలికలకు బాలురతో సమాన అవకాశాలు లభించకపోవడం పరిపాటిగా మారింది. పేదరికం అనేది కేవలం ఆదాయం లేకపోవడం మాత్రమే కాదు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, గౌరవప్రదమైన జీవితం వంటి అవకాశాల కొరత కూడా పేదరికంలో భాగమే.
భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా ఉంది. హోటళ్లు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రంగం, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగం, గృహ పనులు, చిన్న దుకాణాలు వంటి అనేక రంగాల్లో పిల్లలు పనిచేయడం సాధారణ విషయమైంది.
పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో కష్టపడి పనిచేయాల్సి రావడం వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) సవరణ చట్టం, 2016 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను సాధారణంగా ఏ వృత్తి లేదా ప్రక్రియలోనూ పనికి నియమించడం నిషేధం. చట్టంలో పేర్కొన్న పరిమిత మినహాయింపులు ఉన్నాయి.
14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల కిశోరులను ప్రమాదకర వృత్తులు, ప్రక్రియల్లో నియమించడం నిషేధం.
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి.
అయితే చట్టాలు ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వాటి సమర్థమైన అమలు, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం అవసరం.
బాలల పోషకాహారం – ఎదురవుతున్న సవాళ్లు
పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి పౌష్టికాహారం అత్యంత అవసరం. కానీ భారతదేశంలో బాలల పోషకాహార పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – NFHS-5 (2019–21) ప్రకారం ఐదేళ్లలోపు పిల్లల్లో 35.5% మందికి వయసుకు తగిన ఎత్తు లేదు. 19.3% మందికి ఎత్తుకు తగిన బరువు లేదు.
32.1% మందికి వయసుకు తగిన బరువు లేదు. ఈ గణాంకాలు దేశంలో పోషకాహార సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి.
ఈ సమస్యకు పేదరికం, కుటుంబాల్లో ఆహార భద్రత లేకపోవడం, తల్లుల ఆరోగ్య సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు, వైద్య సేవల కొరత వంటి అనేక కారణాలు ఉన్నాయి.
ప్రభుత్వం అంగన్వాడీ సేవలు, పోషణ్ అభియాన్, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. కానీ నేటి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పథకాలకు తగిన నిధులు కేటాయించకుండా నీరుగారుస్తోంది.
మరోవైపు అక్షయ పాత్ర లాంటి ప్రైవేట్ సంస్థలకు మధ్యాహ్న భోజనం వండే బాధ్యతను అప్పగిస్తోంది.
బాలల విద్య – హక్కు అందరికీ సమానంగా అందుతోందా?
విద్య అనేది ప్రతి బాలుడి ప్రాథమిక హక్కు. విద్య ద్వారానే పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వివక్ష నుంచి బయటపడే అవకాశాలు పెరుగుతాయి.
భారత రాజ్యాంగంలోని 21-A అధికరణం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
2009లో వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్లో విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
అయితే విద్యారంగంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకుండా చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు:
♦ కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత.
♦ తగిన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల లోపం.
♦ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సమస్యలు.
♦ డిజిటల్ విద్యకు అవసరమైన పరికరాలు, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడం.
♦ పేద కుటుంబాల పిల్లలు మధ్యలోనే చదువు మానేయడం.
♦ బాలికల విద్యకు కుటుంబ, సామాజిక ఆంక్షలు ఎదురుకావడం.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల విస్తరణ ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం సాధ్యం కాదు. విద్య వ్యాపార వస్తువుగా కాకుండా ప్రతి పౌరుడికి అందాల్సిన హక్కుగా ఉండాలి.
బాలికలపై వివక్ష.. రక్షణ బాధ్యత
భారతదేశంలో బాలికలు అనేక రంగాల్లో ప్రతిభను చూపుతున్నప్పటికీ బాల్య వివాహాలు, లింగ వివక్ష, లైంగిక వేధింపులు, పౌష్టికాహార లోపం, విద్యకు దూరం కావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
కొన్ని కుటుంబాల్లో బాలుర చదువుకు ప్రాధాన్యమిచ్చి బాలికల చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారు. మహిళా సాధికారతకు పునాది బాలికల విద్య. అందువల్ల బాలికల విద్యను కుటుంబ బాధ్యతగా కాకుండా ప్రభుత్వ బాధ్యతగా కూడా చూడాలి.
పిల్లలు కుటుంబంలోనే కాకుండా పాఠశాలల్లో, సమాజంలో, పనిచేసే ప్రదేశాల్లో కూడా సురక్షితంగా ఉండాలి.
బాలలపై లైంగిక దాడులు, హింస, అక్రమ రవాణా, వేధింపులు, ఆన్లైన్ దోపిడీ వంటి సమస్యలను ప్రభుత్వం అరికట్టాలి.
బాలల అభివృద్ధే సంక్షేమ రాజ్యానికి కొలమానం
ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి కేవలం స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ), పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ మారక నిల్వలు మాత్రమే కొలమానాలు కావు. ఆ దేశంలోని పిల్లల పరిస్థితి కూడా ముఖ్యమైన కొలమానం.
ప్రతి బాలుడికి తగినంత పౌష్టికాహారం అందుతోందా? ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య లభిస్తోందా? పేదరికం కారణంగా పిల్లలు పనులకు వెళుతున్నారా? బాలికలకు సమాన హక్కులు ఉన్నాయా? ప్రభుత్వ వైద్య సేవలు పిల్లలకు అందుబాటులో ఉన్నాయా? పేద, ధనిక పిల్లల మధ్య అవకాశాల్లో అంతరం తగ్గుతోందా?
ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశ సంపదలో, ప్రభుత్వ బడ్జెట్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో బాలల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
