ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెలంగాణ విద్యకు సంబంధించిన అసలు లక్ష్యాన్ని పునరాలోచించుకునే ఒక అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రతి బిడ్డ ప్రత్యేకం. కానీ అందరూ ఒకే రకమైన పాఠ్యప్రణాళికను అనుసరించాలని, ఒకే వేగంతో ముందుకు సాగాలని, ఒకే రకమైన పరీక్షల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకోవాలని మన ప్రస్తుత విద్యావ్యవస్థ ఆశిస్తుంది. అంటే, ప్రతి బిడ్డ ప్రత్యేకమని అంగీకరిస్తూనే, అందరూ ప్రామాణికమైన ఒకే విధమైన విధానాలను అనుసరించాలని కోరుకుంటాం.
సృజనాత్మకంగా, మూస ధోరణులను దాటి ఆలోచించమని విద్యార్థులకు చెబుతాం. కానీ ప్రశ్నలను అడగడాన్ని ప్రోత్సహించం. జీవితంలో విజయానికి ఇతరులతో కలిసి పనిచేయడం ఎంతో అవసరమని బోధిస్తాం. కానీ పరీక్షల్లో ఒంటరిగా సాధించిన విషయాన్నే విజయంగా కీర్తిస్తాం.
విద్యార్థులు సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తాం. కానీ ఎవరో ఇప్పటికే గుర్తించిన సమస్యలను, రూపొందించిన ప్రశ్నలను, కనుగొన్న సమాధానాలను పునరావృతం చేసినవారిని ప్రతిభావంతులుగా గుర్తిస్తాం.
ఈ వైరుధ్యాలు పైకి హాస్యాస్పదంగా కనిపించినా, యువత మేధో వికాసంపై ఇవి చూపించే ప్రభావం చాలా తీవ్రమైనది.
ఇక్కడ ఎదురయ్యే ఒక మౌలికమైన ప్రశ్న ఏమిటంటే, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నించడానికి, దాన్ని మార్చడానికి అవసరమైన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తున్నామా? లేక ఇప్పటికే ఉన్న వ్యవస్థలో విజయవంతంగా ఇమిడిపోయి పనిచేయడానికి మాత్రమే వారిని సిద్ధం చేస్తున్నామా?
పరిపాలనా మార్పా? విద్యా స్వభావంలో మార్పా?
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను పాఠశాల విద్యా వ్యవస్థలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనకు ప్రధానంగా విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయడాన్ని తగ్గించడం, విద్య కొనసాగేటట్లు చేయడం, నాణ్యతను మెరుగుపరచడం వంటి కారణాలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది.
పాఠశాల విద్యతో ఇంటర్మీడియట్ను అనుసంధానించడం వల్ల ఈ సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చు.
అయితే, ఈ పునర్వ్యవస్థీకరణ విద్య లక్ష్యాన్ని, స్వభావాన్ని మారుస్తుందా? లేక కేవలం దాని పరిపాలనా నిర్మాణాన్ని మాత్రమే మారుస్తుందా?
హయ్యర్ సెకండరీ దశ అనేది ఉన్నత విద్యలోకి ప్రవేశించడానికి ఎదురుచూసే ఒక మధ్యంతర దశ మాత్రమే కాదు. విశ్వవిద్యాలయాల్లో సీట్లకు, వైద్య, ఇంజినీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం మాత్రమే దాని లక్ష్యం కాదు.
స్వతంత్రంగా ఆలోచించే శక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రజాస్వామిక విలువలను, సామాజిక స్పృహను, నైతిక బాధ్యతను, సమాజంలో అర్థవంతంగా పాల్గొనే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం కూడా దాని ప్రధాన లక్ష్యాలు.
పని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, భిన్న సంస్కృతులను గౌరవించడానికి, తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకోవడానికి అవసరమైన సామర్థ్యాలను కూడా ఈ విద్య అందించాలి.
దీనికి భిన్నంగా, ఒక నిర్దిష్ట రంగంలో లోతైన జ్ఞానాన్ని, ప్రత్యేక నైపుణ్యాలను, వృత్తిపరమైన సామర్థ్యాన్ని, పరిశోధనా దృక్పథాన్ని ఉన్నత విద్య అభివృద్ధి చేస్తుంది. ఈ రెండు దశలు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నప్పటికీ, వాటి లక్ష్యాలు ఒకటి కావు. హయ్యర్ సెకండరీ విద్య మేధోపరమైన, సామాజిక పునాదులను నిర్మిస్తే, ఉన్నత విద్య వాటిపై ప్రత్యేక రంగాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది ఒక కీలకమైన సంధిదశ.
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టుల్లో లోతైన అవగాహనను, ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం కల్పిస్తూనే, విద్య విస్తృతమైన లక్ష్యాలను కూడా కాపాడాలి. కానీ దురదృష్టవశాత్తూ, ప్రభుత్వాల నిర్లక్ష్యం, విద్యలో పెరిగిన వ్యాపార ధోరణి ఈ లక్ష్యాలను పక్కదారి పట్టించాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దశ క్రమంగా జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల శిక్షణకు పరిమితమవుతోంది. కార్పొరేట్ జూనియర్ కళాశాలల విస్తరణ ఈ ధోరణిని మరింత పెంచింది. విద్య అంటే పరీక్షల్లో సాధించే మార్కులు, తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరించడం, కంఠస్థం చేయడం, కోచింగ్ ద్వారా సాధించే విజయాలుగా మారిపోతోంది.
విద్యా వ్యవస్థ పరీక్షల చుట్టూ తిరుగుతోంది. పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మానసిక సమస్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారాయి.
భాషలు, మానవీయ శాస్త్రాలు, కళలు, క్రీడలు, విద్యార్థుల సామాజిక, భావోద్వేగ వికాసానికి సంబంధించిన అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మన విద్యార్థులు సాధిస్తున్న విజయాలను చూసి గర్విస్తున్నాం. కానీ వారి సమగ్ర వికాసం గురించి ఆలోచిస్తున్నామా?
పోటీ పరీక్షల ఒత్తిడి.. ఆచరణాత్మక సవాళ్లు
విద్యార్థుల విజయాన్ని ఉత్తీర్ణత శాతం లేదా పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి సంఖ్యతో మాత్రమే కొలవకూడదు. వారిలో ఆసక్తి, వివేచన, స్వతంత్ర ఆలోచన, సామాజిక బాధ్యత, జీవిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగాయా లేదా అన్నదే అసలైన కొలమానం కావాలి.
సమాజానికి వైద్యులు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులు ఎంత అవసరమో, చైతన్యవంతమైన పౌరులు, సృజనాత్మకంగా ఆలోచించేవారు, సున్నితమైన మనసున్నవారు, అన్యాయాన్ని ప్రశ్నించేవారు కూడా అంతే అవసరం.
విద్యార్థులు డాక్టర్లు కావాలని, ఇంజినీర్లు కావాలని ఆశపడటంలో తప్పేమీ లేదు. అవి సమంజసమైన ఆకాంక్షలే. కానీ కొన్ని పోటీ పరీక్షలకు సిద్ధం కావడమే ఒక విద్యార్థి జీవితంలోని అత్యంత కీలకమైన రెండేళ్ల విద్యకు ఏకైక లక్ష్యంగా మారడమే అసలు సమస్య.
ఐఐటీ లేదా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం పొందలేకపోయిన విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో విఫలమైనట్లుగా భావించే పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రతిపాదిత విలీనం ఈ లోపాన్ని సరిదిద్దడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే 11, 12 తరగతులను పాఠశాల విద్యలోకి తీసుకురావడం వల్ల మాత్రమే ప్రస్తుత విద్యా సంస్కృతి మారిపోదు.
అదే పరీక్షల ఆధారిత బోధన, అదే కోచింగ్ విధానాలు, విద్యా విజయాన్ని పరిమితంగా అర్థం చేసుకునే ధోరణి కొనసాగితే, పాత సమస్యలనే కొత్త పరిపాలనా వ్యవస్థలో తిరిగి సృష్టించినట్లవుతుంది.
ఈ విషయమై ఆచరణకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ స్థాయి విద్యను అందించడానికి అవసరమైన ప్రత్యేక అర్హతలున్న ఉపాధ్యాయులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా?
విద్యార్థులకు తగినన్ని సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం ఉంటుందా? విలీనం వల్ల బోధనా సిబ్బంది కెరీర్ అవకాశాలకు ఇబ్బంది కలుగుతుందా?
కొత్త విధానంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపార ధోరణిని, అది కలిగించే చెడు ప్రభావాన్ని ఎలా నియంత్రిస్తారు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చాలా ముఖ్యమైనవి. పరిపాలనా వ్యవస్థల విలీనం పేరుతో ఇంటర్మీడియట్ విద్య లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు దెబ్బతినకూడదు. ఇంతకంటే ముఖ్యంగా, విద్యా సంస్కరణల గురించి మన అవగాహనలో ఉన్న వైరుధ్యాలను కూడా మనం పునఃపరిశీలించుకోవాలి.
ఏఐ వినియోగం.. మౌలిక మార్పు అవసరం
ఉదాహరణకు, విద్యారంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై పెరుగుతున్న ఆసక్తిని పరిశీలిద్దాం.
విద్యార్థుల అవసరాలకు తగిన బోధన, కచ్చితమైన మూల్యాంకనం, వారి అభ్యసన వేగానికి అనుగుణంగా బోధనా విధానాలను మార్చడం, ఉపాధ్యాయుల పనిని మరింత సమర్థవంతం చేయడం వంటి ఎన్నో అవకాశాలను ఏఐ కల్పిస్తోంది.
భవిష్యత్తులో ప్రతి విద్యార్థి తన వేగానికి, ఆసక్తికి అనుగుణంగా వ్యక్తిగతంగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ పాఠ్యప్రణాళిక, పోటీ పరీక్షల కేంద్రంగా పరిమితమైతే, మూల్యాంకన విధానం చెప్పినట్లుగా చేయడానికే ప్రాధాన్యం ఇస్తుంటే, సృజనాత్మకతను నిర్లక్ష్యం చేస్తుంటే, నేర్చుకోవడాన్ని కేవలం కొలవగలిగే పరీక్షా మార్కుల ద్వారానే నిర్ణయిస్తుంటే ఇది ఎలా సాధ్యమవుతుంది?
ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. విద్యలో మెరుగుదల సాధించడం వేరు, విద్యలో మౌలికమైన మార్పు తీసుకురావడం వేరు. ఒక రైలు వెళ్లాల్సిన గమ్యమే తప్పయితే దాని వేగాన్ని పెంచడం వల్ల ఉపయోగం ఏమిటి? వేగంగా ప్రయాణించడం వల్ల తప్పు గమ్యాన్ని మరింత త్వరగా చేరుకుంటాం అంతే. మన విద్యావ్యవస్థ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ విలీనాన్ని విద్యలో సమూలమైన మార్పులకు ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి.
సమగ్ర అభ్యసనానికి, విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవడానికి, వివిధ శాస్త్రాల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి, ఆచరణాత్మక అనుభవాలను పొందడానికి, స్వతంత్రంగా అన్వేషించడానికి అవకాశం కల్పించాలి.
సైన్స్ క్లబ్బులు, సాహిత్య సంఘాలు, చర్చావేదికలు, కళలు, క్రీడలు, సామాజిక కార్యక్రమాలు, సమిష్టి ప్రాజెక్టులలో విద్యార్థులకు తగిన అవకాశాలు కల్పించాలి.
కేవలం ముందుగా నిర్ణయించిన సమాధానాలను వల్లె వేయడం కాకుండా, విషయాలపై అవగాహనను, సృజనాత్మకతను, విశ్లేషణా సామర్థ్యాన్ని, నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో ఉపయోగించగల నైపుణ్యాన్ని పొందగలగాలి.
విద్యాసంస్థల్లో ఉండాల్సిన సంస్కృతి కూడా ముఖ్యమైనది. విద్యార్థులు ప్రశ్నలు అడగడానికి, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి, భిన్నాభిప్రాయాలను గౌరవంగా చర్చించడానికి, కొత్త విషయాలను అన్వేషించడానికి, తప్పుల నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి.
టీచర్లు కేవలం పాఠ్యపుస్తకాల్లోని సమాచారాన్ని అందించే వారిగా కాకుండా, విద్యార్థుల మేధో వికాసానికి తోడ్పడే మార్గదర్శకులుగా ఉండాలి. విద్యార్థులను నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని స్వీకరించే వారిగా కాకుండా, తమ అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనే వారిగా చూడాలి.
అసలైన కొలమానం ఏమిటి?
అలాగే, విద్యార్థులు చదువు మధ్యలోనే మానేయకుండా చూడాలంటే విద్యాసంస్థల నిర్మాణాన్ని మార్చడం మాత్రమే సరిపోదని ప్రభుత్వం గుర్తించాలి.
పేదరికం, లింగ వివక్ష, రవాణా సదుపాయాల కొరత, సమీపంలో విద్యాసంస్థలు లేకపోవడం, విద్యా వనరులకు సమానమైన అందుబాటు లేకపోవడం వంటి సమస్యలను నిరంతర ప్రభుత్వ పెట్టుబడులు, సామాజిక సహకారం ద్వారా పరిష్కరించాలి.
అంతిమంగా, ఈ సంస్కరణ విజయాన్ని 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం లేదా పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి సంఖ్య ఆధారంగా మాత్రమే నిర్ణయించకూడదు.
విద్యార్థుల్లో ఆసక్తి, స్వతంత్రంగా ఆలోచించే శక్తి, వివేచన, సామాజిక బాధ్యత, తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగాయా లేదా అన్నదే అసలైన కొలమానం కావాలి.
ఒక సమాజానికి డాక్టర్లు, ఇంజినీర్లు, వివిధ వృత్తుల్లో నిపుణులు ఎంత అవసరమో, చైతన్యవంతమైన పౌరులు, సృజనాత్మకంగా ఆలోచించేవారు, సున్నితమైన మనసున్నవారు, అన్యాయాన్ని ప్రశ్నించగలిగినవారు కూడా అంతే అవసరం. ఈ అన్ని బాధ్యతలకు యువతను సిద్ధం చేయడం విద్య కర్తవ్యం.
తెలంగాణ ముందున్న అసలైన సవాలు ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం మాత్రమే కాదు; ఆ దశలో తిరిగి నిజమైన విద్యా స్ఫూర్తిని తీసుకురావడం.
విద్యార్థులను ముందుగా నిర్దేశించిన లక్ష్యాల వైపు మరింత సమర్థంగా నడిపించడం కంటే, వారు స్వయంగా ఆలోచించగల, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోగల వ్యక్తులుగా ఎదిగేలా విద్యను రూపొందించాలి.
మనం ఎలాంటి మనుషులను, ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నామనే ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడే ఈ విలీనం నిజమైన విద్యా సంస్కరణ అవుతుంది.
(వ్యాస రచయిత ఎడమ శ్రీనివాస రెడ్డి అధ్యాపకులు, కాకతీయ ప్రభుత్వ కళాశాల, హనుమకొండ. “త్రిశంకు స్వర్గంలో ఇంటర్ చదువులు” (2007) పుస్తక రచయిత.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
