నేనెందుకు చదువుతాను?
చదవకుండా ఉండలేను కాబట్టి –
చదువుతాను.
నేర్చుకోవడానికి, ఎదగడానికి, నవ్వడానికి,
స్ఫూర్తి పొందడానికి.
ఇంతవరకూ నాకు తెలియని విషయాల్ని
అర్థం చేసుకోవడానికి – చదువుతాను.
అనాలోచితంగా ఆత్మీయుల్ని విసుక్కున్నప్పుడు
చదువుతాను –
మథనపడడమూ, మననం చేసుకోవడమూ
చదవడమే కదా?
భయంతోనూ, నిరాశానిస్పృహలతోనూ
ముక్కలైపోతున్నట్లుగా అనిపించినప్పుడు
శక్తి కోసం చదువుతాను –
ఈ ప్రపంచం మీద అమితమైన ఆగ్రహం
కలిగినప్పుడు చదువుతాను –
అంతా సజావుగా ఉన్నప్పుడు కూడా
ప్రశాంతంగా చదువుతాను –
చర్మం, ఎముకలు, చూపులు, భావాలతో మాత్రమే
కాదు కదా నేను రూపొందిందీ?
కోర్కెలతో, ధ్యేయాలతో, మాటలతో కూడా కదా
నేను రూపొందిందీ?
నా హృదయంలో దాగి ఉన్న భావాల్ని, ధ్యేయాల్ని
వ్యక్తీకరించడానికి మాటలు కదా కావాలి?
మాటలు సజీవం – నేనూ సజీవం
నేను ఉన్న చోటే మార్పు కోసం నినదిస్తాను
నేను ఉన్న చోటే పిడికిళ్లు బిగిస్తాను
నా మాటలు మాత్రం విశ్వమంతా నినదిస్తాయి
నా మాటలే విశ్వమంతా పిడికిళ్లు బిగిస్తాయి
మాటలు సజీవం – నేనూ సజీవం
జీవాన్ని జీవంతో కలపడానికి చదువుతాను.
నేను ప్రేమించే కథ ఏదైనా కనిపించినప్పుడు
ఒకే పాట మళ్లీ మళ్లీ పాడుకుంటున్నట్టు..
ఒకే కథ మళ్లీ మళ్లీ చదువుతుంటాను.
ఆ పదాలతోనే నేను, కథలోకి ప్రవేశిస్తాను
ఆ పాత్రల్లో చేరి ఊపిరి పీలుస్తాను
వాటి నిర్వేదాన్ని, నిరాశల్ని నేను అనుభవిస్తాను
అవి ఏదైనా బుద్ధితక్కువ పని చేయబోతే,
కోపంగా అరుస్తాను.. వాటితో పాటూ నేనూ ఏడుస్తాను.
కాసేపటికి వాటితో పాటే మళ్లీ నవ్వుతాను –
చదవడమంటే నాకు – ఒక మంచి స్నేహితుడితో
గడిపినట్టుంటుంది.
పుస్తకం – ఒక మంచి మిత్రుడు.
అయితే ఆ అనుభూతిని ఆ స్థాయిలో
అందించే పుస్తకాలు చాలా ఉండవు.
జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
