AI illustration: Jhalkari Bai, Laxman Nayak and Miraben, three warriors of the Indian freedom struggle born on November 22.
ఝల్కారీ బాయి – షహీద్ లక్ష్మణ్ నాయక్ – మీరాబెన్
భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర అనేకమంది వీరుల త్యాగాలతో నిండి ఉంది. ఈ పోరాటం రైతులు, కార్మికులు, గిరిజనులు, మహిళలు, సామాన్య ప్రజలు, దేశ విదేశాల నుంచి వచ్చి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు తెలిపిన వ్యక్తులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.
అటువంటి వారిలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సహచరిగా పోరాడిన వీరనారి ఝల్కారీ బాయి, గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనను ఎదిరించి ఉరికంబం ఎక్కిన షహీద్ లక్ష్మణ్ నాయక్, బ్రిటన్‌లో జన్మించి తన జీవితాన్ని భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అంకితం చేసిన మీరాబెన్ ప్రముఖులు. వీరి ముగ్గురి జయంతులు నవంబర్ 22 కావడం యాదృచ్ఛికమే ఐనా విశేష ప్రాధాన్యత ఉంది.
వీరనారి ఝల్కారీ బాయి!
బాల్యం – సామాజిక నేపథ్యం:
ఝల్కారీ బాయి 1830 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని ప్రస్తుత ఝాన్సీ సమీపంలోని భోజ్లా గ్రామంలో జన్మించారు. ఆమె నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు సదోవర్ సింగ్, తల్లి పేరు జమునా దేవి. చిన్నతనం నుంచే ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆమెకు గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము వంటి యుద్ధ విద్య లపై ఆసక్తి ఉండేది. గ్రామీణ ప్రాంతంలో సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక మహిళ సైనిక నాయకురాలిగా ఎదగడం అప్పటి సామాజిక పరిస్థితుల్లో అసాధారణమైన విషయం.
1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పాత్ర:
1857లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ప్రముఖ నాయకత్వ పాత్ర పోషించారు. ఝల్కారీ బాయి ధైర్యసాహసాలను గుర్తించిన ఝాన్సీ రాణి ఆమెను తన సైన్యంలో చేర్చుకున్నారు. క్రమంగా ఆమె మహిళా సైనిక విభాగమైన దుర్గా దళానికి నాయకురాలిగా ఎదిగారు. ఆమెకు రాణి లక్ష్మీబాయితో ముఖ కవళికల్లో పోలిక ఉండేదని చెబుతారు. ఈ పోలికను బ్రిటిష్ సైన్యాన్ని తప్పుదారి పట్టించడానికి ఉపయోగించుకున్నారని చారిత్రక కథనాలు పేర్కొంటాయి.
ఝాన్సీ కోట ముట్టడి – ఆమె సాహసం:
1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ కోటపై భారీ దాడి చేసింది. రాణి లక్ష్మీబాయి సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది.
ఈ సమయంలో రాణి ప్రాణాలను కాపాడి, ఆమె తిరిగి పోరాటాన్ని కొనసాగించేందుకు అవకాశం కల్పించడానికి ఝల్కారీ బాయి రాణి వేషం ధరించి బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ వ్యూహం వల్ల రాణి లక్ష్మీబాయి కోట నుంచి బయటపడే అవకాశం పొందారని చెబుతారు. ఝల్కారీ బాయి బ్రిటిష్ సైన్యానికి చిక్కారా, యుద్ధంలో మరణించారా అన్న విషయాల్లో విభిన్న కథనాలు ఉన్నాయి.
చరిత్రలో ఝల్కారీ బాయికి తగిన గుర్తింపు లభించిందా?
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ప్రముఖ రాజులు, రాణులు, నాయకులకు విస్తృతమైన గుర్తింపు లభించింది. అయితే అట్టడుగు సామాజిక వర్గాల నుంచి వచ్చిన మహిళా యోధుల త్యాగాలకు తగిన ప్రాధాన్యత చాలాకాలం లభించలేదు. ఝల్కారీ బాయి జీవితం మూడు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది.
- దేశ స్వాతంత్ర్యం కోసం మహిళలు కూడా పురుషులతో సమానంగా పోరాడారు.
- సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకత్వం వహించారు.
- దేశభక్తికి కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితి అడ్డంకులు కావు.
ఝల్కారీ బాయి గౌరవార్థం 2001 జూలై 22న భారత తపాలా శాఖ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది.
షహీద్ లక్ష్మణ్ నాయక్!
బాల్యం – గిరిజనుల దుర్భర పరిస్థితులు:
లక్ష్మణ్ నాయక్ 1899 నవంబర్ 22న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొరాపుట్ ప్రాంతంలో, ప్రస్తుత ఒడిశాలో జన్మించారు. ఆయన భూయాన్ గిరిజన తెగకు చెందినవారు. ఆయన తండ్రి పదలం నాయక్ స్థానిక సంస్థాన పాలనలో గిరిజన నాయకుడిగా, ముస్తాదార్గా పనిచేసేవారు. ఆ కాలంలో ఒడిశా లోని గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్ పాలకులు, స్థానిక సంస్థాన అధికారులు, అటవీ అధికారులు, పోలీసుల దౌర్జన్యాలు తీవ్రంగా ఉండేవి.
గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కోల్పోతున్నారు. అడవులపై వారి సంప్రదాయ హక్కులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పన్నుల పేరుతో దోపిడీ, అధికారుల వేధింపులు, బలవంతపు వసూళ్లు కొనసాగేవి. ఈ పరిస్థితులు లక్ష్మణ్ నాయక్‌ను ప్రజా ఉద్యమాల వైపు నడిపించాయి.
గిరిజన ప్రజలను సంఘటితం చేయడం:
లక్ష్మణ్ నాయక్ గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. సత్యాగ్రహం, అహింస, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన తన ప్రాంతంలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తూ ప్రజలను చైతన్య పరిచారు.
బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడం. అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమించడం. ఖాదీ, చరఖా వినియోగాన్ని ప్రోత్సహించడం. వయోజన విద్యను ప్రోత్సహించడం. మద్యపానానికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడడం ఆయన చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు. 1936లో కాంగ్రెస్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో కూడా పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో లక్ష్మణ్ నాయక్:
1942 ఆగస్టులో పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమైంది. బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని విడిచి వెళ్లాలని, సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలని దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఒడిశాలోని కొరాపుట్ ప్రాంతంలో కూడా ఈ ఉద్యమం బలంగా వ్యాపించింది. లక్ష్మణ్ నాయక్ గిరిజన ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించారు.
1942 ఆగస్టు 21 – మాథిలి ఘటన:
ఆగస్టు 21న లక్ష్మణ్ నాయక్ నాయకత్వంలో వందలాది గిరిజన ప్రజలు కాంగ్రెస్ జెండాలు, గాంధీజీ చిత్రాలతో మాథిలి పోలీస్ స్టేషన్ వైపు ప్రదర్శనగా వెళ్లారు. వారి ప్రధాన లక్ష్యం పోలీస్ స్టేషన్‌పై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేయడం.
పోలీసులు ప్రదర్శనను అడ్డుకున్నారు. లాఠీచార్జి, కాల్పులు జరిగాయి. పలువురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు, అనేకమంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక అటవీ ఉద్యోగి జి. రామయ్య మరణానికి లక్ష్మణ్ నాయక్‌ను బాధ్యుడిగా చేస్తూ హత్య కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసి విచారణ జరిపారు.
ఉరికంబం ఎక్కిన గిరిజన వీరుడు:
1942 నవంబర్ 13న న్యాయస్థానం లక్ష్మణ్ నాయక్‌కు మరణశిక్ష విధించింది. ఆయన తరఫున అప్పీల్ చేసినప్పటికీ శిక్ష రద్దు కాలేదు. చివరకు 1943 మార్చి 29న బెర్హంపూర్ జైలులో ఆయనను ఉరితీశారు. ఆయన మరణించే ముందు కూడా భారతదేశానికి స్వాతంత్ర్యం తప్పకుండా వస్తుందని ధైర్యంగా ప్రకటించినట్లు ఒడిశా చారిత్రక ప్రచురణలు పేర్కొంటున్నాయి.
లక్ష్మణ్ నాయక్ పోరాటాన్ని కేవలం బ్రిటిష్ వ్యతిరేక పోరాటంగా మాత్రమే చూడకూడదు. అది గిరిజనుల భూమి, అడవి, నీరు, జీవనాధారాల పరిరక్షణ కోసం జరిగిన పోరాటం కూడా. నేడు అభివృద్ధి పేరుతో అనేక ప్రాంతాల్లో గిరిజనులు తమ నివాస ప్రాంతాల నుంచి నిర్వాసితులు అవుతున్నారు. భారీ ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, పారిశ్రామికీకరణ కారణంగా అడవులు, సహజ వనరులు నాశనమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అటవీ హక్కుల చట్టం-2006, గిరిజనుల భూమి హక్కులు, గ్రామసభల అధికారాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లక్ష్మణ్ నాయక్ ఆశయాలను నిజంగా గౌరవించాలంటే గిరిజనులకు వారి భూమిపై, అడవులపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. అభివృద్ధి పేరుతో వారి జీవనాధారాలను దెబ్బతీయకూడదు.
మీరా బెన్!
విలాసవంతమైన జీవితం నుంచి భారత స్వాతంత్ర్య ఉద్యమం వైపు:
మీరా బెన్ బ్రిటన్‌లోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి అడ్మిరల్ సర్ ఎడ్మండ్ స్లేడ్ బ్రిటిష్ నౌకాదళంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతంపై, ముఖ్యంగా జర్మన్ సంగీతకారుడు లుడ్విగ్ వాన్ బీథోవెన్ సంగీతంపై ఎంతో ఆసక్తి ఉండేది.
ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ఫ్రెంచ్ రచయిత, తత్వవేత్త రొమైన్ రోలాండ్ రచనల పరిచయం. రొమైన్ రోలాండ్ ద్వారా మహాత్మాగాంధీ జీవితం, సిద్ధాంతాల గురించి తెలుసుకున్నారు. గాంధీజీ సత్యం, అహింస, నిరాడంబర జీవనం, మానవ సమానత్వం వంటి ఆదర్శాలకు ఆకర్షితులయ్యారు. గాంధీజీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని, ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
భారతదేశానికి రాక – మీరా బెన్ గా మార్పు:
1925 నవంబర్ 6న మీరా బెన్ బొంబాయి చేరుకున్నారు. నవంబర్ 7న అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలుసుకున్నారు. ఆమె అసలు పేరు మేడలిన్ స్లేడ్. గాంధీజీ ఆమెకు మీరా బెన్ అనే పేరు పెట్టారు.
ఆమె భారతీయ జీవన విధానాన్ని స్వీకరించారు. ఖాదీ దుస్తులు ధరించడం, చరఖా తిప్పడం, స్వయంగా వంట చేసుకోవడం, ఆశ్రమ పనుల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఒక సంపన్న బ్రిటిష్ కుటుంబంలో జన్మించిన మహిళ సాధారణ ఆశ్రమ జీవితాన్ని స్వచ్ఛందంగా స్వీకరించడం ఆమె నిబద్ధతకు నిదర్శనం.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాత్ర:
మీరా బెన్ కేవలం గాంధీజీ వ్యక్తిగత సహాయకురాలిగా మాత్రమే ఉండిపోలేదు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె ఖాదీ, స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాలకు సహకరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. గాంధీజీతో కలిసి 1931లో లండన్‌లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. 1932–33లో, 1942–44లో ఆమె జైలు జీవితాన్ని గడిపారు. ఒక బ్రిటిష్ మహిళగా జన్మించినప్పటికీ, బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా పోరాడటం ఆమె జీవితంలోని ప్రత్యేకత.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ప్రజాసేవ:
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మీరా బెన్ తన సేవలను ఆపలేదు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో పనిచేశారు. రిషి కేశ్ సమీపంలో పశు పోషణ, గ్రామీణ జీవనాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు. పశు లోక్ అనే కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారు.
పర్యావరణ పరిరక్షణలో మీరాబెన్ పాత్ర:
మీరా బెన్ జీవితంలో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ పరిరక్షణ. హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేత, పర్యావరణ విధ్వంసం వల్ల కలిగే పరిణామాలను ఆమె ముందుగానే గుర్తించారు. అడవులు నాశనమైతే కొండ ప్రాంతాల్లో నేల కోత, వరదలు, నీటి కొరత వంటి సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు.
ప్రకృతిని కాపాడుకోవడం, అడవులను సంరక్షించడం, పశు సంపదను అభివృద్ధి చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ విధంగా ఆమె పర్యావరణ ఉద్యమాలకు కూడా మార్గదర్శకంగా నిలిచారు. 1982 జూలై 20న ఆస్ట్రియాలోని వియన్నాలో ఆమె మరణించారు. భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి 1982లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
దేశభక్తికి జన్మించిన దేశంతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మానవత్వం, న్యాయం, సమానత్వం వంటి విలువలు జాతీయ సరిహద్దులకు అతీతమైనవి. సంపద, విలాసవంతమైన జీవితం కంటే ప్రజాసేవ గొప్పది. ప్రకృతి పరిరక్షణ కూడా ప్రజాసేవలో భాగమే అని మీరా బెన్ జీవితం తెలియజేస్తుంది.
ముగింపు: మీరాబెన్ జీవితం భారత స్వాతంత్ర్య పోరాటానికి అంతర్జాతీయ మద్దతు లభించిన తీరుకు ఒక గొప్ప ఉదాహరణ. గాంధీజీ సిద్ధాంతాలను కేవలం మాటల్లో కాకుండా తన జీవితంలో ఆచరించి చూపిన ఆదర్శవంతమైన మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
